సాక్షి, హైదరాబాద్: రాజధాని నగర ప్రయాణికుల కు ‘చల్లటి’ ప్రయాణాన్ని అందించేందుకు ప్రారం భించిన ఏసీ మెట్రో లగ్జరీ బస్సుల చార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే వాటి టికెట్ ధరలను ఎంతమేర తగ్గించాలనే విషయంలో అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తుది ఆమోదం కోసం ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు పంపారు. ఆయ న ఆమోదం రాగానే కొత్త చార్జీలు అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి సిటీ ప్రయాణికులకు కొత్త సంవత్సరం కానుకగా అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరంలో ఈ కేటగిరీకి సంబంధించి 80 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని వోల్వో కంపెనీ నుంచి ఐదేళ్ల కింద కొనుగోలు చేశారు. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్, లింగంపల్లి నుంచి ఎల్‌బీనగర్, లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం, సికింద్రాబాద్ నుంచి ఎల్‌బీనగర్.. ఇలా తిప్పుతున్నారు.
ఎంత తగ్గిస్తారో..?!
ఏసీ బస్సుల్లో ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఎల్‌బీనగర్‌కు టికెట్ చార్జీ రూ.110గా ఉంది. అదే లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు రూ.80గా ఉంది. ఉప్పల్ నుంచి వేవ్‌రాక్‌కు కూడా అంతే వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు రూ.110గా ఉన్న టికెట్ ధరను రూ.75కు, రూ.80గా ఉన్న చార్జీని రూ.50కి తగ్గించబోతున్నట్లు సమాచారం. కనిష్ట టికెట్ ధర రూ.20 అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్‌ల తర్వాత చార్జీలను సవరించనున్నట్లు సమాచారం. దీంతో కొన్ని స్టాపులకు మెట్రో డీలక్స్ బస్సు సర్వీసు కంటే రూ.5 చార్జీ మాత్రమే ఎక్కువగా ఉండబోతోంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment