గ్రేటర్‌లో 40 శాతానికి పడిపోయిన మేల్‌ప్యాసింజర్స్
ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ వినూత్న ప్రయత్నం
ఒక్కో డిపోకు అదనంగా రోజుకు రూ.లక్ష లక్ష్యంగా కార్యాచరణ
సిబ్బందిపై ఒత్తిడి పెంచడం పట్ల కారి్మక సంఘాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణం బెంబేలెత్తిస్తోంది. సిటీ బస్సుల్లో పయనించేందుకు పురుష ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ‘మహాలక్ష్మి’ రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సిటీ బస్సుల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు బస్సుల్లో మూడొంతుల మగ ప్రయాణికులతో కనిపించే రద్దీ ఇప్పుడు మహిళలతో నిండుగా పరుగులు తీస్తోంది.
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కానీ ప్రభుత్వం రీయింబర్స్ రూపంలో చెల్లిస్తుండడంతో ఆరీ్టసీకి నగదు రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే మగ ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న పంథాలో ముందుకు వెళ్తోంది. ప్రతి డిపోలో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయమే లక్ష్యంగా కండక్టర్లు, డ్రైవర్లను కార్యోన్ముఖులను చేస్తోంది. యాజమాన్యం ఒత్తిడి కారణంగా అదనపు ఆర్జన కోసం కండక్టర్లు, డ్రైవర్లు రూ.లక్ష లక్ష్యంగా’ మగప్రయాణికుల వేటలో పడ్డారు. ప్రధాన బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురు చూసే మగ ప్రయాణికులను ‘బస్సెక్కండి ప్లీజ్’ అంటూ ఆహ్వానించడం ఆసక్తికరమైన పరిణామం.
మూడొంతుల ప్రయాణికులు మహిళలే..
గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతిరోజూ సుమారు 2,800 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1,800కు పైగా ఉంటాయి. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారులు తదితర వర్గాలతో బస్సుల్లో రద్దీ ఉంటుంది. సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలోనూ బస్సులు కిక్కిరిసి ఉంటాయి.
మరోవైపు మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రయాణికుల సీట్లు సైతం వారితోనే నిండిపోతున్నాయి. చివరకు మొదటి ప్రవేశ ద్వారం ఫుట్‌బోర్డు సైతం మహిళలతో కిటకిటలాడుతోంది.
– సిటీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. కేవలం 7 లక్షల మంది మగవారు ఉన్నారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఉన్న ప్రయాణికుల లెక్కలు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయి. ‘కొన్నిసార్లు బస్సుల్లో నిల్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. బస్సెక్కి దిగే వరకు సర్కస్ ఫీట్లు చేసినట్లవుతుంది.’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించడం కష్టంగా మారిందన్నారు.
సొంత వాహనాల వినియోగం..
మరోవైపు ఆర్టీసీ అధికారుల అంచనాల మేరకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తర్వాత పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీతో మగవారు సొంత వాహనాల వినియోగం వైపు మళ్లారు. ద్విచక్ర వాహనాల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ‘జెంట్స్ స్పెషల్’ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. కానీ దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సీట్లపై ‘స్త్రీలకు మాత్రమే’ అని కనిపించే వాటి సంఖ్యను తగ్గించారు. పలు మార్గాల్లో మెట్రో లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.
రూ.లక్ష లక్ష్యం ఎందుకంటే..
‘మొదటి నుంచి సిటీ ఆరీ్టసీకి నష్టాలే. ఇప్పడు ‘మహాలక్ష్మి’ పథకానికి ప్రభుత్వమే నిధులను అందజేస్తోంది. రోజువారీ అవసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బందికి ప్రోత్సాహకాలు వంటివి అందజేసేందుకు నగదు అవసరం. అందుకే ప్రతి డిపోలో రోజుకు ఒక రూ.లక్ష అదనంగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా గతంలో ఉన్న విధంగా పురుష ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే టికెట్లపై ఆశించిన స్థాయిలో ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు చెప్పారు.
కండక్టర్లు, డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి..
ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఉచిత ప్రయాణసదుపాయం అభినందనీయమే. కానీ ప్రయాణికుల రద్దీ వల్ల బస్సులు నడపడం కష్టంగా మారింది. ఈ సమయంలో మగ ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. – ఇ.వెంకన్న, ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment