bus journey
-
Hyderabad: మగాళ్లూ.. బస్సెక్కరూ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణం బెంబేలెత్తిస్తోంది. సిటీ బస్సుల్లో పయనించేందుకు పురుష ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ‘మహాలక్ష్మి’ రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సిటీ బస్సుల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు బస్సుల్లో మూడొంతుల మగ ప్రయాణికులతో కనిపించే రద్దీ ఇప్పుడు మహిళలతో నిండుగా పరుగులు తీస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కానీ ప్రభుత్వం రీయింబర్స్ రూపంలో చెల్లిస్తుండడంతో ఆరీ్టసీకి నగదు రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే మగ ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న పంథాలో ముందుకు వెళ్తోంది. ప్రతి డిపోలో రోజుకు రూ.లక్ష అదనపు ఆదాయమే లక్ష్యంగా కండక్టర్లు, డ్రైవర్లను కార్యోన్ముఖులను చేస్తోంది. యాజమాన్యం ఒత్తిడి కారణంగా అదనపు ఆర్జన కోసం కండక్టర్లు, డ్రైవర్లు రూ.లక్ష లక్ష్యంగా’ మగప్రయాణికుల వేటలో పడ్డారు. ప్రధాన బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురు చూసే మగ ప్రయాణికులను ‘బస్సెక్కండి ప్లీజ్’ అంటూ ఆహ్వానించడం ఆసక్తికరమైన పరిణామం. మూడొంతుల ప్రయాణికులు మహిళలే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతిరోజూ సుమారు 2,800 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 1,800కు పైగా ఉంటాయి. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో అన్ని వర్గాల ప్రయాణికులు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా ఉదయం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాపారులు తదితర వర్గాలతో బస్సుల్లో రద్దీ ఉంటుంది. సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలోనూ బస్సులు కిక్కిరిసి ఉంటాయి. మరోవైపు మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రయాణికుల సీట్లు సైతం వారితోనే నిండిపోతున్నాయి. చివరకు మొదటి ప్రవేశ ద్వారం ఫుట్‌బోర్డు సైతం మహిళలతో కిటకిటలాడుతోంది. – సిటీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 22 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నట్లు అంచనా. కేవలం 7 లక్షల మంది మగవారు ఉన్నారు. మహాలక్ష్మి పథకానికి ముందు ఉన్న ప్రయాణికుల లెక్కలు ఇప్పుడు పూర్తిగా తారుమారయ్యాయి. ‘కొన్నిసార్లు బస్సుల్లో నిల్చోవడం కూడా కష్టంగా ఉంటోంది. బస్సెక్కి దిగే వరకు సర్కస్ ఫీట్లు చేసినట్లవుతుంది.’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజూ అమీర్‌పేట్ వరకు రాకపోకలు సాగించడం కష్టంగా మారిందన్నారు. సొంత వాహనాల వినియోగం.. మరోవైపు ఆర్టీసీ అధికారుల అంచనాల మేరకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తర్వాత పెరిగిన మహిళా ప్రయాణికుల రద్దీతో మగవారు సొంత వాహనాల వినియోగం వైపు మళ్లారు. ద్విచక్ర వాహనాల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష ప్రయాణికుల సంఖ్యను పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ‘జెంట్స్ స్పెషల్’ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. కానీ దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సీట్లపై ‘స్త్రీలకు మాత్రమే’ అని కనిపించే వాటి సంఖ్యను తగ్గించారు. పలు మార్గాల్లో మెట్రో లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.రూ.లక్ష లక్ష్యం ఎందుకంటే..‘మొదటి నుంచి సిటీ ఆరీ్టసీకి నష్టాలే. ఇప్పడు ‘మహాలక్ష్మి’ పథకానికి ప్రభుత్వమే నిధులను అందజేస్తోంది. రోజువారీ అవసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బందికి ప్రోత్సాహకాలు వంటివి అందజేసేందుకు నగదు అవసరం. అందుకే ప్రతి డిపోలో రోజుకు ఒక రూ.లక్ష అదనంగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా గతంలో ఉన్న విధంగా పురుష ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటే టికెట్లపై ఆశించిన స్థాయిలో ఆదాయం లభించేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గడంతో ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సంఖ్యను పెంచుకొనేందుకు ప్రయతి్నస్తున్నట్లు చెప్పారు. కండక్టర్లు, డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి.. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఉచిత ప్రయాణసదుపాయం అభినందనీయమే. కానీ ప్రయాణికుల రద్దీ వల్ల బస్సులు నడపడం కష్టంగా మారింది. ఈ సమయంలో మగ ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్లు విధిస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడి మధ్య పని చేయడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. – ఇ.వెంకన్న, ఆర్టీసీ కారి్మక సంఘాల జేఏసీ చైర్మన్ -
US: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!
మనం ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వందల సంవత్సరాలనాటి దారులనే అటు ఇటుగా బాగుచేసుకుంటూ వాటిపైనే ప్రయాణాలు చేస్తున్నాం. అమెరికా వాళ్ళు రాబోయే వందేళ్ల అవసరాలకు ఉపయోగపడే విశాలమైన రోడ్లు దేశమంతా ఎప్పుడో వేసుకున్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన భారతీయులను ముందుగా ఆశ్చర్యచకితులను చేసేవి అక్కడి పెద్దపెద్ద లైన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు. అక్కడ రోడ్ల మీద మనకు మనుషులు కనబడరు, పరుగులు తీస్తున్న వాహనాలే దర్శనమిస్తాయి. గుంపులు గుంపులుగా మనుషులను చూడాలంటే మాల్స్కో, సినిమా హాల్స్ కో వెళ్లాల్సిందే. మన దేశంలో మనుషుల కొరత మాత్రం లేదు, ఎక్కడికి వెళ్లినా తనివితీరా చూడొచ్చు, చివరికి ఇండ్లలో కూడా. అయితే ఈ మానవ వనరులే మనకిప్పుడు పెద్ద పెట్టుబడి అయింది నిజం.అమెరికాలో జనం ఎక్కువగా విమానాల్లోనే దూర ప్రయాణాలు చేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మనవాళ్లతో పోల్చుకుంటే అక్కడ రైలు, బస్సు ప్రయాణాలు చాలా తక్కువనే చెప్పాలి, వాళ్లకు అంత ఓపిక ఉండడం లేదు. అక్కడి బస్సుల్లో ఎక్కువగా తిరిగేది శ్రామిక వర్గానికి చెందిన నల్లవారు, మెక్సికో, చైనా వంటి దేశస్తులు. నేను 2008లో అమెరికాలో పర్యటించినప్పుడు తప్పనిసరై టెక్సాస్‌లోని డాలస్ నుంచి వేన్ కౌంటీలో ఉన్న టేలర్‌కు బస్సులో జూన్ 7 న ప్రయాణమై వెళ్ళాను. అమెరికా వెళ్లి అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న మా బంధువుల అబ్బాయి ప్రోత్సాహంతో బస్సు ఎక్కాను. సరదాగా ఉంటుంది వెళ్ళమని నన్ను డల్లాస్ - టేలర్ బస్ జర్నీ కి ప్రోత్సహించింది అతనే. ఆ రోజుల్లో ఈ ప్రయాణ ఛార్జి 44.50 డాలర్లు, మన రూపాయల్లో దాదాపు 3 వేల పైమాటే. నా పాసుపోర్టు చూశాకనే, లగేజీ చెక్ చేశాకనే బస్సులోకి అనుమతించారు. నేను ఎక్కింది వన్ మ్యాన్ సర్వీస్ కావడం వల్ల అన్ని పనులు డ్రైవరే చూసుకునేవాడు, ప్రయాణికుల లగేజీ సర్దిపేట్టేది ఆయనే, వారు దిగేప్పుడు తీసి ఇచ్చేది కూడా అతనే. ఇది చిన్న పని అది పెద్ద పని అనే ఆలోచన చేయకుండా, ప్రయాణికుల నుండి ఏమీ ఆశించకుండా ఓపిగ్గా అన్నీ డ్రైవరే చేయడం విశేషం. అన్నట్లు అమెరికాలో లేడీ డ్రైవర్లు కూడా ఎక్కువే. అమెరికాలో గ్యాస్ స్టేషన్లు అంటే పెట్రోల్ బంకులు చాలా సర్వీస్ చేస్తుంటాయి. అక్కడ కేవలం గ్యాస్ మాత్రమే కాదు ప్రయాణికులకు కావలసిన వస్తువులు దొరుకుతాయి, తినడానికి, విశ్రాంతికి సౌకర్యంగా ఉంటుంది. పాకిస్తానీలు చాలా మంది ఈ స్టేషన్ స్వంతదారులు, పనిలో మనవాళ్ళు కనబడుతుంటారు, ఒంటరిగా ఉంటే గన్‌తో వచ్చి బెదిరించి ఉన్నవి లాక్కునేవాళ్ళను స్థానికులు అంటారు. మన గమ్యం వస్తుందంటే డ్రైవరే అనౌన్స్ చేస్తుంటాడు, అతన్ని టీవీ స్క్రీన్ మీద గమనించవచ్చు. బస్ టికెట్‌తో పాటు ఇచ్చిన ప్రకటనల బ్రోచర్స్లో ఆనాటి ఇరాక్ యుద్ధం వల్ల సైనికుల అవసరం పెరిగి సైన్యంలో చేరమన్న విజ్ఞప్తులు కనబడ్డాయి. బస్సులో చాలా మంది ఆడవాళ్లు మేకప్‌తో కాలక్షేపం చేస్తుంటే మరికొందరు మ్యూజిక్ వింటూ ఊగిపోయేవారు. బస్సులోనే చిన్న టాయిలెట్ మంచి సౌకర్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ త్రాగడం నిషేధం. డౌన్ టౌన్ లో ప్రవేశించే వరకు ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగానే సాగింది. డాలస్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరిన బస్సు దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత గమ్యస్థానం చేరింది. భారతదేశంతో పోలిస్తే.. ఇక్కడి బస్సు ప్రయాణంలో ఎలాంటి అలసట అనిపించలేదు. సుఖవంతమైన ప్రయాణం కదా అనిపించింది. బస్సులోన నిశబ్ధం, విశాలమైన రోడ్లపై వాహనాల టైర్ల సౌండ్, మధ్యమధ్యన బ్రేక్‌లలో స్నాక్స్. ఇప్పుడు హైదరాబాద్ - విజయవాడ మధ్య, హైదరాబాద-బెంగళూరు లేదా విజయవాడ - విశాఖ మధ్య బస్సు ప్రయాణం కూడా ఇలాంటి అనుభవమే కనిపిస్తోంది. మున్ముందు మనం కూడా అమెరికా తరహాలో రోడ్డు ప్రయాణం ఉంటుందని ఆశిద్దాం వేముల ప్రభాకర్ (చదవండి: US: అమెరికాలో 911..అదో పెద్ద హడావిడి!) -
అద్దంలేని బస్సుతో హైదరాబాద్‌కు.. కావేరి ట్రావెల్స్ నిర్వాకం
అనకాపల్లి: ఛార్జీల రూపంలో వందలాది రూపాయలు వసూలు చేస్తూ సరైన కండిషన్ లేని బస్సు సమకూర్చారంటూ పలువురు ప్రయాణికులు నక్కపల్లి పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు టికెట్టు తీసుకున్నారు. ట్రావెల్స్ వారు కావేరీ ట్రావెల్స్ బస్సును ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సు కండిషన్లో లేదని, ముందు భాగంలో అద్దం లేదని ప్రయాణికులు తెలిపారు. చీకట్లో తాము అద్దం లేదనే విషయాన్ని గుర్తించలేదని, రన్నింగ్‌లో ముందు భాగం నుంచి విపరీతమైన చలిగాలులు రావడంతో డ్రైవర్ వద్దకు వెళ్లి పరిశీలించగా అద్దం లేని విషయం బయటపడిందన్నారు. దీంతో డ్రైవర్‌ను టికెట్స్ బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వారిని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. చలిగాలులతో గజగజ వణుకుతున్న వీరంతా ఎట్టకేలకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్సును బలవంతంగా నిలిపివేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఇదే బస్సులో హైదరాబాద్ తీసుకెళ్తామని, మీరంతా రావాల్సిందేనని డ్రైవర్, బస్సు యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణం చేయకపోతే టికెట్ డబ్బులు తర్వాత వాపసు చేస్తామని, ప్రత్యామ్నాయంగా వేరే బస్సు ఏర్పాటు చేసేది లేదని చెబుతున్నారని ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రయాణికులంతా నక్కపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిటికీలకు అద్దాలు లేకపోవడం వల్ల రాత్రిపూట విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయని, చలిగాలులతో గజగజ లాడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
పంద్రాగస్టున 10 మిలియన్ల మంది బస్సు ప్రయాణం
హైదరాబాద్: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 10 మిలియన్ల మంది బస్సు ప్రయాణాన్ని ఎంచుకున్నారని ప్రముఖ ఆన్లైన్ బస్–టికెటింగ్ వేదికై న ‘అభిబస్’ వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో పీక్ ట్రావెల్ సీజన్‌తో అధిక విమాన ప్రయాణ ఖర్చులు, రైలు టిక్కెట్ల పరిమిత లభ్యత వంటి కారణాలతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులను ఎంచుకున్నారని వారు పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ నుంచి గోవాకు రౌండ్–ట్రిప్ రైలు టిక్కెట్ల ధర సుమారుగా రూ.10 వేలు ఉండగా, బస్సు ప్రయాణికులు అదే గమ్యస్థానానికి దాదాపు రూ.2 వేలకే చేరుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–గోవా, బెంగుళూరు–చైన్నె, చైన్నె–కోయంబత్తూర్, లక్నో–దిల్లీ, దిల్లీ–డెహ్రాడూన్ వంటి ప్రధాన నగరాలను కలిపే వాటితో సహా ప్రముఖ మార్గాలలో బస్సు ప్రయాణంలో పెరుగుదల గణనీయంగా చోటు చేసుకుందని అభిబస్ సీఓఓ రోహిత్ శర్మ తెలిపారు. అంతేగాకుండా పొడిగించిన వారాంతంలో ఇతర మార్గాలలో 30 శాతం వృద్ధి కనిపించిందని ఆయన వివరించారు. -
Hyderabad: ప్రమాదం అంచున ప్రయాణం.. ఏమాత్రం పట్టుతప్పినా!
సాక్షి, హైదరాబాద్: అదో బస్టాపు.. స్కూలుకు, కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు.. ఆఫీసుకు వెళుతున్న ఉద్యోగులు.. ఏవో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులు.. 40–50 మందిదాకా వేచి ఉన్నారు. అంతలో బస్సు వచ్చింది. అప్పటికే దాదాపు సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మరో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. సమయం మించిపోతోందంటూ అంతా ఎక్కేశారు. లోపల స్థలం లేక ఫుట్బోర్డుపైనా నిలబడ్డారు. అక్కడక్కడా గుంతలు, మలుపులు, పక్కపక్కనే దూసుకెళ్లే వాహనాలు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టుతప్పినా ప్రమాదం బారినపడే పరిస్థితి. హైదరాబాద్ నగరం చుట్టూరా శివార్లలో సిటీ బస్సుల్లో పరిస్థితి ఇది. ఆర్టీసీ బస్సులు తగ్గిపోవడం, ప్రైవేటు రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. పలుమార్లు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదకరం, నేరం అయినా.. మోటారు వాహన చట్టం ప్రకారం ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు గతంలో మొబైల్ కోర్టులు ఉండేవి. ఫుట్‌బోర్డు ప్రయాణికులపై జరిమానాలు విధించేవారు. ఇప్పుడు మొబైల్ కోర్టులు లేవుగానీ.. ఫుట్‌బోర్డు జర్నీ మాత్రం ఆగలేదు. ఎంతోమంది మంది ప్రయాణికులు పట్టుతప్పి పడిపోతున్నారు. గాయాలపాలవుతున్నారు. పలుమార్లు బాధితులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇది రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వందలాది రూట్లకు బస్సుల్లేవు.. ప్రపంచ నగరాలకు దీటుగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ప్రజారవాణాలో మాత్రం వెనుకబడిపోతోంది. యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) అధ్యయనం ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) 7,228 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. నగరంలో అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయం 31 శాతమే. బస్సుల కొరత కారణంగా వందలాది రూట్లను ఆర్టీసీ వదిలేసుకుంది. హైదరాబాద్‌లో గతంలో 1,150 రూట్లలో ప్రతిరోజూ 42 వేల ట్రిప్పులు నడిచిన సిటీ బస్సులు.. ఇప్పుడు 795 రూట్లలో కనీసం 25 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. ఏమూల చూసినా అంతే.. ►ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సుల్లో విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ప్రతిరోజూ ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ►ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మీదుగా ఏదులాబాద్ వైపు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు ఉదయం 8 గంటలకల్లా బస్సు అందుకోగలిగితేనే సకాలంలో విధులకు హాజరవుతారు. ఆ రూట్లో వెళ్లే ఒకేఒక్క బస్సులో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిందే. ఏ కొంచెం ఆలస్యమైనా సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే. ఇందుకోసం అయ్యే ఖర్చు అదనపు భారం. ►ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కీసర, నాగారం, షామీర్పేట్ వంటి రూట్లలోనే కాదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. ►సికింద్రాబాద్–కోఠీ, ఉప్పల్–కోఠీ వంటి సుమారు 150 రూట్లలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే.. పలు మార్గాల్లో అరగంట నుంచి గంటకు ఒకటి చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. ►మేడ్చల్ నుంచి పటాన్చెరు మీదుగా గండి మైసమ్మ వరకు ప్రతిరోజు కనీసం 25 బస్సులు నిరంతరం రాకపోకలు సాగించే స్థాయిలో ప్రయాణికుల డిమాండ్ ఉంది. కానీ నడుపుతున్నది 5 బస్సులే. సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, సికింద్రాబాద్–మణికొండ తదితర రూట్లలోనూ అదే పరిస్థితి. అక్కడ పెంచుతుంటే.. ఇక్కడ తగ్గాయి.. ►గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య మూడేళ్లలో 3,850 నుంచి 2,550కి తగ్గింది. ►ఢిల్లీ నగరంలో బస్సుల సంఖ్య 6 వేలు ఉండగా.. 7 వేలకు పెంచారు. ►బెంగళూరు సిటీలో ప్రస్తుతం 7,000 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని 13 వేలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజారవాణాలో హైదరాబాద్.. ►హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం 7,228 చదరపు కిలోమీటర్లు ►రోడ్ నెట్వర్క్ 5,400కి.మీ. ►జనాభా: సుమారు కోటీ 8 లక్షలు (రాష్ట్ర జనాభాలో 29.6%) సరిగా బస్సులు రాక సమస్య బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. కిక్కిరిసి ప్రయాణించాలి. లేదా ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఎంతో భారం అవుతోంది. – ఎస్.అనిత, టీచర్ రహదారి భద్రతకు విఘాతం బస్సులే కాదు ఆటోలు, క్యాబ్‌లు వంటి ఏ వాహనాల్లోనైనా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇలాంటి ఓవర్‌లోడ్ జర్నీయే. అలాంటి ప్రతి ప్రయాణికుడిపై జరిమానా విధించే అవకాశం ఉంది. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా కమిషనర్ ప్రమాదం అనిపించినా తప్పడం లేదు ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు కదా. బస్సులు లేకపోవడం వల్లే చాలా మంది పిల్లలు ఫుట్‌బోర్డ్ జర్నీ చేయాల్సి వస్తోంది. – యాదగిరి, ప్రయాణికుడు -
కరోనా ఎఫెక్ట్ : బిక్కుబిక్కుమంటూ బస్సు ప్రయాణాలు
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అనే భావనను కరోనా మాయం చేస్తోంది. ఈ మాయాదారి వైరస్ విజృంభిస్తుండడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. నిత్యం బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ బస్సులో కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఆర్టీసీ తూ తూ మాత్రాంగా చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. బిక్కు బిక్కుమంటూ బస్సుల్లో ప్రయాణం నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వీటీ పరిధిలో నిజామాబాద్‌లో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డిలో బాన్సువాడ, కామారెడ్డి మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. మొత్తం 640 బస్సుల్లో అద్దె బస్సులు 181 ఉన్నాయి. ప్రతి రోజు బస్సులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకకు సైతం పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నిత్యం లక్షకుపైగా ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో బస్టాండ్లలో, బస్సుల్లో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడలల్లో బస్టాండ్లలో శానిటైజేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోని, భౌతిక దూరం పాటించాలని మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మండల కేంద్రల్లో, గ్రామాల్లో ఉన్న బస్టాండ్లలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కరోనా నిబంధనలు అమలు కావడం లేదు కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజుకు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు తమతమ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు. పలు బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మేర ప్రయాణికులు కూర్చుంటున్నారు. కొన్నింటిలో నిల్చుని మరి ప్రయాణం చేస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. సీటుకు ఒకరు కూర్చున్న బస్సుల్లో ఒకరికి పాజిటివ్ ఉంటే మిగతా వారికే వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ బస్సుల్లో భౌతిక దూరం అమలు కావడం లేదు. అధికారులు కూడా నామమాత్రపు చర్యలతో సరి పెడుతున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు ఒక్కసారీ ముందస్తుగా శానిటైజేషన్ చేస్తున్నాం. అలాగే ప్రధాన బస్టాండ్‌లో మైక్‌ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణికులు మాస్కులు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – సుధాపరిమళ, ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ ( చదవండి: కోవిడ్ ఎఫెక్ట్.. ఇక అంబులెన్స్ సేవలు ఫ్రీ.. ) -
ప్రయాణాల్లో వాంతులకు అల్లంతో కళ్లెం
ప్రయాణాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు? అయితే కొందరు బస్సు ఎక్కాలంటే.. వాంతులు అవుతాయేమోనని భయపడతారు. మలుపులు, లోయలు ఉన్న రహదారుల్లో అయితే మరీ భయం. బస్సు ఎక్కుతూనే నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని, కిటికీ పక్కన కూర్చుంటారు. ప్రయాణాల్లో ఇలాంటి వాంతులు రాకుండా మందులే లేవా ? ఈ సమస్య కు చక్కటి ఆయుర్వేద చిట్కా ఉంది. ఇలా దూర ప్రయాణాలు చేసే వాళ్లు ఒక అల్లం ముక్కను పట్టుకెళ్లాలి. బస్సు ఎక్కుతూనే అల్లం ముక్కను బుగ్గన పెట్టుకోవాలి. అల్లం రసం మెల్లగా లోపలికి వెళ్తూ వాంతులు వచ్చే భావనను తగ్గిస్తుంది. అల్లంలోని ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, కాల్షియం, జింక్, కాపర్ వంటివన్నీ శరీరానికి అందుతాయి. ఒకరకంగా ఇది మందులాగా పనిచేస్తుంది. మరోవైపు అల్లం వల్ల చక్కటి ఆకలి కలుగుతుంది. గొంతులో నస తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నా తగ్గుతాయి. కఫ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా ఒకసారి అలవాటు చేసుకుని చూడండి. వాంతులకు కళ్ళెం వేయొచ్చు. -
ఏడాదిపాటు ‘దూరం’!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైర స్ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఎప్పుడొచ్చేది ఇంకా స్పష్టం కాని నేపథ్యంలో కనీసం ఏడాది పాటు భౌతికదూరం నిబంధనలు అమల్లో ఉంటాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. కరోనాతో సహజీవనం చాలాకాలమే ఉంటుందన్న సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో భౌతికదూరం విషయంలో తగిన చర్యలు చేపట్టా లని ప్రభుత్వ విభాగాలు భావిస్తున్నాయి. ప్రజా రవాణా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. దీంతో మన ఆర్టీసీ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ ప్రాంతంలో వైరస్ విస్తరిస్తుంది. అందుకే బాధితుడికి చేరువగా ఉండకుండా భౌతిక దూరం నిబంధన తప్పనిసరి. కానీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు భౌతిక దూరం నిబంధన అమలు చేయటం అంత సులువు కాదు. దీనికి పరి ష్కారంగా, ఏడాది పాటు వరుసకు ఒక్క ప్రయా ణికుడు చొప్పున మాత్రమే ప్రయాణించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. బస్సుకు రెండు వైపులా ఉండే వరుసల్లో ఎడమవైపు ఒకరు, కుడి వైపు ఒకరు మాత్రమే కూర్చోవాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సూపర్ లగ్జరీలలో సీట్ల మార్పు.. రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల మధ్య సూపర్ లగ్జరీ బస్సులు తిరుగుతాయి. వీటికి ప్రతి వరుసలో రెండు చొప్పున సీట్లు ఉంటాయి. వీటిల్లో ఒక్కొ క్కరు చొప్పున కూర్చునేలా చేయాలని ముందు అనుకున్నారు. కానీ దాదాపు ఏడాది పాటు భౌతిక దూరం నిబంధన అమలు అయ్యే అవకాశం ఉన్నందున, సీట్లను మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో వచ్చే సూచనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోను న్నారు. సీట్లు మారిస్తే రెండువైపులా కలిపి మూడు సింగిల్ సీట్లు ఏర్పాటు చేస్తారు. ఎడమ, కుడి వైపు ఒక్కో సీటు తొలగించి, మధ్యలో ఉండే నడిచే ప్రదేశంలో అదనంగా సీటు ఏర్పాటు చేస్తారు. ఇందుకు నమూనాగా ఓ బస్సును సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఇందుకు అంగీకరిస్తే, మిగతా బస్సులను కూడా ఇలాగే మారుస్తారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో ఇలా.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వరుసకు.. ఎడమ వైపు ఇద్దరు ప్రయాణికులు, కుడివైపు ముగ్గురు ప్రయాణికులు కూర్చునేలా సీట్ల అమరిక ఉంటుంది. ఆ సీట్లు అలాగే ఉంచి, ఎడమ వైపు ఉండే రెండు సీట్లకు ఒకరు, కుడివైపు మూడు సీట్లకు ఒకరు చొప్పున కూర్చునేలా చర్యలు తీసుకుంటారు. ఎడమవైపు మొదటి వరసలో కిటికీవైపు ఒకరు కూర్చుంటే, దాని వెనుక సీటులో కిటికీ వైపు కాకుండా మొదట కూర్చోవాల్సి ఉంటుంది. ఇక కుడి వైపు ముగ్గురు కూర్చునే సీటులో కిటికీ వైపు కాకుండా మొదటి సీటులో ఒక్కరు కూర్చుంటారు. దాని వెనుక ముగ్గురు కూర్చునే సీటులో కిటికీ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. అంటే జిగ్ జాగ్ పద్ధతిలో అన్నమాట. దీంతో ప్రయాణికుల మధ్య కనీసం మీటరు భౌతిక దూరం ఉంటుంది. సిటీ బస్సుల్లో స్టాండింగ్ నిషేధం.. సిటీ బస్సు అనగానే కిక్కిరిసి ప్రయాణికులు నిలబడే దృశ్యమే కనిపిస్తుంది. అయితే ఏడాది పాటు సిటీ బస్సుల్లో నిలబడి ప్రయాణించటాన్ని నిషేధించాలని నిర్ణయించారు. వీటిల్లో కూడా వరసకు ఒక ప్రయాణికుడే కూర్చునే పద్ధతి అమలు చేయాలని నిర్ణయించారు. ఆచరణలో ఇది చాలా కష్టమైనప్పటికీ, దాన్ని అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. బస్సుల ప్రారంభం ఎప్పుడు.. రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతావి దాదాపు గ్రీన్‌జోన్ పరిధిలోకి వచ్చేశాయి. ఈ మేరకు కేంద్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వెరసి ఈ మూడు జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో బస్సులు తిప్పేందుకు వెసులుబాటు కలిగింది. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపగానే ఆయా జిల్లాల్లో బస్సులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 15న దీనిపై సమీక్షిస్తానని ఇటీవల సీఎం తెలిపారు. అయితే, ఆ భేటీపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ సమావేశం ఎప్పుడు జరిగినా, ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సులు తిప్పేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఈ నెలాఖరు వరకు గ్రీన్జోన్లలో కూడా బస్సులు తిప్పొద్దని సూచిస్తున్నారు. ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి.. గ్రీన్ జోన్ పరిధిలో ఆటోలు, క్యాబ్‌లకు కూడా పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వాటిలో ఎంతమంది ప్రయాణించాలన్న దానిపై నిబంధనలు విధించనున్నారు. హైదరాబాద్‌లో ఇప్పట్లో అనుమంతించే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే అనధికారికంగా కొన్ని ప్రాంతాల్లో షేరింగ్ ఆటోలు తిరుగుతున్నాయి. ఒక్కో ఆటోలో ఏడెనిమిది మంది కూర్చుంటున్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, శివారు ప్రాంతాలకు సంబంధించి దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. -
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ఆనంద్ ప్రయాణం
సాక్షి, అనంతగిరి: ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ నెలకోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. సిబ్బంది, ప్రజల సమస్యలను పరిశీలించాలి’ అని సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బుధవారం వికారాబాద్ నుంచి అసెంబ్లీ వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముందుగా వికారాబాద్ బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం బస్సులో హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బస్సు ప్రయాణం చేసినట్లు తెలిపారు. వికారాబాద్ బస్ డిపో మేనేజర్ ...బస్సుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారని, ఆ సంఖ్యను పెంచామన్నారు. అలాగే ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు చెప్పారు. ఇక మహిళలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చోనిద్దామని ఎమ్మెల్యే సూచించారు. -
కాన్వాయ్ వద్దని.. బస్సులో వెళ్లిన ప్రధాని
సింగపూర్ దేశంలో వ్యక్తిగత వాహనాల కంటే ప్రజారవాణా చాలా ఎక్కువ. అక్కడ వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. అందుకేనేమో.. ఆ దేశ ప్రధానమంత్రి లీ సైన్ లూంగ్ భారతదేశంలో ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చినా.. ఆయన తన కోసం కేటాయించిన భారీ వీఐపీ కాన్వాయ్ వద్దని.. ఒక ప్రత్యేక బస్సులో తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్వాగతించేందుకు వచ్చిన అధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఐదు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా లూన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు నేతలతో సమావేశమై చర్చలు జరుపుతారు. ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల గురించి ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. పలు ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న సింగపూర్ వాసుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటుచేసే విందులో కూడా సింగపూర్ ప్రధాని పాల్గొంటారు. లూంగ్‌తో పాటు ఆయన భార్య హో షింగ్, పలువురు కీలక మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కూడా ఈనెల 5, 6 తేదీలలో సింగపూర్ ప్రధాని పర్యటిస్తారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆయనకు విందు ఇవ్వనున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
-
బస్సు కన్నా నడకే నయం.. ట్రాఫిక్ జామ్ జామ్
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ప్రజలు బస్సుల్లోంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇలా వెళ్తే అయినా కాస్త ముందున్న బస్సులోకి వెళ్లొచ్చని, దాంతో త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారికి ఈ ట్రాఫిక్ జామ్ నరకం చూపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. మూసాపేట వద్ద రోడ్డు చెరువును తలపిస్తుండడంతో వాహనాలు అటూ ఇటూ నిలిచిపోయాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకడీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడిన గోతుల కారణంగా వాహనచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
సాహసం చేయాలి మరి!
సీతానగరం: మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన దాదా పు 850 మంది పిల్లలు రోజూ సమీప పట్టణాల్లో చదువుకోసం వెళ్తుంటారు. అయితే వీరు ప్రయాణించాల్సిన సమయాల్లో ఒకటి, అరా బస్సులు మాత్రమే ఉండటంతో వారంతా బస్సు ల్లో కిక్కిరిసి ప్రయాణించడమేగాదు... ఏకంగా బస్ టాప్‌పైకి ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఈ ప్రాంత విద్యార్థులకు రోజువారి దినచర్యగా మారిపోయింది. ఇది ప్రమాదమని తెలిసినా అధికారులు వారికి అదనపు బస్సులు సమకూర్చేందుకు ముందుకు రావడం లేదు. దాదాపు అన్ని గ్రామాలనుంచీ అదే పరిస్థితి మక్కువ రూట్‌నుంచి సీతానగరం, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాలకు దాదాపు 400మంది, పి.చాకరాపల్లి, అజ్జాడ తదితర గ్రామాల నుంచి 450 మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. సకాలంలో విద్యాలయాలకు చేరాలంటే... వచ్చే ఒక్కబస్సునే ఇంతమందీ ఆశ్రయించాల్సి వస్తోంది. మక్కువ నుంచి, పి.చారాపల్లినుంచి ఉదయం పూట 8 గంటల సమయంలో వచ్చే బస్సులు చాలక పోవడంతో కొయ్యానపేట, బగ్గం దొరవలస, బళ్ళకృష్ణాపురం నుంచి విద్యార్థులు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టాప్‌పైనే ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే పి.చాకరాపల్లి బస్సులో బూర్జ, పెదంకలాం, కృష్ణరాయపురం, చెల్లంనాయుడువలస, లక్షీపురం గ్రామాల విద్యార్థులు బస్సు టాప్‌పైనే రోజూ ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం ప్రయాణిస్తుండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్స్ బస్సును ఉదయం-సాయంత్రం పూట బస్సు తిరుగాడేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తోంది నేను తామరఖండి నుంచి సీతానగరం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి 9గంటలకు వెళ్లాలి. తామరకండిలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి రోడ్డుకు వస్తున్నాను. బస్సులు ఆపక పోవడంతో చివరిక్షణంలో సైకిలుపై వెళ్ళాల్సి వస్తోంది. తక్షణమే అదనంగా బస్సు వేయ్యాలి. సురాపాటి లావణ్య, విద్యార్థిని పెదంకలాంలో బస్సులు ఆపట్లేదు రోజూ వందలాదిమంది ప్రయాణించే అజ్జాడ రూటులో బస్సులు చాలక టాప్‌పైనే కాలేజీకి వస్తున్నాను. అదనంగా బస్సువెయ్యాలని కోరినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఒక్కోసారి పెదంకలాంలో ఆ బస్సుకూడా ఆపట్లేదు. - అలజంగి సాయి, ఇంటర్‌విద్యార్థి, పెదంకలాం.