ముందు మిర్రర్ లేని కావేరీ ట్రావెల్స్‌బస్సు
అనకాపల్లి: ఛార్జీల రూపంలో వందలాది రూపాయలు వసూలు చేస్తూ సరైన కండిషన్ లేని బస్సు సమకూర్చారంటూ పలువురు ప్రయాణికులు నక్కపల్లి పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు టికెట్టు తీసుకున్నారు. ట్రావెల్స్ వారు కావేరీ ట్రావెల్స్ బస్సును ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సు కండిషన్‌లో లేదని, ముందు భాగంలో అద్దం లేదని ప్రయాణికులు తెలిపారు.
చీకట్లో తాము అద్దం లేదనే విషయాన్ని గుర్తించలేదని, రన్నింగ్‌లో ముందు భాగం నుంచి విపరీతమైన చలిగాలులు రావడంతో డ్రైవర్ వద్దకు వెళ్లి పరిశీలించగా అద్దం లేని విషయం బయటపడిందన్నారు. దీంతో డ్రైవర్‌ను టికెట్స్ బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వారిని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. చలిగాలులతో గజగజ వణుకుతున్న వీరంతా ఎట్టకేలకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్సును బలవంతంగా నిలిపివేశారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఇదే బస్సులో హైదరాబాద్ తీసుకెళ్తామని, మీరంతా రావాల్సిందేనని డ్రైవర్, బస్సు యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణం చేయకపోతే టికెట్ డబ్బులు తర్వాత వాపసు చేస్తామని, ప్రత్యామ్నాయంగా వేరే బస్సు ఏర్పాటు చేసేది లేదని చెబుతున్నారని ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రయాణికులంతా నక్కపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిటికీలకు అద్దాలు లేకపోవడం వల్ల రాత్రిపూట విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయని, చలిగాలులతో గజగజ లాడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment