Anakapalle District News
-
సిరులతల్లి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు
డాబాగార్డెన్స్ (విశాఖ): మార్గశిర మాస మూడో గురువారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టౌన్ కొత్త రోడ్డు నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రీడింగ్ రూమ్ వద్ద ధర్మదర్శనంతో పాటు రూ.100 శీఘ్ర దర్శనం, రూ.200 ప్రత్యేక దర్శనంతోపాటు రూ.500 ఉత్సవ ప్రత్యేక దర్శనం ప్రవేశ క్యూలైన్ల టికెట్లు ఇస్తారు. సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీవీఐపీ, వీఐపీతోపాటు వృద్ధులు, వికలాంగులు, రూ.200, రూ.500 టికెట్ తీసుకున్న వారికి దర్శనం కల్పించనున్నారు. అమ్మవారి ఆలయ వెనుక భాగం, ఆలయ ప్రధాన ద్వారం (వీటీ కాలేజ్ వద్ద), దర్శనం అనంతరం బయటకు వచ్చే మార్గంలో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయ సమీపంలో పోలీస్ అవుట్ పోస్ట్‌తోపాటు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టౌన్‌కొత్తరోడ్డు, ఘోషాస్పత్రి, అమ్మవారి ఆలయం వెనుక భాగంలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసుల బందోబస్త్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి తెలిపారు. బుధవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. -
సకుటుంబ సపరివారం.. గిన్నిస్ పురస్కారం
● ఆ కుటుంబంలో అందరూ రికార్డు వీరులే..గిన్నిస్ సర్టిఫికెట్లతో విజయ్ కుటుంబం సాక్షి, అనకాపల్లి: రికార్డు నెలకొల్పాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.. అందులోనూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలంటే ఎన్ని కోట్లమందిని దాటి రావాలి..! అంతటి అరుదైన ఘనతను నూటికో కోటికో ఒక్కరు సాధిస్తారు. కానీ అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ఆ రికార్డును సాధించి, సరికొత్త రికార్డు సృష్టించారు. అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల విజయ్ 2012లో చైనాలో స్థిరపడ్డారు. ఆయన, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా వారి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల బాటలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ●కొణతాల విజయ్, జ్యోతి దంపతుల కుమార్తె జస్మిత వయస్సు 14 ఏళ్లు. ఒంటి కాలుతో ఒక నిమిషంలో 168సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ●వారి కుమారుడు శంకర్ వయస్సు ఐదేళ్లు. ఒక నిమిషంలో 129 సార్లు స్కిపింగ్స్ (ఒలింపిక్ ట్రంప్లిన్స్) చేసి రికార్డు సాధించాడు. 2019లో జపనీస్ కుర్రాడు సాధించిన రికార్డును శంకర్ అధిగమించాడు. -
తుపాను గుబులు
వరుస తుపానులు వరి రైతుల వెన్ను విరుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మరిన్ని రోజులు కురిస్తే పూర్తిగా నష్టపోతామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పండిన పంటను రక్షించుకునేందుకు రైతులు ఆందోళనతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు. రైతుల గుండెల్లో పొలంలో ఆరబెట్టిన పంటను మోపులు కట్టి కల్లాలకు తరలిస్తున్న రైతులువరి కుప్పలను కాపాడే పనిలో రైతులు తడిసి ముద్దయిన వరి పంటతో అన్నదాతకు తీవ్ర నష్టం పొలంలో ఆరబెట్టిన పంటను కల్లాలకు తరలించడంలో నిమగ్నం చోడవరం: ఈ ఏడాది ఇప్పటి వరకు తుపానులు ఇబ్బంది పెట్టలేదు. గత నెలలో తుపాను వచ్చినా అప్పటికి వరి కోతలు ప్రాథమిక దశలోనే ఉండటంతో జిల్లా రైతులకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రెండ్రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో గ్రామాల్లో రైతులు పొలాల్లోకి పరుగులు తీస్తున్నారు. వరి పంట పూర్తిగా పక్వానికి రావడంతో వరి కోతలు జిల్లా అంతటా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తుపాను ఆవరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ వరి విస్తీర్ణం (ఈ క్రాప్‌లో నమోదయింది) 56,410 హెక్టార్లు అయినప్పటికీ.. చెరకు సాగుకు బదులు వరి సాగు అదనంగా చేపట్టడంతో 1500 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెరిగింది. సుమారు 58 వేల హెక్టార్లలో ఆశాజనకంగానే వరి సాగు జరిగింది. ప్రధానంగా చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఎక్కువగా సాగు జరిగింది. ఇప్పటికే 50 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే ఈ ఏడాది 54 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. సకాలంలో వరినాట్లు వేయడంతో పంట పూర్తిగా కోతకు వచ్చింది. తేలిక రకాలతోపాటు సోనామసూరి, సాంబమసూరి వంటి బీపీటీ రకాలు కూడా కోతకు రావడంతో అవి కూడా కోతలు కోసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఆర్జీఎల్, సూపర్ జయ, స్వర్ణ వంటి రకాలు ఇప్పటికే కోతలు కోసి కుప్పలు వేసేందుకు పొలాల్లో ఆరబెట్టి ఉంది. మిగతా చోట్ల కూడా పంట పక్వానికి రావడంతో అవి కూడా కోతలు కోసే పనిలో రైతులు ఉన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట కోతకోసి సరిగ్గా ధాన్యం చేతికొచ్చే సమయంలో అల్పపీడనం ఆవరించడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే కోసిన పంటను పొలం నుంచి బయటకు తీసి కుప్పలు వేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఉన్న పంటను హుటాహుటిన ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ల సాయంతో కల్లాలు, పాకల వద్దకు తరలించి కుప్పలు పెడుతున్నారు. మరోపక్క కోతకు వచ్చిన పంటను హడావిడిగా కోత కోస్తున్నారు. ఒకవేళ తుపాను వర్షాలు భారీగా కురిస్తే పంట పూర్తిగా నేలకొరిగి, నీట మునిగి నష్టాలపాలవుతుందనే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది సోనామసూరి, సాంబమసూరి రకాలు కూడా ఎక్కువగా వేశారు. ఈ రకాలు చిన్నపాటి తుపాన్లను కూడా తట్టుకోలేవు. దీంతో చాలాచోట్ల వరి పంట ఈదురుగాలులు, వర్షానికి పొలంలోనే నేలకొరిగింది. ఆందోళన చెందుతున్న రైతులు గింజ కట్టి మరో వారం రోజుల్లో కోయాల్సిన పంటను సైతం ఇప్పుడే కోసేస్తున్నారు. రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, కె.కోటపాడు మండలాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని గ్రామాల్లో రైతులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ పంటను రక్షించుకునే పనిలో పడ్డారు. కుప్పలు పెట్టిన పంటను రక్షించుకునేందుకు కుప్పలకు తార్పాలు కప్పుతున్నారు. తడిసిన వరి పనలపై ఉప్పునీరు పిచికారీ చేయాలి తుమ్మపాల: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పంట 56,410 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయగా ఇప్పటివరకు 21,142 హెక్టార్లలో (38 శాతం) కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహనరావు తెలిపారు. వరి కోతలను వర్షాలు తగ్గే వరకు వాయిదా వేసుకోవాలన్నారు. కోత కోసి పెట్టిన కుప్పల్లో వర్షం నీరు చేరినప్పుడు గింజ మొలకెత్తకుండా ధాన్యం రంగు మారకుండా ఉండేందుకు వర్షాలు తెరిపిచ్చిన తర్వాత ఉప్పునీరు కలిపి కంకులపై చల్లాలని సూచించారు. కోయని పంటను పొలంలోనే ఐదారు వరి దుబ్బులను ఒక దుబ్బుగా కట్టి ఉంచితే ఈదురుగాలులకు పంట నేలకొరగదని ఆయన పేర్కొన్నారు. -
రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి: జిల్లాలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నేరాల సంఖ్య తగ్గేలా చూడాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల నడవడికపై దృష్టి పెట్టాలని, నేర ప్రవృత్తికి దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, పోలీస్ శాఖపై సమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలన్నారు. మిస్సింగ్ కేసుల ఛేదన, రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, చోరీలు, మత్తు పదార్ధాల నివారణపై సిబ్బంది దృష్టి సారించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల వద్ద తప్పక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని, రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన 30మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, కె.వి.సత్యనారాయణ, జి.ఆర్.ఆర్.మోహన్, బి.అప్పారావు, ఇ.శ్రీనివాసులు, పి.నాగేశ్వరరావు, సీఐలు లక్ష్మణమూర్తి, అల్లు స్వామినాయుడు, టి.వి.విజయకుమార్, అశోక్‌కుమార్, టి.లక్ష్మి, గఫూర్, టి.కల్యాణి, ఎస్ఐలు పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ద్వారా పరివర్తనకు కృషి నేర ప్రవృత్తికి దూరంగా ఉండేలా చర్యలు నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ తుహిన్ సిన్హా -
28 నుంచి 31 వరకు గ్రామీణ బ్యాంక్ సేవలు నిలుపుదల
అనకాపల్లి: ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలను ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎస్.సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ ప్రధాన కార్యాలయం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉందని, ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకూ బ్యాంక్ సేవలు, ఏటీఎం, ఆన్లైన్ నగదు లావాదేవీలతోపాటు ఇతర సేవలు నిలుపుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. జనవరి 1వ తేదీ నుంచి బ్యాంక్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. -
వరి కోతలు వాయిదా వేసుకోవాలి
● కోసిన పంటను సంరక్షించాలి ● వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు జేసీ విజ్ఞప్తి తుమ్మపాల: తుపాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో వరి సాగు చేసిన రైతులు రాబోయే రెండు మూడు రోజుల్లో కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత స్థలంలో ఎత్తయిన ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని, కోసిన పంటపై టార్పాలిన్ కప్పి వర్షపు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుని పంట నాణ్యత కాపాడాలన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం రక్షణకు 600 టార్పాలిన్లను అవసరమైన రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. అవసరమైతే మరిన్ని టార్పాలిన్లను కొనుగోలు చేసి అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు 8008901584, 9492821030కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ధాన్యం సేకరణకు ఈనెల 9వ తేదీ నుంచి 72 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 406.16 మెట్రిక్ టన్నుల ధాన్యం 124 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశామని, 117 మంది రైతుల ఖాతాలో రూ.87 లక్షలు జమ చేయడం జరిగిందని తెలిపారు. దళారులను నమ్మి తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
బాబూ.. ఇదేం బాదుడు?
సాక్షి, విశాఖపట్నం: ‘ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారు. సంపద సృష్టించడమంటే ఇదేనా? ప్రజలపై సర్దుబాటు చార్జీల పేరిట వడ్డించడమా? విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే దురదృష్టకరమైన బషీర్‌బాగ్ వంటి ఘటనలు పునరావృతం కాక తప్పదు’అని పలువురు మేధావులు, సామాజిక వేత్తలు హెచ్చరించారు. ద్వారకానగర్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వినియోగదారులపై సర్దుబాటు చార్జీల కింద వసూళ్లు చేస్తున్న మొత్తం రూ.17,898 కోట్లను ప్రభుత్వమే భరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చార్జీలు తగ్గించాలని, సామాన్య ప్రజలకు అనుకూలమైన పాలన, విధానాలు అమలు చేయాలని, స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలనే తీర్మానాలను కృష్ణంరాజు ప్రవేశపెట్టగా.. అందరూ ఆమోదించారు. సర్దు‘పాట్లు’.. భారం మోపిన చార్జీలు సమావేశంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, ‘విద్యుత్ చార్జీల పెంపుతో గృహ వినియోగదారులు, రైతులపై పెనుభారం పడుతోంది. సర్దుబాటు చార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై సుమారు రూ.17,898 కోట్ల భారం మోపడం దారుణం. సగటున యూనిట్‌కు రూ.15 వరకు వినియోగదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం.’అని తెలిపారు. ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ తమ్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు పాలన చేస్తే ప్రజలు క్షమించరన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా అన్ని రంగాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు. స్మార్ట్ మీటర్ల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని ఆరోపించారు. సీఐటీయూ నాయకురాలు మణి మాట్లాడుతూ ఎక్కువ వినియోగం ఉన్న సమయంలో పీక్ ఆఫ్ టైం పేరిట చార్జీలు వసూళ్లు చేస్తారని చెప్పడం దారుణమన్నారు. సర్దుబాటు చార్జీలు తగ్గించి..అదానీతో స్మార్ట్‌మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని, అవసరమైతే పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఇచ్చిన పిలుపును ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. సీపీఎం నేత గంగారావు మాట్లాడుతూ దేశంలో ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ట్రూ అప్ చార్జీల పేరిట వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేట్ చేతుల్లో పెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి.రామారావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే పవన్ కల్యాణ్ లాంటి వారు విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం లేదన్నారు. ఆరు నెలల పాలనలో విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు భారీగా పెరిగినప్పటికీ.. ఆ ఊసే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైల్వే యూనియన్ నాయకుడు రామచంద్రమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు దోపిడీలో 40 ఏళ్ల అనుభవం ఉందని ఆరోపించారు. వినియోగదారుడు రోడెక్కి ప్రశ్నించిన రోజే ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందన్నారు. సామాజిక కార్యకర్త సన్ మూర్తి మాట్లాడుతూ సామాన్యుడి వచ్చే ఆదాయంలో సగం విద్యుత్ చార్జీలకే చెల్లిస్తే.. ఆ కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. స్వచ్ఛంద సంస్థ అధినేత వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ‘బాదుడే బాదుడు’పేరిట ఆందోళనలు చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌మీటర్లు బిగిస్తున్నారని.. రైతులు ఎలా వ్యవసాయం చేయాలని ప్రశ్నించారు. వ్యాపారవేత్త జి.త్యాగరాజు మాట్లాడుతూ వినియోగదారుడు వాడని విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. సంపద సృష్టించడమంటే ప్రజలపై భారం వేయడమా? స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని లోకేష్ వ్యాఖ్యలు మర్చిపోగలమా.. విద్యుత్ చార్జీల పెంపు, స్మార్ట్‌మీటర్లపై ప్రభుత్వం పునరాలోచించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, సామాజికవేత్తల డిమాండ్ -
కొరియర్ ద్వారా గంజాయి రవాణా
● తప్పుడు చిరునామాతో బట్టబయలు ● పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిల్వలు మల్కాపురం: పారిశ్రామిక ప్రాంతంలో అద్దె ఇంట్లో భారీగా గంజాయి నిల్వలను బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి నుంచే ఆటో ద్వారా వివిధ ప్రాంతాలకు గంజాయి పంపిణీ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వివరాలివీ.. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి న్యూఢిల్లీకి ఒక కొరియర్ సంస్థ ద్వారా గంజాయి పార్శిల్ పంపారు. అయితే కొరియర్ చేరాల్సిన చిరునామా తప్పుగా ఉండటంతో.. అక్కడి పార్శిల్ బాయ్‌కు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని ఇక్కడి నుంచి పంపిన సంస్థకు తెలియజేసి పార్శిల్‌ను తిరిగి విశాఖ పంపాడు. దీంతో వారు ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పార్శిల్ తనిఖీ చేసి అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కొరియర్ సంస్థకు పార్శిల్ పంపిన వ్యక్తులు ఇచ్చిన చిరునామా(60వ వార్డు పరిధిలోని ఎంఐజీ–1, 22–65–5–22 క్వార్టర్స్)ను పరిశీలించగా.. అది ప్రమోద్‌కు చెందిన పాత ఇంటి చిరునామాగా తేలింది. ప్రమోద్ బిహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులకు నెలకు రూ.9వేలకు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. సదరు వ్యక్తులు ఒక ఆటోను అద్దెకు తీసుకుని.. ఆ ఇంట్లో గంజాయి బస్తాలను నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆటో ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం రాత్రి టూ టౌన్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి.. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మల్కాపురం పోలీసుల సహాయంతో ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ కేసులో బుధవారం ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
‘డెయిరీ కార్మికులకు న్యాయం చేస్తాం’
అక్కిరెడ్డిపాలెం: ప్రభుత్వ జీవోలు, చట్టాల ప్రకారం కార్మికులకు న్యాయం చేస్తామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ హామీ ఇచ్చారు. వామపక్ష నేతలతో కలిసి విశాఖ డెయిరీ కార్మికులు బుధవారం చైర్మన్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. దీంతో చైర్మన్ ఆనంద్‌కుమార్ కార్మికుల వద్దకు వెళ్లారు. యూనియన్ నాయకులు కార్మికుల డిమాండ్లను వివరిస్తుండగా.. ఆనంద్ కుమార్ వాటికి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, జీవోల ఆధారంగా కార్మికుల హక్కులను అమలు చేస్తామని సమాధానమిచ్చారు. కార్మికులను పర్మినెంట్ చేసే అంశంపై కమిటీ(కార్మికులు, డైరెక్టర్లు) వేసి.. చర్చల ద్వారా నిర్ణయం తీసుకుంటామన్నారు. జీతాలు పెంచే అంశం కూడా సులభంగా తీసుకునే నిర్ణయం కాదన్నారు. దీనికి సీనియారిటీ రికార్డుల పరిశీలన చేస్తామన్నారు. ప్రసూతి సెలవులను విధివిధానాల ప్రకారం అమలు చేస్తామన్నారు. కాగా.. యాజమాన్య, యూనియన్ ప్రతినిధులు త్వరలో సమావేశమై.. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరపడానికి అంగీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాజువాక ఏసీపీ టి.త్రినాథ్, సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి
నర్సీపట్నం: స్థానిక ఏరియా ఆస్పత్రి స్థాయి పెంపునకు కృషి చేస్తానని, ప్రస్తుతం ఉన్న 150 పడకల స్థానంలో 200 పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధుల సేకరణకు సహకారం అందిస్తానని, డాక్టర్ల క్వార్టర్స్ మరమ్మతులకు అవసరమైన రూ.15 లక్షల నిధుల కేటాయింపు తోడ్పాటునందిస్తానని తెలిపారు. శానిటేషన్, రోగుల భోజనం నాణ్యతలో మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు రిఫర్ చేశారో కారణాలతో సమర్పించాలని ఆదేశించారు. కొత్త అంబులెన్స్ ఏర్పాటుకు ఎంపీ హామీ ఇచ్చారన్నారు. సీటీ స్కాన్ అవసరాన్ని డాక్టర్లు సూచించగా దీని ఏర్పాటుకు రూ. 2.5 కోట్లు ఖర్చు అవుతుందని డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల కోసం ఎన్ఆర్ఐల, ప్రభుత్వ సహకారం కోసం కృషి చేస్తానని స్పీకర్ తెలిపారు. కొత్తగా నిర్మించిన భవనానికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్నుమరమ్మతులు చేయించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్డీవో వి.వి.రమణ, కమిషనర్ జంపా సురేంద్ర, సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా బధిరుల క్రికెట్
విశాఖ స్పోర్ట్స్ : బధిరుల టీ–20 క్రికెట్ పోటీలు వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్లో బుధవారం నిర్వహించారు. ఈ టోర్నీలో విశాఖతో పాటు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు చెందిన బధిరులు పాల్గొన్నారు. డెఫ్ ఫెడరేషన్ అభ్యర్థన మేరకు కలెక్టర్ హరిందిర ప్రసాద్ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ పోటీల్లో పాల్గొనేవారికి వసతి, భోజన సదుపాయాల్ని సమకూర్చింది. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ ప్రతినిధులు జూన్గాలియట్, సూర్యనారాయణ, అప్పలనాయుడు, ప్రేమ్‌చంద్, హసీం, నాగార్జున, సంతోష్, అబ్దుల్, డీఎస్ఏ కోచ్‌లు పాల్గొన్నారు. -
నేవీ నిర్వాసితల సమస్యలు పరిష్కరించాలి
● రెవెన్యూ సదస్సులో పెదకలవలాపల్లి ప్రజలు ఏకరువు ● తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పణరాంబిల్లి(యలమంచిలి): నేవీ రక్షణ గోడ నిర్మాణంతో ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ పెదకలవలాపల్లి గ్రామ ప్రజలు బుధవారం ఆందోళన చేశారు. పెదకలవలాపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో నిర్వాసితులకు తక్షణమే ప్యాకేజీ అందించాలని, ఉపాధి కల్పించాలని తహసీల్దారు శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 423 రోజులుగా శాంతియుత నిరసన తెలుపుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ డిమాండ్లు నెరవేర్చకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారులు వచ్చి నిర్వాసితులతో చర్చలు జరిపి వెళ్లారే తప్పా తమకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తామని నిర్వాసితుల తరఫున రావి దేముళ్లు హెచ్చరించారు. -
ఎస్సీ వర్గీకరణపై 194 వినతులు
సమావేశంలో మాట్లాడుతున్న షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మహారాణిపేట (విశాఖ): షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ సమాచారం పూర్తి స్థాయిలో అధికారుల వద్ద ఉండాలని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు.బుధవారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌తో కలిసి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రజలు, ఉద్యోగులు, వివిధ కుల సంఘ నాయకుల నుంచి అభిప్రాయాలు, వినతులు స్వీకరించారు. మొత్తం 194 వినతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కలెక్టర్ జిల్లాలో ఉన్న కులాల వారీగా గణాంకాలు వివరించారు. విద్యాశాఖ, జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ ఆఫీస్, వైద్య ఆరోగ్యశాఖ, డీఆర్డీఏ, ఏపీ ఈపీడీసీఎల్, ఆర్టీసీ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖ, మార్కెటింగ్ శాఖ, గృహనిర్మాణ శాఖ కార్యాలయాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై సంబంధిత వివరాలను అధికారులు వివరించారు. సమావేశంలో డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖ, వికలాంగుల సంక్షేమ సహాయ సంచాలకులు జె.మాధవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రేపు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 20న నిర్వహించనున్నారు. జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మేయర్, స్థాయీ సంఘ చైర్పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో 71 అంశాలు చర్చకు రానున్నాయి. 21న జీవీఎంసీ బడ్జెట్‌పై సమావేశం 2024–2025 మార్చి నెల వరకు బడ్జెట్‌తో పాటు 2025–2026 బడ్జెట్‌కి సంబంధించి స్థాయీ సంఘ సభ్యులు ఈ నెల 21న సమావేశమై చర్చించనున్నారు. సవరించిన బడ్జెట్‌ను త్వరలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి సభ్యుల ఆమోదానికి పంపనున్నారు. -
పిల్లలకు ప్రత్యేక ఓపీ, వార్డు ఏర్పాటు
సీతంపేట (విశాఖ): పిల్లల్లో వచ్చే నేత్ర సమస్యలు, నియంత్రణ చర్యలపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సమీక్ష చేపట్టింది. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు గొండు సీతారామ్ ఆస్పత్రిలో పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు నెల రోజుల్లో పిల్లల కోసం ప్రత్యేక ఓపీ విభాగం, ఐదు బెడ్లతో పిల్లల వార్డు ఏర్పాటు చేస్తామన్నారు. 2023లో ఆస్పత్రిలో 4,068 పిల్లలకు వైద్యం అందించామని, 214 మందికి సదరం ధ్రువీకరణపత్రాలు మంజూరు చేసినట్టు తెలిపారు. 2024లో ఇప్పటివరకు 3,613 మంది పిల్లలకు వైద్యం, 70 మందికి సదరం సర్టిఫికెట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. 133 మందికి రెటినోపతి వైద్యం, జిల్లాల్లోని 541 పాఠశాలల్లో 54,124 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వైద్యులు వాణిశ్రీ, ప్రేమలత, పీఎంవో ఉమా శ్రీనివాస్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు రమణకుమారి, శ్రీలత, బాలల సంరక్షణాధికారి లక్ష్మి, ఐసీపీయూ ప్రతినిధులు ఆనంద్, శకుంతల పాల్గొన్నారు. -
విజయహజారే ట్రోఫీకి విశాఖ సిద్ధం
● ఈ నెల 21 నుంచి లీగ్ మ్యాచ్లువిశాఖ స్పోర్ట్స్: దేశవాళీ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు లీగ్ దశలో పోటీపడనుండగా, గ్రూప్–డీ మ్యాచ్‌లు ఈ నెల 21 నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ముంబయ్, నవీ ముంబయ్ వేదికల్లో ఆంధ్ర జట్టు గ్రూప్ బీలో ఆడనుంది. లీగ్ దశలో ఏడు వన్డే మ్యాచ్‌లు వైఎస్సార్ స్టేడియంలో జరగనున్నాయి. గ్రూప్ దశ పోటీలు రౌండ్–రాబిన్ పద్ధతిలో జనవరి 5తో ముగియనుండగా.. ప్లేఆఫ్ మ్యాచ్‌లు జనవరి 9 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 18న ఫైనల్ జరగనుంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విశాఖ వేదికగా మొదటి మ్యాచ్ ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ఛత్తీస్‌గఢ్, మిజోరం జట్ల మధ్య జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్ జట్టుకు అమన్‌దీప్, మిజోరం జట్టుకు జోథన్ సంగా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రెండో మ్యాచ్ ఈ నెల 23న రింకూసింగ్ కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్ జట్టు మిజోరంతో తలపడనుంది. 26న మూడో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో సాయికిశోర్ నాయకత్వంలో తమిళనాడు జట్టు ఆడనుంది. 28న నాలుగో మ్యాచ్ కరణ్ నాయర్ కెప్టెన్సీలో విదర్భ జట్టు, మనన్వోరా కెప్టెన్సీలో చండీగఢ్ జట్టు మధ్య జరగనుంది. ఈ నెల 31న తమిళనాడుతో విదర్భ, జనవరి 3న చత్తీస్‌గఢ్‌తో పరాస్దోగ్రా కెప్టెన్సీలో జమ్ముకశ్మీర్ జట్టు ఆడనుంది. లీగ్ చివరి మ్యాచ్ జనవరి 5న జమ్ముకశ్మీర్‌తో చండీగఢ్ తలపడనుంది. ఈ సారి భరత్ కెప్టెన్సీలో.. ఆంధ్ర జట్టు ఈసారి కె.ఎస్.భరత్ కెప్టెన్సీలో ఆడనుంది. భరత్ వికెట్ల వెనుక నిలబడటంతో పాటు ఓపెనర్‌గా రానున్నాడు. జట్టులోని మరో ముఖ్య ఆటగాడు రికీబుయ్ టాపార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగనున్నాడు. అశ్విన్ హెబ్బర్ ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్ షేక్ రషీద్, పృథ్వీలు టాపార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగనున్నారు. మిడిలార్డర్లో తేజ రానున్నాడు. మీడియం పేస్‌తో శశికాంత్, అఖిల్, మహీప్, సత్యనారాయణ, తపస్విలు చెలరేగనుండగా, స్పిన్‌తో అభినవ్, అంజనేయులు, సందీప్, కుమార్ బంతిని గింగిరాలు తిప్పనున్నారు. ఆంధ్ర తన తొలి మ్యాచ్‌ను రైల్వేస్‌తో ఆడనుండగా, రాజస్థాన్, సిక్కిం, సర్వీసెస్, మేఘాలయ, మహారాష్ట్రలతో వరసగా మ్యాచ్‌లాడనుంది. లీగ్ చివరి మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌తో తలపడుతుంది. -
వైభవంగా వెంకన్న తిరువీధి
సప్పరం వాహనంపై వెంకన్న తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్‌కు బుధవారం ఉదయం నిత్య పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, గోదాదేవి అమ్మవారి సన్నిధి, స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద, ఉపాలయాల్లోను అర్చనలు పూర్తి చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఇత్తడి సప్పరం వాహనంపై శ్రీదేవి, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామిని పల్లకిలో ఉంచి తిరువీది సేవలు నిర్వహించారు. గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రముఖ కవయిత్రి డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి తిరుప్పావై మూడో పాశురాన్ని విన్నపం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు పాల్గొన్నారు. -
మామిడి బీమా ప్రీమియం గడువు పెంపు
తుమ్మపాల: వాతావరణ ఆధారిత పంటల బీమాకు సంబంధించి మామిడి తోటలకు ఈ నెల 31 వరకు ప్రీమియం గడువు పొడిగించినట్లు జిల్లా ఉద్యాన వనశాఖాధికారి జి.ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ–పంటలో నమోదు చేయుంచుకున్న రైతులంతా 2024–25 సంవత్సరం పంటకు బీమా ప్రీమియం చెల్లించడానికి అర్హులని పేర్కొన్నారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల వద్ద తీసుకున్న పంట నమోదు పత్రం, ఆధార్ కార్డు కాపీ, బ్యాంకు అకౌంట్ కాపీ, 1బీ/పట్టాదారు పాస్ పుస్తకం కాపీతో సహా మామిడి పంటకు ఎకరానికి రూ.2,200 చొప్పున మీ–సేవా కేంద్రంలో ప్రీమియం చెల్లించాలన్నారు. ఈ నెల 15 నుంచి 2025 మే 31 మధ్య కాలంలో అకాల అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం, వాతావరణం వ్యత్యాసం, అధిక గాలివేగం సంబంధించిన పరిమాణాలను పరిగణనలోకి తీసుకుని మామిడి పంటకు నష్టం వాటిల్లితే ఎకరానికి గరిష్టంగా రూ.44 వేలు రైతు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. -
ఉసురు తీసిన ఉపాధి
● నేవల్‌బేస్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి ● మృతుడు దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగి ● న్యాయం చేయాలంటూ బంధువులు,సీపీఎం నేతల ఆందోళన రాంబిల్లి (యలమంచిలి): నేవల్‌బేస్ ప్రాజెక్ట్ ప్రహరీ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీ ఉద్యోగి మృతి చెందాడు. రాంబిల్లి సీఐ సీహెచ్.నర్సింగరావు, మృతుని బంధువులు, స్థాఽనికులు తెలిపిన వివరాలు... పరవాడ గ్రామానికి చెందిన బండారు నీలబాబు(39) దొరాజియా కనస్ట్రక్షన్ కంపెనీలో ఫ్లోర్మన్గా చాలా కాలంగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రాంబిల్లి మండలం మన్యపు చింతువా నేవీ కాలనీ సమీపంలో నేవల్‌బేస్ రక్షణ గోడ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో గోతుల వద్ద బుధవారం ఐరన్టేపుతో కొలతలు సేకరిస్తున్నాడు. ఆ ఐరన్టేపు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై ఘటనా స్థలంలో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు హుటాహుటిన రాంబిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే నీలబాబు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. నీలబాబు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్ద గుండెలవిసేలా విలపించారు. నీలబాబు అందరితో కలసిమెలసి ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బండారు నీలబాబుకు కంపెనీ యాజమాన్యం నష్ట పరిహారం అందజేసి, ఆదుకోవాలని మృతుని బంధువులు, సీఐటీయూ నేతలు రాంబిల్లి పీహెచ్సీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నష్టపరిహారం చెల్లించనిదే మృతదేహాన్ని శవపంచనామాకు తరలించనివ్వబోమని భీష్మించుకు కూర్చుకున్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు ఎట్టకేలకు బుధవారం రాత్రి కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసినట్టు సీఐ చెప్పారు. -
చికిత్స పొందుతూ క్షతగాత్రుడి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని పోతురెడ్డిపాలెంలో ఈ నెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన పిల్లి సోమరాజు(34) బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ పోలీసులు తెలిపారు. రోజువారీ కూలీ అయిన సోమరాజు ఈ నెల 16న వ్యక్తిగత పనులపై పోతురెడ్డిపాలెం నుంచి యలమంచిలి వచ్చి తన ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా గ్రామంలో రామాలయం దగ్గర శునకం అడ్డు రావడంతో కింద పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావడంతో విశాఖ కేజీహెచ్‌కు చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు. సోమరాజు భార్య సాయికుమారి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
మాకవరపాలెం: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. రావికమతం మండలం తోటకూరపాలెం గ్రామానికి చెందిన విజయ(26), కె.తూటిపాలకు చెందిన కొల్లి సూర్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం సూర్యనారాయణ కశ్మీర్లో ఎస్ఎస్బీ(ససస్త్ర సీమా బల్)లో పని చేస్తున్నారు. విజయ బుధవారం ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో కలసి బుధవారం రాత్రి తూటిపాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా అత్త ఇంటి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని విజయ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
20 కేజీల గంజాయితో ఇద్దరి అరెస్ట్
చోడవరం రూరల్: మరో రాష్ట్రానికి తరలించడానికి 20 కేజీల గంజాయితో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి 20 కేజీల గంజాయిని హర్యానా రాష్ట్రానికి తరలించడంలో భాగంగా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తున్న ఇద్దరిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా.. 20 కేజీల గంజాయి బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి, గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కౌలుదారుల పేరిట దేవాలయం భూములు
● గుర్తించిన నర్సీపట్నం డివిజన్ దేవదాయ శాఖాధికారి ● తహసీల్దార్ వేణుగోపాల్‌తో కలిసి వి.బి.అగ్రహారంలో సర్వే నాతవరం: దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన భూములు కౌలుదారుల పేరిట ఉండరాదని తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ స్పష్టం చేశారు. మండలంలో వి.బి.అగ్రహారంలో పురాతన శివాలయానికి సుమారుగా 50 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని దేవదాయ అధికారులు పంట ఫలసాయం నిమిత్తం కౌలుకు వేలం పాట నిర్వహిస్తుంటారు. ఈ భూమిని గతంలో కౌలుకు తీసుకున్న వారు వన్బీతో పాటు సాగు హక్కులో పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇటీవల నర్సీపట్నం డివిజన్ దేవదాయ ధర్మదాయ శాఖాధికారిగా వచ్చిన కె.దివ్యతేజ ఈ విషయాన్ని గుర్తించారు. మన్యపురట్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసభ అనంతరం తహసీల్దార్, గ్రామ పెద్దలతో కలిసి ఆ భూమిని పరిశీలించి మండల సర్వేయర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వే చేశారు. రెండు జిల్లాలు సరిహద్దులో ఉన్న ఈ భూమి ఆక్రమణకు కాకుండా హద్దులు నిర్ణయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు భూములను స్వయంగా పరిశీలించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపడతామన్నారు. శివాలయం భూములు కొంత మంది పేర్ల మీద ఉన్నాయని, నిబంధనలు ప్రకారం ఆలయం పేరు మీద మార్పు చేస్తామన్నారు. మండలంలో నాతవరం వై.డి.పేట, ఎం.బెన్నవరం పంచాయతీల్లో దేవదాయ శాఖకు భూములు ఉన్నాయని ఇండోమెంట్ అధికారి కె.దివ్యతేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివ, తాండవ నీటి ప్రాజెక్టు మన్యపురట్ల సిగ్మెంట్ అధ్యక్షుడు అప్పన దివాణం, మాజీ వైస్ ఎంపీపీ చిట్టిబాబు, మాజీ సర్పంచులు వీసం నూకరాజు, వనిమిన సూర్యారావు, వీఆర్వోలు చలపతి, సత్తిబాబు పాల్గొన్నారు. -
పది కిలోల హాష్ ఆయిల్ పట్టివేత
పెందుర్తి: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గవర జగ్గయ్యపాలెంలో నిల్వ ఉంచిన హాష్ ఆయిల్(లిక్విడ్ గంజాయి)ను పెందుర్తి పోలీసులు, నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం భీమలాపల్లికి చెందిన ఉలంగి రామన్న, పాడేరుకు చెందిన కూడా రవిశంకర్, జీకే వీధి మండలం వంచుల చీరపల్లి గ్రామానికి చెందిన బోనంగి చంటిబాబులు కలిసి హాష్ ఆయిల్ సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఏజెన్సీ నుంచి నగరానికి 10 కిలోల హాష్ ఆయిల్‌ను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి పెందుర్తి పోలీసులు పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
‘రిమాండ్ ఖైదీ నేరస్తుడు కాదు’
చోడవరం రూరల్: రిమాండ్‌లో ఉన్నంత మాత్రాన ఖైదీ నేరస్తుడు కాదని, నేరం రుజువయ్యే వరకు నిందితుడు మాత్రమేనని న్యాయసేవ ప్రాధికార సంస్థ చైర్మన్, సబ్ జడ్జి వి.గౌరీ శంకరరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక సబ్ జైలులోని రిమాండ్ ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముందుగా ఖైదీలకు రోజువారీ అందిస్తున్న ఆహార పదార్థాల వివరాలను సబ్ జైల్ సూపరింటెండెంట్ బాబూరావును అడిగి తెలుసుకున్నారు. మెనూ అనుసరిస్తున్నదీ, లేనిదీ ఆరా తీశారు. బియ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల గదులు, పరిసరాల పరిశుభ్రతపై ఖైదీలతో జైలు సిబ్బంది నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ఖైదీలు ఎవరైనా న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే న్యాయ పరిషత్‌కు చెబితే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. నేర ప్రవృత్తి ఉన్న వారు తమ వ్యక్తిత్వాలను మార్చుకోవాలని, జైలు నుంచి సత్ప్రవర్తనతో బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవ ప్రాధికార సంస్థ పేనల్ న్యాయవాది భూపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.