Travel Agency
-
అద్దంలేని బస్సుతో హైదరాబాద్‌కు.. కావేరి ట్రావెల్స్ నిర్వాకం
అనకాపల్లి: ఛార్జీల రూపంలో వందలాది రూపాయలు వసూలు చేస్తూ సరైన కండిషన్ లేని బస్సు సమకూర్చారంటూ పలువురు ప్రయాణికులు నక్కపల్లి పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు టికెట్టు తీసుకున్నారు. ట్రావెల్స్ వారు కావేరీ ట్రావెల్స్ బస్సును ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సు కండిషన్లో లేదని, ముందు భాగంలో అద్దం లేదని ప్రయాణికులు తెలిపారు. చీకట్లో తాము అద్దం లేదనే విషయాన్ని గుర్తించలేదని, రన్నింగ్‌లో ముందు భాగం నుంచి విపరీతమైన చలిగాలులు రావడంతో డ్రైవర్ వద్దకు వెళ్లి పరిశీలించగా అద్దం లేని విషయం బయటపడిందన్నారు. దీంతో డ్రైవర్‌ను టికెట్స్ బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వారిని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. చలిగాలులతో గజగజ వణుకుతున్న వీరంతా ఎట్టకేలకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్సును బలవంతంగా నిలిపివేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఇదే బస్సులో హైదరాబాద్ తీసుకెళ్తామని, మీరంతా రావాల్సిందేనని డ్రైవర్, బస్సు యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణం చేయకపోతే టికెట్ డబ్బులు తర్వాత వాపసు చేస్తామని, ప్రత్యామ్నాయంగా వేరే బస్సు ఏర్పాటు చేసేది లేదని చెబుతున్నారని ప్రయాణికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రయాణికులంతా నక్కపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిటికీలకు అద్దాలు లేకపోవడం వల్ల రాత్రిపూట విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయని, చలిగాలులతో గజగజ లాడుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం
కర్ణాటక(దొడ్డబళ్లాపురం): ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బెంగళూరు వచ్చిన యువతిని సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి విక్రయించడానికి ప్రయత్నించిన నిందితుడిని కెంపేగౌడ ఎయిపోర్టు పోలీసులు అరెస్టు చేసారు. కోలారుకు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చి మెజెస్టిక్‌లో కూర్చుని ఉండగా ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగేశ్ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవనహళ్లికి తీసుకువచ్చాడు. ఆపై యువతిపై అత్యాచారం చేసి తరువాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని పథకం వేశాడు. అయితే ఎయిర్‌పోర్టులో నాగేశ్, యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వారికోసం కొత్త ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేసిన సోనూసూద్..!
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. లాక్డౌన్ సమయంలో అనేక మందిని వారి సొంత ఊర్లకు చేరవేయడంలో సోనూసూద్ ఎంతగానో కృషి చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రయాణికుల అవసరాల కోసం సరికొత్త ప్లాట్‌ఫాంను సోనూసూద్ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ట్రావెల్ ఏజెంట్ల కోసం ‘ట్రావెల్ యూనియన్’ అనే ప్లాట్‌ఫాంను సోనూసూద్ లాంచ్ చేశారు. సోనూసూద్ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాట్‌ఫాం భారత తొలి గ్రామీణ బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) ట్రావెల్ టెక్‌ప్లాట్‌పాంగా నిలవనుంది.దీంతో గ్రామీణ ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణసేవలను పొందనున్నారు. గ్రామీణ స్థాయిలో ట్రావెలింగ్ సెక్టార్ అసంఘటితంగా ఉంది. టైర్ 2 పట్టణాల్లోని ప్రయాణికులకు సేవలను అందించడానికి పలు ట్రావెలింగ్ సంస్థలు పెద్దగా మొగ్గుచూపడంలేదు. గ్రామీణ ప్రయాణికుల కోసం ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్స్ అసలు లేవని ట్రావెల్ యూనియన్ సంఘాలు పేర్కొన్నాయి. సోనూసూద్ ఏర్పాటుచేసిన ప్టాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులకు తక్కువ ధరలోనే ప్రయాణాలను, ఇతర సదుపాయాలను ఆఫర్ చేయవచ్చునని ట్రావెల్ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫాం మల్టిపుల్ ట్రావెల్ సర్వీస్ పార్టనర్లతో భాగస్వామాన్ని కల్గి ఉంది. అంతేకాకుంగా ఐఆర్సీటీసీ, 500కు పైగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలను, 10,000కు పైగా బస్ ఆపరేటర్లను, 10 లక్షలకు పైగా హోటల్ సదుపాయాలను ఈ ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ట్రావెల్ యూనియన్ ప్లాట్‌ఫాం ఇంగ్లీష్, హిందీ భాషలో అందుబాటులో ఉంది. త్వరలోనే మరో 11 రిజనల్ భాషల్లో సేవలను అందించనుంది. రూరల్ బీ2బీ ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫాం ‘ట్రావెల్ యూనియన్’ లాంచ్ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ... “లాక్డౌన్ సమయంలో ప్రయాణాల విషయంలో గ్రామీణ భారతీయులు ఎదుర్కొనే సవాళ్లను నేను ప్రత్యక్షంగా చూశాను. గ్రామీణ ప్రయాణికులు ముందుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం లేదు. వారి ప్రయాణాల కోసం మల్టీపుల్ ట్రావెల్ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులు ఏలాంటి అడ్డంకులు లేని ప్రయాణ అనుభూతిని పొందవచ్చునని తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్
సాక్షి, హైదరాబాద్: పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ నేషన్– వన్ పర్మిట్’లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రవాణాశాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇస్తోంది. కాంట్రాక్టు క్యారేజీలుగా తిరిగే వాహనాలు మాత్రం రాష్ట్ర, అంతర్రాష్ట్ర పర్మిట్లపై తిరుగుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు ఇచ్చే ఈ పర్మిట్ల వల్ల రవాణా శాఖకు భారీగా ఆదాయం లభిస్తుంది. అయితే కొత్తగా అమల్లోకి రానున్న వెసులుబాటు వల్ల.. ప్రైవేట్ బస్సులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించి టూరిస్టు పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారి పన్ను చెల్లిస్తే ఏడాది పాటు వాహనాలు నడుపుకోవచ్చు. ప్రైవేటు ఆపరేటర్లకు ప్రయోజనం కొత్తగా అమల్లోకి రానున్న టూరిస్టు పర్మిట్ల వల్ల ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి పర్మిట్లపై బస్సులు నడిపే ప్రైవేట్ ఆపరేటర్లకు మాత్రం ఎంతో ప్రయోజనం కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొంటున్న ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి సుమారు 1,150 ప్రైవేట్ బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు లక్షకు పైగా క్యాబ్‌లు అంతర్రాష్ట్ర పర్మిట్లపై ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇలాంటి వాహనాలన్నీ ఇక నుంచి టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు పర్మిట్ల కోసం అదనంగా చెల్లించవలసిన అవసరం ఉండదు. టూరిస్టు పర్మిట్ల ఫీజులివీ 9 సీట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేల చొప్పున చెల్లించాలి. 10 మంది ప్రయాణికులకు తక్కువ కాకుండా.. 20 మందికి మించకుండా తిరిగే నాన్ ఏసీ మినీ బస్సులు ఏడాదికి రూ.50 వేలు, ఏసీ మినీ బస్సులు రూ.75 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులు టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సులు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించి పర్మిట్లు తీసుకోవచ్చు. టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలు టోల్‌ట్యాక్స్, ఇతర చార్జీలన్నీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయం కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో వైట్ ప్లేట్ కార్లు, ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నారు. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి అగ్రిగేటర్ సంస్థలు కూడా టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. చట్టబద్ధంగా త్రైమాసిక పన్ను చెల్లించి తిరిగే రవాణా వాహనాలకు ఇది చాలా నష్టం. –షేక్ సలావుద్దీన్, రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్ -
బోగస్ ట్రావెల్ ఏజెన్సీ గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా ట్రావెల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, వీసా ప్రాసెసింగ్ సైతం నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి ల్యాప్‌టాప్, నకిలీ లెటర్‌హెడ్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బుధవారం తెలిపారు. చంపాపేట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యూసుఫ్‌కు విదేశాలకు వెళ్లి రావడం అంటే మక్కువ, ఈ నేపథ్యంలోనే పలుమార్లు సౌదీ అరేబియాతో పాటు దక్షిణ కొరియా వెళ్లి వచ్చాడు. అలా అతడికి ఆయా దేశాలకు సంబంధించిన వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన ఏర్పడింది. ఈ విధానం సుదీర్ఘమైనవి కావడం, సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని క్యాష్ చేసుకోవాలని పథకం వేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రావెల్ ఏజెన్సీ, వీసా ప్రాసెసింగ్ ప్రారంభించిన అతను ఆయా దేశాలకు వెళ్లాలని భావించే వారికి వీసాలు ఇప్పించే వాడు. దీనికోసం యూసుఫ్ నకిలీ లెటర్‌హెడ్స్, స్టాంపులు వినియోగించి వివిధ పత్రాలు తయారు చేసేవాడు. ఇంటర్నెట్ ద్వారా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల వివరాలు తెలుసుకుని వారి పేరుతోనే వీటిని రూపొందించేవాడు. దక్షిణ కొరియాలో ఉద్యోగాలు సైతం ఇప్పిస్తానంటూ అనేక మందికి ఎర వేసిన ఇతను జాబ్ వీసాల పేరుతో విజిట్ వీసాలు ఇచ్చి పంపేవాడు. అక్కడికి వెళ్ళిన వారిని అక్రమంగా నివాసం ఉండేలా చేసి ఆపై ఏఆర్సీ కార్డు పొందడానికి ప్రాసెసింగ్ చేసేవాడు. చివరకు వారిని శరణార్థులుగా మార్చి అందుకు సంబందించిన గుర్తింపు కార్డులు ఇప్పించేవాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ జఫ్పారుద్దీన్ సహకరించాడు. వీరిద్దరూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ థ«క్రుద్దీన్, ఎన్.శ్రీశైలం, వి.నరేందర్ వలపన్ని నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.47,500 నగదు, ల్యాప్‌టాప్, నకిలీ రబ్బర్ స్టాంపులు, లెటర్‌హెడ్స్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని శాలిబండ పోలీసులకు అప్పగించారు. కెనడాలో వర్క్‌పర్మిట్ ఇప్పిస్తానంటూ మోసం: నిందితుడిపై కేసు నమోదు పంజగుట్ట: కెనడాలో వర్క్ పర్మిట్ ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టౌలీచౌకి, సూర్యానగర్ ప్రాంతానికి చెందిన షేక్ తబ్రేజ్ పాషా, నగరానికి చెందిన మహ్ముద్ అబ్దుల్ అజీజ్, మహ్మద్ మజార్ కెనడాలో వర్క్‌పర్మిట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వాణిజ్య ప్రకటన ఆధారంగా పంజగుట్టలోని సహారా వరల్డ్ మేనేజ్మెంట్ సర్వీస్ యజమాని మహ్మద్ తస్కిన్‌ను సంప్రదించారు. ఇందుకు గాను ఒక్కొక్కరికి రూ.7.80 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో వారు పలు దఫాలుగా రూ.4.30 లక్షల చొప్పున చెల్లించారు. అనంతరం మొదట బ్యాంకాక్ వెళ్లాలని అక్కడి నుంచి 20 రోజుల్లో కెనడా వర్క్ పర్మిట్ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి బ్యాంకాక్ వెళ్లిన తమకు కనీసం వసతి కూడా కల్పించలేదన్నారు. దాదాపు రెండు నెలల పాటు సొంత ఖర్చులతో అక్కడే ఉన్న తాము తస్కిన్‌కు ఫోన్ చేసినా స్పందించ లేదని తెలిపారు. బ్యాంకాక్ వీసా గడువు ముగుస్తుండడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు. అనంతరం తస్కిన్ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మరో రూ.1.70 లక్షలు చెల్లిస్తే కెనడా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటా) వీసా ఇప్పిస్తానని చెప్పాడన్నారు. తాము దీనిపై ఆరా తీయగా భారతీయ పౌరసత్వం కలిగిన వారికి ఈటా వీసా ఇవ్వడం లేదని తెలిసిందని, దీంతో తమను మరోసారి మోసం చేసేందుకు చూసిన తస్కిన్‌పై చర్యలు తీసుకోవాలని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దివాలా అంచుల్లో థామస్ కుక్
లండన్: బ్రిటిష్ పర్యాటక సంస్థ, థామస్ కుక్ దివాలా స్థితికి చేరింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ దొరకడం దుర్లభం కావడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ ద్వారా వివిధ దేశాల్లో పర్యటిస్తున్న లక్షన్నర మంది బ్రిటిష్ పర్యాటకులు ఇబ్బందులు పడనుండగా, వేలాదిమంది ఉద్యోగులు వీధినపడే అవకాశాలున్నాయి. థామస్ కుక్కు తగిన నిధులు అందకపోతే, ఈ లక్షన్నర మంది పర్యాటకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి భారీగానే ఖర్చు కానున్నది. తక్షణం 25 కోట్ల డాలర్లు అవసరం... కార్యకలాపాలు కొనసాగించడానికి 25 కోట్ల డాలర్ల నిధులు అవసరమని థామస్ కుక్ గత శుక్రవారం వెల్లడించింది. నిధుల కోసం ఈ కంపెనీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే, థామస్ కుక్ కంపెనీ మూతపడక తప్పదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కంపెనీ మనుగడపై సందేహాలున్న ప్రభుత్వ వర్గాలు ఎలాంటి తోడ్పాటు నందించేందుకు సుముఖంగా లేవని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రావచ్చని ఆ పత్రిక వెల్లడించింది. ఈ కంపెనీ మూతపడితే వేలాది మంది ఉద్యోగులు వీధులపాలవుతారని, కంపెనీని ప్రభుత్వమే ఆదుకోవాలని కంపెనీ ఉద్యోగుల సంఘం, టీఎస్ఎస్ఏ(ట్రాన్స్పోర్ట్ శాలరీడ్ స్టాఫ్స్ అసోసియేషన్) కోరుతోంది. మోనార్క్ ఎయిర్‌లైన్స్ మునిగిపోయినప్పుడు.. ప్రస్తుతం థామస్ కుక్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితినే రెండేళ్ల క్రితం మోనార్క్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. ఈ కంపెనీ మునిగిపోయినప్పుడు లక్షా పదివేల మంది ప్రయాణికులు వివిధ చోట్ల చిక్కుకు పోయారు. వీరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి బ్రిటన్ ప్రభుత్వానికి 6 కోట్ల పౌండ్ల ప్రభుత్వ సొమ్ములు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా బ్రిటన్‌లో 9,000 మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా 22,000 ఉద్యోగాలు పోయాయి. బ్రెగ్జిట్, ఆన్లైన్ పోటీతో భారీగా నష్టాలు... ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్ కుక్ వెల్లడించింది. బ్రెగ్జిట్ అనిశ్చితి కారణంగా సమ్మర్ హాలిడే బుకింగ్స్ ఆలస్యం కావడంతో నష్టాలు పెరిగాయి. -
ఈబిక్స్ చేతికి యాత్రా ఆన్లైన్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీగా సేవలు అందించే యాత్రా ఆన్‌లైన్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ ఈబిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విలీన ఒప్పందం విలువ 337.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,325 కోట్లు)గా ఉండనుంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికం నాటికి డీల్ పూర్తి కావచ్చని అంచనా. లావాదేవీ పూర్తయ్యాక ఈబిక్స్ గ్రూప్‌లోని ఈబిక్స్‌క్యాష్ వ్యాపార విభాగంలో ఒక భాగంగా యాత్ర ఉంటుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. యాత్ర బ్రాండ్ పేరిటే ఇకపైనా సేవలు కొనసాగుతాయని వివరించాయి. ఒక్కో షేరుకు 4.90 డాలర్ల రేటు చొప్పున యాత్ర సంస్థ విలువను 337.8 మిలియన్ డాలర్లుగా లెక్కించినట్లు పేర్కొన్నాయి. భారత్‌లో అతి పెద్ద, అత్యంత లాభసాటి ట్రావెల్ సేవల కంపెనీగా ఈబిక్స్‌క్యాష్ ఆవిర్భవించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఈబిక్స్ చైర్మన్ రాబిన్ రైనా తెలిపారు. అలాగే ఈబిక్స్‌క్యాష్ ఐపీవోకూ ఊతం లభించగలదని చెప్పారు. బహుళజాతి ఆన్–డిమాండ్ సాఫ్ట్వేర్, ఈ–కామర్స్ సంస్థలో భాగం కావడం ద్వారా తమ షేర్‌హోల్డర్ల పెట్టుబడులకు వృద్ధి అవకాశాలు లభించగలవని యాత్రా ఆన్లైన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్ శృంగి చెప్పారు. ఈబిక్స్‌కు ఇప్పటికే వయా, మెర్క్యురీ పేరిట రెండు ట్రావెల్ సేవల వ్యాపార విభాగాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో సెంట్రమ్ గ్రూప్‌నకు చెందిన ఫారెక్స్ కార్డ్ వ్యాపార విభాగం సెంట్రమ్ డైరెక్ట్‌ను రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఎస్సెల్ ఫారెక్స్‌ను 8 మిలియన్ డాలర్లకు, వీజ్మాన్ ఫారెక్స్‌లో 49 మిలియన్ డాలర్లకు 75 శాతం వాటాలు కొనుగోలు చేసింది. -
ఉమ్రా యాత్ర పేరుతో మోసం చేసిన నిందితుల అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడిన విషయం తెలిసిదే. అయితే ఉమ్రా యాత్ర పేరుతో అమాయకపు ముస్లిం ప్రజలను మోసం చేసిన నిందితులను కడప సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తక్కువ టికెట్ ధరతో కేఎస్ఎస్ ఉమ్రా ట్రావెల్ ఏజెన్సీ యాజమాన్యం దేశ వ్యాప్తంగా వేల మంది దగ్గరి నుంచి కోట్ల రుపాయలను వసూలు చేసింది. ఎంఐఎంకి చెందిన ఓ వ్యక్తితో సహా మరో ఇద్దరు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. -
ఉమ్రా యాత్ర పేరుతో భారీ మోసం
-
రూ. 200 కోట్లు మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీ
సాక్షి, వైఎస్సార్ కడప: పేద మైనారర్టీలను తక్కువ టికెట్ ఖర్చుతో ఉమ్రాకు పంపిస్తామని ఓ ట్రావెల్ ఏజెన్సీ బడా మోసానికి పాల్పడింది. దీంతో ట్రావెల్ ఏజెన్సీ ఎదుట ముస్లింలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. తక్కువ టికెట్ ధరతో కడప ఆల్మాస్ పేటలో కేఎస్ఎస్ ఉమ్రా ట్రావెల్ ఏజెన్సీ ఒక్కొక్కరి దగ్గర రూ. 30 వేల వరకూ వసూలు చేసింది. డబ్బులు చెల్లినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదనే అనుమానంతో బాధితులు ఆరాదీశారు. వసూలు చేసిన సొమ్ముతో వారు ఉండాయించారనే సమాచారంతో బాధితులు ట్రావెల్ ఏజెన్సీ ఎదుట సోమవారం ఆదోళన చేపట్టారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, కదిరి, మదనపల్లి తదితర ప్రాంతాల వారు ఇందులో మోసపొయ్యారు. బాధితులు ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రొద్దుటూరు పోలీసులు ఏజెన్సీ నిర్వాహకుడు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అలీతో పాటు మరో ముగ్గురిని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ట్రావెల్ ఏజెన్సీ రూ. 200 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. -
పర్యాటకురాలితో క్యాబ్ డ్రైవర్ వికృత చేష్టలు
వాట్సాప్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు నిందితుడిని అరెస్టు చేసిన ‘షీ–టీమ్స్’ సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి నగర పర్యటనకు వచ్చిన ఓ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పట్ల క్యాబ్ డ్రైవర్ వికృతంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా వెల్లడించారు. బెంగళూరుకు చెందిన మహిళ గత వారం కుటుంబీకులతో నగర పర్యటనకు వచ్చారు. సిటీకి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి క్యాబ్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఈ వాహనానికి పహాడీషరీఫ్‌కు చెందిన నలభై ఏళ్ల మహ్మద్ సలీం డ్రైవర్‌గా వచ్చాడు. పర్యటన అనంతరం తిరిగి వెళ్లేందుకు అంతా రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. బాధితురాలు డ్రైవర్ పక్క సీటులో కూర్చోగా... కుటుంబీకులు వెనుక సీట్లో కూర్చున్నారు. దారిలో డ్రైవర్ సలీం వికృతంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తీవ్ర జుగుప్సకు లోనైన బాధితురాలు కారు ఆపమని చెప్తున్నా వినకుండా ముందుకు వెళ్లాడు. చివరకు బలవంతంగా కారు ఆపించి కిందికి దిగిన బాధితురాలు తన తండ్రితో పాటు బంధువుకు విషయం చెప్పారు. వారు ప్రశ్నిస్తుండగానే.. లగేజ్‌ను నడిరోడ్డుపై పడేసిన సలీం అక్కడి నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు అప్పుడే ట్రావెల్స్ నిర్వాహకుడికి ఫిర్యాదు చేసినప్పటికీ సమయాభావంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు చేరుకున్న తర్వాత షీ–టీమ్స్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు. -
బోగస్ బుకింగ్‌తో ఎయిర్వేస్కు టోకరా
► ట్రావెల్ ఏజెన్సీల మాయాజాలం ► కోరుట్లలో సైబర్‌క్రైం పోలీసుల ఆరా కోరుట్ల : బోగస్ పేర్లతో టిక్కెట్లు కావాలని కోరుతూ విమాన టిక్కెట్లను బ్లాక్ చేసి తాము బుకింగ్ చేసిన టిక్కెట్లను అధిక ధరలకు అమ్ముకుంటున్న ట్రావెల్ ఏజెన్సీల నిర్వాకంపై బుధవారం సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆరా తీశారు. సాధారణంగా ఆయా ఎయిర్వేస్ కంపెనీలకు చెందిన విమానాల టిక్కెట్లకు అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తారు. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది ట్రావెల్ ఏజెన్సీల వారు బోగస్ టిక్కెట్లు బుకింగ్ చేసి ఎయిర్వేస్ టిక్కెట్లు అన్ని బుక్ అయినట్లుగా ఆన్లైన్లో చూపిస్తారు. టిక్కెట్లు అన్ని అమ్ముడయినట్లుగా ఆన్లైన్లో కనిపించడంతో ఫ్లయిట్ టిక్కెట్లు అవసరమైన వారు ధర ఎక్కువైనా చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. ఆ తరువాత ముందుగానే తాము బుకింగ్ చేసిన టిక్కెట్లను అవసరమైన వారికి అధిక ధరలకు అమ్ముకుంటారు. ఈవిధంగా నెలరోజుల క్రితం సుమారు 20 రోజులపాటు ప్లైదుబాయ్ కంపెనీకి చెందిన విమానం టిక్కెట్లను కోరుట్లకు చెందిన ఓ ప్రయివేటు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు డమ్మీ బుకింగ్‌తో బ్లాక్ చేశారు. దీంతో ప్లైదుబాయ్ కంపెనీకి చెందిన విమానం టిక్కెట్లు అన్నీ బుక్ అయినట్లుగా ఆన్లైన్లో కనబడింది. టిక్కెట్లు అవసరమైన ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ట్రావెల్ ఏజన్సీ నుంచి అధిక ధరలకు టిక్కెట్లు కొన్నారు. ఇలా హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు రూ.16 వేల నుంచి రూ.20వేల వరకు డిమాండ్ ఉన్న టిక్కెట్లను రూ.25వేల వరకు అమ్ముకున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుల మాయాజాలంతో ఇటు ఎయిర్వేస్ కంపెనీకి, అటు ప్రయూణికులకు నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లై దుబాయ్ ఎయిర్వేస్ కంపెనీ తమకు వస్తున్న నష్టాల విషయమై హైదరాబాద్‌లోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు విచారణ చేసిన సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ జిల్లా కోరుట్ల కేంద్రంగా ఈ డమ్మీ బుకింగ్ చోటు చేసుకున్నట్లు గుర్తించారు. బుధవారం ప్లైదుబాయ్ కంపెనీ ప్రతినిధులతోపాటు సైబర్ క్రైం పోలీసులు పట్టణంలోని అన్ని ట్రావెల్ ఏజన్సీలకు ఆన్లైన్ కనెక్టివిటీ అందిస్తున్న జీకే నెట్వర్క్ వద్ద వివరాలు సేకరించారు. ఈ నెట్వర్క్ సర్వీసెస్ నుంచి లాగిన్ పాస్వర్డ్ వివరాలు సేకరించి పట్టణంలోని అన్ని ట్రావెల్ ఏజన్సీల వద్దకు వెళ్లి ఆరా తీశారు. అనంతరం కోరుట్లలోని ట్రావెల్ ఏజన్సీలకు ప్లై దుబాయ్ కంపెనీకి చెందిన టికెట్ బుకింగ్ వ్యవస్థను లాక్ చేశారు. డమ్మీ బుకింగ్‌కు పాల్పడిన ట్రావెల్ ఏజన్సీల వివరాలు వెల్లడించడానికి ఫ్లైదుబాయ్ ఏయిర్‌వేస్ ప్రతినిధులు నిరాకరించారు. ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. -
నేపాల్‌లో మనోళ్ల అవస్థ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నేపాల్ యాత్రకు వెళ్లిన జిల్లా యాత్రికులను ట్రావెల్ ఏజెన్సీ వారు మధ్యలోనే వదిలేయడంతో అక్కడ అవస్థ పడుతున్నారు. పది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మానస సరోవర యాత్రకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారితో కలిసి ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన వెంపటి సత్యనారాయణ, శ్రీదేవి, చంద్రశేఖర్, రాణి, మధు, శ్రీరామ్‌మూర్తిలతోపాటు మరికొందరు బయల్దేరారు. వీరంతా నేపాల్‌లో స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత..సోమవారం ట్రావెల్ ఏజెన్సీ బాధ్యులు వీరిని నేపాల్గంజ్కు తీసుకొచ్చి చెప్పాపెట్టకుండా ఉడాయించడంతో యాత్రికులు అక్కడే చిక్కుకున్నారు. తమ బంధువులకు ఫోన్లు చేసి జరిగిన విషయం తెలిపి, ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితో మాట్లాడి సురక్షితంగా జిల్లాకు చేరుకునేలా చూడాలని కోరారు. ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం నేపాల్ ఎంబసీతో మాట్లాడి..యాత్రికులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. -
ఎవరో ఒకరు ఎపుడో అపుడు..
సమాజ సేవలో ఆటో డ్రైవర్ ♦ క్యాన్సర్ బాధితులకు తనవంతు చేయూత ♦ సంపాదనలో సింహభాగం సేవకే.. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు’ అన్నాడో సినీ గీత రచయిత. తన తల్లికి జరిగినది ఇంకెవరికీ జరగకూడదని అడుగు ముందుకేశాడో అతి సామాన్య ఆటో డ్రైవర్. ‘సమాజం నాకేమిచ్చింది’ అని ప్రశ్నించే జనాలు ఉన్న నేటి ప్రపంచంలో తనకు సాయం చేయని అదే సమాజం కోసం పాటుపడుతున్నాడు మన మనసున్న మున్నాభాయ్ ఎస్ఎస్సీ అలియాస్ సందీప్ బచ్చే. ముంబై : ‘సమస్య వచ్చిందా అయితే మున్నాభాయ్ ఎస్ఎస్సీని కలవండి’ ఇదీ ముంబై నెటిజన్లు మన మున్నాభాయ్ ఎస్ఎస్సీ అలియాస్ సందీప్ బచ్చే గురించి చెప్పే మొదటి మాట. ముంబైలో ఓ సాదా సీదా ఆటోడ్రైవర్ సందీప్. 1995లో టెన్త్ పూర్తి చేశా డు. తర్వాత పొట్టకూటి కోసం ఓ ట్రావెల్ ఏజెన్సీలో ప్యూన్‌గా చేరినా కొన్నాళ్లకు మానేశాడు. అయితే అక్కడ పనిచేసే సమయంలో బస్‌లో ఉన్న సౌకర్యా లు నచ్చాయి సందీప్‌కి. దీంతో ఆటో కొంటే ఆ సౌకర్యాలన్నీ అందులో పెట్టాలనుకున్నాడు. ఉద్యోగం మానేశాక వచ్చిన పీఎఫ్ డబ్బులతో ఓ ఆటో కొన్నా డు. ఇప్పుడు అదే ‘టాక్ ఆఫ్ ది ముంబై’ అయ్యింది. సకల సౌకర్యాలు.. ‘అతిథి దేవో భవ’ అన్న మాటను నిజం చేస్తున్నాడు మున్నాభాయ్. ఆటో ఎక్కిన ప్రయాణికులకు చదువుకోవడానికి పేపర్లు, తాగడానికి మంచినీళ్లు, అడిగితే ఫ్లాస్క్ తీసి ఛాయ్ కూడా ఇస్తాడు. టైం పాస్ కోసం ఎల్సీడీ టీవీ ఆన్ చేస్తాడు. అంతేనా... అవసరమైతే లోకల్, ఎస్టీడీ చేసుకునేందుకు టెలిఫోన్, వైఫై ఉం టుంది. అత్యవసర నంబర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉం టుంది. రోడ్డుపై ఎవరికైనా గాయాలైతే వెంటనే డ్రైవ ర్ నుంచి డాక్టర్ అవతారం ఎత్తుతాడు. ప్రాథమిక చికిత్స చేసి వాళ్లను జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాడు. మానవ సేవే.. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని క్యాన్సర్ బాధితులకు ఇస్తూ ఉంటాడు. ఇంటింటికీ తిరిగి దుస్తులు, డబ్బులు సేకరిస్తాడు. అవసరం అని వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు. ప్రతి ఆదివారం కొంతమంది క్యాన్సర్ బాధితులకు ఉదయం అల్పాహారం అందజేస్తుంటాడు. వికలాంగులు, గర్భిణిలు, వృద్ధులకు చార్జీలో కొంతమేర రాయితీ ఇస్తాడు. క్యాన్సర్ బాధితులకు సాయం చేయండంటూ ఆటో వెనకాల డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వాళ్లకు విషయం చెప్పి సాయం చేయమని అడుగుతాడు. డొనేషన్ చేసిన వాళ్లు ఒక మిఠాయి కూడా ఇస్తాడు. ఆపద్బాంధవుడు.. క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారిని గుర్తించి స్థానిక బాంద్రా, టాటా మెమోరియల్ ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. ఆ మధ్య ఒక మహిళకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఒక స్వచ్ఛంద సంస్థ ఆపరేషన్ చేసేం దుకు ముందుకు వచ్చింది. అయితే అంతకు ముందు చేయాల్సిన చెకప్‌ల కోసం రూ. 35 వేలు అవసరమయ్యింది. ఆమె భర్త ఎంతమందిని అడిగినా డబ్బు మాత్రం అందలేదు. వెంటనే విషయం తెలుసుకున్న సందీప్, ఆ మొత్తాన్ని సమకూర్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే ‘ఏ సమస్య వచ్చినా మున్నాభాయ్ ఎస్ఎస్సీని కలవండి. అతను సంజయ్ దత్ ఫ్యాన్. సంజయ్ సినిమాల్లో సేవ చేస్తే ఈ అభినవ మున్నాభాయ్ నిజ జీవితంలో చేస్తున్నాడు’ అంటూ సందీప్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు నెటిజన్లు. ఓ అతి సామాన్య ఆటో డైవర్‌గా జీవనం గడుపుతూ ఆపదలో ఉన్న వారికి నిస్వార్థ సేవ చేస్తున్న సందీప్ కాదు కాదు... మున్నాభాయ్ ఎస్ఎస్సీని ఏమని కీర్తిద్దాం. సలాం సందీప్ భాయ్. మా అమ్మలా ఎవరికీ జరగొద్దు.. ‘మా అమ్మ గొంతు క్యాన్సర్‌తో చనిపోయింది. ఆమెను ఆస్పత్రిలో చూపించడానికి చాలా మందిని డబ్బు అడిగాను. ఆటో డ్రైవర్‌వి అంటూ అందరూ ఛీదరించుకున్నారు. హీరో సంజయ్ దత్ కొంత సాయం చేశాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను. అమ్మకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదని. అప్పటి నుంచి ఈ మార్గంలో నడుస్తున్నా’ అంటాడు సందీప్. ఈయన సేవలు గుర్తించిన ముంబై నగరం అతన్ని అవార్డులతో సత్కరించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 8 అవార్డులు గెలుచుకున్నాడు. సంజయ్ దత్‌పై ఉన్న అభిమానంతో చేతిపై మున్నాభాయ్ ఎస్ఎస్సీ అని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. -
కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం
మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. కొత్త ప్రాంతాలు, కొత్త ప్రజలు, నూతన సంస్కృతులను తెలుసుకోవాలంటే.. పర్యటించాలి. ఎలాంటి వనరులు లేకపోయినా పర్యాటకంతోనే మనుగడ సాగిస్తున్న దేశాలున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం.. ట్రావెల్ అండ్ టూరిజం. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ అండ్ టూరిజాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగావకాశాలకు లోటే ఉండదు. ప్రశంసలు, పురస్కారాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రవాణా, పర్యాటక నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం విభాగాల్లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు, టూరిస్ట్ గైడ్లు వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్ అండ్ కార్గో కంపెనీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అనుభవజ్ఞులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వృత్తిలో తగిన అనుభవం సంపాదించి సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. విద్యాసంస్థల్లో ట్రావెలింగ్, టూరిజం కోర్సుల ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు. కొత్త ప్రాంతాలను, విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ వృత్తిలో ఉంటుంది. రకరకాల భాషలు, నేపథ్యాలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతృప్తికరమైన సేవలందిస్తే క్లయింట్ల నుంచి ప్రశంసలు, పేరు ప్రఖ్యాతలు, తద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయి. సేవల ద్వారా మంచి గుర్తింపు పొందిన టూరిజం నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పురస్కారాలను ప్రదానం చేస్తుంటాయి. టూరిజం రంగంలో పురోగమనమే తప్ప తిరోగమనం అనేది ఉండదు. ఇది రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న కెరీర్. కావాల్సిన నైపుణ్యాలు: టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా క్లయింట్లకు సేవలందించే గుణం ముఖ్యం. ప్రయాణాల్లో శారీరక అలసటను తట్టుకొనే సామర్థ్యం పెంచుకోవాలి. కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇందులో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటికీ సిద్ధపడినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. అర్హతలు: భారత్‌లో ట్రావెల్ అండ్ టూరిజంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత డిప్లొమాలో చేరొచ్చు. అలాగే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. అడ్వెంచర్ టూరిజం రంగంలో స్థిరపడాలనుకుంటే పర్వతారోహణ(మౌంటెయినీరింగ్) కోర్సుల్లో చేరాలి. వేతనాలు: టూరిజం రంగంలో పని చేస్తున్న సంస్థను బట్టి ఆదాయం అందుకోవచ్చు. పేరు ప్రఖ్యాతలున్న ట్రావెల్ కంపెనీలో వేతనాలు అధికంగా ఉంటాయి. కౌంటర్ క్లర్క్‌కు నెలకు రూ.13 వేల నుంచి రూ.17 వేలు, అసిస్టెంట్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.24 వేల నుంచి రూ.30 వేలు, రీజినల్ మేనేజర్‌కు రూ.35 వేల నుంచి రూ.50 వేల వేతనాలు అందుతాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్-నెల్లూరు వెబ్సైట్: www.iittm.org నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్ వెబ్సైట్: www.nimindia.net ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ - హైదరాబాద్ వెబ్సైట్: www.nithm.ac.in -
ట్రావెల్స్ సంస్థపై ముప్పేట దాడి
అఫ్జల్‌గంజ్: ఆదాయ పన్ను చెల్లించకుండా అక్రమంగా పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ఓ ట్రావెల్స్ సంస్థపై ఆదాయ పన్ను శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు 800 గోనె సంచులలోని పొగాకును స్వాధీనం చేసుకుని, పంచనామా నిర్వహించారు. నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఒకారా ట్రాన్స్పోర్ట్స్ నుంచి అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పక్కన గల ఒకారా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి రెండు లారీల్లో (హెచ్ఆర్ 55కె7774, ఆర్జె 09జిబి0245) సరుకు దిగుమతయింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖ డీ సీపీ సునీతారెడ్డి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఫుడ్ కంట్రోల్ విభాగం అధికారి దామోధర్ రావుల నేతృత్వంలో సిబ్బంది ఒకారా ట్రావెల్స్‌పై బుధవారం రాత్రి దాడి చేశారు. 800 గోనె సంచుల్లో గల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బిల్లులు లేవని అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్టు మేనేజర్ తిలక్‌రాజ్‌ను విచారించగా సరుకును ఎక్కడికి పంపుతున్నారన్న విషయం తనకు తెలియదని, ఢిల్లీలోని తమ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిందని అధికారులకు తెలిపారు. మేనేజర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్‌లో స్వాధీనం చేసుకున్న పొగాకు నిషేధిత గుట్కాల తయారీకి వినియోగించేదిగా తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.