కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం | Now, Travel and tourism sector has more employment | Sakshi
Sakshi News home page

కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం

Published Thu, Oct 16 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం

కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం

మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. కొత్త ప్రాంతాలు, కొత్త ప్రజలు, నూతన సంస్కృతులను తెలుసుకోవాలంటే.. పర్యటించాలి. ఎలాంటి వనరులు లేకపోయినా పర్యాటకంతోనే మనుగడ సాగిస్తున్న దేశాలున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం.. ట్రావెల్ అండ్ టూరిజం. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ అండ్ టూరిజాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగావకాశాలకు లోటే ఉండదు.
 
 ప్రశంసలు, పురస్కారాలు
 ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రవాణా, పర్యాటక నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం విభాగాల్లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు, టూరిస్ట్ గైడ్లు వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రాన్స్‌పోర్ట్ అండ్ కార్గో కంపెనీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అనుభవజ్ఞులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వృత్తిలో తగిన అనుభవం సంపాదించి సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. విద్యాసంస్థల్లో ట్రావెలింగ్, టూరిజం కోర్సుల ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు.  కొత్త ప్రాంతాలను, విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ వృత్తిలో ఉంటుంది. రకరకాల భాషలు, నేపథ్యాలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతృప్తికరమైన సేవలందిస్తే క్లయింట్ల నుంచి ప్రశంసలు, పేరు ప్రఖ్యాతలు, తద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయి. సేవల ద్వారా మంచి గుర్తింపు పొందిన టూరిజం నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పురస్కారాలను ప్రదానం చేస్తుంటాయి. టూరిజం రంగంలో పురోగమనమే తప్ప తిరోగమనం అనేది ఉండదు. ఇది రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న కెరీర్.
 
 కావాల్సిన నైపుణ్యాలు: టూరిజం, ట్రావెల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా క్లయింట్లకు సేవలందించే గుణం ముఖ్యం. ప్రయాణాల్లో శారీరక అలసటను తట్టుకొనే సామర్థ్యం పెంచుకోవాలి. కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇందులో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటికీ సిద్ధపడినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు.  
 
 అర్హతలు: భారత్‌లో ట్రావెల్ అండ్ టూరిజంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత డిప్లొమాలో చేరొచ్చు. అలాగే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. అడ్వెంచర్ టూరిజం రంగంలో స్థిరపడాలనుకుంటే పర్వతారోహణ(మౌంటెయినీరింగ్) కోర్సుల్లో చేరాలి.
 
 వేతనాలు: టూరిజం రంగంలో పని చేస్తున్న సంస్థను బట్టి ఆదాయం అందుకోవచ్చు. పేరు ప్రఖ్యాతలున్న ట్రావెల్ కంపెనీలో వేతనాలు అధికంగా ఉంటాయి. కౌంటర్ క్లర్క్‌కు నెలకు రూ.13 వేల నుంచి రూ.17 వేలు, అసిస్టెంట్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.24 వేల నుంచి రూ.30 వేలు, రీజినల్ మేనేజర్‌కు రూ.35 వేల నుంచి రూ.50 వేల వేతనాలు అందుతాయి.  
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్-నెల్లూరు
 వెబ్‌సైట్: www.iittm.org
 నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్
 వెబ్‌సైట్: www.nimindia.net
 ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
 వెబ్‌సైట్: www.ignou.ac.in
 డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్ - హైదరాబాద్
 వెబ్‌సైట్: www.nithm.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement