Employment offers
-
వృత్తిపరమైన సంతృప్తికి.. డిజాస్టర్ మేనేజ్మెంట్
సుందర నగరం విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన బీభత్సం మాటలకందనిది. ఈ విపత్తుతో నగరం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రూ.వేల కోట్ల నష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తూ.. సర్వం కోల్పోయి వీధిన పడ్డ ప్రజలకు అండగా నిలుస్తూ నగరాన్ని ఒక దారికి తీసుకొస్తున్న నిపుణులు కనిపిస్తున్నారు. పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న ఈ సిబ్బందే.. విపత్తుల నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) నిపుణులు. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ప్రకృతి బీభత్సాలతోపాటు ప్రేరేపిత విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు శిక్షణ పొందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సేవలు తప్పనిసరిగా అవసరమవుతున్నాయి. అందుకే ఈ రంగాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభ్యమవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు తుఫాన్లు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విలయాలతోపాటు ఉగ్రవాద, తీవ్రవాదుల దాడుల్లో అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు విపత్తుల నిర్వహణ సిబ్బంది కృషి చేస్తుంటారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణ బాధ్యతలను చేపడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర(ఎన్జీవో) సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న భారీ పరిశ్రమలు, భవనాల్లో వీరి సేవలు అవసరం. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రిసార్ట్‌ల్లో వీరిని నియమించుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోనూ అవకాశాలున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), రెడ్ క్రాస్, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బందికి కొలువులను కల్పిస్తున్నాయి. ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది. భారత్‌లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో రీసెర్చ్ స్కాలర్స్ సంఖ్య స్వల్పంగానే ఉంది. మరోవైపు విద్యాసంస్థల్లోనూ ఫ్యాకల్టీగా అవకాశాలున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కు కేంద్ర హోంశాఖతోపాటు రాష్ర్ట ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో నిపుణులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో చేరితే నిర్వాసితులకు సేవలు అందించామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రకాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. సకాలంలో వేగంగా స్పందించే గుణం అవసరం. అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలగాలి. కొత్త బాధ్యతలను చేపట్టి, పూర్తిచేసే సామర్థ్యం ఉండాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. అర్హతలు: డిజాస్టర్ మేనేజ్మెంట్పై మన దేశంలో డిప్లొమా, సర్టిఫికెట్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్, అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరొచ్చు. ఏవైనా సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంది. వేతనాలు: డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు అందుకోవచ్చు. వృత్తిలో నాలుగైదేళ్ల అనుభవం ఉంటే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సొంతం చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఎన్జీవోల్లో చేరితే నెలకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వేతనం పొందొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో ప్రాజెక్ట్ మేనేజర్‌కు నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా చేరితే హోదాను బట్టి జీతభత్యాలుంటాయి. కన్సల్టెన్సీల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్: http://nidm.net/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in యూనివర్సిటీ ఆఫ్ నార్త్ బెంగాల్ వెబ్సైట్: www.nbu.ac.in ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ వెబ్సైట్: www.unom.ac.in డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.dmibhopal.nic.in నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ వెబ్సైట్: http://ncdcnagpur.nic.in/ -
కొలువులకు కొదవ లేని.. ట్రావెల్ అండ్ టూరిజం
మనిషి తాను పుట్టిన చోటే ఉండిపోతే ఇప్పటికీ నాగరికుడిగా మారేవాడు కాదు. ఒకచోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రగతి సాధ్యమైంది. కొత్త ప్రాంతాలు, కొత్త ప్రజలు, నూతన సంస్కృతులను తెలుసుకోవాలంటే.. పర్యటించాలి. ఎలాంటి వనరులు లేకపోయినా పర్యాటకంతోనే మనుగడ సాగిస్తున్న దేశాలున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం.. ట్రావెల్ అండ్ టూరిజం. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ అండ్ టూరిజాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఉద్యోగావకాశాలకు లోటే ఉండదు. ప్రశంసలు, పురస్కారాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రవాణా, పర్యాటక నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టూరిజం విభాగాల్లో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్లు, టూరిస్ట్ గైడ్లు వంటి కొలువులు లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రాన్స్పోర్ట్ అండ్ కార్గో కంపెనీల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అనుభవజ్ఞులకు విదేశాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. వృత్తిలో తగిన అనుభవం సంపాదించి సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే అధిక ఆదాయం సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే.. విద్యాసంస్థల్లో ట్రావెలింగ్, టూరిజం కోర్సుల ఫ్యాకల్టీగా కూడా పనిచేయొచ్చు. కొత్త ప్రాంతాలను, విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ వృత్తిలో ఉంటుంది. రకరకాల భాషలు, నేపథ్యాలున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంతృప్తికరమైన సేవలందిస్తే క్లయింట్ల నుంచి ప్రశంసలు, పేరు ప్రఖ్యాతలు, తద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయి. సేవల ద్వారా మంచి గుర్తింపు పొందిన టూరిజం నిపుణులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పురస్కారాలను ప్రదానం చేస్తుంటాయి. టూరిజం రంగంలో పురోగమనమే తప్ప తిరోగమనం అనేది ఉండదు. ఇది రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న కెరీర్. కావాల్సిన నైపుణ్యాలు: టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో పట్టు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించాలి. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ప్రతికూల పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా క్లయింట్లకు సేవలందించే గుణం ముఖ్యం. ప్రయాణాల్లో శారీరక అలసటను తట్టుకొనే సామర్థ్యం పెంచుకోవాలి. కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇందులో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. వీటన్నింటికీ సిద్ధపడినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. అర్హతలు: భారత్‌లో ట్రావెల్ అండ్ టూరిజంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులున్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత డిప్లొమాలో చేరొచ్చు. అలాగే ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. అడ్వెంచర్ టూరిజం రంగంలో స్థిరపడాలనుకుంటే పర్వతారోహణ(మౌంటెయినీరింగ్) కోర్సుల్లో చేరాలి. వేతనాలు: టూరిజం రంగంలో పని చేస్తున్న సంస్థను బట్టి ఆదాయం అందుకోవచ్చు. పేరు ప్రఖ్యాతలున్న ట్రావెల్ కంపెనీలో వేతనాలు అధికంగా ఉంటాయి. కౌంటర్ క్లర్క్‌కు నెలకు రూ.13 వేల నుంచి రూ.17 వేలు, అసిస్టెంట్‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.24 వేల నుంచి రూ.30 వేలు, రీజినల్ మేనేజర్‌కు రూ.35 వేల నుంచి రూ.50 వేల వేతనాలు అందుతాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్-నెల్లూరు వెబ్సైట్: www.iittm.org నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్ వెబ్సైట్: www.nimindia.net ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్ - హైదరాబాద్ వెబ్సైట్: www.nithm.ac.in -
నిశ్శబ్ద విప్లవం
ఝాన్సీ కీ వాణి: ఉద్యోగావకాశాలు, ఉపాధి మార్గాలు కల్పించడం మాత్రమే వీరికి న్యాయం చేయడం అవుతుందనుకుంటే పొరపాటే అవుతుంది. సమాజంలో సమాన అవకాశం ఇవ్వడం మనతోనే ప్రారంభమవుతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో మనకి ముందు తెలిసి ఉండాలి. అందుకు మనం వారిని మరింత దగ్గరగా తెలుసుకోవాలి. మన చుట్టూ వీరు రోజూ కనిపించకపోవడానికి కారణం మనం తెలిసో, తెలియకో చూపించే వివక్ష. ఒక బధిరుల, అంధుల పాఠశాలకో.. మానసికంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల కేంద్రానికో వెళ్లి చూస్తే అర్థమవుతుంది.. ఎందరి బాల్యం తమ ప్రత్యేకసామర్థ్యం వెతుక్కునే క్రమంలో కష్టపడుతోందో! వీరిలో రేపు నిజంగా ఎంతమందికి వారి ప్రతిభకి తగ్గ ఉపాధి దొరుకుతుందో అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. మన ఓర్పు, సహకారం, అర్థం చేసుకోవడం.. వీరి జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఆర్టికల్ రాద్దామని కాగితం, కలం తీసాను. పెన్ను రాయట్లేదు.. ఫ్లయిట్లో కదా ఇంక్ బిగుసుకు పోయిందేమోనని, కాస్త రాస్తే కలం కదులుతుందని రాస్తూ పోయాను. కాగితం మీద రాతలేవీ కనబడటం లేదు.. బ్లాంక్‌గా ఉంది నా మనసు లాగా! ఇంకు కనిపించని ఆ తెల్లకాగితంపై జాగ్రత్తగా చూస్తే పెన్నుతో రాసిన అచ్చులు కనిపిస్తున్నాయి. బయటికి స్పష్టత లేకపోయినా ఈ ముద్రలు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. అచ్చం అలాగే మనం పట్టించుకోని, వినిపించుకోని.. చూడని జీవితాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అస్తిత్వం కోసం పోరాటం చేసే ఆ గళాలని కనిపిస్తున్నా వినిపించుకోని నిర్లక్ష్యం మనది. వినిపించే స్వరం లేని ఈ జీవితాలకి కనిపించే గళం ఉంది. ఈ వాక్యంలోని అంతరార్థం అర్థం కావాలంటే నేను మీకు తన్వీర్ సుల్తానా గురించి చెప్పాలి. ఈ ఇరవయ్యేళ్ల మెరిసే కళ్ల అమ్మాయి ఓ టీచర్. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్లో ఎంబ్రాయిడరీ నేర్పించే ఈ అమ్మాయితో ముచ్చట్లలో పడి నేను ఎంత సమయం గడిపేసానో గుర్తులేదు. ఐదుగురు సంతానంలో రెండో అమ్మాయి అయిన తన్వీర్ తన అక్కకీ, చెల్లికి పెళ్లి చేసింది. మతి స్థిమితం లేని తమ్ముడి ఆలనాపాలనా చూసుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న తల్లికి అండగా ఉంటోంది. ఇన్నింటికీ తన ఈ చిన్న ఉద్యోగమే ఊతం. ఇదేదో 80ల్లో తెలుగు సినిమా కథ కాదు. తన్వీర్ నిజ జీవితం. ఆ అమ్మాయి స్ఫూర్తిని వర్ణించాలంటే నాకు మాటలు చాలవు. ఎందుకంటే తన్వీర్‌కు మాటలు రావు. పుట్టుకతోనే బధిరురాలైన ఆమెకు మాటలు వచ్చే అవకాశం లేదు. కనిపించే గళానికి, వినిపించుకొనే మనసు కావాలి. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ నిశ్శబ్ద సంభాషణలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వినిపించకపోయినా, మాటలు రాకపోయినా ఓ టీచర్‌గా తన్వీర్ సూపర్ సక్సెస్ఫుల్. ఇక్కడ మూడు విషయాలు ప్రత్యేకంగా గుర్తించాలి. ఒకటి.. తనని తాను నమ్మిన తన్వీర్, రెండు.. తన్వీర్ ప్రతిభని గుర్తించి ఉద్యోగమిచ్చిన సంస్థ నిర్వాహకులు, మూడు.. మాట్లాడకుండా ఆమె దగ్గర పని నేర్చుకున్న శిష్యులు! వీరిలో వైకల్యం ప్రతిభకి అడ్డు అని ఎవరనుకున్నా తన్వీర్ గురించి మనం ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకునే వాళ్లం కాదు. నిజానికి ఏ అవయవలోపమైనా, అది సామర్థ్య లోపం అని ఆలోచించే మనది అసలు వైకల్యం. ప్రత్యేక సామర్థ్యం ఉన్న వీరికి తగిన అవకాశాలు కల్పించకపోవడం వ్యవస్థ వైఫల్యం. తన్వీర్ది అదృష్టం అనేవాళ్లు కొందరుంటే.. కాదు అని ఆమెది మొండి పట్టుదల అనేవాళ్లు మరికొందరు! ఏది ఏమైనా అంత పట్టుదల, అదృష్టం రెండూ ఉన్న వాళ్లు మన చుట్టూ ఎంతమంది కనపడుతున్నారు? అలాంటి వ్యక్తులకి మన మధ్యలో చోటు కల్పించేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ఈ సందర్భంలో ఓ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్‌ని అభినందించాలి. కేఎఫ్సీలో కొన్ని ఔట్‌లెట్స్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తూ కస్టమర్లని డీల్ చేస్తున్న బధిర, మూగ వ్యక్తులు కనిపిస్తారు. అక్కడ మనకి వారి ప్రతిభ మాత్రమే కనిపిస్తుంది. ఇనార్బిట్‌మాల్‌లో డైలాగ్ ఇన్ ద డార్కలో అంధులు మనకి గైడ్సగా దారి చూపిస్తారు. ఆ చీకట్లో మనం వారిపై పూర్తిగా ఆధారపడిపోతాం. అప్పుడు కానీ మనకి వారి ప్రత్యేక సామర్థ్యం అర్థం కాదు. society to aid hearing impaired అనే ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేయడం వల్ల నాకు ఎంతో అవగాహన పెరిగింది. వినికిడి లోపం వల్ల కలిగే మరో శాపం మూగతనం. అవగాహనరాహిత్యం వల్ల చిన్నతనంలో సరిచేయగలిగే వినికిడి సమస్యలని కూడా అశ్రద్ధ చేయడంతో జీవితాంతం నిశ్శబ్దంతో కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి పిల్లలకి కలుగచేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఇటువంటి వారికి అవగాహన పెంచేందుకూ, పేదరికం వల్ల వెనుకాడే వారికి సహకారం అందించేందుకూ dr. Ec vinaykumar, dr.rambabu వంటి ENT surgeons ఆధ్వర్యంలో సజ్జల దివాకర్‌రెడ్డి, భాగీరథి, సునీత వంటి ప్రముఖులు HATఅనే సంస్థను ప్రారంభించారు. కనిపించే గళాలను వినిపించుకునే మనసుని నేర్పించిన HAT కి, తన్వర్కి ధన్యవాదాలు. ప్రపంచం కొత్తగా కనిపిస్తోంది. ఇదే నిశ్శబ్ద విప్లవం. -
తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలిక్కడ..!
నేటి జాబ్ మార్కెట్లో ఉద్యోగావకాశాలకు కొదవలేదు. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు బీఏ/బీకామ్/బీఎస్సీ తదితర బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి సైతం కెరీర్ అవకాశాలు పుష్కలం. ఐటీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, సేల్స్/మార్కెటింగ్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, ఫ్యాషన్‌తోపాటు మరెన్నో రంగాలు గ్రాడ్యుయేట్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. గతంలో కంటే జాబ్ మార్కెట్ ఇప్పుడు వీరికి సానుకూలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. యువ ప్రతిభావంతులను నియమించుకునేందుకు టాప్ కాలేజీలకు కంపెనీలు క్యూ కడుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో సిటీ యువతకు అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై ఫోకస్.. ఐటీ కొలువులు: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న కెరీర్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఒకటి. ఐటీపై ఆసక్తి ఉండి సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో అడుగుపెట్టాలంటే.. టెక్నాలజీలో ప్రాథమిక అంశాలపై అవగాహనతోపాటు ఆసక్తి ఉండాలి. సృజనాత్మకంగా ఆలోచించగలిగే నేర్పు, ఎప్పటికప్పుడు సాంకేతిక అంశాలతో అప్డేట్ అయ్యే నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్: అంకెలు, ఆడిట్లు, అకౌంట్లు, పన్నుల చుట్టూ తిరిగే రంగం ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారు పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసిన యువత ముందు ఉన్న మరో అద్భుత అవకాశం బ్యాంక్ కొలువులు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లరికల్ ఉద్యోగాల కోసం ఏటా వేలాది జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి బ్యాంకులో ఉద్యోగం సాధించొచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్: కంపెనీ ఏదైనా మార్కెట్లో పోటీని తట్టుకుని నిలవాలంటే.. దాని ఉత్పత్తుల సేల్స్‌తోపాటు మార్కెటింగ్ తప్పనిసరి. కాబట్టి కంపెనీలు అధిక వేతనాలు చెల్లించి మార్కెటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చురుకైన, ఉత్సాహవంతులైన యువతకు మార్కెటింగ్‌లో విస్తృత అవకాశాలున్నాయి. సేల్స్ విభాగంలో పనిచేయాలంటే గ్రాడ్యుయేషన్ అర్హత తప్పనిసరి కానప్పటికీ అధిక సంఖ్యలో కంపెనీలు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి. ఏవియేషన్: భారత్‌లో ఏవియేషన్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికల్లా ప్రపంచంలోనే మనదేశం మూడో స్థానంలో నిలవనుందని, 2030 నాటికి మొదటి స్థానాన్ని సొంతం చేసుకోనుందని ఫిక్కీ-కేపీఎంజీ అంచనా. ఈ నేపథ్యంలో ఏవియేషన్‌లో గ్రౌండ్ లెవల్ జాబ్స్ నుంచి ఏరోప్లేన్ సర్వీసెస్ వరకు పెలైట్, గ్రౌండ్ డ్యూటీ, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తదితర విభాగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలు: దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలో ఆతిథ్య, పర్యాటక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కారణంగా ఈ రంగాల్లో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎంబీఏ(హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) /ఎంఎస్సీ(హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) తదితర కోర్సులనభ్యసించొచ్చు. ఈ రంగంలో ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ: ప్రపంచీకరణ ప్రభావంతో ఫ్యాషన్, డిజైనింగ్ రంగాల విస్తృతి పెరుగుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ నిపుణులకు డిమాండ్ అధికమవుతోంది. ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలుండి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంటే.. ఎవరైనా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. ‘ఫ్యాషన్’లో బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారు వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలస్ట్రేటర్లుగా ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)తోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. మీడియా/జర్నలిజం/పబ్లిషింగ్: జర్నలిజం.. ఒక ఉత్సాహవంతమైన, సాహసోపేతమైన కెరీర్. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వృత్తి. సామాజిక స్పృహ, భాషా ప్రావీణ్యం, కష్టపడి పనిచేసేతత్వం ఉన్నవారికి ఇది సరైన కెరీర్. దేశంలో కొత్త పత్రికలు, టీవీ చానళ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ తదితర కోర్సులను అందిస్తున్నాయి. ఈవెంట్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్: బర్త్‌డే పార్టీ, ఎడ్యుకేషన్ ఈవెంట్స్, ఇండస్ట్రియల్ మీటింగ్స్, మ్యారేజ్ ఫంక్షన్స్.. ఇలా కార్యక్రమమేదైనా నేటి కార్పొరేట్ యుగానికి అనుగుణంగా డిజైన్ చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్/పబ్లిక్ రిలేషన్స్ సంస్థలు తప్పనిసరి అవుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న ఉత్సాహవంతులైన, చురుకైన అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్మెంట్/పబ్లిక్ రిలేషన్స్ కెరీర్ నూరుశాతం సరిపోతుంది. కష్టపడి పనిచేసే తత్వం, గంటల కొద్దీ పనిచేసే ఓపిక, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు ఈ కెరీర్లో సులభంగా రాణిస్తారు. దేశంలోని పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సర్కారీ కొలువులు: ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన భవిష్యత్తుకు వేదికలు... ప్రభుత్వ కొలువులు. కింది స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు మొదలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు బ్యాచిలర్‌స డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. వందల సంఖ్యల్లో ఖాళీలకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయంటే సర్కారీ కొలువులకు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అనేకం. క్రమబద్ధమైన, స్థిరమైన జీవనం కోరుకునేవారు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్.. విభాగమేదైనా ప్రభుత్వ కొలువులకు యువత పోటీపడొచ్చు. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా శ్రమిస్తే కోరుకున్న కొలువు ఖాయం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు: కార్పొరేట్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోకుండా పోటీపడుతూ అధిక వేతనాలు చెల్లించే కంపెనీలు.. ప్రభుత్వ రంగ సంస్థలు. వీటిలో మహారత్న, నవరత్న, మినీరత్న అనే కేటగిరీలున్నాయి. మినీరత్నలో మళ్లీ రెండు కేటగిరీలున్నాయి. మొత్తంగా దేశంలో 7 మహారత్న, 17 నవరత్న, 71 మినీరత్న కంపెనీలున్నాయి. వీటిలో శాశ్వత ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు అత్యుత్తమ జీత భత్యాలు, పదోన్నతులు, ఇతర సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇవి కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం ఉండే ఉద్యోగాలు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభ ప్రభావం ఉండని కొలువులు. ఆసక్తికే ప్రాధాన్యం! ‘‘బ్యాచిలర్‌స డిగ్రీ స్థాయిలో అభ్యసించిన కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు తమ ఆసక్తి, అభిరుచికి తగిన కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ కెరీర్ ఎంపికలో వేతనాలకు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఏదైనా ఒక రంగంలో అడుగుపెట్టే ముందు తమ అభిరుచులు, సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ రంగంలో పోటీ, సవాళ్లను ఏమేరకు తట్టుకోగలరో తెలుసుకోవాలి. ఒక వేళ వేతనం ఆశించినంతగా లభించకపోతే నిరుత్సాహపడొద్దు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో మీకు నచ్చిన రంగంలోనే ఎక్కువ సంపాదన పొందే అవకాశం లేకపోలేదు. కాబట్టి కెరీర్ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.’’ - డా.అడపా రామారావు, డీన్, కౌన్సెలింగ్ అండ్ కెరీర్ గెడైన్స్, జీఆర్ఐఈటీ -
త్వరలో ఉద్యోగాల జాతర!
► పింఛన్ పెంపు, ‘కల్యాణ లక్ష్మి’ సహా వరాలన్నీ దసరా నుంచి అమలు ► 48 మంది మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్ ► తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండ కోటలో వైభవంగా వేడుకలు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తమకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభవార్త ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ద్వారా త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని... పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను వచ్చే దసరా నుంచి అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు డిపోలు సైతం దసరా నుంచి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో.. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి 23 నిమిషాలు ప్రసంగించారు. సీఎం ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. మహాత్ముడి బాటలోనే.. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ చరిత్రను సమున్నతంగా చాటిచెప్పే గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఆటో, ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు పేదలు పొట్టకూటికోసం నడుపుకొనే ఆటోలపై రవాణా పన్నును రద్దు చేశాం. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపైనా రవాణా పన్నును మినహాయించాం. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశాం. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశాం. వడగళ్లు, భారీ వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం విడుదల చేసిన రూ. 482 కోట్లు రైతుల ఖాతాల్లోనే నేరుగా జమవుతాయి. పవర్‌లూం కార్మికులను ఆదుకొనేందుకు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఐదున్నర కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఎంబీసీలకు ప్రత్యేక పథకాలు.. తెలంగాణలో బీసీలపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది. ముఖ్యంగా బాగా వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తాం. గిరిజన, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించే విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తున్నాం. తెలంగాణలోని గిరిజన తండాలు, 500 వరకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. అందుబాటులో 35 లక్షల ఎకరాలు తెలంగాణలో సాగుకు పనికిరాని 35 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అందులో 10 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉంది. ఈ భూమిపై పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 3 లక్షల ఎకరాలను గుర్తించాం. మరో ఆరేడు లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 ల క్షల ఎకరాల ను పారిశ్రామిక జోన్‌గా ప్రకటిస్తాం. క్రీడాకారులకు ప్రోత్సాహం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇకపై ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆయా పోటీల్లో స్వర్ణ పతకం సాధిస్తే రూ. 50 లక్షలు, రజత పతకం సాధిస్తే రూ. 25 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ. 15 ల క్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకున్నాం. పతకాలు సాధించిన క్రీడాకారులతో సమానంగా కోచ్‌లకు కూడా నగదు అందజేస్తాం. హైదరాబాద్‌కు బస్సు, రైల్వే టెర్మినల్లు హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం. 3,600 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతినిచ్చాం. హైదరాబాద్‌ను త్వరలోనే వైఫై నగరంగా, ఐటీ ఇంక్యుబేటర్‌గా మార్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌కు నలుదిశలా కొత్తగా బస్, రైల్వే టెర్మినల్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. దీంతోపాటు ఫార్మా, స్పోర్ట్స్, సినిమా, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌లను నగరం నలు దిశలా ఏర్పాటు చేస్తాం. చర్చి నిర్మాణానికి పంచాయతీ అనుమతి దళిత, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఇకపై చర్చిల నిర్మాణానికి గ్రామ పంచాయతీ పరిధిలోనే అనుమతి ఇచ్చేలా వెసులుబాటు కల్పిస్తాం. సర్వేపై దుష్ర్పచారం రాష్ట్రంలో ప్రజల పరిస్థితిపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కల్లేవు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లోకి వెళుతున్నాయి. దీనిని అధిగమించేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నాం. కానీ దీనిపై కొన్ని దుష్టశక్తులు లేనిపోని ప్రచారం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అర్హులకు మాత్రమే అందాలని చేపట్టిన కార్యక్రమమే తప్ప మరొకటి కాదు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో పథకాలను రూపొందిస్తాం. అందుకు ప్రజలంతా సహకరించాలి. దళితులకు భూ పంపిణీ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘పేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ’ పథకాన్ని గోల్కొండ కోట నుంచి కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఎంపిక చేసిన మొత్తం 48 మంది మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు. మంత్రులు సైతం అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. విజ్ఞానానికి, వైభవానికి ప్రతీక ఇది.. ‘‘తెలుగు జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం సముచిత నిర్ణయం. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న గోల్కొండ కోట ఫతేదర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలాహిస్సార్ దర్వాజా వద్ద ప్రతిధ్వనించే ఏర్పాటు.. ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కౌశలానికి నిదర్శనంగా నిలిచింది. తానీషా ప్రభువుకు శ్రీరామలక్ష్మణులు సాక్షాత్కరించిందీ, భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించిందీ ఈ కోటలోనే... ఏటా భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయం ప్రారంభమైంది కూడా ఈ గోల్కొండ కోటలోనే... మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్య చరిత్ర రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఇక్కడి ఆస్థానకవే.. యక్షగానం సుగ్రీవ విజయం జాలువారిందీ, ఇబ్రహీం కుతుబ్‌షాకు మల్కిభ రాముడిగా బిరుదునిచ్చిందీ ఈ కోటలోనే... సుప్రసిద్ధ కోహినూర్, దరియా, దహూప్ వంటి వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లిందీ, హైదరాబాద్ నిర్మాణానికి పురుడుపోసుకుందీ ఈ కోటలోనే... తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ప్రారంభించేదీ ఇక్కడి నుంచే... తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానమైతే.. తెలంగాణ పరిపాలనా అస్తిత్వం, వారసత్వ వైభవం ఎగరేసిన జెండా ఈ గోల్కొండ కోట.’’ అమర జవానులకు ముఖ్యమంత్రి నివాళులు కంటోన్మెంట్: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని ఆర్మీ యుద్ధ స్మారక స్థూపం (వీరుల సైనిక స్మారక స్థూపం) వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమర జవానులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా సబ్ ఏరియా కమాండర్ జీఓసీ-ఇన్-సీ మేజర్ జనరల్ సీఏ పిఠావాలా, ఎయిర్ వైస్ మార్షల్, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమాండర్ శ్రీనివాస్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు మారినప్పటికీ, ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే సాంప్రదాయాన్ని కొసాగించడం గమనార్హం. దసరా నుంచి వరాలు వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి.. వికలాంగులకు రూ. 1,500కు పింఛన్ పెంపును దసరా నుంచి అమలు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను వచ్చే దసరా నుంచి తెరిపిస్తాం. దీనివల్ల 60 వేల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. రుణమాఫీ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల భారం పడుతున్నా.. 40 లక్షల మంది రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని కూడా దసరా నుంచే ప్రారంభిస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందనగానే పెళ్లి ఎలా చేయాలా? అని రందిపడే రోజులివి. దళిత, గిరిజన కుటుంబాల్లోనైతే ఆడపిల్ల పుడితే చంపేసే దుర్భర పరిస్థితులున్నాయి. వారిని ఆదుకోవడం కోసం చేపడుతున్న ఇలాంటి పథకం దేశ చరిత్రలో ఎక్కడా అమలు కాలేదు. వచ్చే దసరా నుంచి తెలంగాణలోనే ప్రథమంగా అమలు చేస్తుండటం గర్వ కారణం.