త్వరలో ఉద్యోగాల జాతర! | KCR announced a good news for Telangana youth on Employment | Sakshi
Sakshi News home page

త్వరలో ఉద్యోగాల జాతర!

Published Sat, Aug 16 2014 2:07 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

KCR announced a good news for Telangana youth on Employment

పింఛన్ పెంపు, ‘కల్యాణ లక్ష్మి’ సహా వరాలన్నీ దసరా నుంచి అమలు
48 మంది మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండ కోటలో వైభవంగా వేడుకలు

 
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తమకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభవార్త ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ద్వారా త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని... పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను వచ్చే దసరా నుంచి అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు డిపోలు సైతం దసరా నుంచి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో.. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి 23 నిమిషాలు ప్రసంగించారు. సీఎం ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే..
 
మహాత్ముడి బాటలోనే..
 మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ చరిత్రను సమున్నతంగా చాటిచెప్పే గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు.
 
ఆటో, ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు
 పేదలు పొట్టకూటికోసం నడుపుకొనే ఆటోలపై రవాణా పన్నును రద్దు చేశాం. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపైనా రవాణా పన్నును మినహాయించాం. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశాం. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేశాం. వడగళ్లు, భారీ వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం విడుదల చేసిన రూ. 482 కోట్లు రైతుల ఖాతాల్లోనే నేరుగా జమవుతాయి. పవర్‌లూం కార్మికులను ఆదుకొనేందుకు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఐదున్నర కోట్ల రూపాయలను విడుదల చేశాం.
 
ఎంబీసీలకు ప్రత్యేక పథకాలు..
 తెలంగాణలో బీసీలపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది. ముఖ్యంగా బాగా వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తాం. గిరిజన, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించే విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తున్నాం. తెలంగాణలోని గిరిజన తండాలు, 500 వరకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.
 
 అందుబాటులో 35 లక్షల ఎకరాలు
 తెలంగాణలో సాగుకు పనికిరాని 35 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అందులో 10 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉంది. ఈ భూమిపై పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 3 లక్షల ఎకరాలను గుర్తించాం. మరో ఆరేడు లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 ల క్షల ఎకరాల ను పారిశ్రామిక జోన్‌గా ప్రకటిస్తాం.
 
 క్రీడాకారులకు ప్రోత్సాహం
 రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇకపై ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆయా పోటీల్లో స్వర్ణ పతకం సాధిస్తే రూ. 50 లక్షలు, రజత పతకం సాధిస్తే రూ. 25 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ. 15 ల క్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకున్నాం. పతకాలు సాధించిన క్రీడాకారులతో సమానంగా కోచ్‌లకు కూడా నగదు అందజేస్తాం.
 
 హైదరాబాద్‌కు బస్సు, రైల్వే టెర్మినల్‌లు
 హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం. 3,600 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతినిచ్చాం. హైదరాబాద్‌ను త్వరలోనే వైఫై నగరంగా, ఐటీ ఇంక్యుబేటర్‌గా మార్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌కు నలుదిశలా కొత్తగా బస్, రైల్వే టెర్మినల్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. దీంతోపాటు ఫార్మా, స్పోర్ట్స్, సినిమా, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌లను నగరం నలు దిశలా ఏర్పాటు చేస్తాం.
 
 చర్చి నిర్మాణానికి పంచాయతీ అనుమతి
 దళిత, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఇకపై చర్చిల నిర్మాణానికి గ్రామ పంచాయతీ పరిధిలోనే అనుమతి ఇచ్చేలా వెసులుబాటు కల్పిస్తాం.
 
 సర్వేపై దుష్ర్పచారం
 రాష్ట్రంలో ప్రజల పరిస్థితిపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కల్లేవు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లోకి వెళుతున్నాయి. దీనిని అధిగమించేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నాం. కానీ దీనిపై కొన్ని దుష్టశక్తులు లేనిపోని ప్రచారం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అర్హులకు మాత్రమే అందాలని చేపట్టిన కార్యక్రమమే తప్ప మరొకటి కాదు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో పథకాలను రూపొందిస్తాం. అందుకు ప్రజలంతా సహకరించాలి.
 
దళితులకు భూ పంపిణీ ప్రారంభం

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘పేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ’ పథకాన్ని గోల్కొండ కోట నుంచి కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఎంపిక చేసిన మొత్తం 48 మంది మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు. మంత్రులు సైతం అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు.
 
 విజ్ఞానానికి, వైభవానికి ప్రతీక ఇది..
 ‘‘తెలుగు జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం సముచిత నిర్ణయం. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న గోల్కొండ కోట ఫతేదర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలాహిస్సార్ దర్వాజా వద్ద ప్రతిధ్వనించే ఏర్పాటు.. ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కౌశలానికి నిదర్శనంగా నిలిచింది. తానీషా ప్రభువుకు శ్రీరామలక్ష్మణులు సాక్షాత్కరించిందీ, భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించిందీ ఈ కోటలోనే... ఏటా భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయం ప్రారంభమైంది కూడా ఈ గోల్కొండ కోటలోనే... మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్య చరిత్ర రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఇక్కడి ఆస్థానకవే.. యక్షగానం సుగ్రీవ విజయం జాలువారిందీ, ఇబ్రహీం కుతుబ్‌షాకు మల్కిభ రాముడిగా బిరుదునిచ్చిందీ ఈ కోటలోనే... సుప్రసిద్ధ కోహినూర్, దరియా, దహూప్ వంటి వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లిందీ, హైదరాబాద్ నిర్మాణానికి పురుడుపోసుకుందీ ఈ  కోటలోనే... తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ప్రారంభించేదీ ఇక్కడి నుంచే... తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానమైతే.. తెలంగాణ పరిపాలనా అస్తిత్వం, వారసత్వ వైభవం ఎగరేసిన జెండా ఈ గోల్కొండ కోట.’’
 
అమర జవానులకు ముఖ్యమంత్రి నివాళులు
కంటోన్మెంట్: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని ఆర్మీ యుద్ధ స్మారక స్థూపం (వీరుల సైనిక స్మారక స్థూపం) వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమర జవానులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా సబ్ ఏరియా కమాండర్ జీఓసీ-ఇన్-సీ మేజర్ జనరల్ సీఏ పిఠావాలా, ఎయిర్ వైస్ మార్షల్, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్ కమాండర్ శ్రీనివాస్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు మారినప్పటికీ, ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే సాంప్రదాయాన్ని కొసాగించడం గమనార్హం.
 
దసరా నుంచి వరాలు
వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి.. వికలాంగులకు రూ. 1,500కు పింఛన్ పెంపును దసరా నుంచి అమలు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను వచ్చే దసరా నుంచి తెరిపిస్తాం. దీనివల్ల 60 వేల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. రుణమాఫీ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల భారం పడుతున్నా.. 40 లక్షల మంది రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని కూడా దసరా నుంచే ప్రారంభిస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందనగానే పెళ్లి ఎలా చేయాలా? అని రందిపడే రోజులివి. దళిత, గిరిజన కుటుంబాల్లోనైతే ఆడపిల్ల పుడితే చంపేసే దుర్భర పరిస్థితులున్నాయి. వారిని ఆదుకోవడం కోసం చేపడుతున్న ఇలాంటి పథకం దేశ చరిత్రలో ఎక్కడా అమలు కాలేదు. వచ్చే దసరా నుంచి తెలంగాణలోనే ప్రథమంగా అమలు చేస్తుండటం గర్వ కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement