కొత్త సచివాలయంలోనే ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ పండుగల వేళ జెండా వందన కార్యక్రమం ఇలా ఒక్కోచోట జరుగుతూ వస్తోంది! గోల్కొండ కోటపై జెండా రెపరెపలాడటం ఘనంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా.. అక్కడ స్థలాభావం ఇబ్బంది పెడుతోంది. ఇది కాదంటే మిగిలింది.. రక్షణ శాఖ అధీనంలోని పరేడ్ మైదానం. అసలు ఇవన్నీ ఎందుకు.. సచివాలయం చెంతనే జెండా వందనం నిర్వహిస్తే బాగుంటుంది కదా..! సీఎం మదిలో మెదిలిన ఆలోచన ఇది.
కొత్త సచివాలయం ఏర్పడనున్న ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే పరేడ్ మైదానం కూడా కొలువుదీరబోతోంది. ఈ మైదానం కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించనున్నారు. జెండా వందనం, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలను ఇందులోనే నిర్వహించనున్నారు. దేశంలో మరే సచివాలయం లేని తరహాలో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యంత అధునాతన సచివాలయం రాజధాని నయారాయ్‌పూర్‌లో రూపొందింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ఇటీవల అధికారుల బృందం వెళ్లి ఆ సచివాలయాన్ని పరిశీలించి వచ్చింది. అక్కడికన్నా ఎక్కువ ప్రత్యేకతలతో కొత్త సచివాలయం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు
ప్రస్తుత సచివాలయంలో భవనాల విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రాబోతున్నాయి. మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, సిబ్బంది కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. వాటితోపాటు ఒక విశాలమైన సమావేశ మందిరం ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేకంగా కేంద్ర సమావేశ మందిరం నిర్మిస్తారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తారు.
వీటన్నింటికీ రూ. 500 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఇక సందర్శకులు ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి వచ్చేవారికి ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆధునిక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. 5 వేల వాహనాల సామర్థ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.
అక్కడే హెలీప్యాడ్..
కొత్త సచివాలయంలో సీఎం భవనానికి చేరువలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో అనువైన హెలీప్యాడ్ లేక బేగంపేట విమానాశ్రయంలో దిగాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ హెలీప్యాడ్ రూపొందించినా అది భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవటంతో వాడటం లేదు. దీంతో హెలీకాప్టర్ నేరుగా సీఎం కార్యాలయం వరకు వచ్చేలా కొత్త సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలక్‌నుమా తరహాలో అసెంబ్లీ భవనం
రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగడ్డలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలని నిర్ణయించినందున ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో దాన్ని నగరానికి మకుటాయమానంగా మిగిలేలా రూపొం దించాలని అధికారులకు సూచించారు. మ్యూజియంగా మార్చాలా, ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో హోటల్‌గా రూపొందిం చాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో భారీ ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నారు. గతంలో సిగ్నేచర్ టవర్స్ కోసం లుంబినీ పార్కును గుర్తించగా, అక్కడ కుదరదని తాజాగా తేల్చారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సచివాలయ ప్రాంగణమే సరిపోతుందని భావిస్తున్నారు.
ఐఏఎస్‌లకు ఆధునిక విల్లాలు
సీనియర్ ఐఏఎస్ అధికారులకు అధునాతన రీతిలో 100 విల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వీటిని ఎర్రగడ్డలోనే నిర్మించాలనుకున్నా.. తాజాగా ఎర్రమంజిల్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇక్కడి పాత క్వార్టర్లు తొలగించి 25 ఎకరాలను నిర్మాణాలకు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం పక్కన ఐఏఎస్ అధికారుల సంఘం భవనం, పాత క్వార్టర్లను తొలగించి.. ముఖ్యమంత్రికి కొత్త అధికారిక నివాసం నిర్మించనున్నారు.
ఈ నిర్మాణాలకు మరో రూ.400 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తమ్మీద కొత్త సచివాలయం, అందులో భవనాల నిర్మాణాలతోపాటు అధికారులకు భవనాలు, సీఎం అధికార నివాసానికి కలిపి రూ.900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. డిజైన్లు మొదలు నిర్మాణం వరకు వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నారు. గతంలో అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీలో మరో ముగ్గురిని చేర్చాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్నారు.