Pandragastu celebrations
-
తిరుపతిలో పంద్రాగస్టు వేడుకలు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆగస్టు 15న అధికారికంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జెండావిష్కరణ వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతిలోని తారకరామ స్టేడియాన్ని పరిశీలిస్తోంది. మంగళవారం తిరుపతి చేరుకున్న పోలీస్ వర్గాలు ఈ మేరకు మైదానం విస్తీర్ణం, గేట్లు, పార్కింగ్ స్థలంపై పరిశీలన జరిపాయి. రాష్ట్ర విభజన తరువాత ఏటా ఒక్కో నగరంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విజయవాడ, కర్నూలు, అనంతపురం నగరాల్లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కొత్త సచివాలయంలోనే ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాలు.. తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ పండుగల వేళ జెండా వందన కార్యక్రమం ఇలా ఒక్కోచోట జరుగుతూ వస్తోంది! గోల్కొండ కోటపై జెండా రెపరెపలాడటం ఘనంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నా.. అక్కడ స్థలాభావం ఇబ్బంది పెడుతోంది. ఇది కాదంటే మిగిలింది.. రక్షణ శాఖ అధీనంలోని పరేడ్ మైదానం. అసలు ఇవన్నీ ఎందుకు.. సచివాలయం చెంతనే జెండా వందనం నిర్వహిస్తే బాగుంటుంది కదా..! సీఎం మదిలో మెదిలిన ఆలోచన ఇది. కొత్త సచివాలయం ఏర్పడనున్న ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే పరేడ్ మైదానం కూడా కొలువుదీరబోతోంది. ఈ మైదానం కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించనున్నారు. జెండా వందనం, శకటాల ప్రదర్శన తదితర కార్యక్రమాలను ఇందులోనే నిర్వహించనున్నారు. దేశంలో మరే సచివాలయం లేని తరహాలో కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ దేశంలోనే అత్యంత అధునాతన సచివాలయం రాజధాని నయారాయ్‌పూర్‌లో రూపొందింది. రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ఇటీవల అధికారుల బృందం వెళ్లి ఆ సచివాలయాన్ని పరిశీలించి వచ్చింది. అక్కడికన్నా ఎక్కువ ప్రత్యేకతలతో కొత్త సచివాలయం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 20 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ప్రస్తుత సచివాలయంలో భవనాల విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. కొత్తగా నిర్మించబోయే సచివాలయంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు రాబోతున్నాయి. మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతి, సిబ్బంది కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండనున్నాయి. వాటితోపాటు ఒక విశాలమైన సమావేశ మందిరం ఉంటుంది. సీఎం కోసం ప్రత్యేకంగా కేంద్ర సమావేశ మందిరం నిర్మిస్తారు. ఆహ్లాదకర వాతావరణం కోసం ఉద్యానవనాలు, వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికీ రూ. 500 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ఇక సందర్శకులు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. అక్కడికి వచ్చేవారికి ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఆధునిక లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. 5 వేల వాహనాల సామర్థ్యంతో పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడే హెలీప్యాడ్.. కొత్త సచివాలయంలో సీఎం భవనానికి చేరువలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత సచివాలయంలో అనువైన హెలీప్యాడ్ లేక బేగంపేట విమానాశ్రయంలో దిగాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ హెలీప్యాడ్ రూపొందించినా అది భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేకపోవటంతో వాడటం లేదు. దీంతో హెలీకాప్టర్ నేరుగా సీఎం కార్యాలయం వరకు వచ్చేలా కొత్త సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలక్‌నుమా తరహాలో అసెంబ్లీ భవనం రాష్ట్ర అసెంబ్లీ భవనానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగడ్డలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించాలని నిర్ణయించినందున ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో దాన్ని నగరానికి మకుటాయమానంగా మిగిలేలా రూపొం దించాలని అధికారులకు సూచించారు. మ్యూజియంగా మార్చాలా, ఫలక్‌నుమా ప్యాలెస్ తరహాలో హోటల్‌గా రూపొందిం చాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో భారీ ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నారు. గతంలో సిగ్నేచర్ టవర్స్ కోసం లుంబినీ పార్కును గుర్తించగా, అక్కడ కుదరదని తాజాగా తేల్చారు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి సచివాలయ ప్రాంగణమే సరిపోతుందని భావిస్తున్నారు. ఐఏఎస్‌లకు ఆధునిక విల్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అధునాతన రీతిలో 100 విల్లాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత వీటిని ఎర్రగడ్డలోనే నిర్మించాలనుకున్నా.. తాజాగా ఎర్రమంజిల్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇక్కడి పాత క్వార్టర్లు తొలగించి 25 ఎకరాలను నిర్మాణాలకు గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం పక్కన ఐఏఎస్ అధికారుల సంఘం భవనం, పాత క్వార్టర్లను తొలగించి.. ముఖ్యమంత్రికి కొత్త అధికారిక నివాసం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు మరో రూ.400 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తమ్మీద కొత్త సచివాలయం, అందులో భవనాల నిర్మాణాలతోపాటు అధికారులకు భవనాలు, సీఎం అధికార నివాసానికి కలిపి రూ.900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. డిజైన్లు మొదలు నిర్మాణం వరకు వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఆధ్వర్యంలో ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీ వేయనున్నారు. గతంలో అయిదుగురు సభ్యులతో ప్రభుత్వం వేసిన కమిటీలో మరో ముగ్గురిని చేర్చాలని ఇటీవల సీఎం నిర్ణయం తీసుకున్నారు. -
పంద్రాగస్టుపై పోలీసుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు దగ్గర పడుతుండటంతో పోలీసుల నిఘాను మరింత తీవ్రతరం చేశారు. స్వాత్రంత్య దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు నిఘాను విస్తృతం చేస్తున్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండా ఎగురవేయనున్న గోల్కొండ కోటను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తాజాగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిని నిలిపేశారు. అదేవిధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల భద్రతకు సంబంధించి డీజీపీ కార్యాలయం ఎస్పీలతో ప్రతీరోజూ పర్యవేక్షిస్తోంది. సరిహద్దుల్లో గట్టి నిఘా రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు. అసాంఘిక శక్తులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఉండేందుకు 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నారు. రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పంజాబ్‌తో పాటు జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరపడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జమ్ముకాశ్మీర్‌లో దాడి తరా్వాత ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీంతో వారు మళ్లీ ఎక్కడైనా ఉప్రదవం తలపెట్టే అవకాశమున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో చాలా సులువుగా కలిసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలతో పాటు జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రదేశాలపై నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. -
నూతన రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర వేడుకలకు హంగులు
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా శుక్రవారం నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖామంత్రి టి.పద్మారావు హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్లో తొలుత ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తారు. వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేయడంతో పాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నలుగురికి పట్టాలు అందజేయనున్నారు. కాగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ రంగనాథ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. కోయ, కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాలతో వేడుకలు నిర్వహించేందుకు సమాచార, పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రగతి నివేదికలతోపాటు స్టాల్స్ రూపొందించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వివిధ శాఖలలో సాధించిన ప్రగతిని వివరించేందుకు శకటాలు, జానపద కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు వెన్నుదన్నుగా నిలవడంతో వారిని ప్రోత్సహించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా 400 మందికి పైగా ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రంగులద్దుకున్న పరేడ్ గ్రౌండ్.. పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను రంగులతో తీర్చిదిద్దారు. త్రివర్ణ పతాకాలతో పరేడ్‌గ్రౌండ్ కొత్త శోభను సంతరించుకుంది. పోలీసులు కవాతు నిర్వహించేందుకు పరేడ్‌ను సిద్ధం చేశారు. మంత్రి ప్రసంగించేందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ, పోలీస్ లోగోను అమర్చారు. గ్రౌండ్‌కు అన్ని వైపులా జెండాలు ఏర్పాటు చేశారు. తొలి తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. మూడు గ్రామాల దళితులకు భూ పంపిణీ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో మూడు గ్రామాల్లో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తొలుత జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరకు మూడు గ్రామాల్లో తొమ్మిది మంది దళితులకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించారు. వైరా, పాలేరు, మధిర నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మంది రైతులకు 22.27 ఎకరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా గోల్కొండ కోటలో ఐదుగురికి భూమి పట్టాలు పంపిణీ చేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా నలుగురిలో వైరా మండలం గొల్లెనపాడులోని పాపగంటి మేరమ్మ, కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలోని తుడుము కళ్యాణి, దుంపుల పుష్ప, ముదిగొండ మండలం గంధసిరికి చెందిన గద్దల లక్ష్మీకి స్థానిక పరేడ్ గ్రౌండ్లో భూ పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలు.... స్వాంత్య్ర వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఇలంబరితి, కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్, జడ్పీలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీ అధ్యక్షులు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జెండాలను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కార్యాలయాలు త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతున్నాయి. -
కోటలోనే ఎగిరిన జెండా
హన్మకొండ కల్చరల్ : నిజాం రాష్ట్రంలో మొదటిసారిగా త్రివర్ణపతాకం ఎగిరింది వరంగల్ కోటలోనే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి పంద్రాగస్టు వేడుకలు కూడా కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులోనే కావడం విశేషం. దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించబడింది. ఆనాటి పరిస్థితులను బట్టి ప్రతివారం వరంగల్ కోటలోనూ, స్థంభంపల్లిలోనూ, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు హైదరాబాద్ సంస్థానంలోని ఏ ప్రాంతంలో కూడా జెండావందనం బహిరంగంగా జరగలేదు. ఈ మేరకు ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, సుదర్శన్, బి.రంగనాయకులు, వి.గోవిందరావు, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్య అధ్వర్యంలో 1944 నుంచి జెండావందనాలు జరుగుతూ వచ్చాయి. ఆవిధంగా మొదటిసారి జెండా వందనం వరంగల్ కోట నుంచే ప్రారంభం కావడం మన జిల్లాకు గర్వకారణం. ప్రతీ వారం నిజాం వ్యతిరేకపోరాటంలో యువకులను ఉత్తేజితులను చేస్తూ వరుసగా త్రివర్ణపతాకావిష్కరణలు జరిగాయి. అందులో భాగంగానే బత్తిని రామస్వామి ఇంటిముందు ఆవరణలో 1946 అగస్టు 11వ తేదీన జెండా వందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. జెండా వందనం అనంతరం ఉద్యమ కార్యక్రమాల గూర్చి అందరూ చర్చించుకుంటుండగా.. ఇత్తెహదుల్ ముసల్మీన్ సంస్థకు చెందినజాకార్ల గుంపు ఖాసీమ్షరిఫ్ అధ్వర్యంలో వారిపై దాడి చేసింది. ఇందులో బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. అప్పటి వరకు జెండావందనంలో పాల్గొని.. ఆ తరువాత తన వృత్తి పనిపై వెళ్తున్న మొగిలయ్యకు తనసోదరుడు గాయపడిన సంగతి, ఘర్షణ జరిగిన సంగతి తెలిసింది.వెంటనే మొగిలయ్య సింహంలా వచ్చి రజాకార్లపై కలబడ్డాడు. మొగిలయ్యది దృఢమైన శరీరసౌష్టవం కావడంతో మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టడని భావించిన రజాకార్లు బరిసెతో పోడవడంతో మొగిలయ్య అక్కడిక్కడే మరణించాడు. హైదరాబాద్ స్వతంత్రోద్యమంలో మొగిలయ్యదే మొదటిరాజకీయ హత్యగా ఉండిపోయింది. రామస్వామి, గుఱ్ఱం వెంకటయ్య, కూచం మల్లేషం గాయపడ్డాడు. ఎదురుగట్ల వెంకటయ్య, గుర్రం రామస్వామి, మంథిని రాజవీరు, మంథిని శివయ్య, బైరి రామస్వామి, పొశాల బుచ్చయ్య, మట్టెవాడ రాంబ్రమ్మం, ఎదురుకట్ట కనకయ్య, దాసరి శమ్మయ్య, మాసం నారాయణ, బారుపల్లి రామయ్య తదితరులు క్షతగాత్రులయ్యారు. మిగిలినవారు ఇంటి వెనక వైపు ద్వారం గుండా తప్పించుకున్నారు. మొగిలయ్య హత్య చేయబడ్డాడనే విషయం తెలుసుకున్న అజంజాహీ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు.. పని వదిలేసి నర్మెటి రామస్వామి న్యాయకత్వంలో పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఖాసిం షరిఫ్ దుండగులు పోతూ..పోతూ.. వరంగల్ చౌరస్తాలో మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ ఊరేగింపు చేశారు. ఇక్కడ ఆర్యసమాజ నాయకుడు చెరుకు కాంతయ్య ఇంటిపై దాడి చేశారు. శబ్ధానుశాసనాంధ్ర గ్రంథాలయం ముందు నిల్చొని ఉన్న ఏవీవీ స్కూల్ విద్యార్థి ఖమ్మంకు చెందిన ప్రతాప సూర్యనారాయణను కత్తితో పొడిచి గాయపరిచారు. ఆర్యసమాజ నాయకులు వెలగందుల జనార్దన్గుప్త, చింతల రంగయ్యలు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరంగల్ సుబేదార్ సైతం ముష్కరులను అభినందించారు. చైతన్యం నింపిన కాళోజీ కవిత.. అలర్లు సృష్టిస్తారనే కారణంపై కాళోజీ నారాయణరావు, ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, మొ గిలయ్య అన్న బత్తిని రామస్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కారం చేశారు. బహిష్కరణ ని బంధనను ఉల్లంఘించిన రాజలింగంను నిర్బం ధించారు. బూర్గుల రామకృష్ణారావు ఈ సంఘటనను నిరసిస్తూ నేరస్తులకు తగిన శిక్ష విధించాలని నిజాం రాజుకు నివేదిక పంపించారు. డాక్టర్ భోగరాజుపట్టాభి సీతారామయ్య ఈ సంఘటన నిరసిస్తూ నేరస్థులను కఠినంగా శిక్షించాలని నిజాంను హెచ్చరించాడు. నిజాం రాజు ఈ సంఘటనపై విచారించడానికి ప్రధాని మీర్జాఇస్మాయిల్‌ను నియమించాడు. ఇది తెలిసిన ఖాసిం షరిఫ్ బళ్లారికి వెళ్లి అక్కడే దా క్కున్నాడు. విచారించడానికి మీర్జాఇస్మాయిల్ వరంగల్ వచ్చిన సందర్భంగా భేతి కేశవరెడ్డి, బండారు చంద్రమౌళీశ్వరరావులు హత్య జరిగిన తీరును ప్రత్యక్షంగా చూపించారు. నిదింతులను శిక్షించాలని కోరుతూ ఖిలా వరంగల్‌లోని యువకులు విజ్ఞాపన పత్రం సమర్పించారు. మీర్జాస్మాయిల్ విచారించి వెళ్లిన తరువాత,.. ఎన్నాళ్ల నుండియో ఇదిగో ఇదిగో యనుచు/ ఇన్నాళ్లకైనను వెళ్లి వచ్చితివా? కోటగోడల మధ్య ఖూని జరిగిన చోట/ గుండాల శక్తుల గోచరించినవా? బజార్ల బాలకుని బల్లెంబుతో పొడచు/ బద్మాషునేమైన పసిగట్టినావా? .. అంటూ పరిహసిస్తూ కాళోజీ రాసిన కవిత చాలా మందిని ఆలోచింపచేసింది. కానీ, ఆ తరువాత ఈ సంఘటనలో గాయపడిన వారినే ప్రభుత్వం నేరస్థులుగా పరిగణించి జరిమానాలు విధించింది. యువకుల్లో పోరాట పటిమ.. ఈ సంఘటన ఇక్కడి యువకులలో భయాన్ని కలి గించ లేదు. పైగా యువకులు స్వచ్చంద సేవకులుగా ముందుకు రావడం ఓరుగల్లు ప్రజలకు పోరా ట పటిమకు నిదర్శనం. అలా ముందుకు వచ్చినవారిలో ఆరెల్లి బుచ్చయ్య, వెంకటనారాయణ యాదవ్ పలాసలో శిక్షణకు వెళ్లారు. దుగ్గిశెట్టి వెంకటయ్య, న ర్మెటి రామస్వామిలు ఆ తరువాత కాంగ్రెస్ వాలంటీర్ దళాలకు దళాధిపతులుగా ఆగ్రభాగాన నిలి చారు.ఇక్కడి నుంచి అటు ఆర్యసమాజీయులు, కాం గ్రెస్ వారు తమ పోరాట పంథాను మార్చుకున్నారు. దళాలను ఏర్పాటు చేసుకుని రహస్య పోరా టం జరిపారు. కమ్యూనిస్టులు పాలకుర్తిని కేంద్రం గా చేసుకుని విస్నూరు రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఊరు కమ్మర్లు తుపాకులు, బర్మార్లు, బందూకులు తయారు చేశారు. ప్రజలు బందూకు పట్టారు. చివరికి నిజాం రాజు, అతని తా బేదార్లు లోంగిపోక తప్పలేదు. తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తి ప్రపంచ ప్రజలను నివ్వెరపర్చింది.