పంద్రాగస్టుపై పోలీసుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు దగ్గర పడుతుండటంతో పోలీసుల నిఘాను మరింత తీవ్రతరం చేశారు. స్వాత్రంత్య దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు నిఘాను విస్తృతం చేస్తున్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండా ఎగురవేయనున్న గోల్కొండ కోటను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తాజాగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిని నిలిపేశారు. అదేవిధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల భద్రతకు సంబంధించి డీజీపీ కార్యాలయం ఎస్పీలతో ప్రతీరోజూ పర్యవేక్షిస్తోంది.
సరిహద్దుల్లో గట్టి నిఘా
రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు. అసాంఘిక శక్తులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఉండేందుకు 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నారు. రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పంజాబ్‌తో పాటు జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరపడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
జమ్ముకాశ్మీర్‌లో దాడి తరా్వాత ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీంతో వారు మళ్లీ ఎక్కడైనా ఉప్రదవం తలపెట్టే అవకాశమున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో చాలా సులువుగా కలిసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలతో పాటు జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రదేశాలపై నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.