సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా శుక్రవారం నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖామంత్రి టి.పద్మారావు హాజరు కానున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో తొలుత ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తారు.
వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేయడంతో పాటు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నలుగురికి పట్టాలు అందజేయనున్నారు. కాగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించేందుకు కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ రంగనాథ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. కోయ, కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాలతో వేడుకలు నిర్వహించేందుకు సమాచార, పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది.
వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రగతి నివేదికలతోపాటు స్టాల్స్ రూపొందించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వివిధ శాఖలలో సాధించిన ప్రగతిని వివరించేందుకు శకటాలు, జానపద కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యోగులు వెన్నుదన్నుగా నిలవడంతో వారిని ప్రోత్సహించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా 400 మందికి పైగా ప్రశంసాపత్రాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
రంగులద్దుకున్న పరేడ్ గ్రౌండ్..
పంద్రాగస్టు వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను రంగులతో తీర్చిదిద్దారు. త్రివర్ణ పతాకాలతో పరేడ్‌గ్రౌండ్ కొత్త శోభను సంతరించుకుంది. పోలీసులు కవాతు నిర్వహించేందుకు పరేడ్‌ను సిద్ధం చేశారు. మంత్రి ప్రసంగించేందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ, పోలీస్ లోగోను అమర్చారు. గ్రౌండ్‌కు అన్ని వైపులా జెండాలు ఏర్పాటు చేశారు. తొలి తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు.
మూడు గ్రామాల దళితులకు భూ పంపిణీ..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో మూడు గ్రామాల్లో నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తొలుత జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. చివరకు మూడు గ్రామాల్లో తొమ్మిది మంది దళితులకు భూ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వైరా, పాలేరు, మధిర నియోజకవర్గాల పరిధిలోని తొమ్మిది మంది రైతులకు 22.27 ఎకరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా గోల్కొండ కోటలో ఐదుగురికి భూమి పట్టాలు పంపిణీ చేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా నలుగురిలో వైరా మండలం గొల్లెనపాడులోని పాపగంటి మేరమ్మ, కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలోని తుడుము కళ్యాణి, దుంపుల పుష్ప, ముదిగొండ మండలం గంధసిరికి చెందిన గద్దల లక్ష్మీకి స్థానిక పరేడ్ గ్రౌండ్‌లో భూ పంపిణీ చేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా వేడుకలు....
స్వాంత్య్ర వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యాలయాలు ముస్తాబయ్యాయి. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ ఇలంబరితి, కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్, జడ్పీలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీపీ అధ్యక్షులు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జెండాలను ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కార్యాలయాలు త్రివర్ణ పతాకాలతో కళకళలాడుతున్నాయి.
నూతన రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర వేడుకలకు హంగులు
Published Fri, Aug 15 2014 2:39 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement