హన్మకొండ కల్చరల్ : నిజాం రాష్ట్రంలో మొదటిసారిగా త్రివర్ణపతాకం ఎగిరింది వరంగల్ కోటలోనే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి పంద్రాగస్టు వేడుకలు కూడా కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లులోనే కావడం విశేషం. దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా 1944లో వరంగల్‌లో సర్వోదయ సంఘం స్థాపించబడింది. ఆనాటి పరిస్థితులను బట్టి ప్రతివారం వరంగల్ కోటలోనూ, స్థంభంపల్లిలోనూ, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతవరకు హైదరాబాద్ సంస్థానంలోని ఏ ప్రాంతంలో కూడా జెండావందనం బహిరంగంగా జరగలేదు. ఈ మేరకు ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, సంగరంబోయిన కనకయ్య, మల్లయ్య, దుగ్గిశెట్టి వెంకటయ్య, సుదర్శన్, బి.రంగనాయకులు, వి.గోవిందరావు, బత్తిని రామస్వామి, బత్తిని మొగిలయ్య అధ్వర్యంలో 1944 నుంచి జెండావందనాలు జరుగుతూ వచ్చాయి. ఆవిధంగా మొదటిసారి జెండా వందనం వరంగల్ కోట నుంచే ప్రారంభం కావడం మన జిల్లాకు గర్వకారణం. ప్రతీ వారం నిజాం వ్యతిరేకపోరాటంలో యువకులను ఉత్తేజితులను చేస్తూ వరుసగా త్రివర్ణపతాకావిష్కరణలు జరిగాయి.
అందులో భాగంగానే బత్తిని రామస్వామి ఇంటిముందు ఆవరణలో 1946 అగస్టు 11వ తేదీన జెండా వందనం జరిగింది. మొగిలయ్య కూడా అందులో పాల్గొన్నాడు. జెండా వందనం అనంతరం ఉద్యమ కార్యక్రమాల గూర్చి అందరూ చర్చించుకుంటుండగా.. ఇత్తెహదుల్ ముసల్మీన్ సంస్థకు చెందినజాకార్ల గుంపు ఖాసీమ్‌షరిఫ్ అధ్వర్యంలో వారిపై దాడి చేసింది. ఇందులో బత్తిని రామస్వామికి గాయాలయ్యాయి. అప్పటి వరకు జెండావందనంలో పాల్గొని.. ఆ తరువాత తన వృత్తి పనిపై వెళ్తున్న మొగిలయ్యకు తనసోదరుడు గాయపడిన సంగతి, ఘర్షణ జరిగిన సంగతి తెలిసింది.వెంటనే మొగిలయ్య సింహంలా వచ్చి రజాకార్లపై కలబడ్డాడు.
మొగిలయ్యది దృఢమైన శరీరసౌష్టవం కావడంతో మొగిలయ్యను వదిలేస్తే తమను వదిలిపెట్టడని భావించిన రజాకార్లు బరిసెతో పోడవడంతో మొగిలయ్య అక్కడిక్కడే మరణించాడు. హైదరాబాద్ స్వతంత్రోద్యమంలో మొగిలయ్యదే మొదటిరాజకీయ హత్యగా ఉండిపోయింది. రామస్వామి, గుఱ్ఱం వెంకటయ్య, కూచం మల్లేషం గాయపడ్డాడు. ఎదురుగట్ల వెంకటయ్య, గుర్రం రామస్వామి, మంథిని రాజవీరు, మంథిని శివయ్య, బైరి రామస్వామి, పొశాల బుచ్చయ్య, మట్టెవాడ రాంబ్రమ్మం, ఎదురుకట్ట కనకయ్య, దాసరి శమ్మయ్య, మాసం నారాయణ, బారుపల్లి రామయ్య తదితరులు క్షతగాత్రులయ్యారు.
మిగిలినవారు ఇంటి వెనక వైపు ద్వారం గుండా తప్పించుకున్నారు. మొగిలయ్య హత్య చేయబడ్డాడనే విషయం తెలుసుకున్న అజంజాహీ మిల్లులో పనిచేస్తున్న కార్మికులు.. పని వదిలేసి నర్మెటి రామస్వామి న్యాయకత్వంలో పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఖాసిం షరిఫ్ దుండగులు పోతూ..పోతూ.. వరంగల్ చౌరస్తాలో మొగిలయ్యను చంపిన బరిసెను చూపుతూ ఊరేగింపు చేశారు. ఇక్కడ ఆర్యసమాజ నాయకుడు చెరుకు కాంతయ్య ఇంటిపై దాడి చేశారు. శబ్ధానుశాసనాంధ్ర గ్రంథాలయం ముందు నిల్చొని ఉన్న ఏవీవీ స్కూల్ విద్యార్థి ఖమ్మంకు చెందిన ప్రతాప సూర్యనారాయణను కత్తితో పొడిచి గాయపరిచారు. ఆర్యసమాజ నాయకులు వెలగందుల జనార్దన్‌గుప్త, చింతల రంగయ్యలు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వరంగల్ సుబేదార్ సైతం ముష్కరులను అభినందించారు.
చైతన్యం నింపిన కాళోజీ కవిత..
అలర్లు సృష్టిస్తారనే కారణంపై కాళోజీ నారాయణరావు, ఎమ్మెస్ రాజలింగం, హయగ్రీవాచారి, మొ గిలయ్య అన్న బత్తిని రామస్వామిలను ఆరు నెలల పాటు నగర బహిష్కారం చేశారు. బహిష్కరణ ని బంధనను ఉల్లంఘించిన రాజలింగంను నిర్బం ధించారు. బూర్గుల రామకృష్ణారావు ఈ సంఘటనను నిరసిస్తూ నేరస్తులకు తగిన శిక్ష విధించాలని నిజాం రాజుకు నివేదిక పంపించారు. డాక్టర్ భోగరాజుపట్టాభి సీతారామయ్య ఈ సంఘటన నిరసిస్తూ నేరస్థులను కఠినంగా శిక్షించాలని నిజాంను హెచ్చరించాడు.
నిజాం రాజు ఈ సంఘటనపై విచారించడానికి ప్రధాని మీర్జాఇస్మాయిల్‌ను నియమించాడు. ఇది తెలిసిన ఖాసిం షరిఫ్ బళ్లారికి వెళ్లి అక్కడే దా క్కున్నాడు. విచారించడానికి మీర్జాఇస్మాయిల్ వరంగల్ వచ్చిన సందర్భంగా భేతి కేశవరెడ్డి, బండారు చంద్రమౌళీశ్వరరావులు హత్య జరిగిన తీరును ప్రత్యక్షంగా చూపించారు. నిదింతులను శిక్షించాలని కోరుతూ ఖిలా వరంగల్‌లోని యువకులు విజ్ఞాపన పత్రం సమర్పించారు. మీర్జాస్మాయిల్ విచారించి వెళ్లిన తరువాత,..
ఎన్నాళ్ల నుండియో ఇదిగో ఇదిగో యనుచు/ ఇన్నాళ్లకైనను వెళ్లి వచ్చితివా?
కోటగోడల మధ్య ఖూని జరిగిన చోట/ గుండాల శక్తుల గోచరించినవా?
బజార్ల బాలకుని బల్లెంబుతో పొడచు/ బద్మాషునేమైన పసిగట్టినావా? ..
అంటూ పరిహసిస్తూ కాళోజీ రాసిన కవిత చాలా మందిని ఆలోచింపచేసింది. కానీ, ఆ తరువాత ఈ సంఘటనలో గాయపడిన వారినే ప్రభుత్వం నేరస్థులుగా పరిగణించి జరిమానాలు విధించింది.
యువకుల్లో పోరాట పటిమ..
ఈ సంఘటన ఇక్కడి యువకులలో భయాన్ని కలి గించ లేదు. పైగా యువకులు స్వచ్చంద సేవకులుగా ముందుకు రావడం ఓరుగల్లు ప్రజలకు పోరా ట పటిమకు నిదర్శనం. అలా ముందుకు వచ్చినవారిలో ఆరెల్లి బుచ్చయ్య, వెంకటనారాయణ యాదవ్ పలాసలో శిక్షణకు వెళ్లారు. దుగ్గిశెట్టి వెంకటయ్య, న ర్మెటి రామస్వామిలు ఆ తరువాత కాంగ్రెస్ వాలంటీర్ దళాలకు దళాధిపతులుగా ఆగ్రభాగాన నిలి చారు.ఇక్కడి నుంచి అటు ఆర్యసమాజీయులు, కాం గ్రెస్ వారు తమ పోరాట పంథాను మార్చుకున్నారు.
దళాలను ఏర్పాటు చేసుకుని రహస్య పోరా టం జరిపారు. కమ్యూనిస్టులు పాలకుర్తిని కేంద్రం గా చేసుకుని విస్నూరు రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఊరు కమ్మర్లు తుపాకులు, బర్మార్లు, బందూకులు తయారు చేశారు. ప్రజలు బందూకు పట్టారు. చివరికి నిజాం రాజు, అతని తా బేదార్లు లోంగిపోక తప్పలేదు. తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తి ప్రపంచ ప్రజలను నివ్వెరపర్చింది.
కోటలోనే ఎగిరిన జెండా
Published Thu, Aug 14 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement