సహజంగా ఏర్పడిన రాతి గోడ
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్‌పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి.
ముందే పసిగట్టేందుకు..
కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి.
200 మందికి పైగా సైనికులకు
ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు.
గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం
మూడంచెల భద్రత
రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు.
సుల్తానులను నిలువరించడానికే
కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి.
– అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు
సైనిక స్థావరాలు ఉండొచ్చు
కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి.
– ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment