రాయలసీమలో తొలిసారిగా శంఖు లిపి ఆనవాళ్లు లభ్యం
వెలుగుచూసిన 15 శాసనాలు
అందులో 4–15 శతాబ్దాల మధ్య లిపి పరిణామ క్రమం
బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు భాష వరకు శాసనాలు
బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం రేంజిలోని లంకమల అభయారణ్యంలో గురువారం వెలుగుచూసిన శిలా శాసనాలు 4–15 శతాబ్దాల మధ్య కాలపు అతి పురాతన మానవ ఆనవాళ్లుగా నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా రాయలసీమలో శంఖు లిపి ఆనవాళ్లు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. తొలిసారిగా ఈ అటవీ ప్రాంతంలో ఈ ఆనవాళ్లు లభించడం చాలా అరుదైన విషయమని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
అటవీ శాఖాధికారుల ద్వారా వెలుగులోకి వచ్చిన 15 శాసనాల్లో కొన్నింటిని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నంరెడ్డి తర్జుమా చేశారు. ఐదు శాసనాలను శుక్రవారం అధ్యయనం చేయగా, తొలిసారి రాయలసీమలో లభ్యమైన శంఖు లిపి శాసనాల అధ్యయనం అంత సులువుగా సాధ్యంకాదని తేల్చారు. ఒకేచోట వేర్వేరు శతాబ్దాలకు చెందిన లిపి ఆధారాలు ఉండటం విశేషం.
కొండూరు, రోళ్లబోడు, ముత్తుకూరు, మద్దూరు, సిద్ధవటం అభయారణ్య ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన శాసనాల్లో చిన్నచిన్న పదాలు మాత్రమే ఉన్నాయి. దీని ఆధారంగా పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులకు ఆ కాలంనాటి వ్యక్తులు, వాళ్ల ఉనికి చాటుకోవడం కోసం లంకమల అభయారణ్యంలో ఎవరు ఉండేవారో తెలిసేలా వారి పేర్లను ఇలా బండలపై చెక్కి ఉంటారని నిర్థారించారు.
బ్రాహ్మీ లిపిలో ‘చంద్రహాస’..
అభయారణ్యంలో బండరాయిపై లభ్యమైన శాసనాల్లో బ్రాహ్మీ లిపి ఉంది. 4, 5, 6 శతాబ్దాల మధ్య ఈ లిపి మనుగడ సాగించింది. ఈ లిపిలో చంద్రహాస అని పేరు చెక్కి ఉంది. అంటే.. ఇతను ఈ అటవీ ప్రాంతంలో నివసించి.. ఈ ప్రాంతం తనదిగా భవిష్యత్తు తరాలకు తెలిసేలా బ్రాహ్మీ లిపిలో రాతిపై శాసనం చెక్కినట్లు నిర్ధారించారు.
సంస్కృత భాష– నాగర లిపి
మరో బండరాయిపై.. సంస్కృత భాష కలిసిన నాగర లిపిలో శాసనం చెక్కారు. ఇందులో రెండు పేర్లు ప్రస్తావించారు. ఎనిమిదో శతాబ్దిలో ‘శ్రీ విశిష్ట కంకణ దారి’ అని చెక్కి ఉంది. ఇది కూడా పేరుకు సంబంధించిన శాసనంగా తేల్చారు. ఇతను అప్పట్లో ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తన గురించి తెలిపేలా ఈ శాసనం వేసుకున్నట్లు నిర్థారించారు. ఇందులోనే 15వ శతాబ్దికి చెందిన సంస్కృత భాషలో ‘స్థల కర చానప్ప’ పేరు కూడా చెక్కి ఉంది.
సంస్కృతంలో బ్రాహ్మీ లిపి..
ఇక నాలుగు–ఐదు శతాబ్దాలకు చెందిన సంస్కృతంలో ఉన్న బ్రాహ్మిలిపిని కూడా కనుగొన్నారు. ఈ భాష, లిపి కలయికతో ఉన్న శాసనంలో ‘యే ధర్మజ’ అన్న పేరు ఉంది. ఇతను ఈ ప్రాంత నివాసిగా శాసనం వేయించుకున్నట్లు తేల్చారు.
వారంతా శైవభక్తులు..
లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన శాసనాల ఆధారంగా అప్పటి మానవులు శైవభక్తులుగా గుర్తించారు. అప్పట్లో వీరు బుద్ధ–జైన మతాలను వ్యతిరేకించే వారని.. దీనిబట్టి నాటి శైవ ధర్మాన్ని వ్యాపింపజేశారని వీటి ఆధారంగా అధ్యయనం చేశారు. ఒక శాసనం పక్కన శివలింగ ఆకారం చెక్కి ఉండడంతో దీన్నిబట్టి నాటే మత పరిస్థితులను అంచనా వేశారు.
లిపి పరిణామ క్రమం..
లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చిన శాసనాలు ఓ కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. అదేంటంటే.. లిపి పరిణామ క్రమం. 4, 5, 6 శతాబ్దాలకు చెందిన బ్రాహ్మిలిపి, 4, 5, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన సంస్కృత భాష, 6, 7, 8 శతాబ్దాలకు చెందిన నాగర లిపి, 14వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపి.. ఈ మొత్తం లిపి, భాషతో కూడిన శాసనాలు లభించాయి. ఇది అరుదైన విషయం. దీంతో లంకమల అభయారణ్యం లిపి పరిణామ క్రమానికి సాక్ష్యంగా నిలిచింది.
శంఖు లిపి అతి కష్టం
ఏపీలో ఆంధ్ర ప్రాంతంలో శంఖు లిపి వెలుగుచూసింది. రాయలసీమలో మొదటిసారిగా లంకమల అభయారణ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆరో శతాబ్దానికి చెందిన శంఖు లిపి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. దీంతో ఆ కాలంలో మానవ మనుగడపై సరైన ఆధారాల్లేవు. ఇప్పుడు లంకమలలో వెలుగు చూడటంవల్ల దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో.. లంకమల అభయారణ్యం మానవ మనుగడపై పరిశోధన కేంద్రంగా మారబోతోంది. వెలుగు చూసిన శాసనాల్లో 4 నుంచి 15వ శతాబ్ది మధ్య మానవ పరిణామక్రమం.. లిపి పరిణామ క్రమంపై లోతైన అధ్యయనానికి భారతీయ పురావస్తు శాఖ సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment