archaeological department
-
చరిత్రకు సాక్ష్యం.. క్రీస్తుపూర్వపు సమాధులు
అద్దంకి: పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలోనూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద ప్రాంతంలో నివసించిన వారి మృతదేహాలకు సంబంధించిన పెద్దపెద్ద సమాధుల (రాక్షస గూళ్లు)ను స్థానిక శాసన, పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి గుర్తించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు. పురాతన సమాధులున్న ప్రాంతాలివే.. అద్దంకి మండలంలోని దేవనువకొండ, పేరాయిపాలెం, అద్దంకి కొండ, ధర్మవరం (జంగమహేశ్వర అగ్రహారం), మణికేశ్వరం, రామకూరు, మార్టూరు మండలంలోని ద్రోణాదుల, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి గ్రామాల్లోని కొండ దిగువ భాగాల్లో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద కాలంలో నివసించిన మానవుల సమాధులు ఐదారేళ్లుగా బయటపడుతూ వస్తున్నాయి. నాటి మనుషుల ఎత్తు ఏడడుగుల పైనే.. క్రీస్తుం పూర్వం ఇక్కడ నివసించిన మనుషుల ఎత్తు ఏడడుగుల ఎత్తుకు పైమాటే అనేది ఇక్కడ లభించిన సమాధుల పొడవును బట్టి పరి«శోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి ఏడడుగుల పొడవు, నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉన్నాయి. సమాధికి మూడువైపులా పలకరాళ్లు, పైన ఒక పలకరాయి మూతపెట్టి.. సమాధి తలభాగంలో అప్పట్లో తయారుచేసిన కుండలో మరో చిన్న కుండ పెట్టి అందులో ఆనాడు వారు పండించిన కొర్రలు, జొన్నలు, రాగులను ఉంచారు. దీనిబట్టి ఆ రోజుల్లో ఇవే వారి ఆహారమని అర్థమవుతోంది. పోడు వ్యవసాయం.. ఇక అప్పట్లో అద్దంకి గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం మొత్తం అడవులతో నిండి ఉండేదని తెలుస్తోంది. ఇక్కడ నివసించిన సంచార జాతులు అడవుల్లోని చెట్లను నరుక్కుని అక్కడే ఉండేవారు. ఆధిపత్య పోరులో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగానే సమాధులను తయారుచేసి ఉంచి, మరణించిన వారి మృతదేహాలను వాటిల్లో ఉంచేవారని తెలుస్తోంది. ఈ సమా«ధులపై మట్టివేసి పూడ్చిన తరువాత పైభాగంలో గుండ్రని ఆకారంలో రాళ్లను పాతేవారు. ఇదిలా ఉంటే.. క్రీస్తు పూర్వంలోనే నాగరికత ఉందని చెప్పడానికి ఈ సమాధులే నిదర్శనం. సమాధుల తలభాగంలో ఉంచిన మట్టి కుండలు (మృణ్మయ పాత్రలు) ఇప్పటికీ చెక్కుచెదరక (తవ్వకాల్లో పగిలిపోయాయి) ఉన్నాయి. ఈ కుండలు కొన్ని పూర్తిగా ఎర్రగానూ, మరికొన్ని సగభాగం వరకు ఎర్రగా ఉండి, మిగిలిన సగం నల్లగా ఉన్నాయి. పైభాగంలో నగిషీలు చెక్కిఉంచారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆనవాళ్లు.. పురాతన సమాధులు బయటపడిన ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే మరిన్ని ఆనవాళ్లు లభించడమే కాక, భావితరాలకు నాటి విశేషాలు అందించిన వారమవుతాం. అద్దంకి చరిత్ర ఇప్పటి తరానికే కాగా దేశం నలుమూలలా చాటి చెప్పాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం నడుం బిగించాలి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శాసన పరిశోధకుడు, రచయిత -
MP: ‘భోజ్‌శాల’ కాంప్లెక్సులో ఆర్కియాలజీ సర్వే
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా డ్రిల్ చేపట్టారు. ‘2022 మేలో మేం ఆర్కియాలజీ సర్వే కోసం కోర్టులో పిటిషన్ వేశాం. కార్బన్ డేటింగ్ సహా పూర్తిస్థాయి టెక్నాలజీ వాడి సర్వే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే మొదలైంది. ఆరు వారాల తర్వాత సర్వే నివేదిక వస్తుంది’ అని భోజ్‌శాల సర్వే కోసం పిటిషన్ వేసిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ ఆశిశ్ గోయెల్ చెప్పారు. కాగా, మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు -
అడవిలో అనంత చరిత్ర.. ప్రకాశం జిల్లాలో బయటపడ్డ ఆధారాలు!
కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు.. శాయపునాయుడి వంశస్తుల పాలనలో ఎందరో చక్రవర్తులు, మహారాజులు నడయాడిన నేల పశ్చిమ ప్రకాశం. గతమెంతో ఘనమైన చరిత్రను నింపుకుంది ఈ ప్రాంతం. దట్టమైన అటవీప్రాంతం.. కొండలు.. కోనలు.. లోయలు.. ఇరుకైన రహదార్లు ఉన్న నల్లమల అటవీ ప్రాంతం ఆనాడు రక్షణ కవచంగా ఉండేది. చరిత్రకారులపరిశోధనల్లో లభ్యమవుతున్న పలు శాసనాలు వీటిని ధ్రువీకరిస్తున్నాయి. 5 వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగానికి చెందిన పురాతన మానవుల సమాధులు సైతం ఇక్కడ బయటపడ్డాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతంలోని ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందా మరి.. – ఒంగోలు డెస్క్ యర్రగొండపాలెం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తురిమెళ్ల శ్రీనివాస్ చేసిన పలు పరిశోధనల్లో శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే శాసనాలు లభ్యమయ్యాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ధ్రువీకరించారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు పురాతన, చారిత్రక నేపథ్యముంది. ఈ ప్రాంతాన్ని కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు, అలాగే శాయపునాయుడి వంశస్తులు పాలించారని తెలియజేసే ఎన్నో ఆధారాలు పదిలంగా ఉన్నాయి. 11వ శతాబ్దం ప్రారంభానికి చెందిన కొత్తిపి చాళుక్యుల సామ్రాజ్యానికి చెందిన శాసనం పుల్లలచెరువు మండలం శతకోడులో లభ్యమైంది. కొచ్చెర్లకోట రామలింగేశ్వరస్వామి ఆలయంలో లభ్యమైన కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం విజయనగర సామ్రాజ్యంలో రెండో బుక్కరాయల కుమారుడు మొదటి దేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చివెళ్లారు. ఇందుకు సంబంధించి యర్రగొండపాలెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన పొన్నలబైలు వద్ద శాసనం లభ్యమైంది. 12, 13వ శతాబ్దాల్లో పాలించిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుని శాసనం దొనకొండ మండలం కొచ్చెర్లకోట శివాలయం సమీపంలో బయటపడింది. ఈ ప్రాంతానికి రుద్రమదేవి, అంబదేవుడు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు వచ్చి వెళ్లినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది. దూపాడు పరగణా, కొచ్చెర్లపాడు సీమ పేరుతో కాకతీయులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక విజయనగర రాజులు పాలన మొదలైంది. శాయపునాయుడి వంశస్తులు(కమ్మరాజులు) శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో దూపాడు పరగణా సంస్థానాధీశులు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో దద్దనాల వద్ద కోట నిర్మించుకున్నారు. పెద్ద పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1512లో కృష్ణదేవరాయలు శాయపునాయుడి వంశస్తులను పాలించమని అవకాశమిచ్చారు. ఆ తర్వాత తురుష్కుల దాడిలో మొత్తం పట్టణంతోపాటు, కోట ధ్వంసమైంది. తర్వాత వారు యర్రగొండపాలెం వచ్చారు. ఇందుకు సంబంధించి బోయలపల్లి వద్ద శాసనం లభ్యమైంది. దద్దణాల కోటలో పెద్ద కోనేరు ఉంది. ఇక్కడ రోళ్లు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన గజపతి రాజు తెలుగు రాయుడు పెద్ద చెరువు కట్టించారు. శ్రీశైలం వయా త్రిపురాంతకం పూర్వం ఎందరో మహరాజులు, వర్తకులు త్రిపురాంతకం మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. త్రిపురాంతకం నుంచి అమానిగుడిపాడు, దద్దనాల, పాలంక మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. వీరు తమ సైన్యం, గుర్రాలు, ఏనుగులు సేదతీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. సైనికుల కోసం సానికవరం, గుర్రాలు కట్టేసేందుకు గుర్రపుశాల, ఏనుగుల కోసం ఏనుగులదిన్నెపాడు ప్రాంతాలు ఉండేవి. దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల్లో ఇప్పటికీ అదే పేర్లతో గ్రామాలు ఉన్నాయి. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు కొత్త రాతియుగం ఆనవాళ్లు పుల్లలచెరువు మండలంలోని చక్రాలబోడు వద్ద కొత్త రాతియుగానికి చెందిన ఐదు వేల ఏళ్లనాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇక్కడ పురాతన మానవుల సమాధులను ఇటీవల గుర్తించారు. కొండ రాళ్లపై ఆనాటి మానవులు చెక్కిన ఎద్దులు, మేకలు, మనుషుల ఆకృతులు వెలుగుచూశాయి. అలాగే త్రిపురాంతకం మండలం బొంకురవారిపాలెం వద్ద ఒకటో శతాబ్దం నాటి బౌద్ద శిల్పం లభ్యమైంది. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు శత్రుజాడ కనిపెట్టేలా.. ఇరుకుదారులు.. కొండాకోనలు ఉండటంతో శత్రువుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు చక్రవర్తులు ఆనాడు ఈ ప్రాంతాన్ని రక్షణ కవచంగా వినియోగించుకున్నారు. ఇక్కడ అనేక బురుజులు సైతం నిర్మించుకున్నారు. మొదటి దేవరాయలు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేవారని తెలుస్తోంది. ఈ దట్టమైన కీకారణ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రాంతంగా నిర్ధారించుకున్నారు కూడా. నల్లమల శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దేవరాయలు కాలనికి చెందిన ఒక శాసనం లభ్యమవడంతో ఈ విషయాలు అవగతమవుతున్నాయి. నలురుగురు శిల్పులు చెక్కిన త్రిపురాంతకేశ్వరాలయం 13వ శతాబ్దానికి చెందిన శాసనం త్రిపురాంతకం కొండపైన బయటపడింది. దీని ఆధారంగా ఇక్కడ త్రిపురాంతకేశ్వరుని ఆలయ నిర్మాణానికి ఆనాడు ప్రముఖ శిల్పులుగా పేరొందిన హరిజేతి, రామజేతి, ధగజేతి, సింఘన కృషి చేశారు. ఇందుకు సంబంధించి తెలుగు, సంస్కృతంలో వీరి పేర్లతో ఉన్న చిత్రాలు లభ్యమయ్యాయి. ఆసక్తితోనే చారిత్రక పరిశోధన కురిచేడు మండలంలో ఒక దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్న సమయంలో సత్రం నిర్మిస్తుండగా కొన్ని పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి చారిత్రక పరిశోధనపై ఆసక్తి పెరిగింది. గుంటూరుకు చెందిన చరిత్రకారుడు మనిమేల శివశంకర్ ప్రోత్సాహంతో చరిత్రపై పరిశోధన కొనసాగించా. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఎపిగ్రాఫికా–తెలంగాణికా అనే పుస్తకంలో నేను కనుగొన్న కాకతీయ కాలం నాటి శాసనాన్ని ముద్రించారు. అలాగే మొదటి దేవరాయలు కాలానికి చెందిన శాసనానికి కరెంట్ అఫైర్స్‌లో స్థానం దక్కింది. తాను గుర్తించిన శాసనాలన్నీ భారత ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపగా ధ్రువీకరించి పరిశోధన దిశగా ప్రోత్సహించారు. – తురిమెళ్ల శ్రీనివాస్, చరిత్రకారుడు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్, యర్రగొండపాలెం -
కళ్లకు కట్టినట్టు సాక్ష్యాలు.. తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తోన్న మన చరిత్ర
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లు, పురాతన మూలాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆయా గ్రామాలకు ఉన్న పేర్లు ఎలా వచ్చాయి.. గతంలో ఎలాంటి చరిత్ర ఉండేదన్న ఆసక్తికరమైన అంశాలపై అధ్యయనం కొనసాగుతోంది. జిల్లాలో ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెబ్బేటి మల్లికార్జున్‌ను నియమించగా.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల నుంచి ఆరుగురు అధ్యాపకులు సభ్యులుగా ఉన్నారు. వెలుగులోకి కొత్త చరిత్ర.. జిల్లాలో నెల రోజులుగా మన ఊరు– మన చరిత్ర కార్యక్రమ అధ్యయన బృందం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. వాటి చరిత్రను అవలోకనం చేసుకునేందుకు గ్రామాల్లో వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి ఫొటోలతో సహా పుస్తకాల్లో నిక్షిప్తం చేసే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట గ్రామాన్ని సందర్శించినప్పుడు గ్రామం చుట్టుపక్కల గొలుసుకట్టు చెరువులతోపాటు కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయాలను గుర్తించారు. ఆలయాల వద్ద ఆనాటి కాలంలో తవ్విన పురాతన బావులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడి పురాతన ఆలయంలోని శివలింగం తెలుపు రంగులో ఉండటం విశేషం. అంతకు ముందు ఈ గ్రామం పేరు తుర్కలపల్లిగా ఉండగా ఈ శివలింగం కారణంగానే మహదేవునిపేటగా స్థిరపడినట్టు బృందం సభ్యులు గుర్తించారు. ఈ గ్రామంలో హిందు, ముస్లిం గురువులు వేర్వేరుగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారని తెలుసుకున్నారు. ఈ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని బృందం సభ్యులు అభివర్ణిస్తున్నారు. ● గంగారం సమీపంలోని గుట్టల నుంచి ఎత్తైన రాళ్లను పగులగొట్టి నందివడ్డెమాన్ ఆలయాలను నిర్మించినట్టు తెలుసుకున్నారు. వడ్డెమాన్‌లోని త్రికూట ఆలయాల వద్దనున్న బుద్ధుడి ప్రతిమను బట్టి అక్కడ బౌద్ధమతం సైతం విలసిల్లిందని అధ్యాపకులు భావిస్తున్నారు. గ్రామాల్లో మన ఊరు– మన చరిత్ర కార్యక్రమం ‘ఇక్కడ కనిపిస్తున్నది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని అటవీప్రాంతం. చరిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన నందివడ్డెమాన్‌లోని ఆలయాలు, పురాతన కోట నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లనే వినియోగించారు. ఈ ప్రాంతంలోని ఎత్తైన రాళ్లను పగులగొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ నాటి చరిత్రకు ఆధారంగా నిలుస్తున్నాయి’. ‘ఈ ఫొటోలో రాజసంగా కనిపిస్తున్న భవనం జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని పురాతన కోట. సుమారు 1625 సంవత్సరం నుంచి స్వాతంత్య్రం వచ్చే వరకు ఈ కోట కేంద్రంగా రెడ్లు పాలన సాగించేవారు. వట్టెం కేంద్రంగా కొంతకాలం పాటు రెడ్డి వంశస్తుల పాలన సాగిందని మన ఊరు– మన చరిత్ర పరిశోధన బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. మరింత లోతుగా పరిశోధన చేస్తే చాలా వరకు చరిత్ర బయటపడుతుందని వారు చెబుతున్నారు.’ ఆలయాలపై ప్రధాన దృష్టి.. గ్రామాల చరిత్రతోపాటు ఆయా గ్రామాల్లోని ఆలయాలపై సమగ్రంగా దృష్టిసారించి అధ్యయనాన్ని సాగిస్తున్నారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లిలో ఉన్న నారసింహుని ఆలయానికి సంబంధించిన 1171 నాటి శాసనాన్ని గుర్తించారు. 12వ శతాబ్దంలోనే 500 ఎకరాల భూమిని ఆలయానికి దానం ఇచ్చినట్టుగా శాసనంలో పేర్కొని ఉంది. ● ఒక గ్రామం గురించి అధ్యయనం మొదలుపెట్టినప్పుడు గ్రామానికి ఆ పేరెలా వచ్చింది.. గ్రామానికి ఉన్న ప్రధాన చారిత్రక మూలాలేంటి అన్నదానిపై పరిశోధన మొదలవుతుంది. క్రమంగా గ్రామ భౌగోళిక నైసర్గిక స్వరూపం, సమీపంలో ఉన్న వాగులు, సెలయేర్లు, చెరువులు, కొండల వంటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని పొందుపరుస్తారు. ● గ్రామంలోని పురాతన ఆలయాలు, వాటి చరిత్ర, మతసామరస్యం వంటి అంశాలను తెలుసుకునేందుకు గ్రామంలోని వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామ పెద్దలు, పురోహితులు, ఔత్సాహికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆసక్తికర విషయాలు.. మన ఊరు– మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గ్రామాల వారీగా చరిత్రను తెలుసుకునేందుకు అధ్యయనాన్ని మొదలుపెట్టాం. క్షేత్రస్థాయి సందర్శనలో పలు గ్రామాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మనకు తెలియని ఎంతో చరిత్ర దాగి ఉంది. వివిధ వర్గాల సహకారంతో విడతల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత తరం వారిలో తమ ఊరి పట్ల మమకారం మరింత పెరుగుతుంది. – మల్లికార్జున్,ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ -
AP: పురావస్తు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలకు (మ్యూజియాలకు) ప్రభుత్వం కొత్తకళ తీసుకురానుంది. శిథిలావస్థలోని మ్యూజియం భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మ్యూజియాల్లో అంతర్జాతీయస్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఆంటిక్విటీస్ (పురాతన వస్తువులు) డిస్ప్లే చేసేలా ప్రత్యేకదృష్టి సారిం చింది. తాజాగా విశాఖపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో స్టేట్ మ్యూజియాన్ని నిరి్మంచనుంది. మరోవైపు కడపలోని భగవాన్ మహావీర్ మ్యూజియం, గుంటూరులోని బుద్ధశ్రీ మ్యూజియం, కర్నూలులోని జిల్లా మ్యూజియాల్లో కొత్త భవనాలు, ఇతర అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున డీపీఆర్‌లను రూపొందించింది. శాసనాల పరిరక్షణకు.. రాష్ట్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో లక్షలాది శాసనాలు, ఎస్టేంపేజీలు (శాసనాల కాపీలు) ఉన్నాయి. వీటిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు, రాష్ట్ర సాంస్కృతిక, వారసత్వ సంపదను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ‘శాసన మ్యూజియం’ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. తద్వారా ఇప్పటివరకు లభ్యమైన శాసనాల వివరాలను ఒకేవేదికపై ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. పెండింగ్‌లో రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు రాష్ట్రంలోని పురావస్తు ప్రదర్శనశాలలతో పాటు వారసత్వ నగరాల అభివృద్ధి, ఆంటిక్విటీస్ డిజిటలైజే‹Ùకు సంబంధించి రూ.436.50 కోట్ల డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.400 కోట్లతో రాజమహేంద్రవరాన్ని వారసత్వ నగరంగా తీర్చిదిద్దనున్నారు. వైఎస్సార్ జిల్లాలోని మైలవరం, శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ, జిల్లా కేంద్రం కాడినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్ మ్యూజియాల డీపీఆర్‌లకు అనుమతులు రావాల్సి ఉంది. మ్యూజియాల్లో ప్రవేశపెట్టే అంతర్జాతీయస్థాయి సాంకేతికత ఇలా.. - ఇంటరాక్టివ్ రెస్పాన్సివ్ డిజిటల్ వాల్ - వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ - ఇంటరాక్టివ్ డిస్ప్లే కియోస్క్ - ఆడియో–వీడియో టెక్నాలజీ - ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ బుక్ వారసత్వ విలువలను ప్రోత్సహించాలి ఏపీలోని మ్యూజియాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాం. మన అద్భుతమైన సంస్కృతి, వారసత్వ విలువలను ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని డీపీఆర్‌లు కేంద్రానికి పంపగా.. కొత్తగా మరో నాలుగు మ్యూజియాలకు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఇకపై సామాజిక మాధ్యమాల ద్వారా మన మ్యూజియాల్లోని విశిష్టతను ప్రచారం చేయనున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తుశాఖ -
వైఎస్సార్ జిల్లాలో బయటపడ్డ భూ గృహం
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగర సమీపంలో భూ గృహం వెలుగు చూసింది. ఓ యూట్యూబర్ ముందుగా దానిని గమనించి కథనాలు ప్రసారం చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. నగరానికి దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతం, పైగా శ్మశానం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లరు. అయితే యూట్యూబర్ వెలుగులోకి తేవడంతో దానిపై ఎవరికి వారు కథనాలు, ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కారాగారమని, ఖైదీలను అక్కడ చిత్రహింసలు పెట్టేవారని, సమీపంలో బుగ్గవంక ప్రాజెక్టు ఉండటంతో ఆ గృహం నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన సంపు అయి ఉండొచ్చని ప్రచారాలు సాగాయి. నవాబులు లేదా బ్రిటీషు కాలం నాటి రాచభవనాల వరండాలను పోలి ఉందని మరికొందరంటున్నారు. సైనికులు తలదాచుకునే బంకర్ అయి ఉండొచ్చని చరిత్రకారులు, పురావస్తుశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సైనిక పటాలాలకు అనుకూలంగా రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మించుకుంటారని కూడా వారు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో వెళ్లి పరిశీలిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. -
భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు
సాక్షి, చార్మినార్( హైదరాబాద్): పాతబస్తీలోని హెరిటేజ్ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. ► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. ►అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. ► అలాగే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం చార్మినార్‌లోని సర్దార్ మహాల్ భవనంలో నివాసముండేది. ► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ► శాలిబండలోని క్లాక్ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ►శాలిబండ క్లాక్ టవర్‌ను అనుకొని ప్రైవేట్ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్.... యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్‌లోగతేడాది జూన్ 27న కిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు. నిజాం ప్రభువుల నివాస గృహం.. నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. ► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ► ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. ► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ►ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. ►1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. ► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్య మిచ్చేవారు. శిథిలావస్థకు చేరిన సర్దార్ మహల్... జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ (సర్దార్ మహల్) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. -
400 ఏళ్ల చరిత్ర.. ముట్టుకుంటే ఊడిపోతోంది
సాక్షి, హైదరాబాద్: బాగా పాతబడిపోవటం, వాహన కాలుష్య ప్రభావం.. వెరసి చార్మినార్ కట్టడం పైపూత అత్యంత బలహీనంగా మారిపోతోంది. ఇప్పుడు కట్టడంలోని చాలా ప్రాంతాల్లో ముట్టుకుంటే చాలు పొరలుపొరలుగా మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య బాగా పెరిగిపోయింది. దాదాపు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర కట్టడంపైనున్న డంగు సున్నం పూత అత్యంత బలహీనంగా మారినట్టు కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం గుర్తించింది. దీంతో అత్యవసర చర్యలు ప్రారంభించింది. కట్టడంలో ఏయే ప్రాంతాల్లో డంగుసున్నం పొరలు బలహీనంగా మారాయో గుర్తించి అంతమేర దాన్ని తొలగించి సంప్రదాయ డంగుసున్నం మిశ్రమాన్ని మెత్తే పని ప్రారంభించారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పై పొర తొలగించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనున్నట్టు తెలిసింది. సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ భానుప్రకాశ్ వర్మ ఆధ్వర్యంలో పనులు నిర్వహించనున్నారు. ఆరు నెలలపాటు పనులు.. చార్మినార్ పరిరక్షణ చర్యలు తరచూ జరిగేవే. అయితే ఒకేసారి కావాల్సినన్ని నిధులు ఇవ్వకపోవడంతో మధ్యమధ్య విరామం ఇస్తూ పనులు చేస్తున్నారు. ఇది కూడా సమస్యలకు కారణమవుతోంది. రెండేళ్లక్రితం మరమ్మతు పనులు నిర్వహించారు. అప్పట్లో రెండు దఫాల్లో రూ.35 లక్షలు రావటంతో వాటితో పనులు చేసి ఆపేశారు. మళ్లీ ఇప్పుడు కేంద్రం కొన్ని నిధులు ఇవ్వటంతో వాటితో అత్యవసరంగా పనులు ప్రారంభించారు. విరామం లేకుండా పనులు జరిగితే దాదాపు ఏడాదిన్నర కాలంలో మొత్తం పనులు పూర్తవుతాయి. రెండేళ్ల క్రితం మొదటి అంతస్తు నుంచి మినార్ల వరకు పరిరక్షణ చర్యలు పూర్తి చేశారు. ఇప్పుడు దిగువ భాగంలో పనులు ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల క్రితం పనులు చేసిన చోట కూడా మట్టి రాలిపోతోంది. అప్పట్లో లేపనంలాగా అద్దిన పైపూత పటిష్టంగానే ఉన్నా... దానిలోపలి సున్నం మిశ్రమం బలహీనంగా మారటంతో పై పూత ఊడిపోతోంది. ఎందుకీ సమస్య.. కులీకుతుబ్‌షా 1591లో దీన్ని నిర్మాణం చేపట్టారు. 430 ఏళ్లు గడుస్తున్నందున స్వతహాగా కట్టడం మట్టి భాగం బలహీనపడింది. అయినప్పటికీ అది లోపలి రాతి నిర్మాణాలు పట్టుకుని నిలిచిఉంటుంది. కానీ.. దశాబ్దాలుగా కట్టడానికి అతి చేరువగా వాహనాలు తిరుగుతుండటంతో కాలుష్యం కాటేస్తోంది. వానాకాలంలో తడితో కలిసి రసాయన చర్య ఏర్పడి క్రమంగా గోడల డంగు సున్నం పొరలు బలహీనపడిపోయాయి. దీంతో పటుత్వం కోల్పోయి మట్టి రాలిపోతోంది. ఇటీవలి కాలంలో సమస్య బాగా పెరిగింది. ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో పై పూతను తొలగించి కొత్త మిశ్రమాన్ని పూసి, ఆయా ప్రాంతాల్లో ఉండాల్సిన నగిషీలను తిరిగి ఏర్పాటు చేయనున్నారు. సోమవారం నుంచి ఆ పనులు మొదలు కానున్నాయి. తొలుత లాడ్‌బజార్ వైపు భాగానికి పనులు చేపట్టనున్నట్టు సమాచారం. -
ఈ శవపేటికలు చరిత్రను తిరగరాస్తాయి..!
కైరో: ఈజిప్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని గుర్తించింది. ఈజిప్టు పాత సామ్రాజ్యం(ఓల్డ్ కింగ్డమ్) ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణలని గుర్తించింది. 'చరిత్రను తిరిగరాస్తుంది' న్యూ కింగ్డమ్ (క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం)నాటి 50 కి పైగా చెక్క శవపెటికలు భూమికి 40 అడుగుల లోతులో ఈ శ్మశానవాటికలో బయపటడినట్లు హవాస్ న్యూస్ ఏజెన్సీకి ఏఎఫ్పీకి వెల్లడించారు. "ఈ ఆవిష్కరణ సక్కారా చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుంది" అన్నారు. (చదవండి: ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!) ఇంకా ఏమి కనుగొన్నారు తన బృందం శవపేటికలతో పాటు మొత్తం 22 బాణాలను కనుగొన్నట్లు హవాస్ వెల్లడించారు. వాటిలో ఒకదాని మీద "సైనికుడు, పక్కనే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉన్న అతని యుద్ధ గొడ్డలి ఉంది" అన్నారు. వీటితో పాటు ఒక రాతి శవపేటికను కూడా గుర్తించామని హవాస్ వెల్లడించారు. అలాగే చనిపోయినవారి పుస్తకంలోని(బుక్ ఆఫ్ ది డెడ్) 17 వ అధ్యాయాన్ని కలిగి ఉన్న ఐదు మీటర్ల పొడవున్న పురాతన పత్రం, ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇదే ప్రధాన ఆవిష్కరణ ఎందుకు ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ శనివారం సక్కారాలో గుర్తించిన "ప్రధాన ఆవిష్కరణలు" గురించి ప్రకటించింది. ‘‘ఇది చాలా అరుదైన, క్రొత్త ఆవిష్కరణ. ఎందుకంటే మేము కనుగొన్న చాలా కళాఖండాలు న్యూ కింగ్డమ్(క్రొత్త రాజ్యం)కి చెందినవి. అయితే ప్రస్తుతం సక్కారాలో గుర్తించినవి మాత్రం సాధారణంగా క్రీ.పూ 500 కాలానికి చెందినవి’’ అని తెలిపింది. ఇక్కడ ఇటీవలి సంవత్సరాలలో అనేక తవ్వకాలు జరిగాయి. (చదవండి: 2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!) బయటపడిన పురాతన ఆలయం ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో హవస్ ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది "కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం" అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురాతన ఈజిప్టులో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణాల్లో ఒకటి అయిన జొజర్ స్టెప్ పిరమిడ్ సక్కరా ప్రాంతంలోనే ఉంది. -
చార్మినార్ మరమ్మతులకు ఆలయ స్థపతులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) అధీనంలో ఉన్న చార్మినార్ కట్టడానికి దేవాలయాల స్థపతులు మరమ్మతులు చేయబోతున్నారు. గత నెల రెండో తేదీ అర్ధరాత్రి వేళ ఈ చారిత్రక కట్టడానికి మక్కా మసీదు వైపు ఉన్న మినార్ డిజైన్ లోంచి ఓ భాగం ఊడి కింద పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు మీటర్ల మేర ఈ భారీ పెచ్చు ఉన్నట్టుండి ఊడి కింద పడింది. అంతకుముందు కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతంలోని సన్నటి పగుళ్ల నుంచి నీటిని భారీగా పీల్చుకోవటంతో అక్కడి డంగు సున్నంతో రూపొందించిన నగిషీల భాగం బాగా బరువెక్కి ఊడిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఆ పెచ్చు ఊడిపోయిన చోట మళ్లీ సంప్రదాయరీతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి నగిషీలు అద్దాల్సి ఉంది. కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం నిపుణులే దాన్ని పూర్తి చేస్తారని అనుకున్నా, ఆ విభాగం తాజాగా ఆ పనిని దేవాలయాల స్థపతులకు అప్పగించింది. తమిళనాడుకు చెందిన ఆ స్థపతుల బృందం ఆది, సోమవారాల్లో నగరానికి రానుంది. ఆ వెంటనే పనులు మొదలుపెడతారు. గతంలో ఈ స్థపతులకు ఇలాంటి పనులు చేసిన అనుభవం ఉండటంతో వారికే అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఏడెనిమిదేళ్ల క్రితం చార్మినార్‌కు చిన్నచిన్న డిజైన్లు ఊడిపోవటంతో వీరితోనే చేయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో పురాతన దేవాలయాల పునరుద్ధరణలో కూడా వీరు డంగు సున్నంతో పనులు చేశారు. చార్మినార్‌కు కూడా ఇప్పుడు సూక్ష నగిషీలు అద్దాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారైతేనే సరిగ్గా చేయగలరని నిర్ణయించి పనులు అప్పగించారు. మరో పది రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉన్నందున ఈలోపే పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డంగు సున్నం, నల్లబెల్లం, కరక్కాయ పొడి, రాతి పొడి, గుడ్డు సొనలతో కూడిన మిశ్రమాన్ని ఈ పనుల్లో వినియోగించనున్నారు. కట్టడంలోని చాలా భాగాల్లో చిన్నచిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ పెచ్చు ఊడిన ప్రాంతంలో కూడా మరికొన్ని పగుళ్లున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని కూడా ఇప్పుడు పూడ్చేయనున్నారు. లేకుంటే మరిన్ని పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉంది. త్వరలో ఢిల్లీ నుంచి అధికారులు చార్మినార్ పెచ్చు ఊడి పడడానికి కారణమైన పగుళ్లు ఎందుకు ఏర్పడ్డాయనే విషయంలో మరింత లోతుగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఏఎస్ఐ ఉన్నతాధికారులు త్వరలో నిపుణులతో కలిసి రానున్నారు. పెచ్చు ఊడిపడిన వెంటనే కొందరు నిపుణులు వచ్చి పరిశీలించి వెళ్లారు. వారి నుంచి ఇంకా నివేదిక రాలేదు. కట్టడం చుట్టూ ఏర్పడ్డ వైబ్రేషన్ల వల్లే పగుళ్లు ఏర్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. చార్మినార్ చుట్టూ దశాబ్దాలుగా వాహనాలు తిరుగుతుండటం, ఇటీవల పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కట్టడానికి అతి చేరువగా భారీ యంత్రాలతో పనులు చేపట్టడం వల్ల ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతు పనులు చేపట్టాలని తొలుత భావించారు. కానీ వర్షాకాలం ముంచుకు రావడంతో వెంటనే మరమ్మతులు జరపకుంటే మరిన్ని పెచ్చులూడే ప్రమాదం ఉండటంతో వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ స్కానర్ సాయంతో కట్టడంలో ఎక్కడెక్కడ పగుళ్లున్నాయో గుర్తించనున్నారు. -
చూస్తే ‘డంగు’ అయిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా వెలుగు చూడని బుద్ధుడిదిగా భావిస్తున్న భారీ గార ప్రతిమ (డంగుసున్నంతో రూపొందిన) వెలుగు చూసింది. ఇక్ష్వాకుల కాలంలో క్రీస్తుశకం మూడో శతాబ్దంలో దీన్ని రూపొందించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్తూప కేంద్రమైన ఫణిగిరిలో శుక్రవారం ఈ అద్భుతం బయల్పడింది. ఫణిగిరి బౌద్ధ స్తూపం ప్రాంగణంలో ఫిబ్రవరి నుంచి పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. బౌద్ధ స్తూపం, చైత్యాలు, బుద్ధుడి ధాతువు, బుద్ధుడి జీవిత చరిత్రను కళ్లముందు నిలిపే అద్భుత చెక్కడాలను గతంలో వెలికి తీశారు. ఆ తర్వాత తవ్వకాలు నిలిపివేశారు. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తుశాఖ) ఏఎస్ఐ నుంచి అనుమతి తీసుకుని ఫిబ్రవరిలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం దాదాపు ఆరడగుల పొడవున్న బుద్ధుడి ఆకారం వెలుగు చూసింది. ఆ ప్రతిమ వెనుక భాగం మాత్రమే కన్పిస్తోంది. దాన్ని చూస్తే నిలబడి ఉన్న బుద్ధుడి ఆకారంగానే కనిపిస్తోంది. అయితే బుద్ధుడి జీవిత చరిత్రలో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. బుద్ధుడి చరిత్రలో ఉండే రాజులకు సంబంధించినదై కూడా ఉంటుందనే మరో అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై అలంకరణ గుర్తులున్నాయి. సాధారణంగా బుద్ధుడి శరీరంపై ఎక్కడా అలంకరణ ఉండదు. కంకణాలు, ముంజేతి అలంకరణలు కనిపిస్తున్నందున అది బుద్ధుడిగా మారకముందు రూపమై ఉంటుందని, లేదంటే ఇతర రాజులకు సంబంధించినదై ఉంటుం దని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న హెరిటేజ్ తెలంగాణ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పేర్కొంటున్నారు. ఆ విగ్రహం ముందు భాగం చూస్తేగాని కచ్చితమైన రూపాన్ని ప్రకటించలేమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా.. పురాతన కాలం నాటి కట్టడాలున్న ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో డంగు సున్నంతో రూపొందించిన శిల్పాలు వెలుగు చూడటం సహజం. కానీ ఇవి రెండడుగుల కంటే ఎక్కువ పొడవున్న దాఖలాలు ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కానీ తొలిసారి మానవుడి సహజ ఎత్తు పరిమాణంలో ఉండే సున్నం (గార) ప్రతిమ వెలుగుచూసిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఆరడగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు కనిపించలేదని నాగరాజు, విశ్రాంత అధికారులు రంగాచార్యులు, తవ్వకంలో పాలుపంచుకున్న భానుమూర్తిలు వెల్లడించారు. ఇది చాలా అరుదైన ప్రతిమగా వారు అభివర్ణించారు. లోన ఇటుకలు.. ఈ విగ్రహాన్ని తొలుత ఇటుకలతో నిర్మించి దానిపై మందంగా డంగు సున్నం మిశ్రమ లేపనంతో ఆకృతి తెచ్చారు. ఆ విగ్రహానికి పలు ప్రాంతాల్లో రంధ్రాలున్నాయి. దానికి చేరువలో భారీ గోడ ఉన్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. అంటే ఆ విగ్రహాన్ని ప్రత్యేక పద్ధతిలో గోడకు అమర్చి ఉంటారని, అది గోడతోపాటు అలాగే కూలిపోయి భూగర్భంలో ఉండిపోయి ఉంటుందని భావిస్తున్నారు. వెలికి తీసే తరుణంలో అది ముక్కలు కానుంది. దాన్ని తిరిగి పూర్వపు పద్ధతిలో డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించనున్నారు. ఇందుకోసం విగ్రహాన్ని వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు. విగ్రహం పగుళ్ల ఆధారంగా నంబర్లు వేశారు. వెలికి తీశాక అ ముక్కలను హైదరాబాద్ తరలించి ఫొటో డాక్యుమెంటేషన్ ఆధారంగా డంగు సున్నం మిశ్రమంతో తిరిగి అతికించి పూర్వరూపం తెస్తారు. ఈ భారీ విగ్రహం వెలుగు చూసిన విషయాన్ని వెంటనే హెరిటేజ్ తెలంగాణ ఇన్చార్జి డైరెక్టర్ సునీత భగవత్ దృష్టికి తీసుకెళ్లామని, ఆమె సూచనల మేరకు నిపుణులతో చర్చించి దాన్ని హైదరాబాద్ తరలింపు, సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాజు పేర్కొన్నారు. అపూర్వ గుర్తు ఆ విగ్రహం వెలుగు చూసిన వెంటనే మా సిబ్బంది నా దృష్టికి తెచ్చారు. అది అతి అరుదైన ప్రతిమగా వారు చెప్పారు. కానీ పూర్తిగా వెలికి తీశాక గాని వివరాలు తెలియవు. ఇప్పటి వరకైతే అది చరిత్రకు సంబంధించి అపూర్వ గుర్తుగా భావిస్తున్నాం. తవ్వకాలు కొనసాగించి అక్కడ ఇంకా ఏమున్నాయో గుర్తిస్తాం. శనివారం కొన్ని వివరాలు వెల్లడవుతాయి. సునీత భగవత్, ఇన్చార్జి డైరెక్టర్ -
దేవుడక్కడ.. గంటలు ఇక్కడ
దేవాలయానికి వెళ్లగానే భక్తులు స్వామి విగ్రహం ముందు నిలబడి.. అప్రయత్నంగానే దైవం ముందున్న గంటను మోగిస్తారు. ఆలయం అనగానే దేవుడి ప్రతిరూపం కళ్లముందు కదలాడితే, అలయ పవిత్ర గంటల శబ్దం చెవుల్లో మారుమోగుతుంది. గంట మోగిస్తే దేవుడు తమ కోరికను ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంట సరిగ్గా గర్భాలయం ముందు మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటుంది. కానీ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొలనుపాక దేవాలయం పరిస్థితి వేరు. ఆ ఆలయ గంటలు మోగిస్తే గర్భాలయంలోని స్వామికి వినిపించవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా ఇది నిజం....ఎందుకంటే.. ఆలయాలు కొలనుపాకలో ఉంటే, ఆ గుడి గంటలు అక్కడికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో ఉన్నాయి. గంటలు దేవాలయంలో ఉండాలిగాని, హైదరాబాద్‌లో ఉండటమేంటన్న గందరగోళానికి పురావస్తుశాఖ నిర్వాకమే కారణం. – సాక్షి, హైదరాబాద్ ఇదీ సంగతి... కొలనుపాక అనగానే ప్రపంచ ఖ్యాతి పొందిన అద్భుత జైన దేవాలయం మదిలో మెదులుతుంది. ప్రస్తుత యాదాద్రి– భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు సమీపంలో ఈ గ్రామముంది. రాష్ట్రకూటులు పదో శతాబ్దంలో ఇక్కడ విశాలమైన జైన దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఐదడుగుల పచ్చరాతి మహావీరుని విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. రాష్ట్రకూటుల తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కళ్యాణి చాళుక్యులు పదకొండో శతాబ్దంలో దానికి చేరువలో సోమేశ్వరాలయం, పక్కనే వీరనారాయణస్వామి ఆల యాలను నిర్మించారు. వెరసి ఇది జైన, శైవ, వైష్ణవ సంప్రదాయంతో వర్ధిల్లిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. శైవంలో కాలకమైన పంచ ఆచార్యుల్లో రేణుకాచార్య మనుగడ సాగించింది కొలనుపాకలోనే అన్న ఆధారాలుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులొస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన భక్తులు కొలనుపాకకు వచ్చి సేదతీరుతారు. ఈ ఆలయాలకు చెందిన రెండు భారీ గంటలు ఆలయాలకు దూరంగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉండిపోయాయి. నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జైన ఆలయం ధ్వంసమైంది. మిగతా కొన్ని నిర్మాణాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 1970లలో అక్కడ జరిపిన అన్వేషణలో ఆలయాలకు చెందిన భాగాలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. నాడు ధ్వంసమైన జైన దేవాలయం స్థలంలో తర్వాత పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడది జైన భక్తుల ఇలవేల్పు. అక్కడికి సమీపంలో ఊబదిబ్బగా పేర్కొనే వాగు ఇసుకలో 2 భారీ గంటలు లభించాయి. కంచుతో రూపొందిన ఈ గంటలు అద్భుత శిల్పకళానైపుణ్యంతో వెలుగొందుతున్నాయి. ఈ రెండు కూడా కంచుతో రూపొందిన బరువైన గంటలు. వాటిని మోగిస్తే వచ్చే శబ్ద తరంగాలు వినసొంపుగా చాలాదూరం వినిపిస్తాయి. వాటి ని అప్పట్లో స్టేట్ మ్యూజియంకు తరలించి మరిచిపోయారు. ఐదారేళ్లుగా వీటిని తిరిగి ఆలయాలకు తరలించాలన్న విన్నపం భక్తుల నుంచి వస్తోంది. ఇవి ఆ ఆలయాలకు చెందినవే కావటంతో వాటిని మళ్లీ ఆలయాల్లో ఏర్పాటు చేయాలి. కానీ విలువైన ఆ గంటలను స్మగ్లర్ల బారి నుంచి కాపాడాలంటే భద్రత అవసరం. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దుస్థితిలో ఉన్న పురావస్తుశాఖ వాటిని కాపాడలేనని చేతులెత్తేసింది. కాపలా సిబ్బంది ఖర్చులు భరించే స్తోమత లేనందున వాటిని మ్యూజియంలోనే ఉంచి చేతులు దులిపేసుకుంది. గంటపై శాసనం... సాధారణంగా శాసనాలు రాళ్లు, రాతి పత్రాలపై రాస్తారు. కానీ ఈ రెండు గంటల్లో ఓ దానిపై శాసనం లిఖించి ఉండటం విశేషం. ‘స్వస్తిశ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ’అని కన్నడలో లిఖించి ఉంది. కండప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వరదేవుడికి విరాళంగా ఇచ్చిందన్న అర్ధం. కాశీ కొలనుపాక బింభావతి పట్టణంగా చరిత్రలో కొలనుపాక వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల హయాంలో రెండో రాజధానిగా కూడా భాసిల్లింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీనిపేరు కొల్లిపాకైగా ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనంలో కొల్లిపాక అని ఉంది. ఇలా ఈ పేరు రూపాంతరం చెందుతూ కొలనుపాకగా స్థిరపడింది. ఈ గంటల్లో ఒకదానిపై అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మ, పరుశు, పాశం, దంతం, మోదుకం ధరించి లలితాసనంలో ఉన్న గణపతి, రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించిన విష్ణువు, అభయహస్తం, శ్రీఫలం, శూలం, ఖట్వాంగం ధరించిన శివుడు ప్రతిరూపాలున్నాయి. మరో గంటపై ఆసీనుడైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, గణపతి విగ్రహాలున్నాయి. కొంతమంది భక్తులకు ఈ గంటల ఖ్యాతి తెలిసి చూసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కానీ అవి హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వాటిని వెంటనే కొలనుపాక ఆలయంలో ఏర్పాటు చేసి తగు భద్రత కల్పించాలి. అలనాటి ఆ గంటలు మోగించి ఆధ్యాత్మికానందం పొందే అవకాశాన్ని భక్తులకు కల్పించాలి. – రత్నాకరరెడ్డి ఔత్సాహిక పరిశోధకుడు -
అపురూప కళా వైభవానికి ఆదరణ కరువు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు. అబ్బురపరిచే శిల్ప సంపద. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిన శివాలయం.. నేడు శిథిలావస్థకు చేరుకుంది. కాకతీయ శిల్పకళా ప్రతిభకు తార్కాణంగా నిలి చిన ఈ ఆలయం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండ లంలోని గొడిశాల గ్రామంలో ఉంది. తూర్పు ము ఖం కలిగి ఉన్న ఈ దేవాలయం నక్షత్రం ఆకారంలో ఉంది. ముఖ మండపానికి ఉత్తర, పడమర, దక్షిణ దిక్కల్లో గర్భగుడులు ఉండగా తూర్పు దిక్కున ప్రవే శ మండపం ఉంది. ఈ మూడు గర్భగుడుల్లో శివుడిని లింగం రూపంలో ప్రతిష్టించారు. పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిల్ప సంపద చెల్లాచెదురు గా పడి ఉంది. ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలుగు పద్యాలతో శాసనం.. గొడిశాల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఉన్నాయి. పురాతన శాసనాల్లో గొడిశాల గ్రామాన్ని ఉప్పరపల్లిగా పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.శ.1236 కాకతీయ గణపతి దేవుడి కాలంలో గ్రాంధిక భాషలో కావ్య శైలిలో వేయించిన శాసనం ఒకటి ఉంది. తెలు గు పద్యాలతో ప్రారంభమైన ఈ శాసనంలో వినాయకుడు, దుర్గ, వరాహ రూపంలో ఉన్న విష్ణు మూర్తిని, సూర్యుడిని స్తుతించారు. రాజనాయకుడు, రవ్వ మాంబ దంపతులకు జన్మించిన కాటయ..పంచ లింగాలతో ఈ శివాలయాలను నిర్మించాడు. ఆలయ నిర్మాణం మాత్రమే కాకుండా చెరువులను కూడా తవ్వించాడు. ధూప దీప నైవేద్యాల కోసం బ్రాహ్మణులకు పించరపల్లి అనే గ్రామా న్ని దానంగా ఇచ్చాడు. తాటి వనాన్ని, అంగడి సుం కాన్ని, మామిడి తోటలను కూడా దానం చేశాడు. రుద్రదేవుడి, గణపతి దేవుడి ప్రశంసలతోపాటు కాట య గురించి కూడా శాసనంలో వర్ణించారు. శాసనం చివరి భాగంలో ఈ ఆలయానికి గణపతి దేవ చక్రవర్తి కూడా భూ దానం చేసినట్లు రాశారు. శాసనంలో పేర్కొన్న పంచ లింగాలలో 3 త్రికుటాలయంలో ఉండగా, మరో 2 పక్కనే ఉన్న వేర్వేరు ఆలయాల్లో ప్రతిష్టించి ఉన్నాయి. (ప్రస్తుతం పునర్ నిర్మాణం కోసం ఆలయ స్తంభాలన్నీ విప్పి పెట్టారు). ఢిల్లీ సుల్తానులకు, కాకతీయులకు యుద్ధం జరిగిన ప్రదేశం.. ఉప్పరపల్లి గ్రామానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ.. మాలిక్ ఫక్రోద్దిన్, జునాఖాన్ల నాయకత్వంలో ఓరుగల్లు పైకి మొదటిసారి తన సేనలను దండయాత్రకు పం పాడు. కాకతీయ సైన్యాలు పోతుగంటి మైలి, రేచర్ల వెన్న భూపాలుడు, మంగయ దేవుడు ఇతర సేనాల నాయకత్వంలో ఇక్కడే అడ్డుకుని తిప్పి పంపారు. పునర్నిర్మాణ పనులు చేపట్టాలి.. చారిత్రక నేపథ్యం ఉన్న కాకతీయ ఆలయం నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఆలయం చుట్టు పక్కల అనేక వందల స్తంభాలు, శిథిలాలు పడి ఉన్నాయి. ఇప్పటికైనా పురావస్తు శాఖ స్పందించి ఆలయాన్ని పునర్ నిర్మించాలి. – రామోజు హరగోపాల్, తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ -
యుద్ధం గెలిస్తే.. నాణేలపై ముద్ర పడాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోలాహలం.. గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది.. ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలు మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు, కార్యక్రమాలను నిలిపేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లకముందు రాచరిక వ్యవస్థలో ఏం జరిగేది..? బలమున్నోడిదే రాజ్యం. రాజ్యాల మీదకు దండెత్తి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని తన ఏలుబడిలో కలిపేసి సామ్రాజ్యాన్ని విస్తరించుకునేవారు. ఈ క్రమంలో ఆ రాజు వెంటనే చేసే పనేంటో తెలుసా? అంతవరకు చలా‘మణి’లో ఉన్న నాణేలపై తన ‘మార్కు’ముద్రించటమే.. ఆలస్యమవుతుందనే పునర్ ముద్రణ.. ఆనాడు నాణేలకు ఎంతో ప్రాధాన్యముండేది. ఏ రాజైన సరే తన రాజ వంశం, దైవం.. వంటి సొంత చిహ్నాలని నాణేలపై ముద్రించి చలామణి చేసేవారు. మరో రాజ్యాన్ని ఆక్రమించుకున్నప్పుడు, కొత్త ప్రాంతంలో తమ నాణేలు చలామణి చేసేందుకు కొంత సమయం పడుతుంది. నాణేల ముద్రణ, అందుకు సరిపడా ముద్రణాలయాల ఏర్పాటు, జనంలోకి తరలింపు.. ఇవన్నీ జరిగేందుకు సమయం అవసరం. కొత్త నాణేలు వచ్చే వరకు, పాత రాజులు అమలు చేసిన నాణేలనే కొనసాగించేవారు. అయితే వాటిపై తమ చిహ్నాలను ముద్రించేవారు. చలామణిలో ఉన్న పాత నాణేలను తెప్పించి వాటిపై తమ చిహ్నాలను ముద్రించి పంపేవారు. వీటికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాంతాల తవ్వకాల్లో ఇలాంటి నాణేలు వెలుగు చూశాయి. వాటి వల్లనే నాటి సంఘటనలు వెలుగు చూశాయి. వెరసి చరిత్రకు అవి సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఇప్పుడు అలాంటి అరుదైన కొన్ని నాణేలు లభించాయి. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో... సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపం, బౌద్ధ విహారాలు వెలుగు చూసిన చోట పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. వీటిల్లో కొత్త విహారాలు, నాటి వస్తువుల అవశేషాలు, నాణేలు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కొన్ని నాణేలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. సీసంతో తయారైన ఆ నాణేలు శాతవాహనకాలానికి చెందినవిగా తెలుస్తున్నాయి. శాతవాహన నాణేలకు వీటికి కొంత తేడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిపై శాతవాహన చిహ్నాలతో పాటు ఇతర కొన్ని చిహ్నాలున్నాయి. దీంతో.. శాతవాహనులు ఇతర రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో, పాత రాజు చలామణి చేసిన నాణేలపై తమ చిహ్నాలను పునర్ ముద్రించి అమలులోకి తెచ్చినవిగా చరిత్రకారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. వీటిపై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటి వివరాలు వెలుగులోకి వస్తే శాతవాహనుల కాలానికి సంబంధించి మరికొన్ని కొత్త వివరాలు వెలుగుచూస్తాయి. క్రీ.పూ.5వ శతాబ్దంలోనే.. దేశంలో నాణేల చలామణి క్రీ.పూ.5వ శతాబ్దంలో మొదలైంది. మగధ సామ్రాజ్యంలో 3.4 గ్రాముల బరువు తూగే వెండి నాణేల ముద్రణ మొదలైందప్పుడే. మగధ పాలకులు నాణేలపై సూర్యుడి గుర్తుతో పాటు 6 ఆయుధాల ఆకృతులను ముద్రించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వీటితోపాటు మరికొన్ని చిహ్నాలున్నా, అవి మారుతూ వచ్చాయి. తదనంతరం నంద సామ్రాజ్యాధీశులు దాన్ని కొనసాగించారు. క్రీ.పూ. 2, 3 శతాబ్దాల్లో రోమన్, గ్రీకుతో వాణిజ్యం పెరిగిన తర్వాత నాణేల ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆ తర్వాత సీసం నాణేలు వచ్చాయి. కుషాన్స్ హయాంలో బంగారు నాణేలు మొదలయ్యాయి. తర్వాత మౌర్యులు, దక్షిణాదిన మౌర్యులను ఓడించి శాతవాహనులు నాణేలను ప్రారంభించారు. ఇందులో మౌర్యులను ఓడించి వారి నాణేలపై తమ చిహ్నాలను శాతవాహనులు వేసుకున్నారని ఆధారాలు లభించాయి. రెండు చోట్లనే వెలుగులోకి... మరో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు పాత నాణేలపై కొత్త రాజులు తమ చిహ్నాలను ముద్రించిన ఉదంతానికి సంబంధించి మన దగ్గర ఇప్పటికి 2 చోట్ల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 కూడా శాతవాహన కాలానికి సంబంధించినవే కావడం విశేషం. శాతవాహనుల తొలి రాజధానిగా పేర్కొంటున్న కోటిలింగాల వద్ద, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న మస్కి (రాయచూరు సమీపం) వద్ద జరిపిన తవ్వకాల్లో ఇలాంటి నాణేలు లభించాయి. దక్షిణ భారతం కూడా మౌర్యుల పాలనలో ఉందనటానికి ఇవే ఆధారాలుగా మిగిలాయి. ఈ రెండు చోట్ల జరిపిన తవ్వకాల్లో మౌర్యులు చలామణి చేసి న వెండి నాణేలు బయటపడ్డాయి. ఇవి పంచ్ మార్క్డ్ నాణేలు. వీటికి మరోవైపు శాతవాహనులు ముద్రించిన ఏనుగు ఆకృతి కనిపించింది. మౌర్యులను ఓడించి ఆ ప్రాంతాన్ని శాతవాహనులు తమ అధీనంలోకి తెచ్చుకుని మౌర్యుల నాణేలపై తమ గుర్తులను పునర్ముద్రించారని చరిత్రకారులు తేల్చారు. ఈ రెండు చోట్ల తప్ప అలాంటి నాణేలు వెలుగు చూడలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి కౌంటర్ మార్క్ డ్ నాణేలు వెలుగు చూడటంతో చరిత్రకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫణిగిరిలో లభించిన నాణేలు సీసం ముడిపదార్థంగా రూపొందినవి. దీంతో అవి కొంతమేర చెదిరిపోయి ఉండటంతో వాటిపై చిహ్నాలు అస్పష్టంగా కనిపిస్తున్నా యి. ప్రత్యేక పద్ధతుల్లో వాటిని పరిశోధించాల్సి ఉంది. -
ఇటుకపై ఇటుక పేర్చి!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జైన మతం ఇక్కడ వర్ధిల్లింది.. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేల ఇది.. జైనులకు ఎంతో ప్రీతిపాత్ర మైన ఆలయం ఇది.. వారికి ప్రధాన స్థిరనివాసంగా ప్రత్యేకతను చాటుకుంది. ఎంతో ప్రత్యేకంగా కేవలం ఇటుకలతో ఎన్నో శతాబ్దాల కిందట నిర్మితమై అలరారింది. తనకంటూ చరిత్రలో ఓ పేజీని లిఖించుకుంది. అదే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్‌పల్లిలో ఉన్న గొల్లత్త గుడి. ఎన్నో ప్రత్యేకతలు.. దాదాపు 65 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు ఈ గుడిని నిర్మిం చినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతు న్నారు. చాలా అరుదుగా ఇటుకలతో 7వ లేదా 8వ శతాబ్దంలో జరిగినట్లు భావిస్తున్నారు. గార అలంకరణలకు సంబంధించిన ఇటుకల నిర్మాణం. 40 అడుగుల నిలువెత్తు గోపురం గొల్లత్త గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇటుకలతో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలు దేశంలో రెండే రెండు ఉన్నాయని, వాటిలో ఈ గొల్లత్త గుడి ఒకటని పేర్కొంటున్నారు. మరొకటి ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులోని భీతర్గావ్ శివారులో ఉంది. ఈ గుడిని 1600 ఏళ్ల కింద 58 అడుగుల ఎత్తులో కుమారగుప్తుడి కాలంలో నిర్మిత మైంది. ఆలయ నిర్మాణం 8 ఎకరాల్లో ఉండగా, పాదాల గుట్ట సుమారు రెండు ఎకరాల్లో ఉంది. జైనుల ధాన్య భాండాగారంగా పేరు గాంచిన గొల్లత్తగుడి ఆలయంలో ఒకప్పుడు బంగారు కుండలు ఉండేవని స్థానికులు చెబుతారు. గుడి వెనుక భాగంలో అప్పటి నగిషీల జాడలు ఇంకా స్పష్టంగా ఉండటం విశేషం. జైనుల స్థిర నివాసం.. జైనీయుల స్థిర నివాస కేంద్రంగా ఈ గుడికి గుర్తింపు ఉన్నది. అంతేకాకుండా జైనీయులకు ధాన్యాగారంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా జైనులకు రెండు ప్రధాన పట్టణాలు ఉండగా.. అందులో గొల్లత్తగుడి ఒక్కటి. వందల ఏళ్ల కింద ఇది జైన మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చర్రితకారులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో అనేక పురావస్తు అన్వేషణలు, తవ్వకాలు జరిగాయి. పురాతన కాలం నాటి మట్టిపెంకులు, ఇటుకలతో పాటు నల్ల రంగులో ఉన్న బూడిద తవ్వకాల్లో వెలుగు చూశాయి. వాటిని పరిరక్షించేందుకు పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు. ఇక్కడ లభించిన 5 అడుగుల ఎత్తున్న జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో, మరొక దాన్ని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే ప్రాంతంలో హిందూ దేవాలయం అవశేషాలు, మధ్యయుగ కాలం నాటి మహావీర, పార్శ్వనాథ శిల్పాలు బయటపడ్డాయి. పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు ఆలయ పూర్వవైభవానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇటుకల గోపురం చెక్కుచెదరకుండానే పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఆలయ రక్షణకు సుమారు రూ.36 లక్షలతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. ఎలా చేరుకోవాలి? జడ్చర్ల నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్‌నగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గొల్లత్త గుడి ఉంది. రైలు, రోడ్డుమార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ వైపు నుంచి రావాలనుకునే వారు జడ్చర్ల వెళ్లి అక్కడినుంచి అల్వాన్‌పల్లి చేరుకోవచ్చు. రైలు మార్గం అయితే జడ్చర్ల స్టేషన్లో దిగి, అక్కడి నుంచి ఆటోలలో ఆలయానికి వెళ్లొచ్చు. -
అద్భుత శిల్పాల నెలవు
సాక్షి, హైదరాబాద్: అక్కడి శిల్పాలు చరిత్రను కళ్లకు కదలాడేలా చేస్తాయి. నాటి జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. శిల్పులు చెక్కిన కళారూపాలు ఔరా! అనిపిస్తాయి. సాంకేతికత లేని ఆ రోజుల్లోనే ఇలా ఎలా చెక్కారబ్బా అని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఇలాంటి శిల్పాలు చూడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకకు వెళ్లాల్సిందే. దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉన్న జైన దేవాలయానికి కొలనుపాక ప్రసిద్ధి. దక్షిణ భారత్‌లోని ప్రముఖ జైన కేంద్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి మ్యూజియంలో అరుదైన 1.5 మీటర్ల ఎత్తున్న మహావీరుడి విగ్రహం ఉంది. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల రెండవ రాజధానిగా కొలనుపాక ఉండేది. ఆ కాలంలో ఈ గ్రామం జైనుల మత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పురాతన సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవాలని అనుకునే వారికి అద్భుత మ్యూజియం ఇది. వెయ్యి సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న స్మారక శిలలు లేదా వీరగల్లులుగా పిలిచే విగ్రహాలను ఇక్కడ భద్రపరిచారు. హిందూ, జైన మతానికి సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులున్నాయి. 6 నుంచి 16వ శతాబ్దాల కాలం నాటి మహావీర, మత్స్యవల్లభ, చాముండి, నంది లాంటి ముఖ్య శిల్పాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ శిల్పాలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ఇందులో కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుంచి, సమీప గ్రామాల నుంచి సేకరించిన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు. చాళుక్య, కాకతీయ శైలికి సంబంధించిన 100కుపైగా శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యమైన విగ్రహాలు... క్రీ.శ.1076–1127 మధ్య కాలంలో కొలనుపాకని పరిపాలించిన త్రిభువనమల్ల రాజు వేయించిన విజయ స్తంభం. దీనికి నాలుగు వైపులా శాసనం ఉండటం విశేషం. చాళుక్యుల కాలం నాటి వినాయక, నటరాజ విగ్రహాలు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వీరగల్లు, మహిషాసురమర్ధిని విగ్రహాలు, కాకతీయుల కాలం నాటి చాముండి విగ్రహం, నంది, వజ్రపాణి విగ్రహం, విజయ నగర కాలం నాటి కోదండ రామస్వామి విగ్రహం చూడొచ్చు. చాళుక్యుల కాలం నాటి మహావీరుని విగ్రహం యోగముద్రలో ఉంటుంది. ఎలా చేరుకోవాలి? హైదరాబాద్ నుంచి కొలనుపాక 79 కిలో మీటర్లు పర్యాటకులు హైదరాబాద్ నుంచి బస్సు లేదా రైలులో ఆలేరు వరకుచేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. మ్యూజియం ఉదయం10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది. ప్రవేశం ఉచితం. -
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
అరుదైన గుహాలయాలు
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖ నిర్లక్ష్యం, గ్రామస్తుల అవగాహనా రాహిత్యంతో దేశంలోనే చారిత్రక ప్రదేశంగా పేరొందాల్సిన అడవి సోమనపల్లి గుహాలయాలు వాటి సహజత్వం కోల్పోయాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా అభివృద్ధికి పూనుకున్నారు. అవగాహనా లోపం తో వందల ఏళ్ల నాటి గుహలు అందంగా కనపడాలనే ఉద్దేశంతో సున్నం వేశారు. దాంతో వాటి సహజ అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఒకటిగా పేరొందాల్సిన ఆలయం ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన అడవుల్లో ఉన్న ప్రాచీన సంపదపై సాక్షి ప్రత్యేక కథనం.. కొండను తొలిచి..అందంగా మలిచి.. మంథనికి 22 కిలోమీటర్ల దూరంలోని అడవి సోమన పల్లి గుట్టపై శిలను తొలిచి నిర్మించిన నాలుగు గుహాలయాలు ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చిహ్నాలుగా నిలిచాయి. తాడిచెర్ల వద్ద బస్సు దిగి, దట్టమైన అర ణ్యం గుండా నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయా ణించి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. కొండపై ఉన్న పెద్ద శిలను తొలచగా ఏర్పడిన ఈ నాలుగు గుహలు పడమటి ముఖాన్ని కలిగి మానేరు నదికి ఎదురుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ప్రకృతి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తాయి. స్థానికంగా నైనిగుళ్లు అని పిలువబడే ఈ శివాలయాల కొలతలు ఒక్కరీతిగా లేవు. నాణ్యమైన శిల కాకపోవడం, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలులకు తట్టుకోలేక ఈ గుహాలయాలు క్రమేణా శిథిలమవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని మొగల్రాజపురంలో చెక్కబడిన విష్ణుకుండినుల కాలపు గుహాలయాల వలె ఇక్కడి గుహాలయాలు కూడా గర్భగృహం, దాని ముందు మంటపమున్నట్లు తొలచబడిఉన్నాయి. ఆకర్షించే వర్ణ చిత్రాలు ఈ మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాదాగా ఉన్నా, మంటపం పైకప్పు (సీలింగ్) సన్నని సున్నపు పొరతో చదును చేయబడి, దానిపై వర్ణచిత్రాలున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోయి ప్రస్తుతం నలుపు, ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగులలో కొన్ని అస్పష్టమైన గుర్తులు మిగిలాయి. అక్కడక్కడ మిగిలిన వర్ణచిత్రాలలో నర్తకి, యుద్ధ దృశ్యాలు, అశ్వ రథాలు విలుకాండ్రు, రాజభవనాలు చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ గుహలకు ముందున్న గోడపై పదవ, 11వ శతాబ్దపు తెలుగు లిపి లక్షణాలతో రెండు చిన్న శాసనాలున్నాయి. మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కుటేవిమున అనే వ్యక్తి శివలింగానికి రామేశ్వరుడని నామకరణం చేసి దేవుని ప్రతిష్టించాడని, కెంపెన అనే వ్యక్తి రాతిని తొలచినట్లు తెలపబడింది. రామేశ్వరుని ఆల య ధూపదీప నైవేద్యాలకు పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూదాన మిచ్చినట్లు రెండో శాసనం తెలుపుతుంది. ఈ గుహాలయాలు విజయవాడకు సమీపాన ఉండవల్లి కొండలపై ఉన్న గుహాలయాలను పోలిఉన్నాయి. కానీ వీటిని ఉండవల్లిలోని 5 అంతస్తులు అనంతశయన గుడితో పోల్చలేమని, కళారీతులను బట్టి ఈ గుహలు క్రీ.శ ఏడో, 8వ శతాబ్దాలకు చెందినవని చారిత్రక పరిశోధకులు ఎన్.ఎస్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చారిత్రక కట్టడాలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ ఈ ప్రదేశం వివరాలు లేవని చెప్పారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. చెదిరిపోతున్న శాసనాలు శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం పూనుకున్నారు. ఆలయానికి వెళ్ళేందుకు అనుగుణంగా నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. పురావస్తు శాఖ పట్టించుకోక పోవడం, చారిత్రక సంపదపై అవగాహన లేకపోవడంతో గుహలకు సున్నం వేశారు. దీనివల్ల గుహల పైభాగంలో ఉన్న రాతి చిత్రాలు పాడవ్వడమేకాక, దాని చారిత్రక ప్రాధాన్యం కోల్పోయింది. ఇంత ప్రాచీన చరిత్ర, ప్రాధాన్యత కలిగిన ఈ గుహల వివరాలు అటు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, ఇటు రాష్ట్ర పురావస్తు శాఖలోకానీ లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి మాట అటుంచి కనీసం ఇలాంటి ప్రాంతం ఒకటుంది అన్న విషయం చుట్టు పక్కల గ్రామాల ప్రజలకి సైతం తెలియకపోవడం శోచనీయం. రాష్ట్ర పురావస్తు శాఖ ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మరోసారి సున్నం, రంగులు వేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు . -
కాపురం గుట్టల్లో కాకతీయ స్థావరం
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కోటకు ఆవల కాకతీయుల సైనిక రహస్య స్థావరం ఉండేదా? గోదావరి తీరాన చిట్టడివిలో రెండవ ప్రతాపరుద్రుడు శత్రువు గుర్తించని వనదుర్గం కట్టాడా? కాకతీయుల సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి ఈ సైన్యంతోనే అల్లావుద్దీన్ ఖిల్జి సేనాని మాలిక్ కాఫర్‌పై దాడి చేశాడా?.. యువ చారిత్రక పరిశోధకుడు అరవింద్ ఆర్య పరిశోధనలు అవుననే సమాధానమిస్తున్నాయి. శత్రువుల రాకను ముందే పసిగట్టడానికి కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ పటిష్టమైన రాతి గోడలు, సైనికులు పహారా కోసం నలువైపులా నిర్మించిన బురుజుల ఆధారాలు లభ్యమయ్యాయి. ముందే పసిగట్టేందుకు.. కాకతీయ సామ్రాజ్యంపై శత్రు రాజుల కన్నెప్పుడూ ఉండేది. ఢిల్లీ సుల్తాన్లు 5 సార్లు కాకతీయ సామ్రాజ్య ఆక్రమణకు దండెత్తారు. ఈ 5 మార్లు సుల్తాన్ల సైన్యం గోదావరి మీదుగానే ప్రయాణం చేసి ఓరుగల్లు రాజ్య ప్రవేశం చేసింది. దీంతో పరాయి సైన్యం రాకను ముందే పసిగట్టి నిలువరించేందుకు రెండవ ప్రతాప రుద్రుడు ఓరుగల్లు కోటకు ఉత్తర దిక్కున 140 కి.మీ దూరంలో కాపురం, వల్లూరు, ప్రతాపగిరి, నందిగామ గొంతెమ్మ గుట్టల మీద రహస్య స్థావరాలు ఏర్పాటు చేసిన చారిత్రక ఆనవాళ్లు వెలుగుచూశాయి. 200 మందికి పైగా సైనికులకు ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచేర్లకు 3 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరికి కాస్త దూరంలో దట్టమైన అడవిలో మూడు కొండలు కనబడుతుంటాయి. శిల్పి పనిగట్టుకొని ఉలితో చెక్కిన తరహాలో ఈ గుట్టలున్నాయి. ఆ కొండల పైభాగంలో ఆలయం, సహజంగా ఏర్పడ్డ రాతి గోడ, ఆ పక్కనే మానవ నిర్మిత కోట గోడలు, బురుజులు, పెద్ద రాతి స్తంభాలు, కుండ పెంకులు లభ్యమయ్యాయి. వాన నీటి నిల్వ కోసం కొండ పైభాగంలో నాడు నిర్మించుకున్న బావుల లాంటి నిర్మాణాలు నేటి చెక్ డ్యాంలను తలపిస్తాయి. గుట్టల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణాలు, సైనికుల నివాసానికి కొండ మధ్య భాగంలో కుడి, ఎడమ వైపున గుహలున్నాయి. రెండు కొండలను కలుపుతూ సుమారు 500 మీటర్ల మేర సహజ సిద్ధంగా ఏర్పాటైన రాతి గోడ ఉంది. ఈ రెండు గుహలలో 200 మందికి పైగా సైనికులు నివాసం ఉండేందుకు సరిపడేంత స్థలం గుర్తించారు. గరుడ విగ్రహం, సైనిక గుహ ముఖ భాగం మూడంచెల భద్రత రక్షణ కోసం కాకతీయులు శత్రు దుర్భేద్యమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడంచెల్లో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతి గోడలు, సైనికుల పహారా కోసం నలువైపులా బురుజులు ఉన్నాయి. సైనికుల అవసరాల కోసం కొండ పైభాగంలో 1వ, 2వ కోటగోడల మధ్య రెండు చెక్ డ్యాంలను పోలి ఉన్న బావులు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు కొండ మీద పల్లం వైపు రాతి ముక్కలతో గోడ నిర్మించుకున్నారు. సుల్తానులను నిలువరించడానికే కొండ మీద దొరికిన చారిత్రక ఆనవాళ్లు, అక్కడి చుట్టు పక్కల గ్రామాల్లోని జన బాహుళ్యం నుంచి సేకరించిన సాంస్కృతిక ఆనవాళ్ల ఆధారంగా ఇక్క డ కాకతీయుల రహస్య సైనిక స్థావరం ఉందనే అంచనాకు వచ్చాం. గోదావరి నది మీదుగా ఢిల్లీ సుల్తానులు పదే పదే దండెత్తుతుండటంతో కాకతీయులు దీనిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి. – అరవింద్ ఆర్య పరికి, చరిత్ర యువ పరిశోధకుడు సైనిక స్థావరాలు ఉండొచ్చు కొండ మీద దొరికన ఆనవాళ్ల ఆధారంగా ఇక్కడ సైనిక స్థావరాలు ఉండొ చ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి సరైన చారిత్రక అవగాహన లేదు. చారిత్రక, సాంస్కృతిక, అజ్ఞాత చరిత్ర ఇక్కడ దాగి ఉంది. పురావస్తు శాఖ అధికారులు పూర్తిగా పరిశోధన చేసి ఈ ప్రాంత చరిత్ర, కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలి. – ప్రొఫెసర్ జయధీర్ తిర్మల్‌రావు -
ఇటుకలు ‘గుటకేశారు’!
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి ఇటుకలు మాయమయ్యాయి. సమీప ప్రాంతాల్లోని ప్రజలు తమ సొంత నిర్మాణాల కోసం పాతకాలం నాటి గోడల్ని ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పురావస్తు శాఖ.. వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది. బయటికి చెబితే తమకే చెడ్డ పేరొస్తుందని దొరికిన ఇటు కల్ని గుట్టుచప్పుడు కాకుండా స్వాధీనం చేసుకుంటూ రికార్డు చేసే పనిలో పడ్డారు అధికారులు. 70 ఎకరాల్లో.. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరులో శాతవాహనుల కాలం నాటి నిర్మాణాలున్న ప్రాంతంలో 1955 నుంచి 1981 మధ్య ప్రాంతంలో పురా వస్తు శాఖ ఐదారు దఫాలు తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో నిర్మాణాలు వెలుగు చూశాయి. దాదాపు 3 వేలకుపైగా శాతవాహనుల, రోమన్ నాణేలు బయటపడ్డాయి. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత అక్కడ తవ్వకాలు జరగలేదు. దీంతో అక్కడ 70 ఎకరాల భూములు సేకరించి నిర్మాణాలు పరిరక్షించాలని అప్పటి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలోనే ఇటీవల తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ.. అప్పట్లో తవ్వకాల్లో వెలుగు చూసిన నిర్మాణాలు అదృశ్యమైనట్లు గుర్తించింది. ఓ ఊళ్లో దేవాలయానికి.. ఇటీవల ఓ ఊళ్లో శాతవాహనుల కాలం నాటి ఇటుకల రాశి కనిపించింది. అక్కడి ఓ దేవాలయాన్ని పునర్ నిర్మించేందుకు కూల్చడంతో ఆ ఇటుకలు బయటపడ్డాయి. అవన్నీ పెద్దబొంకూరు నిర్మాణాల్లోని ఇటుకలుగా అధికారులు గుర్తించారు. గోడలు ధ్వంసం చేసి ఆ ఇటుకలు తీసుకెళ్లి గుడి నిర్మించారని తేల్చారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని వివరాలు రికార్డు చేశారు. అలాగే కొన్ని ఊళ్లలో ఇళ్లు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలకు ఈ ఇటుకలు వాడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. శాతవాహన కాలం నాటి ఆ ఇటుకల వయసు దాదాపు 2 వేల ఏళ్లు. అయినా ఇప్పటికీ అవి దృఢంగా ఉన్నాయి. 58 అంగుళాల పొడవు, 26 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల మందంతో మనం వాడే సాధారణ ఇటుకకు మూడు, నాలుగు రెట్లు పెద్దగా ఉంటాయి ఆ ఇటుకలు. అలనాటి నిర్మాణాలు వేల ఏళ్ల పాటు మనగలగడంలో వీటిదే ప్రధాన పాత్ర. కోటిలింగాల వద్ద కూడా.. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల వద్ద కూడా తవ్వకాల్లో భారీ నిర్మాణాలు వెలుగు చూశాయి. కానీ ఇటీవల పుష్కరాల సమయంలో పార్కింగ్ కోసం పదెకరాల స్థలంలో భూమిని చదును చేసి రోలర్‌తో తొక్కిం చారు. దీంతో దిగువనున్న నిర్మాణాలు భూగర్భంలోనే ధ్వంసమై ఉంటాయని భావిస్తున్నారు. ధూళికట్టలో అద్భుత బుద్ధ స్థూపం ఉన్న ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలం నిర్మాణాలు, కోటగోడ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ చాలా వరకు నిర్మాణాలు ధ్వంస మయ్యాయి. ఫణిగిరి, గాజులబండ, కర్ణమామిడిల్లోనూ నిర్మాణాలు ధ్వంసమవుతూనే ఉన్నాయి. -
'పెద్దబొంకూరు'పై గద్దల కన్ను
సాక్షి, హైదరాబాద్: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశంపై నేతల కన్ను పడింది. పురావస్తు శాఖ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అతికష్టం మీద సేకరించిన భూమిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలంటూ ఒత్తిడి ప్రారంభించారు. ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టే వంకతో భూమిని సొంతం చేసుకునే ప్లాన్ వేశారు. అందులో క్రీడా మైదానం, దాని ఆసరాగా వాణిజ్య సముదాయం నిర్మించాలని ఆ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఈ భూమి ఉండటంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకు నేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక పెద్దబొంకూరులో జరుగుతున్న వ్యవహారమిది. చారిత్రక ప్రాధాన్యం పెద్దబొంకూరుకు చారిత్రకంగా చాలా ప్రాధాన్యముందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. దీనికి పది కిలోమీటర్ల దూరంలో ధూళికట్టలో బౌద్ధ స్తూపం ఉంది. దక్షిణ భారత దేశంలో లభించిన బౌద్ధ ప్రాంతాల్లో ఇది అత్యంత కీలకమైంది. శాతవాహనులు ప్రత్యేక శ్రద్ధతో బౌద్ధ స్తూపాలు, ఇతర నిర్మాణాలు కట్టించారు. దానికి అనుబంధంగానే పెద్దబొంకూరును తీర్చి దిద్దారు. పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ చారిత్రక అవశేషాలున్నట్టు గుర్తించి ఐదు దఫాల్లో తవ్వకాలు జరిపారు. అందులో ఏకంగా ఐదు వేల వరకు నాణేలు లభించాయి. కొన్ని రోమన్ బంగారు నాణేలు కూడా దొరకటంతో ఇది వాణిజ్య కేంద్రమన్న ఉద్దేశంతో తవ్వకాలు కొనసాగించారు. విశాలంగా ఉన్న హాళ్లు, ఇతర గదుల అవశేషాలు, 22 బావులు ఉన్నట్టు తేలింది. ఇది నాణేల ముద్రణ జరిగే కేంద్రంగా వాడుకుని ఉంటారని భావించారు. అయితే తర్వాత తవ్వకాలు నిలిచిపోయాయి. ఆ 40 ఎకరాలు భవిష్యత్తులో పెద్దబొంకూరు ప్రాంతంలో విస్తృతంగా తవ్వకాలు జరపాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే 68 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. నెల రోజుల క్రితం అక్కడ మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఆ భూమిపై నేతల కన్ను పడింది. ఇప్పటి వరకు జరిగిన అన్వేషణను చాలించి మిగతా ఖాళీ భూమిని అప్పగిస్తే ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టేందుకు వీలు కలుగుతుందంటూ ఒత్తిడి తెస్తున్నారు. గతంలో 25 ఎకరాల్లో తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మూడెకరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నందున అంతవరకు భూమి అట్టిపెట్టుకుని మిగతా 40 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్ చేయాలన్న ఒత్తిడి ప్రారంభించారు. జాతీయ రహదారిపై ఉన్న భూమి కావడంతో అక్కడ స్టేడియం.. దానికి అనుబంధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మింపచేస్తే తమకు గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో వారున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు ఉన్నతస్థాయి నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, ప్రస్తుతం సచివాలయం స్థాయిలో ఆ మేరకు వ్యవహారం సాగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికారులు పూర్తిస్థాయి తవ్వకాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో చిన్నచిన్న ట్రెంచ్‌లు తవ్వి నిర్మాణాల ఆనవాళ్లు ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఆ ట్రెంచుల్లో కూడా నాటి పూసలు, ఇతర అవశేషాలు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. అయితే ట్రెంచుల్లో పెద్దగా అవశేషాల జాడ లేనందున మిగతా భూముల్లో తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పురావస్తు శాఖ నుంచి వ్యక్తమయ్యేలా నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సైట్ మ్యూజియం నిర్మించాల్సిన స్థలం సమీపంలోనే ఉన్న ధూళికట్ట వద్ద తవ్వకాలు జరిపినప్పుడు చారిత్రకంగా ఎంతో విలువైన శాతవాహనుల ఆధారాలు లభించాయి. వాటిని సందర్శకులు తిలకించే అవకాశమే లేకుండా పోయింది. ఆ ఆధారాలన్నీ పురావస్తు శాఖ స్టోర్ రూమ్‌లో మగ్గిపోతున్నాయి. ధూళికట్ట ప్రధాన రహదారికి దూరంగా ఉన్నందున, అక్కడి ఆధారాలు, పెద్దబొంకూరు తవ్వకాల్లో లభించిన ఆధారాలను.. జాతీయ రహదారిపై ఉన్న పెద్దబొంకూరు వద్ద సైట్ మ్యూజియం నిర్మించి ప్రదర్శనకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పురావస్తు శాఖ వద్ద పెండింగులోనే ఉండిపోయింది. తవ్వకాలు కొనసాగుతున్న ప్రాంతం -
విదేశాలకు తరలిపోయిన శ్రీవారి ఆభరణాలు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆభరణాలు ఎప్పుడో ఇతర దేశాలకు తరలిపోయాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి బాంబు పేల్చారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన అనేక ఆభరణాలు, నాణేలు కూడా ఇప్పుడు లేవని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న దానిపై పురావస్తు శాఖ గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సభ్యులు నెల రోజులపాటు పరిశీలించి చాలా ఆభరణాలు, నాణేలు లేనట్టు గుర్తించారని చెప్పారు. చాలా ఆభరణాలు, నాణేలను కరగబెట్టినట్టు కమిటీ సభ్యులు తేల్చారని వివరించారు. ‘పాత మిరాశీదారీ వ్యవస్థ సమయంలోనో.. అంతకుముందో చాలా నాణేలు కరగబెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సతీసమేతంగా తిరుమల పర్యటనకు వచ్చి ఎన్నో ఆభరణాలు, నాణేలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. విచారణ చేస్తే వాటికి సరైన రికార్డులు కూడా లేవని తేలింది’అని తెలిపారు. వివిధ శాసనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాల గురించి పురావస్తు శాఖ ‘గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేట్ బై కృష్ణదేవరాయల్ టూ ఆంధ్రా టెంపుల్స్’పేరుతో ఒక పుస్తకం ప్రచురించినట్టు చెప్పారు. రాయల వారు ఏ సమయంలో పర్యటించారు? ఏ కానుకలు సమర్పించారన్నది శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారని.. వాటి వివరాలతో పుస్తకం ప్రచురించినట్టు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో విలువైన నాణేలు, వజ్రవైడూర్యాలు సమర్పించారని వీటిలో కొన్ని పర్షియన్ దేశాలకు, మరికొన్ని అరబ్ దేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో ముత్యాలను ఇంగ్లండ్‌కు తరలించుకుపోయిందని, అవన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడు ఎన్నో ఆభరణాలు ఆ ప్రాంతంలో ఉండిపోయాయని, వాటిని అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. రోమన్, శాతవాహన కాలం నాటి కొన్ని నాణేలు ఇప్పటికీ టీటీడీ మ్యూజియంలో ఉన్నాయని వెల్లడించారు. -
హెరిటేజ్ తెలంగాణతో సర్వతో‘భద్రం’
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తింపు పొందిన సర్వతోభద్ర ఆలయ పునర్నిర్మాణ బాధ్యత నుంచి ప్రభుత్వం దేవాదాయ శాఖను తప్పించింది. ఆలయ ప్రత్యేకతలను దెబ్బతీసేలా దేవాదాయ శాఖ పనులు చేస్తుండటాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవడంతో.. సర్కారు స్పందించింది. ఈ పనులను హెరిటేజ్ తెలంగాణ (రాష్ట్ర పురావస్తు విభాగం)కు అప్పగించింది. ఈ పనుల కోసం దేవాదాయ శాఖకు మంజూరు చేసిన నిధులను కూడా పురావస్తు శాఖకే అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా.. పూర్తిగా రాతి నిర్మాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు పురావస్తుశాఖ సిద్ధమైంది. ఆలయానికి దూరంగా ఆర్కేడ్ భూపాలపల్లి జిల్లా నయన్‌పాక గ్రామంలో పురాతన సర్వతోభద్ర ఆలయాన్ని ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించి పునర్వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దేవాదాయ శాఖకు బాధ్యత అప్పగించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు పురాతన ఆలయ విశిష్టతనే దెబ్బతీసేలా రాళ్ల తొలగింపు, కాంక్రీటుతో పనుల వంటివి చేపట్టారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు పునరుద్ధరణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హెరిటేజ్ తెలంగాణకు అప్పగించింది. చర్యలు చేపట్టిన పురావస్తు శాఖ సర్వతోభద్ర ఆలయం అతి పురాతన నిర్మాణం కావడంతో.. దాని ప్రత్యేకత దెబ్బతినేలా, దాన్ని అనుకుని కొత్త నిర్మాణాలేవీ చేపట్టడానికి వీలు లేదు. దీంతో ప్రధాన ఆలయానికి చుట్టూ 60 అడుగుల దూరంలో చతురస్రాకారంలో భారీ ఆర్కేడ్ (మంటపం తరహాలో) నిర్మించాలని పురావస్తు శాఖ అధికారులు యోచిస్తున్నారు. అది కూడా పూర్తిగా రాతి నిర్మాణంగా ఉండనుంది. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నందున ఆర్కేడ్ నాలుగు వైపులా ప్రత్యేక బాటలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో పచ్చిక బయలు, పూల చెట్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఈశాన్య దిశలో ఉన్న కోనేరులో పూడిక తీసి పునరుద్ధరిస్తారు. ఇక ఆర్కేడ్ వెలుపల భక్తులు, పర్యాటకుల వసతి కోసం ఇతర నిర్మాణాలను చేపడతారు. ఇక ఆలయ శిఖరంపై భాగాన ఇటుకలు పడిపోయి ఉన్నాయి. దీంతో అదే పరిమాణంలో కొత్త ఇటుకలు తయారు చేయించి.. శిథిలమైన చోట ఏర్పాటు చేసి, డంగుసున్నంతో పునరుద్ధరించ నున్నారు. -
చారిత్రక వనం..పునర్వైభవానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: గురుత్వాకర్షణ శక్తితో నీటిని విరజిమ్మే ఫౌంటెన్.. నలువైపులా ఉద్యానవనం.. కాలిబాటలు.. అందమైన పూల చెట్లు.. చుట్టూ ఉన్న చెరువుల నుంచి నీటిని తరలించే కాలువలు.. టెర్రకోట పైపులైన్లు.. పూదోట అందాల్ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఓ బారాదరి (పెవిలియన్).. గోల్కొండ నయా ఖిల్లాలో 450 ఏళ్ల కిందటి అద్భుత ఉద్యానవనం ప్రత్యేకతలివి. తాజ్‌మహల్ ముందు ఉన్న మొఘల్ గార్డెన్‌కు మాతృకగా భావించే ఈ ఉద్యానవనం.. కాలక్రమేణా భూగర్భంలో కలసింది. తాజాగా దానిని పునరుద్ధరించేందుకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. గోల్కొండ కోటకు మరోవైపున.. కాకతీయుల నుంచి గోల్కొండను స్వాధీనం చేసుకున్నాక దానికి కొత్తరూపు ఇచ్చే క్రమంలో కుతుబ్‌షాహీలు నయాఖిల్లాను నిర్మించారు. అందులో అద్భుత ఉద్యానవనాన్ని నిర్మించారు. 1590 సంవత్సరం అనంతరం అసఫ్‌జాహీల పాలన మొదలయ్యాక ఉద్యానవనం కనుమరుగైంది. కొన్నేళ్ల కింద ఈ ప్రాంతంలో గోల్ఫ్‌కోర్టు నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నపుడు ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టులు కృష్ణయ్య, తాహెర్‌లు తవ్వకాలు జరిపి పర్షియా గార్డెన్ ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మిలింద్ కుమార్ చావ్లే.. ఈ ఉద్యానవనానికి పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న శాతం చెరువు నుంచి నీటిని తీసుకొచ్చే కాలువల్లో మిగిలిన భాగాన్ని పునరుద్ధరించారు. బారాదరిని డంగు సున్నంతో బాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏ ఇతర తవ్వకాలకు కొత్త అనుమతులు కోరకుండా.. కేవలం ఈ ఒక్కపనికే అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇక చుట్టూ ఉన్న భూముల్లో ఇంకా నిర్మాణాలేమైనా ఉండిపోయా యా అన్న సందేహం మేరకు జీఐఎస్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను చెన్నై ఐఐటీకి అప్పగించారు. భూమిలో పూడుకుపోయిన కట్టడాలు, నాటి వస్తువులు, నాణేల వంటివి ఏవి ఉన్నా దానితో గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన ఉద్యానవనం కట్టడాలు అతిథులు కూర్చునేందుకు నిర్మించిన బారాదరి -
తాజ్‌మహల్‌కు నిర్లక్ష్యం కాటు
కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటిచుక్కగా, ధవళకాంతుల దివ్య మందిరంగా ఎందరెం దరినో పరవశింపజేసే తాజ్‌మహల్... దాన్ని కాపాడి రక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారుల మనసుల్ని కాస్తయినా కదిలించలేకపోతున్నది. తాజ్ కళాకాంతులు క్షీణిస్తున్నాయని, అది క్రమేపీ పసుపు రంగుకు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఆ శాఖకు చీవాట్లు పెట్టింది. ఆ అపురూప కట్టడాన్ని పరిరక్షించడం చేతగాకపోతే ఆ బాధ్యతనుంచి తప్పుకోండని అధికారు లను మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణముంది. తాజ్‌మహల్‌కు ముప్పు ముంచుకొస్తున్నదని పర్యావరణవేత్తలు దాదాపు పాతికేళ్లనుంచి ఆందోళనపడుతు న్నారు. ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని రక్షించమని ప్రభుత్వాలను వేడుకుంటు న్నారు. అయినా ఫలితం శూన్యం. చివరకు వారు 1996లో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడినుంచి తరలించాలని, సమీపంలోని రిఫైన రీల నిర్వహణకు సహజవాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను గానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలను గానీ ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలా లేదు. నిరుడు ఒక హోటల్ నిర్మాణం కోసం తాజ్ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్ లోని మధురకూ, ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదల్చుకున్నా మని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్ దానికెంత ఆగ్రహం తెప్పించిందో అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూలకెళ్లినా తాజ్‌మహల్‌ను భారత్‌కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్మహల్దే. ఏడు ప్రపంచ వింతల్లో అదొకటి. అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు ఇక్కడి పాలకులకు మాత్రం దానిపై ఆసక్తిగానీ, అనురక్తిగానీ ఉండటం లేదు. బుధవారం సుప్రీంకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. తాజ్‌మహల్ రక్షణకు ఏం చేయా లన్న విషయంలో పురావస్తు శాఖను పక్కనబెట్టి అంతర్జాతీయ నిపుణుల సహాయసహకా రాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ శాఖ ఎంత ఘనంగా పనిచేస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కీటకాలు, శైవలాలు దాన్ని దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ధర్మాసనం విశ్వసించలేదు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచి పోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్‌పై పడుతున్నదని ఆ శాఖ చెప్పింది. నీరు నాచుపట్టడం నిజమే అయినా... అది ఎగిరొచ్చి తాజ్‌ను దెబ్బతీస్తుందా అని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 17 వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాలరాతి కట్టడం వాయు కాలు ష్యంతో వన్నె కోల్పోతున్నది. కాలుష్యం కాటుకు మనుషుల ప్రాణాలే రాలిపడుతున్నప్పుడు కట్టడాల గురించి చెప్పేదేముంది? గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమా ణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఆ పాలరాతి కట్టడం చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు నిరుడు వార్తలొచ్చాయి. అయితే ఇన్నేళ్లుగా జరి గిన విధ్వంసాన్ని అవి ఇప్పటికప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుంది. చారిత్రక కట్టడాలను శిథిల, నిర్జీవ రూపాలుగా చూడకూడదు. అవి కేవలం గత కాలపు కళా కౌశలానికి, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అప్పటి వాస్తు శాస్త్ర వైభవానికి మాత్రమే ప్రతీకలు కావు. అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిగా మాత్రమే వాటిని చూస్తే సరిపోదు. అవి మన వారసత్వ సంపద. వందల ఏళ్లనాటి చరిత్రకూ, సంస్కృతికీ సజీవ సాక్ష్యాలు. ఆనాటి విలువలకు నకళ్లు. ఇప్పటి మన అవసరాలతో, మనకుండే అభిప్రాయాలతో కాక వాటిని చరి త్రకు దర్పణాలుగా గుర్తించగలిగితే ఆ కట్టడాల గొప్పతనం అర్ధమవుతుంది. వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. మిగిలినవారి మాటెలా ఉన్నా... పురావస్తు శాఖలో పనిచేసేవారికి, ఆ శాఖను పర్యవేక్షించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష ఉండాలి. చారిత్రక కట్టడాలను తగు జాగ్రత్తలతో కాపాడి భవిష్య త్తరాలకు భద్రంగా అప్పజెప్పాలన్న స్పృహ ఉండాలి. మన పురావస్తు శాఖకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఏం ప్రయోజనం? ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన తాజ్ మహల్కే పురావస్తు శాఖ ఈ గతి పట్టించింది. ఇక ఇతర కట్టడాల పరిరక్షణ విషయం చెప్పేదే ముంది? యుమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులీయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దాన్లో కలుస్తున్నాయి. ఆ కర్మా గారాలు వదిలే పొగ తాజ్‌మహల్‌ను కమ్ముతోంది. దశాబ్దాలు గడుస్తున్నా వాటి దుష్ప్రభా వాన్ని కాస్తయినా నివారించడానికి ప్రయత్నించకపోవడం నేరం కాదా? కేంద్రంలో ఎవరున్నా తాజ్ పట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. రెండేళ్లక్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మై రాను ఐఎస్ ఉగ్రవాదులు ముట్టడించి, అందులోని కొత్త రాతియుగంనాటి అపురూప కళాఖం డాలను, అనంతరకాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారని విన్నప్పుడు ఎందరెంద రికో మనస్సు చివుక్కుమంది. మన నిర్లక్ష్యం ఇక్కడి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టి స్తున్నదని అర్ధమైతే వాటిపట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అందరికీ తెలుస్తుంది.