
సాక్షి, హైదరాబాద్: ఓ గొప్ప చారిత్రక వారసత్వ కేంద్రమది.. ఆదిమానవుల కాలం నుంచి మహారాజ్యాల పాలనకు సంబంధించిన ఎన్నో ఆధారాలు అక్కడ కొలువయ్యాయి. కానీ విచక్షణ లేకుండా సాగిన తవ్వకాలతో మొత్తం నాశనమయ్యాయి. జనగామ సమీపంలో తాజాగా వెలుగు చూసిన పురాతన నిర్మాణ అవశేషాలను ప్రాథమికంగా పరిశీలించిన పురావస్తు శాఖ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. పెంబర్తి శివారు ఎల్లంలలో వెలుగుచూసిన పురాతన ఇటుక గోడను పురావస్తు శాఖ అధికారి భానుమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. ఆ నిర్మాణం ఏ కాలానికి చెందిందో తేల్చనప్పటికీ.. అది దాదాపు ఏడో శతాబ్దానికి చెందిన కట్టడంలాగా ఉందని అధికారులు గుర్తించారు. ఇటుకల తీరు, నిర్మాణ పద్ధతి ఆధారంగా చాళుక్యుల కాలం నాటిది కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇటుక గోడపైన రెండు మీటర్లకుపైగా ఎత్తుతో భారీగా ఇసుక మేట వేసి ఉందని, దాన్ని తొలగిస్తే గాని సరైన అంచనా రాదని వారు పేర్కొంటున్నారు. చుట్టూ తవ్వకాలు జరిపితేనే ఆ నిర్మాణం పూర్తిగా వెలుగు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. బుధవారం మరింత మేర తవ్వగా తొమ్మిది ఇటుక నిర్మాణ వరసలు వెలుగు చూశాయి. ఈ వివరాలతో రెండు రోజుల్లో పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చికి నివేదిక ఇస్తానని భానుమూర్తి తెలిపారు. గోడ అవశేషమే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో మరెన్నో ఆధారాలు కనిపించాయి. ఆదిమానవుల ఆవాసం, వివిధ అవసరాల కోసం రూపొందించిన రాతి గుంతలు, వినియోగించిన వస్తువులు, సమాధులు కనిపించాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి. పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలకు వెంటనే అనుమతించి పనులు చేపడితే నాటి నిర్మాణాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment