డిజైన్‌కు కేంద్ర జల సంఘం ఆమోదం
గ్యాప్–2లో దెబ్బతిన్న వాల్‌కు 6 మీటర్ల ఎగువన నిర్మాణం
టీ–5 కాంక్రీట్ మిశ్రమం వైపే సీడబ్ల్యూసీ మొగ్గు
అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచన
ఇబ్బందులకు రాష్ట్ర జల వనరుల శాఖ, మేఘా,బావర్ సంస్థలదే బాధ్యత అని స్పష్టీకరణ
కనిష్టంగా 10.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతుతో నిర్మాణం
89.09 నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1.5 మీటర్ల మందం, 1,396.6 మీటర్ల పొడవు
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో 2016–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైన్‌పై ఆమోద ముద్ర వేసింది.
నిర్మాణంలో టీ–16 రకంతో పోల్చితే టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరమని సీఎస్‌ఎంఆర్‌ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) చేసిన ప్రతిపాదన వైపు సీడబ్ల్యూసీ మొగ్గు చూపింది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ మిశ్రమంపై.. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టతపై 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) సూచన తీసుకోవాలని మెలిక పెట్టింది.
నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా..
» ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తారు.
» కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కట్టర్ యంత్రాలతో భూమిని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. రాతి పొర తగిలే(కనిష్టంగా పది మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్లు) వరకూ ప్యానళ్లను దించి.. ఆ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడగా ఏర్పడుతుంది. అదే డయాఫ్రం వాల్.
» డయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి(ఫర్మియబులిటీని లీజీయన్ లలో కొలుస్తారు). అప్పుడే ఆ డయా ఫ్రం వాల్ నాణ్యంగా ఉన్నట్లు లెక్క. గ్యాప్–1లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్‌లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment