సంక్షోభంలో ఎంఎస్‌ఎంఈలు | The MSME industries in the state are facing an unprecedented crisis | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ఎంఎస్‌ఎంఈలు

Apr 3 2025 5:58 AM | Updated on Apr 3 2025 5:58 AM

The MSME industries in the state are facing an unprecedented crisis

కార్మికులు దొరక్క.. పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టాల ఊబిలోకి..   

బరువైన పనిచేయడానికి ఇష్టపడని రాష్ట్ర యువత

శారీరక శ్రమతో కూడిన పనులకు ఇతర రాష్ట్ర కార్మికులపైనే ఆధారం 

ప్రస్తుతం బిహార్, ఒడిశా నుంచి తగ్గిన వలసలు 

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారం 

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల భారం, ప్రోత్సాహకాల ఎగనామం కూడా సంక్షోభానికి కారణం  

కార్మికుల కొరతను పట్టించుకోవడంలేదని చిన్న పారిశ్రామికవేత్తల గగ్గోలు 

తమిళనాడు తరహాలో ప్రభుత్వం దృష్టిపెట్టాలంటూ సూచన 

ఐటీఐ విద్యార్థులకు స్టైపెండ్‌తో కూడిన శిక్షణనిస్తున్న అక్కడి ప్రభుత్వం 

కోయంబత్తూరులో వలస కార్మికులకు ప్రత్యేకంగా హాస్టల్స్‌ కూడా..

రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా సూక్ష్మ, చిన్న మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పనిచేయడానికి కార్మికులు దొరక్క.. పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేక కష్టా­ల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా.. క్లిష్టమైన పనులు చేసే గ్రానైట్, నిర్మాణం, డెయిరీ, టెక్స్‌టైల్, వ్యవసాయం వంటి రంగాలను ఈ కొరత విపరీతంగా వేధిస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉన్నా ఈ పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. అలాగని బయ­ట రాష్ట్రాల నుంచి తెచ్చుకుందామన్నా పరిస్థితుల్లో అది కుదరడంలేదు. 

ఫలితంగా చాలా యూనిట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని సగానికి సగం తగ్గించడమో లేక యూనిట్లు మూసేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమ­­స్యలపై పరిశ్రమల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సెక్రటేరియట్‌ కోఆర్డినేషన్‌ కార్యదర్శి వందనా గుర్నానకు నేరుగా ఫిర్యాదు చేశారు. అయినా, రాష్ట్ర ప్రభు­త్వం ఎంఎస్‌ఎంఈల సర్వే అంటూ కాలక్షేపం చేస్తోందే తప్ప తమ సమస్యలను పరిష్కరించడంలేదని వారు గగ్గోలు పెడుతున్నారు.

వలస కార్మికులపైనే పారిశ్రామికవేత్తల ఆధారం..
ఇతర రాష్ట్రాల కార్మికులు తక్కువ కూలికే ఎక్కువ గంటలు పనిచేస్తున్నందున ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా వలస కూలీలపైనే ఆధారపడుతున్నాయి. వారి పనితీరును బట్టి ఎనిమిది గంటల పనికి రూ.400–500 వరకు చెల్లిస్తున్నారు. పైగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అదనపు గంటలు పనిచేయడంతో పని కూడా త్వరగా అవుతోంది. దీంతో.. కంపెనీలు వీరివైపే ఎక్కువగా చూస్తున్నాయి. ఇక మనవాళ్లు ఒక టన్ను ఔట్‌పుట్‌ చేసే సమయంలో బిహార్, పశ్చిమ బెంగాల్‌ వాళ్లు 1.5 టన్నుల ఔట్‌పుట్‌ అందిస్తారని, అందుకే వలస కార్మికులపై ఆధారపడుతున్నట్లు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.

ఈ పనులకు వారే కరెక్ట్‌.. 
ఇక మైనింగ్, నిర్మాణ రంగాలకు సంబంధించిన బరువైన పనులు చేయడంలో బిహార్, రాజస్థాన్, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల వారికి విశేష అనుభవం ఉంటే.. పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల వారికి వ్యవసాయం, టెక్స్‌టైల్, ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వంటి పనుల్లో నైపుణ్యం ఉంది. ఆ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి కార్మికులను తెచ్చుకుని యూనిట్లను విజయవంతంగా నడిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు బిహార్, ఒడిశాల్లో అభివృద్ధి పనులు జరుగుతుండడంతో అక్కడ వారికి స్థానికంగానే ఉపాధి దొరకుతోంది. దీంతో రాష్ట్రానికి వచ్చి పనిచేయ­డానికి వారు ఇష్టపడడంలేదు. 

ఇప్పుడు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచే వస్తున్నారంటూ పరిశ్రమల యజమానులు చెబుతున్నారు.తమిళనాడు తరహాలో హాస్టల్స్‌ నిర్మించాలి.. తమిళనాడు తరహాలోనే వలస కార్మికులను ఆకర్షించేలా వివిధ పారిశ్రామిక పార్కుల్లో వలస కార్మికులంతా ఒకేచోట ఉండేలా నివాస సదుపా­యాలు కల్పించాలని కోరుతున్నారు. ఎందుకంటే.. కోయంబత్తూరులో వలస కార్మికులకు హాస్టల్స్‌ నిర్మించి ఉచిత వసతిని కల్పిస్తున్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా నిర్మించాలని వీరు సూచిస్తున్నారు. ఇందులో నలు­గురు.. ఆరుగురు వ్యక్తులు ఒకే గదిలో ఉండేలా నిర్మిస్తున్నారని, ఇందుకయ్యే వ్యయా­న్ని ఆయా కంపెనీలు భరించడానికి ముందుకొస్తున్నాయన్నారు. 

ఇదే సమయంలో స్థానిక యు­వ­తకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా మా­నవ వనరులను అందుబాటులోకి తీసుకురావాలని.. ముఖ్యంగా ఐటీఐ వంటి కోర్సు­లు చేస్తున్న వారికి ప్రభుత్వం స్టైపెండ్‌తో నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. ఇక తమిళనాడులో ‘ఇండస్ట్రీ 4.0’ పేరుతో టాటా టెక్నాలజీస్‌తో కలిసి రాష్ట్రంలోని 120 ఐటీఐ కళాశాలల్లో 23 స్వల్పకాలిక కోర్సులను అభివృద్ధిచేసి స్టైపెండ్‌ ఇస్తూ శిక్షణ ఇస్తోందని, అలాగే ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. దీంతోపాటు ఎంఎస్‌ఎంఈలు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రభుత్వం ఆరి్థక సహకారం అందించాలని ఎంఎస్‌ఎంఈ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గ్రానైట్‌ రంగంలో ఎక్కువగా కార్మికుల కొరత.. 
అనాదిగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌ వారికి మైనింగ్‌లో అనుభవం ఉంది. కోవిడ్‌ సమయంలో స్వస్థలాలకు వెళ్లిన వారిలో చాలామంది వెనక్కి రాలేదు. స్థానికులు ఈ పనిచేయలేకపోతున్నారు. కొత్త యువత ఈ రంగంలోకి అడుగుపెట్టకపోవడం.. పాతతరం వారు రాకపోతుండటంతో గ్రానైట్‌ పరిశ్రమ  కార్మికుల కొరతను బాగా ఎదుర్కొంటోంది. – వై. కోటేశ్వరరావు, ప్రెసిడెంట్,  ఏపీ చిన్నతరహా గ్రానైట్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ 

బరువు పనులు పనిచేసేవారు దొరకడం లేదు.. 
కష్టమైన పనులు చేయడానికి కార్మికులు ఎవ్వరూ ముందుకురావడంలేదు. 8–10 గంటలు నిలబడి పనిచేయడానికి రాష్ట్ర యువత సుముఖంగా లేదు. రోజుకు రూ.1,000 లేదా రూ.1,500 లేనిదే వీరు రావడంలేదు. అదే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వారు రూ.400–500కే సిద్ధపడుతున్నారు. కానీ, ఇప్పుడు వీరూ దొరకడంలేదు. దీంతో అన్ని ఎంఎస్‌ఎంఈలకు కార్మికుల కొర­త తీవ్రంగా ఉంది.  – వంకా రవీంద్రనాథ్, ఎండీ, రవళి స్పిన్నింగ్స్‌

సగం ఉత్పత్తి తగ్గించేశాం.. 
ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న టెక్స్‌టైల్‌ రంగానికి కార్మికుల కొరత మరింత ఇబ్బందిగా మారింది. ఉత్పత్తి సగానికి సగం తగ్గించేసినా కూడా 20–30 శాతం కార్మికుల కొరత వెంటాడుతోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌ల నుంచి ఎక్కువమంది కార్మికులు వచ్చేవాళ్లు. ఇప్పుడు ఒడిశా, బిహార్‌ల్లో ఉపాధి అవకాశాలు మెరుగవడంతో వారి లభ్యత తగ్గిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే టెక్స్‌టైల్‌ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది.  – కల్లం వెంకటేశ్వరరెడ్డి,  ఎండీ, కల్లం టెక్స్‌టైల్స్‌తమిళనాడు విధానం 

అమలు చేయాలి.. 
మన రాష్ట్రంలాగే పక్కనున్న తమిళనాడు కూడా వలస కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. కానీ, అక్కడి ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల్లో హాస్టల్స్‌ నిర్మిస్తోంది. అలాగే, స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు స్టైపెండ్‌ ఇస్తూ ఆరు నెలలు శిక్షణనిస్తోంది. ఇదే విధానంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. – వి. మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాఫ్సియా

ఉద్యమ్‌ పోర్టల్‌ ప్రకారం ప్రస్తుతం రాష్ట్ట్ర్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య: 31,70,298
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1,345 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. 
దీనివల్ల 18,901 మంది ఉపాధి కోల్పోయారు.బిహార్, రాజస్థాన్‌ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల నుంచి గతంలో 1.80 లక్షల మంది పనిచేసినట్లు సమాచారం. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సంఖ్య లక్షలోపునకు పడిపోయిందని పరిశ్రమల సంఘాల అంచనా.రాష్ట్రంలో 7,000కు పైగా గ్రానైట్‌ యూనిట్లు ఉన్నాయి. కార్మికుల కొరత, ఇతర ఆర్థిక సమస్యలతో ఉత్పత్తి 60 శాతానికి పైగా పడిపోయింది.

రాష్ట్రంలో  106 స్పిన్నింగ్‌ మిల్స్, 12,635 పవర్‌లూమ్‌ యూనిట్లు, 848 టెక్స్‌టైల్‌ యూనిట్లు ఉన్నాయి.ఏటా 3 లక్షల స్పిండిల్స్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మన యూనిట్లు ఇప్పుడు 50 శాతం కూడా ఉత్పత్తి చేయడంలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement