
ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్ల మేరకు అడ్వాన్సుగా నిధులు విడుదల చేయండి
కేంద్ర ఆర్థిక శాఖకు జల్ శక్తి శాఖ సిఫారసు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాపాల ఫలితంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోయి, కేవలం 41.15 మీటర్లేనని మరోసారి తేలిపోయింది. ఈ ఎత్తుతో ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కేవలం ఓ బ్యారేజిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నా, దానిని ప్రతిపాదిత ఎత్తు 45.72 మీటర్లకు పెంపునకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమీ లేవు. దీంతో కేంద్రం కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా నిధులిస్తోంది.
ఆ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం మరో రూ. 2,700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి అడ్వాన్సుగా విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆర్థిక శాఖకు సిఫారసు చేశారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెరగదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కేంద్రం 2024–25 సవరించిన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.5,512.50 కోట్లు కేటాయించింది. ఇందులో గతేడాది అక్టోబర్ 9న రూ.2,807.69 కోట్లు (రీయింబర్స్‌మెంట్ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు) విడుదల చేసింది.
ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా యూసీలు (వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మిగతా రూ.2,704.81 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.459.69 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపింది. అడ్వాన్సుకు యూసీలు పంపలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 36 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మిగతా నిధుల విడుదలకు జల్ శక్తి శాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టును 2026 మార్చికి పూర్తి చేయడానికి నిధుల సమస్య లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తే 119.40 టీంఎసీలు మాత్రమే నిల్వ చేయొచ్చు. దీనివల్ల వరద ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే.. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment