
డీపీఆర్ ఆమోదం తర్వాతే విశాఖ మెట్రోకు నిధులు
సుంకాలపై చర్చల కోసం అమెరికాకు ప్రత్యేక బృందం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడిగిన సాంకేతిక ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సాంకేతిక సమస్యల వల్లే నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం తెలిపిన తర్వాతే నిధుల మంజూరు సాధ్యమవుతుందని చెప్పారు.
విశాఖ స్టీల్ ఫ్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని, సేవా రంగంలో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని చెప్పారు.
నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని తెలిపారు. తొమ్మిది కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, కొత్తగా పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు.
సుంకాలపై అమెరికా ప్రభావం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లి సుంకాల పెంపుపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నివసించానని, అక్కడ నీటి కష్టాలు అనుభవించానని ఆమె తెలిపారు.
జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికే మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించేవని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ సమీపంలో ఫార్మా రంగం అభివృద్ధికి బల్క్ డ్రగ్ పరిశ్రమలను విస్తృతం చేసినట్లు తెలిపారు.
పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి
వివిధ వ్యాపార వర్గాలు, పారిశ్రామిక, ఐటీ సంఘాల ప్రతినిధులతో గురువారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ ముఖాముఖి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ)ల కోసం ‘కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్’ను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
తొలుత ముంబయిలో జరిగిందని, రెండో చర్చ విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు... ఎంఎస్‌ఎంఈలకు రుణాలు మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ మదింపులపై ఆధారపడకుండా, అంతర్గత మదింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాయన్నారు. అధికారిక అకౌంటింగ్ వ్యవస్థ లేని ఎంఎస్‌ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. విశాఖలో వివిధ వర్గాల ప్రజలను కలసి బడ్జెట్‌పై వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.