కేంద్ర జల శక్తి మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చ
2022లో ముందుకొచ్చిన ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి మళ్లీ నిధులు ఇవ్వాలని కోరారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. పునరావాసం.. పరిహారం తదితర అంశాలపైనా చర్చించారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం
చంద్రబాబు శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతరత్రా అంశాలపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.
2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీతోపాటు 2020 వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వ తప్పిదమే అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు జలశక్తి మంత్రితో భేటీ అయ్యారన్నారు.
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చ జరిగిందని, నిర్మాణ బాధ్యతను 2022లో ముందుకొచ్చిన ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. స్పిల్‌వేకు రక్షణగాఉండే గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని చెప్పారు. సీడబ్ల్యూసీ డిజైన్ల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నేడు ప్రధానితో బాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి
అమిత్ షా లతోనూ భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment