1.35 లక్షల ఖాతాలతో ఐదో స్థానంలో రాష్ట్రం
దేశంలో మొత్తం 24.13 లక్షల మహిళా సమ్మాన్ సేవింగ్ ఖాతాలు
మహిళలు, బాలికల కోసం 2023–24 బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్రం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని 2023–24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం ఇది. పోస్టాఫీసులతో పాటు నిర్దేశించిన బ్యాంకుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు.
ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఖతాలుండగా.. ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహిళా సేవింగ్ సర్టిఫికెట్ అనేది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. స్థిరంగా రెండేళ్ల పాటు మహిళలు, బాలికల పేర్న గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అయినందున దీనికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని ఆడపిల్ల లేదా మహిళల పేర్న మాత్రమే చేస్తారు.
ప్రస్తుతం ఉన్న ఖాతా తెరిచినప్పటి నుంచి కనీసం మూడు నెలల తర్వాత ఒక మహిళ లేదా ఆడపిల్ల సంరక్షకుడు రెండో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాను తెరవొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. అంటే ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఖాతాదారుడికి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది.
ప్రయోజనాలు..
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో రూ.2,00,000 పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5 శాతం వడ్డీ పొందుతారు. మొదటి సంవత్సరంలో, అసలు మొత్తంపై రూ.15,000 వడ్డీని పొందుతారు. రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీని పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment