ఆ మేరకు చర్యలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ దిశానిర్దేశం
సీపేజీ నీరు 17 మీటర్లలోపే ఉండేలా చూడాలని సూచన
పోలవరం ప్రాజెక్టుపై మూడు రోజులుగా చర్చోపచర్చలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులకు గోదావరి వరదల సమయంలో ఆటంకం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ దిశా నిర్దేశం చేసింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో నీటి మట్టం 17 మీటర్ల (సముద్ర మట్టానికి) ఎత్తులోపే ఉండేలా గ్రావిటీ ద్వారా, ఎత్తిపోతల ద్వారా సీపేజీ నీటిని ఎప్పటికప్పుడు తోడేయాలని సూచించింది.
ఇందుకు మరిన్ని పంపులు ఏర్పాటు చేయాలని చెప్పింది. గియాన్ ఫ్రాన్‌కో డి సిస్కో, డేవిడ్ బి పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ (డ్యాం సేఫ్టీ రిహాబిలిటేషన్) సరబ్‌జీత్ సింగ్ బక్షి తదితరులతో కలిసి శనివారం డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో డయా ఫ్రం వాల్ నిర్మాణ విధానంపై చర్చించింది. గోదావరి వరదల సమయంలో డయా ఫ్రం వాల్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది.
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీని నియంత్రించేందుకు డ్యాం పొడవునా.. అంటే 2,458 మీటర్ల పొడవుతో బట్రెస్ డ్యాంను నిరి్మంచాలన్న గతంలో సూచనపై కూడా చర్చించింది. ఎగువ కాఫర్ డ్యాం దిగువన, ఆ డ్యాం గర్భం వద్ద బట్రెస్ డ్యాంను నిర్మించడం వల్ల సీపేజీ నీటిని సమర్థవంతంగా నియంత్రించ వచ్చని నిపుణులు స్పష్టం చేశారు. బట్రెస్ డ్యాం డిజైన్‌లో మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించి.. తగిన సూచనలు చేశారు. ఆ మేరకు డిజైన్ పంపితే ఆమోదిస్తామని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు.
గోదావరి వరదల సమయంలో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాం సీపేజీ నీటితో ముంపునకు గురికాకుండా ఎప్పటికప్పుడు ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్‌లపై కూడా చర్చించారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment