క్రీ.పూ 10వ శతాబ్దం నుంచి క్రీ.పూ 5వ శతాబ్ద కాలం నాటివిగా గుర్తింపు
అడవులు నరికి జీవించిన నాటి సంచార జాతులు
ఒక్కో మనిషి పొడవు ఏడు అడుగులకు పైగానే..
ఆనాటి సమాధుల్లో కుండలు, కొర్రలు, రాగులు, జొన్నలు లభ్యం
తవ్వకాలు జరిపితే మరిన్ని వెలుగుచూసే అవకాశం
అద్దంకి: పురావస్తులోనూ, ఇటు తెలుగు సాహిత్యంలోనూ బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతం ఎంతో పేరెన్నికగన్నది. అద్దంకి, బల్లికురవ, మార్టూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్రీస్తుపూర్వం నాటి సమాధులు తరచూ వెలుగుచూస్తుండడంతో ఈప్రాంతం అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇప్పటికే ఇక్కడ క్రీస్తుపూర్వం 7వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద ప్రాంతంలో నివసించిన వారి మృతదేహాలకు సంబంధించిన పెద్దపెద్ద సమాధుల (రాక్షస గూళ్లు)ను స్థానిక శాసన, పురావస్తు పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి గుర్తించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు.
పురాతన సమాధులున్న ప్రాంతాలివే..
అద్దంకి మండలంలోని దేవనువకొండ, పేరాయిపాలెం, అద్దంకి కొండ, ధర్మవరం (జంగమహేశ్వర అగ్రహారం), మణికేశ్వరం, రామకూరు, మార్టూరు మండలంలోని ద్రోణాదుల, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి గ్రామాల్లోని కొండ దిగువ భాగాల్లో క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 5వ శతాబ్ద కాలంలో నివసించిన మానవుల సమాధులు ఐదారేళ్లుగా బయటపడుతూ వస్తున్నాయి.
నాటి మనుషుల ఎత్తు ఏడడుగుల పైనే..
క్రీస్తుం పూర్వం ఇక్కడ నివసించిన మనుషుల ఎత్తు ఏడడుగుల ఎత్తుకు పైమాటే అనేది ఇక్కడ లభించిన సమాధుల పొడవును బట్టి పరి«శోధకులు అంచనా వేస్తున్నారు. ఇవి ఏడడుగుల పొడవు, నాలుగడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు కలిగి ఉన్నాయి. సమాధికి మూడువైపులా పలకరాళ్లు, పైన ఒక పలకరాయి మూతపెట్టి.. సమాధి తలభాగంలో అప్పట్లో తయారుచేసిన కుండలో మరో చిన్న కుండ పెట్టి అందులో ఆనాడు వారు పండించిన కొర్రలు, జొన్నలు, రాగులను ఉంచారు. దీనిబట్టి ఆ రోజుల్లో ఇవే వారి ఆహారమని అర్థమవుతోంది.
పోడు వ్యవసాయం..
ఇక అప్పట్లో అద్దంకి గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతం మొత్తం అడవులతో నిండి ఉండేదని తెలుస్తోంది. ఇక్కడ నివసించిన సంచార జాతులు అడవుల్లోని చెట్లను నరుక్కుని అక్కడే ఉండేవారు. ఆధిపత్య పోరులో యుద్ధాలు జరిగే సమయంలో ముందుగానే సమాధులను తయారుచేసి ఉంచి, మరణించిన వారి మృతదేహాలను వాటిల్లో ఉంచేవారని తెలుస్తోంది. ఈ సమా«ధులపై మట్టివేసి పూడ్చిన తరువాత పైభాగంలో గుండ్రని ఆకారంలో రాళ్లను పాతేవారు.
ఇదిలా ఉంటే.. క్రీస్తు పూర్వంలోనే నాగరికత ఉందని చెప్పడానికి ఈ సమాధులే నిదర్శనం. సమాధుల తలభాగంలో ఉంచిన మట్టి కుండలు (మృణ్మయ పాత్రలు) ఇప్పటికీ చెక్కుచెదరక (తవ్వకాల్లో పగిలిపోయాయి) ఉన్నాయి. ఈ కుండలు కొన్ని పూర్తిగా ఎర్రగానూ, మరికొన్ని సగభాగం వరకు ఎర్రగా ఉండి, మిగిలిన సగం నల్లగా ఉన్నాయి. పైభాగంలో నగిషీలు చెక్కిఉంచారు.
తవ్వకాలు జరిపితే మరిన్ని ఆనవాళ్లు..
పురాతన సమాధులు బయటపడిన ప్రదేశాల్లో పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే మరిన్ని ఆనవాళ్లు లభించడమే కాక, భావితరాలకు నాటి విశేషాలు అందించిన వారమవుతాం. అద్దంకి చరిత్ర ఇప్పటి తరానికే కాగా దేశం నలుమూలలా చాటి చెప్పాలి. ఇందుకు అధికారులు, ప్రభుత్వం నడుం బిగించాలి. – విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, శాసన పరిశోధకుడు, రచయిత
Comments
Please login to add a commentAdd a comment