ancient history
-
అడవిలో అనంత చరిత్ర.. ప్రకాశం జిల్లాలో బయటపడ్డ ఆధారాలు!
కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు.. శాయపునాయుడి వంశస్తుల పాలనలో ఎందరో చక్రవర్తులు, మహారాజులు నడయాడిన నేల పశ్చిమ ప్రకాశం. గతమెంతో ఘనమైన చరిత్రను నింపుకుంది ఈ ప్రాంతం. దట్టమైన అటవీప్రాంతం.. కొండలు.. కోనలు.. లోయలు.. ఇరుకైన రహదార్లు ఉన్న నల్లమల అటవీ ప్రాంతం ఆనాడు రక్షణ కవచంగా ఉండేది. చరిత్రకారులపరిశోధనల్లో లభ్యమవుతున్న పలు శాసనాలు వీటిని ధ్రువీకరిస్తున్నాయి. 5 వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగానికి చెందిన పురాతన మానవుల సమాధులు సైతం ఇక్కడ బయటపడ్డాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతంలోని ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందా మరి.. – ఒంగోలు డెస్క్ యర్రగొండపాలెం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తురిమెళ్ల శ్రీనివాస్ చేసిన పలు పరిశోధనల్లో శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే శాసనాలు లభ్యమయ్యాయి. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ధ్రువీకరించారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు పురాతన, చారిత్రక నేపథ్యముంది. ఈ ప్రాంతాన్ని కొత్తిపి చాళుక్యులు.. విజయనగర రాజులు.. కాకతీయ రాజులు, అలాగే శాయపునాయుడి వంశస్తులు పాలించారని తెలియజేసే ఎన్నో ఆధారాలు పదిలంగా ఉన్నాయి. 11వ శతాబ్దం ప్రారంభానికి చెందిన కొత్తిపి చాళుక్యుల సామ్రాజ్యానికి చెందిన శాసనం పుల్లలచెరువు మండలం శతకోడులో లభ్యమైంది. కొచ్చెర్లకోట రామలింగేశ్వరస్వామి ఆలయంలో లభ్యమైన కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం విజయనగర సామ్రాజ్యంలో రెండో బుక్కరాయల కుమారుడు మొదటి దేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చివెళ్లారు. ఇందుకు సంబంధించి యర్రగొండపాలెం మండలంలో దట్టమైన అటవీ ప్రాంతమైన పొన్నలబైలు వద్ద శాసనం లభ్యమైంది. 12, 13వ శతాబ్దాల్లో పాలించిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రతాపరుద్రుని శాసనం దొనకొండ మండలం కొచ్చెర్లకోట శివాలయం సమీపంలో బయటపడింది. ఈ ప్రాంతానికి రుద్రమదేవి, అంబదేవుడు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు వచ్చి వెళ్లినట్టు శాసనం ద్వారా తెలుస్తోంది. దూపాడు పరగణా, కొచ్చెర్లపాడు సీమ పేరుతో కాకతీయులు పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక విజయనగర రాజులు పాలన మొదలైంది. శాయపునాయుడి వంశస్తులు(కమ్మరాజులు) శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో దూపాడు పరగణా సంస్థానాధీశులు. వీరు దట్టమైన అటవీ ప్రాంతంలో దద్దనాల వద్ద కోట నిర్మించుకున్నారు. పెద్ద పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1512లో కృష్ణదేవరాయలు శాయపునాయుడి వంశస్తులను పాలించమని అవకాశమిచ్చారు. ఆ తర్వాత తురుష్కుల దాడిలో మొత్తం పట్టణంతోపాటు, కోట ధ్వంసమైంది. తర్వాత వారు యర్రగొండపాలెం వచ్చారు. ఇందుకు సంబంధించి బోయలపల్లి వద్ద శాసనం లభ్యమైంది. దద్దణాల కోటలో పెద్ద కోనేరు ఉంది. ఇక్కడ రోళ్లు ఇప్పటికీ ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన గజపతి రాజు తెలుగు రాయుడు పెద్ద చెరువు కట్టించారు. శ్రీశైలం వయా త్రిపురాంతకం పూర్వం ఎందరో మహరాజులు, వర్తకులు త్రిపురాంతకం మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. త్రిపురాంతకం నుంచి అమానిగుడిపాడు, దద్దనాల, పాలంక మీదుగా శ్రీశైలానికి వెళ్లేవారు. వీరు తమ సైన్యం, గుర్రాలు, ఏనుగులు సేదతీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. సైనికుల కోసం సానికవరం, గుర్రాలు కట్టేసేందుకు గుర్రపుశాల, ఏనుగుల కోసం ఏనుగులదిన్నెపాడు ప్రాంతాలు ఉండేవి. దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండలాల్లో ఇప్పటికీ అదే పేర్లతో గ్రామాలు ఉన్నాయి. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు కొత్త రాతియుగం ఆనవాళ్లు పుల్లలచెరువు మండలంలోని చక్రాలబోడు వద్ద కొత్త రాతియుగానికి చెందిన ఐదు వేల ఏళ్లనాటి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇక్కడ పురాతన మానవుల సమాధులను ఇటీవల గుర్తించారు. కొండ రాళ్లపై ఆనాటి మానవులు చెక్కిన ఎద్దులు, మేకలు, మనుషుల ఆకృతులు వెలుగుచూశాయి. అలాగే త్రిపురాంతకం మండలం బొంకురవారిపాలెం వద్ద ఒకటో శతాబ్దం నాటి బౌద్ద శిల్పం లభ్యమైంది. చక్రాలబోడు వద్ద కొండరాళ్లపై పురాతన చిత్రాలు శత్రుజాడ కనిపెట్టేలా.. ఇరుకుదారులు.. కొండాకోనలు ఉండటంతో శత్రువుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు చక్రవర్తులు ఆనాడు ఈ ప్రాంతాన్ని రక్షణ కవచంగా వినియోగించుకున్నారు. ఇక్కడ అనేక బురుజులు సైతం నిర్మించుకున్నారు. మొదటి దేవరాయలు తరుచూ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేవారని తెలుస్తోంది. ఈ దట్టమైన కీకారణ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రాంతంగా నిర్ధారించుకున్నారు కూడా. నల్లమల శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి దేవరాయలు కాలనికి చెందిన ఒక శాసనం లభ్యమవడంతో ఈ విషయాలు అవగతమవుతున్నాయి. నలురుగురు శిల్పులు చెక్కిన త్రిపురాంతకేశ్వరాలయం 13వ శతాబ్దానికి చెందిన శాసనం త్రిపురాంతకం కొండపైన బయటపడింది. దీని ఆధారంగా ఇక్కడ త్రిపురాంతకేశ్వరుని ఆలయ నిర్మాణానికి ఆనాడు ప్రముఖ శిల్పులుగా పేరొందిన హరిజేతి, రామజేతి, ధగజేతి, సింఘన కృషి చేశారు. ఇందుకు సంబంధించి తెలుగు, సంస్కృతంలో వీరి పేర్లతో ఉన్న చిత్రాలు లభ్యమయ్యాయి. ఆసక్తితోనే చారిత్రక పరిశోధన కురిచేడు మండలంలో ఒక దేవస్థానానికి ధర్మకర్తగా ఉన్న సమయంలో సత్రం నిర్మిస్తుండగా కొన్ని పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి చారిత్రక పరిశోధనపై ఆసక్తి పెరిగింది. గుంటూరుకు చెందిన చరిత్రకారుడు మనిమేల శివశంకర్ ప్రోత్సాహంతో చరిత్రపై పరిశోధన కొనసాగించా. మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్ ప్రచురించిన ఎపిగ్రాఫికా–తెలంగాణికా అనే పుస్తకంలో నేను కనుగొన్న కాకతీయ కాలం నాటి శాసనాన్ని ముద్రించారు. అలాగే మొదటి దేవరాయలు కాలానికి చెందిన శాసనానికి కరెంట్ అఫైర్స్‌లో స్థానం దక్కింది. తాను గుర్తించిన శాసనాలన్నీ భారత ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి పంపగా ధ్రువీకరించి పరిశోధన దిశగా ప్రోత్సహించారు. – తురిమెళ్ల శ్రీనివాస్, చరిత్రకారుడు, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్, యర్రగొండపాలెం -
టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
పచ్చబొట్టు వేసుకోవడం పురాతన కళ. ప్రపంచవ్యాప్తంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. పలుదేశాల్లో బయటపడిన కొత్తరాతియుగం నాటి ఆధారాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3300 నుంచి 3200 నాటి ‘ఓట్జీ ది ఐస్ మ్యాన్’ మమ్మీ.. ఆస్ట్రియా–ఇటలీ సరిహద్దుల్లో దొరికింది. అతడి పచ్చబొట్లను ఎక్స్ రే తీసిన శాస్త్రవేత్తలు.. అతడి శరీరంపైనున్న ప్రతి పచ్చబొట్టుకు కొన్ని నొప్పులు, వ్యాధులే కారణమని నిర్ధారించారు. దీనిని బట్టి పురాతన చికిత్సా విధానాల్లో భాగంగా పచ్చబొట్లను వేసుకునేవారని తేలింది. ఫ్రాన్స్, పోర్చుగల్, స్కాండినేవియన్ దేశాల్లోని పురావస్తు శాఖ పరిశోధకులకు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే పురాతన పరికరాలు దొరికాయి. అవి సుమారు పన్నెండువేల ఏళ్ల నాటి మంచు యుగానికి చెందినవని నిర్ధారించారు. ఆనాటి కొన్ని స్త్రీల బొమ్మలపై పచ్చబొట్ల లాంటి చిత్రాలు ఉన్నాయి. తొడలపైన, వీపు మీద పచ్చబొట్లు వేయించుకోవడం అప్పటి నుంచే ఉండేదనేందుకు ఆ చిత్రాలే నిదర్శనాలు. పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే శాశ్వత చిహ్నాలు. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి. ఇప్పుడు పచ్చబొట్లు రకరకాల రంగులతో మరింత కళాత్మకంగా రూపు దిద్దుకున్నాయి. పూర్వం చాలామంది సంతల్లో, జాతర్లలో తమ పిల్లలు తప్పిపోకూడదని చేతులపై వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించేవారు. పలు తెగలకు చెందిన గిరిజన స్త్రీలు తమ ముంజేతులు, భుజాలు, పాదాలపై నక్షత్రాలు, చందమామ చిత్రాలను తమ తమ సంప్రదాయాల ప్రకారం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అప్పట్లో కొందరు స్త్రీలు సౌందర్యం కోసం బుగ్గలు, పై పెదవి, చుబుకం మీద పుట్టుమచ్చల్లా పచ్చబొట్లు వేయించుకునేవారు. కాలక్రమేణా మనసులోని ప్రేమను వ్యక్తపరచేందుకు ప్రియమైనవారి పేరును పచ్చబొట్టు వేయించుకునేవారు పెరిగారు. ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్ రాజ్యాల్లో బానిసలు, నేరగాళ్లు పారిపోయినా, వారిని సులువుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుగా వారి శరీరాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా పచ్చబొట్లు వేసేవారు. రోమన్ చక్రవర్తుల కాలంలో పచ్చబొట్ల కళకు రాజాదరణ అమితంగా ఉండేది. రాజులను మెప్పించడానికి రాజ దర్బారులోని వారంతా పచ్చబొట్లు వేయించుకునేవారు. దర్బారులోని రాజోద్యోగులను చూసి సామాన్య పౌరులూ పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ధోరణి విపరీతమైన కొన్నాళ్లకు.. కొందరు మతపెద్దలు పచ్చబొట్లను నిషేధించడంతో 19వ శతాబ్దం వరకూ పశ్చిమ యూరోపియన్లకు పచ్చబొట్ల కళ దూరమైంది. ఇక తూర్పు యూరోపియన్లు కూడా పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. అయితే వారు తమ శత్రువులను అవమానించడానికి అసహ్యకరమైన పచ్చబొట్లను నుదుటిపై వేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. టాటూ అర్థాలు వాటర్ కలర్ టాటూలు, బ్లాక్‌వర్క్ టాటూలు, ఇలస్ట్రేటివ్ టాటూలు, హెన్నా టాటూలు, డాల్ఫిన్ టాటూలు, పువ్వులు, సీతాకోక చిలుకలు, పక్షుల టాటూలు.. ఇలా ఒకటి రెండూ కాదు కొన్ని వందల టాటూలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా రంగులు పెరిగే కొద్దీ సహజమైన అందాలను అచ్చంగా అద్దే ఆర్టిస్ట్‌లు చాలామందే పుట్టుకొస్తున్నారు. అయితే టాటూ బాగుంది కదా అని వేయించుకునే వారికంటే.. వాటి అర్థాలు తెలుసుకుని వేయించుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో టాటూ అర్థాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువమంది వాడే కొన్ని టాటూల అర్థాలు చూద్దాం. డ్రాగన్ – ధైర్యం, బలం, రక్షణ, శక్తి, జ్ఞానం సీతాకోక చిలుక – అందం, స్వేచ్ఛ, విశ్వాసం పక్షులు – స్వేచ్ఛ, ఆకాశమే హద్దు నక్షత్రం – ఆశ, విశ్వాసం, పరివర్తన, ఆశయం, విజయం పువ్వులు – సున్నితత్వం, ప్రశాంతత (ఎంచుకున్న రంగును బట్టి, పువ్వును బట్టి మరిన్ని అర్థాలు మారతాయి) సూర్యుడు – ఆరంభం, శక్తి మ్యూజిక్ టాటూ – ప్రేమ, పరివర్తన, అహ్లాదం (డప్పు, పియానో, ప్లేబ్యాక్ బటన్స్ వంటి రూపాలను బట్టి అర్థాలు మారతాయి) పులి – నాయకత్వం, ప్రాణాంతకం, భయానకం, ప్రకృతిపై ప్రేమ సింహం – రాజసం త్రాసు – సానుకూలత, ఆదర్శవాదం శాశ్వత అలంకరణగా టాటూ మేకప్ ఎర్రని పెదవులు, గులాబి బుగ్గలు, నిండుగా ఉన్న కనుబొమలు, దట్టంగా కనిపించే కనురెప్పలు.. వీటితో స్త్రీలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే తాత్కాలిక కాస్మెటిక్స్ పక్కన పెట్టి మరీ.. ఈ పర్మినెంట్ టాటూ రంగుల్ని వాడటం మొదలుపెట్టారు నేటి మహిళలు. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదని.. 1902లో లండన్‌లో మొదలైందనే ఆధారాలున్నాయి. అయితే భారతీయుల్లో పర్మినెంట్ మేకర్ అనే ఈ కళ 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవాప్తంగా పలు సెలూన్స్, స్కిన్ క్లినిక్స్ ఇలాంటి శాశ్వతమైన మేకప్ ట్రెండ్‌ని అందిస్తున్నాయి. అయితే కొంతమంది అమ్మాయిలు.. పార్టీలు, ఫంక్షన్ల కోసం మాత్రమే సెమీ పర్మినెంట్ మేకప్స్ వేయించుకుంటున్నారు. అవి కొన్ని రోజుల పాటు చెక్కు చెదరని అందాన్ని ఇస్తుంటాయి. కానీ పర్మినెంట్ మేకప్స్ పట్ల మోజు చూపే యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. సున్నితమైన పెదవులు, కళ్లు వంటి చోట్ల పర్మినెంట్ మేకప్‌లో భాగంగా రసాయనాలు వాడుతుండటం అంత మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వీటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనుకాడుతున్నారు. ఈ మధ్య కాలంలో కపుల్ టాటూస్‌తో పాటు ఫ్రెండ్స్ టాటూలూ బాగానే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వీటితో పాటు పాపులర్‌గా నిలుస్తున్న కొన్ని టాటూస్ విశేషాలు చూద్దాం. ►కలర్‌ఫుల్ టాటూస్: వీటిలో చాలా కలర్స్ వాడుతారు. మనిషి ముఖం, పువ్వులు వంటి ప్రకృతి అందాలను సహజసిద్ధంగా చెక్కుతారు. ►టెంపరరీ టాటూ: నచ్చిన స్టికర్ సెలెక్ట్ చేసుకుంటే.. దాని మీద ఒకరకమైన స్ప్రే జల్లి.. ఆ స్టికర్ లాగేస్తారు. ఇది మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. ►యానిమే టాటూ: వీడియో గేమ్స్ నుంచి ప్రేరణ రూపొందిన టాటూలు ఇవి. యానిమేషన్ లవర్స్ వీటిని విపరీతంగా వేయించుకుంటున్నారు. ►లివింగ్ టాటూ: దీన్నే త్రీడీ టాటూ అనీ అంటారు. వీటిలో కొన్ని చూడటానికి కదలుతున్నట్లుగా ఉంటాయి. మనదేశంలో ఇవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. ►మ్యూజిక్ ప్లేయింగ్ టాటూ: ఇష్టమైన వారి వాయిస్‌ని రికార్డ్ చేసి.. దాన్ని మ్యూజిక్ సింబల్ రూపంలో మార్పించి, దాన్ని టాటూగా వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న టాటూని.. ఫోన్లో తిరిగి స్కాన్ చేస్తే ఆ వాయిస్ మనకు వినిపిస్తుంది. టాటూ క్యాన్సర్ కారకమా? కలప బూడిదతో, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి.. పూర్వం పచ్చబొట్టు సిరాలను తయారు చేసేవారు. అయితే నేడు రకరకాల పిగ్మెంట్స్తో తయారైన కెమికల్ ఇంకును వాడుతున్నారు. పైగా ఏది ఎంత మోతాదులో వాడుతారనేదానికి సరైన తూకం లేదు. తయారీదారులు వాటి సాంద్రతను, గాఢతను బహిర్గతం చేయాల్సిన పనిలేదు. అలాగే టాటూ డిజైనర్స్.. వేసే డిజైన్ని బట్టి సొంతంగానే సిరాను కలిపి పచ్చబొట్లను చిత్రిస్తారు. దాంతో దేని మోతాదు ఎంత? దాని వల్ల కలిగే ఫలితాలేంటి అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే గత ఏడాది అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టాటూ ఇంక్స్ మీద పలు పరిశోధనలు చేశారు. అప్పుడే ఓ షాకింగ్ విషయం బయటపడింది. టాటూల కోసం ఉపయోగించే ఇంకుల్లో క్యాన్సర్ కారకం ఉందని వారు వెల్లడించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు వంద రకాల టాటూ ఇంకులను పరీక్షించారు. టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండటానికి ఇంకుల్లో ఉండే పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్ని వాడుతుంటారు. శాస్త్రవేత్తలు పరీక్షించిన 100 ఇంకుల్లో 23 ఇంకుల్లో అజో అనే సింథెటిక్ రంగుల ఉనికిని గుర్తించారు. సాధారణంగా అజో సింథెటిక్ రంగులను ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా చేరినా, అధిక సూర్యరశ్మి తగిలినా క్యాన్సర్ కారకంగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడే వారు.. శరీరంపై పచ్చబొట్లు వేయించుకునే ఆలోచన మానుకుంటే మంచిది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీసు ఉద్యోగాలతో పాటు.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) వంటి ఉద్యోగాలు ఒంటిపైన పచ్చబొట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రావు. వాస్తవానికి, శరీరంపై పచ్చబొట్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోవడానికి.. పచ్చబొట్లు పలు వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందనేది ఒక కారణం కాగా.. సైన్యం వంటి రక్షణ రంగంలో శరీరంపై టాటూలు భద్రతకు ముప్పు అనేది మరో కారణం. అంతేకాదు టాటూ వేసుకున్నవారు క్రమశిక్షణా రాహిత్యంతో ఉంటారనే అభిప్రాయమూ ఉంది. అయితే గత ఏడాది.. అన్ని అర్హతలూ ఉన్నా కేవలం తన ఒంటి మీదున్న టాటూ కారణంగా తనకు సర్కారు కొలువును నిరాకరించారంటూ అసోమ్‌కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ హైకోర్టు్టను ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో కోర్టు.. పచ్చబొట్టు తీయించుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. పచ్చబొట్టు తొలగించుకున్నాక మెడికల్ బోర్డు ముందు హాజరు కావాలని, ఆ తర్వాతే నియామకం జరుగుతుందని తీర్పు చెప్పింది. రక్తదానం చేయకూడదా? గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. రాజకీయ అభిమానులు, సినీ నటుల అభిమానులతో పాటు చాలామంది యువత సేవాభావంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం సర్వసాధారణమైంది. అయితే రక్తదానం చేయడానికి ముందుకొచ్చేవారిలో వందకు సుమారు తొంభై మంది టాటూస్తోనే ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే.. రక్తం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు వైద్యులు. ఆ జాగ్రత్తల్లో రక్తం ఇచ్చేవారు టాటూ వేయించుకున్న సమయం కూడా ముఖ్యమే. ఎందుకంటే టాటూ కారణంగా.. కొన్ని రకాల చర్మవ్యాధులు, హెపటైటిస్– ఏ, హెపటైటిస్–బీ, హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులూ సోకే ప్రమాదం ఉంది. ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదనేది రెడ్ క్రాస్ నిబంధన. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన టాటూ సెంటర్స్‌లో టాటూ వేయించుకుంటే సమస్య లేదు. కానీ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ టాటూ వేయించుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు రక్తదానం చేయొద్దని అంటోంది. ఆరోగ్య నిపుణుల సలహాలతో, ప్రొఫెషనల్ టాటూ సెంటర్స్‌లో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇవి వద్దు గురూ.. చిరునవ్వు సానుకూలత.. విచారం ప్రతికూలత అనేది తెలిసిన సంగతే. ఇదే టాటూల విషయంలోనూ కనిపిస్తుంది. సానుకూల సంకేతాలతో మేలు, ప్రతికూల సంకేతాలతో కీడు ఎలా వచ్చిపోతాయో మన పురాణాల్లో ఋషులు వర్ణించారు. అందుకే కొందరు శాస్త్రం తెలిసిన పెద్దలు.. కొన్ని రకాల టాటూలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దం (అశుభానికి సంకేతం), తిరగబడిన గుర్రపు డెక్క (దురదృష్టానికి ప్రతీక), విరిగిన గడియారం (పురోగతికి అవరోధం) విచారంగా ఉండే ముఖం (దుఃఖానికి సూచన) వంటివి ఒంటిపై టాటూలుగా వేయించుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే గబ్బిలం, పాము, బల్లి, పిల్లి, తేలు వంటి రూపాలను టాటూలుగా వేయించుకుంటే అవి జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లవని కొందరి నమ్మకం. మొన్నటికి మొన్న హైదరాబాదీ యువ క్రికెటర్ తిలక్ వర్మ.. ఏషియన్ గేమ్స్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్టేడియంలోనే.. తన జెర్సీని పైకి లేపి టాటూని చూపించాడు. ఒంటిపై వేయించుకున్న తల్లిదండ్రుల రూపాన్ని చూపించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆ దృశ్యం.. టాటూలపై మరోసారి చర్చకు దారితీసింది. యువత ఆకర్షణకూ కారణమైంది. ఈ రోజుల్లో యూత్.. టాటూ, టాటూస్య, టాటూభ్యోహ అనే రీతిలో టాటూ ఒరవడిని ఫాలో అవుతోంది. ఆ మాటకొస్తే అక్కినేని నాగార్జున, త్రిష, జూనియర్ ఎన్టీఆర్, నాని, తాప్సీ, విక్రమ్, షాలినీ పాండే, చార్మీ ఇలా ఎందరో సెలబ్రీటీలు ఏనాడో ఈ ట్రెండ్ ప్రారంభించారు. పచ్చబొట్టు చెరిగిపోద్దిలే.. పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం నాటు పద్ధతులను ఉపయోగించేవారు. వెనిగర్, పావురాల రెట్టలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని పిండికట్టులా పచ్చబొట్టుపై వేసేవారు. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్తో పచ్చబొట్లను తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్తో నలుపు రంగులో ఉన్న పచ్చబొట్లను చాలా సులువుగా తొలగించవచ్చు. కానీ పసుపు, ఎరుపు వంటి ఇతర రంగులను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాత పచ్చబొట్టు కొత్త రంగులతో వన్నె తరగని ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం.. ఆహ్లాదం.. ఆనందం! దానికి పచ్చబొట్టూ మినహాయింపు కాదు! (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!
2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్ మ్యూజియంలో ఉన్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్ చేయడానికి ఒక లోహపు (ఐరన్ ప్లేట్) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను ట్రెఫినేషన్ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా సోషల్ మీడియాలో పేర్కొంది. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
కడపలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు... బృహత్ శిలాయుగం నాటి..
వైఎస్సార్ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్): జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉంది. సుండుపల్లె మండలం దేవావాండ్లపల్లె సమీపాన ఉన్న బృహత్ శిలాయుగపు సమాధులే ఇందుకు నిదర్శనం. ఆ గ్రామానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరాన శేషాచల కొండల్లో బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇవి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి మనుషుల సమాధులు. దేశంలో ఇనుము వాడకం ప్రారంభమైన కాలానికి సంబంధించినవి. ఈ కాలాన్ని ఇనుపయుగం లేదా బృహత్ శిలాయుగం అంటారు. ఆ కాలంలో ఎవరైనా మరణిస్తే ప్రత్యేక పద్దతుల్లో పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించి సమాధులు నిర్మించేవారు. సమాధుల్లో డాల్మెన్స్, స్టోన్ సర్కిల్స్, మెన్ హిర్స్, సిస్ట్ బరియల్స్, డాల్మెనాయిడ్ సిస్ట్స్ తదితదర రకాలు ఉంటాయి. దేవావాండ్లపల్లె వద్ద శేషాచల అడవుల్లో డాల్మెన్స్ రకానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఆర్కియన్ యుగపు గ్రానైట్ రాయిని వీటి నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సమాధుల్లో మనిషి శవంతోపాటు ఇనుప పరికరాలు కూడా పూడ్చి పెడతారు. అప్పట్లో బ్లాక్ అండ్ రెడ్ వేర్ మట్టి పాత్రలను వినియోగించేవారు. చనిపోయిన వ్యక్తికి సమాధుల్లో ఆహారం వంటివి అవసరమవుతాయన్న మూఢ విశ్వాసంతో ఈ మట్టిపాత్రలను కూడా వేసి పూడ్చేవారు. ఈ సమాధుల వద్ద నేటికీ కొన్ని మట్టి పెంకులను మనం చూడవచ్చు. డాల్మెన్స్ సమాధుల లోపలి భాగంలో బండలపై తెలుపు రంగులో ఏనుగు, ఏనుగుపై సవారి చేస్తున్న మనిషి, తాబేళ్లు, డైనోసార్స్‌ను పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆనాటి మనుషులు వీటిని చిత్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆనుకుని ఉన్న మరో గుట్టపై డాల్మెన్స్ ఎన్ సర్కిల్డ్ విత్ శ్లాబ్స్ ఉన్నాయి. తామరపుష్పం ఆకారంలో ఈ సమాధుల చుట్టూ పెద్దపెద్ద బండరాళ్లు పాతారు. గుప్తనిధుల కోసం కొందరు దుండగులు చాలా సమాధులను పగులగొట్టారు. ఎముకలు, కుండ పెంకులు తప్ప అక్కడ ఏమి లభించవని వారికి తెలియకపోవడం వల్లనే సమాధులు పగులగొట్టి ఉంటారు. ప్రస్తుతం మిగిలినవి, పగుల గొట్టడబడినవి అన్నీ కలిపి 50 సమాధులు ఉన్నాయి. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇవి కనిపిస్తాయి. ఇలాంటి సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య భారతంలో కూడా కొంత ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలాంటి సమాధుల సంస్కృతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా లిథిక్ సైట్స్ ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. అందులో కడపజిల్లాలోనే అధికభాగం ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న మెగా లిథిక్ సైట్స్‌లో దేవావాండ్లపల్లె వద్ద ఉన్నవే పెద్దవి కావడం విశేషం. వీటిలో పాండవులు నివసించారని, కడప, చిత్తూరు జిల్లా ప్రజల విశ్వాసం. కనుక వీటిని ఈ జిల్లాల్లో పాండవ గుళ్లుగా పిలుస్తారు. దేవావాండ్లపల్లె ప్రజలు పాండురాజు గుళ్లు అంటారు. ఇలాంటి సమాధుల్లో రాక్షసులు నివసించారని భావించే కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు వీటిని రాక్షస గుండ్లు అని పిలుస్తారు. దేవావాండ్లపల్లెలోనే కాకుండా జిల్లాలో ఇతర చోట్ల కూడా అక్కడక్కడ ఇలాంటి సమాధులు మనకు కనిపిస్తాయి. టూరిస్ట్ హబ్‌గా మార్చాలి దేవావాండ్లపల్లె సమీపంలో ఉన్న బృహత్ శిలాయుగపు సమాధుల ప్రాంతాన్ని టూరిస్టు హబ్‌గా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. సమాధులు ఉన్న ప్రాంతానికి పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రహదారి సౌకర్యం కల్పించాలి. సైట్ చుట్టూ రక్షణ కంచె, వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. – కొండూరు జనార్దన్‌రాజు, కార్యదర్శి, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, కడప చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు!
మార్పు అనేది ఓ కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే హోటల్ రంగంలో కూడా ఆ మార్పు మొదలైంది. మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వివిధ పనులపై వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. దీంతో చిన్న చిన్న హోటల్స్ నుంచి ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు వచ్చేశాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా గడిచిన కాలాన్ని అంత తొందరగా మరచిపోనివ్వదు చరిత్ర. అలాగే కొన్ని భారతీయ హోటల్స్‌కు ఓ వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. వాటి వివరాల ఏంటో ఓ సారి చూద్దాం.. పర్వతాలను చూస్తూ.. ఓ పట్టు పట్టొచ్చు! పశ్చిమ బెంగాల్‌లోని గ్లెనరీ అనే రెస్టారెంట్ డార్జిలింగ్‌లోని కొండ పట్టణ ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటి. దీనికి 130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి భోజనం అద్భుతంగా ఉంటుదని వినికిడి. విందు ఏర్పాటు కోసం ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా గ్లెనరీలో బేకరీ కూడా ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో పర్వతాలను చూస్తూ విందు ఆరగించడానికి ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాల చరిత్ర ముంబైలోని లియోపోల్డ్ కేఫ్ రెస్టారెంట్, బార్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగ్రవాదులు 2008 వ సంవత్సరంలో జరిపిన ముంబై దాడుల లిస్టులో ఈ రెస్టారెంట్ ఉండటంలో దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆ భయంకరమైన దాడులకు సంబంధించి భద్రపరిచిన బుల్లెట్ గుర్తులను రెస్టారెంట్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులకు, స్థానికులకు ఎంతో ఇష్టమైనది. ప్రసిద్థ వ్యక్తులు చేతుల మీదుగా.. కోల్‌కతాలోని ఈ ఇండియన్ కాఫీ హౌస్‌ను ప్రసిద్థ వ్యక్తులు సత్యజిత్ రే, మృణాల్ సేన్, అమెరికన్ కవి అలెన్ గిన్స్బర్గ్ 1876లో స్థాపించారు. అయితే ఆల్బర్ట్ హాల్ అనే పేరు గల ఈ రెస్టారెంట్‌ను 1947 తర్వాత కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ టుండే కబాబీ తినుబండాగారానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ టుండే కబాబీ 115 సంవత్సరాల పురాతనమైనది. దీన్ని 1905లో ప్రారంభించారు. ఇక్క 125 రకాల వంటకాలు దొరుకుతాయని చెబుతారు. ఇక్కడి కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయని ప్రతీతి. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
పాలమూరులో 13వ శతాబ్దం నాటి బుద్ధుడి విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు బతికుండగానే ఆయన స్ఫూర్తి తెలంగాణలో అడుగిడింది. ఆయన బోధనల ప్రచారం మొదలై ఇక్కడి నుంచి కొన్ని ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బౌద్ధం విలసిల్లింది. ఎన్నో అద్భుత నిర్మాణాలు, మందిరాలు రూపుదిద్దుకున్నాయి. కాకతీయుల కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో బుద్ధుడి విగ్రహాలు కొలువుదీరాయి. అందుకే తెలంగాణవ్యాప్తంగా చాలా ప్రాం తాల్లో బుద్ధుడి ప్రతిమలు, శిల్పాలు వెలుగుచూస్తూ ఉంటాయి. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం బుద్ధుడి విగ్రహాలు ఇంతవరకు బయటపడలేదు. చరిత్రకారుల అన్వేషణలోనూ బుద్ధుడి జాడలేదు. కానీ, ఇంతకాలం తర్వాత తొలి సారి ఉమ్మడి పాలమూరులో 4 అడుగుల మూడం గుళాల ఎత్తున్న బుద్ధుడి శిల్పం వెలుగుచూసింది. ఇది తవ్వకాల్లో బయటపడింది కాదు.. ఓ పల్లెటూర్లోని చిన్న ఆలయంలో దేవతామూర్తిగా పూజలందుకుంటోంది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో తొలిసారి బుద్ధుడి శిల్పం రికార్డుల్లో నమోదైనట్టయింది. మశమ్మ ఆలయంలో నిలువెల్లా బొట్లతో.. చాలా ఊళ్లలో గ్రామ దేవతగా భావిస్తూ ఎన్నో విగ్రహాలను పూజిస్తుంటారు. అందులో వీరగల్లులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీరుల శిల్పాలు ఆంజనేయ స్వామి విగ్రహంగా పూజలందుకుంటుంటాయి. అదే కోవలో.. నాగర్‌కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట గ్రామంలో స్థానికులు మశమ్మ విగ్రహానికి ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇందులో రెండు ప్రధాన విగ్రహాలున్నాయి. వీటికి నిలువెల్లా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తుంటారు. ఇటీవల స్థానికుడు శ్రీనివాస బహదూర్‌తో కలసి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి తోకల సంజీవరెడ్డి వేరే పనిమీద వెళ్తూ ఆ దేవాలయాన్ని పరిశీలించారు. ఆయనకు అందులో మశమ్మ విగ్రహం పక్కనున్న మరో విగ్రహంపై అనుమానాలు కలిగాయి. ఈ విషయాన్ని పురావస్తు విశ్రాంత అధికారి, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ ఈమని శివనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మరో చరిత్ర పరిశోధకుడు ఎం.ఏ.శ్రీనివాసన్‌తో వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించి అది బుద్ధుడి విగ్రహంగా తేల్చారు. 13వ శతాబ్దం నాటికి.. ఆ తర్వాత మార్పులు.. ఈ విగ్రహం ఎక్కడిదో, ఎవరు రూపొందించారో స్థానికులకు సమాచారం లేదు. ఎక్కడి నుంచో దాన్ని తెచ్చి ఆలయంలో ఉంచి దేవతామూర్తిగా పూజిస్తున్నారని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. దీని ఆకృతిని బట్టి 13వ శతాబ్దిలో రూపొందించినట్లు గుర్తించారు. కానీ, మళ్లీ 18వ శతాబ్దంలో దాని రూపాన్ని కొంత మార్చినట్లు తేల్చారు. అంతగా అనుభవం లేని శిల్పి ఎవరో విగ్రహం మొహం, చేతులు, కాళ్ల భాగాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి శరీరంపై పలుచటి వస్త్రం ఉన్నట్టుగా చెక్కారని, కుడివైపున ఉపాసిక ప్రతిమను కూడా తీర్చిదిద్దారని తెలిపారు. మధ్యయుగంలో తిమ్మాజిపేట ప్రాంతం బౌద్ధస్థావరమని సమీపంలోనే అలనాటి వర్ధమానపురం ఉంటుందని చెప్పారు. గోన వంశానికి చెందిన గోన బుద్ధారెడ్డి పాలనకు ఇది రాజధాని. బుద్ధసముద్రం, గోనె బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక నిర్మించిన ప్రస్తుతం భూత్పూర్గా పేర్కొంటున్న బుద్ధపురంలు కాకతీయుల కాలంలో బౌద్ధానికి ఈ ప్రాంతంలో ఆదరణను తెచ్చాయని వారు వివరించారు. చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స -
గ్రామాన్నికాపాడిన వారికోసమే.. ఈ గుళ్లు
యాదాద్రి: ఊరిని కాపాడుకోవడానికి ప్రతి గ్రామానికి కొంతమంది వీరులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. వారు ఊర్లలోని పిల్లల్ని, స్త్రీలను, సంపదలను కాపాడటానికి దొంగలతో, పరాయి సైనికులతో, క్రూర జంతువులతోనూ పోరాడేవారు. పోరులో అమరులైన ఆ వీరుల పేరిట నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల్లో ఈ శిలలు దర్శనమిస్తాయి. అయితే వీరగల్లులకు గుడులు కట్టిన విషయం మాత్రం పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తోంది. గుర్తించిన చరిత్రకారులు.. శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, పెసరు లింగారెడ్డి, సహాయకుడు నాగరాజుతో కూడిన చరిత్ర బృందం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో పర్యటించినపుడు అక్కడున్న మన్నెవార్ కోట, శైవ, వైష్ణవ దేవాలయాలు, నిజాం కాలం నాటి మెట్లబావితో పాటు విశేషమైన వీరగల్లులను గుర్తించారు. ఎక్కడాలేనట్లు తుర్కపల్లిలో వీరగల్లులకు గుడికట్టిన అవశేషాలు కనిపించాయి. ఊరికి తూర్పున 2 కూలిన కప్పులతో చిన్నగుడుల అవశేషాలు ఉన్నాయి. వీరగల్లులకు గుడులు కట్టిన 4 రాతి స్తంభాలున్నాయి. భూమిలో మునిగినవి కొన్ని, సగం బయటపడినవి కొన్ని కనిపించాయి. మూడింటిలో 2 ప్రత్యేక వీరగల్లులు ఉన్నాయి. వీరగల్లుల శిల మొదటి వీరగల్లులో రెండవ అంతస్తులో పైన సూర్యచంద్రులు వాటికింద ఒక ఎద్దు, దానికెదురుగా పడ గెత్తిన నాగుపాము ఉన్నాయి. కింది అంతస్తులో దనుర్ధారి సైనికుడున్నాడు. పాము నుండి ఎద్దును కాపాడే క్రమంలో పోరాడి మరణించిన వీరుని స్మారకశిలగా భావిస్తు న్నారు. ఇంతవరకు తెలంగాణలో లభించిన వీరగల్లులలో ఇటువంటి వీరగల్లు ఇదే మొదటిది. రెండవ వీరగల్లులో పెద్దపులులతో పోరాడుతున్న వీరుడు అగుపిస్తున్నా డు. ఓ పులి మరణించి ఉంది. రెండో పులిని వీరుడు శూలంతో పొడుస్తున్నాడు. మూడో పులి పారిపోతున్నది. పులులతో పోరాడి అమరుడైన వీరయోధుని వీరశిల ఇది. తెలంగాణలో వీరులు పెద్దపులులతో పోరాడే దృశ్యాలున్న వీరగల్లులు కూడా ఐదులోపునే లభించాయి. మూడవ వీరగల్లులో వీరుని తలమీద సూర్యచంద్రులున్నా రు. ఇలా వీరగల్లులపై లోతుగా పరిశీలన చేస్తే విలువైన సమాచారం లభించవచ్చు. -
విశాఖ పురాతన చరిత్రకు సాక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : నగర ప్రాచీన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బంకర్ ఒకటి బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్ లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. జాలరి పేట వద్ద మాత్రం బంకర్ శిధిల స్థితిలో కనిపిస్తుంటుంది. తాజాగా వాతావరణ మార్పులతో పాండురంగ స్వామి టెంపుల్ సమీపాన ఓ బంకర్ బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధంలో సముద్రపు గుండా వచ్చే శత్రువులపై దాడి చేసేందుకు సైనికులు ఈ బంకర్లను నిర్మించుకుని అక్కడినుంచి దాడులకు దిగినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా చెప్పుకునే ఈ బంకర్ బయటపడడంతో విశాఖ వాసులు సందర్శిస్తున్నారు. కేవలం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే కాదు రాతి యుగంలో కూడా విశాఖలో నాగరికత ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ప్రాచీన చరిత్ర కలిగిన బంకర్ బయట పడిందన్న విషయం తెలిసి ఉదయాన్నే కొందరు సందర్శకులు అక్కడ చేరుకున్నారు. -
విజయ విహారి
చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. – విజయనగరం గంటస్తంభం వీర బొబ్బిలి.. పర్యాటక లోగిలి వీర బొబ్బిలి పౌరుషానికి.. పరాక్రమానికి ప్రతీక.. త్యాగానికి పర్యాయ పదం. అలాంటి బొబ్బిలి పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి బొబ్బిలి కోట, విశ్రాంత మందిరం (గెస్ట్ హౌస్)లు చూడ ముచ్చటగా ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లోని నాట్యమందిరంలో చెక్క గచ్చులు ఆకట్టుకుంటాయి. రాజుల కోటలో యుద్ధానికి వాడిన కత్తులు, బాకులు, శూలాలు, డాళ్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాండ్ర పాపారాయుడు నాటి యుద్ధంలో గుడారంలో ఉన్న విజయరామరాజును చంపిన కత్తి ఆకట్టుకుంటుంది. వాటిని సందర్శకులు చూసేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా 18వ శతాబ్ధంలో పాత బొబ్బిలి సమీపాన నిర్మించిన యుద్ధ స్తంభం నేటికీ చెక్కు చెదరలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 72,500 ఎకరాల్లో బొబ్బిలి సంస్థానం విస్తరించి ఉండేది. తాండ్ర పాపారాయ కూడలి బొబ్బిలి యుద్ధంలో రాజుల తరపున యుద్ధం చేసిన తాండ్ర పాపారాయుడి విగ్రహాన్ని బొబ్బిలి నడిబొడ్డులో ఏర్పాటు చేశారు. నేటికీ ఆ విగ్రహం పదిలంగా ఉంది. దీని పక్కన ఇటీవల నిర్మాణాలకు ప్రయత్నిస్తే విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని తొలగించారు. ఇప్పుడు తాండ్రపాపారాయుడి విగ్రహం అల్లంత దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. తాజ్‌మహల్ వంటి నిర్మాణం తాజ్‌మహల్ ఆకృతిని పోలి ఉండే పెద్ద గెస్ట్‌హౌస్ కాలనీ ఇక్కడే ఉంది. దీని పక్కనే వెలసిన గృహనిర్మాణాల సముదాయానికి గెస్ట్ హౌస్ కాలనీ అని పేరు. ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్‌ను జరుపుకొన్నాయి. తమిళ, తెలుగు భాషా చిత్రాలతో పాటు ప్రముఖ నటులు సైతం గెస్ట్‌హౌస్, కోట, సంస్థానం ఉన్నత పాఠశాలల్లో షూటింగ్‌ను జరుపుకొన్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలు విజయవంతమవుతాయనే నమ్మకం నిర్మాత, దర్శకులతో పాటు నటులకు కూడా ఉండటం గమనార్హం. రాణీ కోట, గుర్రపుకోనేరు వంటి నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అరుదైన రైల్ బస్ కూడా బొబ్బిలిలో ఉంది. ఇది నిత్యం నాలుగు మార్లు బొబ్బిలి–సాలూరు మధ్య తిరుగుతుంది. ఇందులో బస్సులో మాదిరి కండక్టర్ ఉండటం విశేషం. గోవిందపురంలోని ముక్తిధాం క్షేత్రం జిల్లాలో పైడితల్లి అమ్మవారి దేవస్థానం దేశీయంగా మంచి గుర్తింపు పొందింది. జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలు వాసులు, ఇతర రాష్ట్ర, దేశాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించి పులకరిస్తుంటారు. శ్రీరామచంద్రులవారు కొలువైన రామతీర్థం కూడా ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో ప్రముఖ రామాలయంగా వర్ధిల్లుతోంది. విజయనగరం పట్టణంలో త్రిపురాంతకస్వామి, జగన్నాథ స్వామి, కన్యకాపరమేశ్వరి, గుమ్చి, సారిపల్లి లింగేశ్వరస్వామి, కుమిలి, బొబ్బిలి వేణుగోపాలస్వామి, తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయనగరానికి సమీపంలోని రామనారాయణం దేవాలయం కూడా ప్రసిద్ధి పొందింది. ముఖ్యమైన కట్టడాలు జిల్లా చరిత్రను ఇనుమడింప చేసే కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని నలుమూలలకు చాటాయి. ఇందులో విజయనగరంలోని రాజుల కోట, గంటస్తంభం, మోతీమహాల్, ఊద్ఖానా ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్, పెర్లా హోం, బొబ్బిలి కోట, రాజ్‌మహల్, బొబ్బిలి గెస్ట్‌హౌస్ ఇందులో ముఖ్యమైనవి. చారిత్రక ప్రదేశాలు జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కొదవ లేదు. జిల్లా కేంద్రం విజయనగరం అనేక విధాలుగా గుర్తింపు పొందింది. సంగీత కళాశాల, సాంస్కృతిక కళాశాల, కోరుకొండ సైనిక పాఠశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలతో గుర్తింపు పొందింది. వ్యాపార కేంద్రంగా భాసిల్లుతోంది. వస్త్ర వ్యాపారానికి చిరునామాగా మారింది. బొబ్బిలి కూడా రాజుల కాలం నుంచి గొప్ప చారిత్రక కేంద్రంగా పేరొందింది. సాలూరు లారీ పరిశ్రమ ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు వ్యాపారపరంగా గుర్తింపు పొందింది. పుణ్యగిరి, ధర్మవరం, శంబర, గోవిందపురం, తోటపల్లి ప్రాంతాలు ఆధ్యాత్మికపరమైన.. తాటిపూడి, తోటపల్లి పర్యాటకపరమైన గుర్తింపు పొందాయి. సాలూరు మండలం దండిగాం, కురుకూటి, గమ్మలక్ష్మిపురం తాటిగూడ తదితర ప్రాంతాలు జలపాతాలకు ప్రసిద్ధి చెందాయి. సముద్రతీర ప్రాంతం, చింతపల్లి లైట్‌హౌస్, జంఝావతి రబ్బర్‌డ్యాం ఇలా అనేక గుర్తింపు పొందిన ప్రదేశాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయి. పర్యాటక రంగం అభివృద్ధికి కసరత్తు ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో కలెక్టర్ హరి జవహర్లాల్, ఇతర అధికారులు పర్యాటక పెట్టుబడులు ఆహ్వానించడం, పర్యాటకంగా అభివృద్ధి సాధించడంపై దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇందులో కొన్నింటిని ప్రభుత్వం, మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇదీ ఆలోచన ►ఈ తాటిపూడి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో రూ.1.5 కోట్లు పర్యాటకానికి, రూ.50 లక్షలు అడ్వంచర్ పార్కుకు కేటాయించారు. తోటపల్లిలో రూ.4.5 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ రెండు చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేయాలని నిర్ణయించారు. ►ఈ సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో రూ.50 లక్షలతో సైబీరియా పక్షుల కేంద్రం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. ►చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ► విజయనగరం గంటస్తంభం ఈ సాంస్కృతిక రాజధాని విజయనగరం గుర్తింపును ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించేలా విశాఖపట్నం నుంచి విజయనగరం పట్టణంలోకి వచ్చే మార్గంలో రూ.50 లక్షలతో ముఖద్వారం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ►ఈ దేవాలయ పర్యాటకంలో భాగంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, సీతంపేట అడ్వంచర్ పార్కుతోపాటు రామతీర్థం సందర్శనకు ఒక పర్యాటక ప్యాకేజీని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభిస్తున్నారు. ►ఈ బౌద్ధ స్థూపాల పర్యాటకంలో భాగంగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా శాలిహుండం, విశాఖపట్నం జిల్లా తోట్లకొండ, అనకాపల్లి బొజ్జలకొండ, అమరావతిని కలుపుకొని ఒక సర్కిల్ ఏర్పాటు చేశారు. ఇందులో రామతీర్థం, గంట్యాడ మండలం నీలావతిలో ఉన్న బౌద్ధ స్థూపాలను కూడా కలిపి సర్కిల్ తయారు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు అనుమతి రావలసి ఉంది. ►ఈ స్వదేశీ దర్శనం పథకం కింద కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రారంభమై ఆ జిల్లా నర్సీపట్నం, లంబసింగి, అరకుతో ముగిసే విధంగా ఒక రోజు పర్యాటక యాత్ర ఏర్పాటు చేశారు. దీన్ని మరోరోజు విస్తరించి విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మకొండ, పెద్దగెడ్డ జలాశయం, దండిగాం, కురుకూటి జలపాతాలు, శంబర పోలమాంబ, బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయాలు, కోట, యుద్ధ స్మారక ప్రదేశం, వీణల తయారీ, సీతానగరం చెల్లంనాయుడువలస, పార్వతీపురం మండలం అడ్డాపుశీల మహానంది, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి, కొమరాడ మండల రాజులకోట, గుమ్మలక్ష్మీపురం మండలం తాటిగూడ జలపాతాలతో ముగిసేలా పర్యాటక యాత్ర నిర్వహించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. తాటిపూడి జలాశయం రా.. రమ్మని.. గంట్యాడ (గజపతినగరం): పచ్చని కొండల నడుమ అందమైన జలాశయం.. ప్రకృతి సోయగాలకు తాటిపూడి పెట్టింది పేరు. తాటిపూడి అందాలను తిలకించేందుకు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు సేదదీరేందుకు తాటిపూడి అవతల గిరివినాయక కాటేజీలను నిర్మించారు. గిరి వినాయక కొండపైకి ఎక్కితే చేతికందేలా కనువిందు చేసే మేఘాల్ని చూసి కేరింతలు కొడతారు. గిరిజనుల సంప్రదాయ వంటలు, ధింసా నృత్యం ఆకట్టుకుంటాయి. నోరూరించే బొంగు చికెన్, మట్టి చికెన్.. నూనె లేకుండా చేసే వంటకాలను పర్యాటకులు లొట్టలేసుకొని తింటారు. సినిమాల చిత్రీకరణ తాటిపూడి పరిసరాల్లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా చిత్రీకరించారు. తాటిపూడిలో చిన్న దృశ్యం చిత్రీకరించినా ఆ సినిమా హిట్ అవుతుందని నటుడు నందమూరి బాలకృష్ణకు నమ్మకం ఉంది. ఆనాటి మరోచరిత్ర మొదలుకొని, బొబ్బిలి సింహం, లెజెండ్, సోలో, గంగోత్రిలో ఒకపాట, అల్లరి నరేష్ సినిమా మడతకాజాలో ఒక పాట.. ఇలా చాలా సినిమాలను తాటిపూడి జలాశయం ఆవరణలో చిత్రీకరించారు. తాటిపూడి జళాశయం మధ్యలోని ఐలాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎలా చేరుకోవాలి తాటిపూడి చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు, ఆటోలు, టూరిస్ట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. విశాఖ, అరకు నుంచి వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా తాటిపూడి జళాశయం అందాలు తిలకించకుండా వెళ్లరు. అందాల మన్యం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో పర్యాటక రంగం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్.కె.పాడు గ్రామ సమీపంలో ఉద్యానవన నర్సరీ, శిక్షణ కేంద్రం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నర్సరీలో సుమారు రూ.38 లక్షలతో ఇటీవల చుట్టూ కంచె, సిమెంటు రోడ్లు, ప్రవేశంలో ఆర్చీ, పగోడా, యోగా ప్రతిమలు, పద్మవ్యూహం తదితర పర్యాటకాభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. మండలంలోని తాడికొండ గ్రామంలోని మొగనాళి గెడ్డ జలపాతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ జలపాతాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో పర్యాటకాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. – గుమ్మలక్ష్మీపురం (కురుపాం) పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. అందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి నిధులు వచ్చాక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం వల్ల తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యం పెంచి బాధ్యత పెంచాలన్న ఆలోచనలో పెద్దలున్నారు. రానున్న రోజుల్లో జిల్లా పర్యాటకానికి మంచి రోజులు వస్తాయి. – పి.ఎన్.వి.లక్ష్మీనారాయణ, జిల్లా పర్యాటక శాఖాధికారి -
మూడు వేల ఏళ్ల క్రితమే ‘జల్లికట్టు’
తమిళనాడులో ‘జల్లికట్టు’ పోటీలను శాశ్వతంగా అనుమతించాలంటూ అక్కడి ప్రజలు ఓపక్క ఆందోళన కొనసాగిస్తుంటే మరోపక్క జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమా, హిందూ సంప్రదాయమా? అంటూ మేథావుల మధ్య చర్చ జరుగుతోంది. జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమని, సంఘం సాహిత్యం నాటి కాలం నుంచే, అంటే రెండువేల సంవత్సరాల కాలం నుంచే అమల్లో ఉందని, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు వాదిస్తున్నారు. జల్లికట్టు హిందూ సంప్రదాయమని, ఈ క్రీడను నిషేధించడం హిందూత్వం మీద దాడి చేయడమేనని హిందుత్వ మేథావులు వాదిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలో ఉన్న మొహెంజొదారోలో మూడువేల సంవత్సరాల క్రితం దొరికిన ముద్ర (సీల్)లో జల్లికట్టు బొమ్మ ఉందని సింధూ నాగరికతపై అధ్యయనం చేసిన ప్రముఖ ప్రపంచ చరిత్రకారుల్లో ఒకరైన ఐరావతం మహదేవన్ తెలియజేశారు. ఆ ముద్రలో ఎద్దు లేదా దున్నపోతు మనుషులను తన కొమ్ములతో ఎత్తి పడేస్తున్నట్లు ఉంది. సింధూ నాగరికతకు సంబంధించిన పత్రాలు కూడా ద్రవిడ భాషలో రాసినవేనన్నది ఆయన వాదన. ప్రాచీన తమిళ భాషా చిహ్నాలకు, హరప్పా కాలం నాటి భాషాచిహ్నాలకు దగ్గరి పోలికలు చాలా ఉన్నాయని మహదేవన్ తన అధ్యయనంలో తేల్చారు. 1964లో యూరీ క్నోరోజొవ్ నాయకత్వంలో ఓ రష్యా బృందం, ఫిన్లాండ్కు చెందిన మరో పురాతత్వ చరిత్రకారుల బృందం సింధూ లిపిపై అధ్యయనం చేసి దాన్ని ద్రవిడ భాషగానే తేల్చాయి. ఫిన్లాండ్ బృందంలో పాల్గొన్న నాటి హెల్సింకి యూనివర్సిటీ ఇండాలజిస్ట్ అస్కో పర్పోలా సింధూ లిపిలో ఉన్న పదాలు లేదా శబ్ద చిత్రాలను ద్రవిడ భాషలోని చిత్రాలతో పోల్చి చూసి రెండూ ఒకే భాషలోనివని తేల్చారు. ‘ది రూట్స్ ఆఫ్ హిందూయిజం, ది ఎర్లీ ఆర్యన్స్ అండ్ సివిలైజేషన్’ అనే పుస్తకంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సింధూ లిపి ద్రవిడ భాషలో ఉన్నందున సింధూ నాగరికత ద్రవిడులదని, ఆర్యులు అక్కడికి తర్వాత వచ్చారన్నది ఐరావతం మహదేవన్, ఆస్కో పర్పోలాలతోపాటు మరో సింధూ స్కాలర్ బ్య్రాన్ వెల్స్ వాదన. ఇలినాయి యూనివర్శిటీలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి, ప్రస్తుతం గూగుల్ రిసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న రిచర్డ్ స్పోర్ట్, హార్వర్డ్ యూనివర్శిటీలో సంస్కృత భాషా పరిశోధకుడిగా పనిచేస్తున్న మైఖేల్ విట్జెల్ ఈ ద్రవిడ వాదనతో వ్యతిరేకిస్తున్నారు. అసలు సింధూ స్క్రిప్టు అనేదే బూటకమని, సింధూ నాగరికత మూలాలు ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయన్నది వీరిద్దరి అభిప్రాయం. జల్లికట్టు వివాదం పుణ్యమా అని ప్రాచీన నాగరికత, భాషలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సింధూ నాగరికత ద్రవిడులదా, హిందువులదా లేదా ఆర్యులదా అన్నది పక్కన పెడితే మొహెంజొదారోలో దొరికిన ముద్రను బట్టి జల్లికట్టు సంప్రదాయం మూడువేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లు తెలుస్తోంది. -
తాడ్వాయి అడవుల్లో డోల్మన్ సమాధులు
♦ ఒక్కోటి 15 అడుగుల పొడవు, వెడల్పున్న రాతి సమాధులు ♦ రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ప్రాచీన చరిత్ర ములుగు: వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న సూరగుండయ్య గుట్టల్లో 10 వేల ఏళ్ల కిందటి ప్రాచీన సమాధులు వెలుగుచూశాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి.. తన బృందం సభ్యుడు పకిడె అరవింద్, స్థానికులు మహేశ్, లక్ష్మయ్య, హరిలాల్ సహకారంతో చేసిన పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. సూర గుండయ్య గుట్ట ఆది మానవులకు ఆవాసంగా ఉండేదని, ఇక్కడ బయల్పడిన సమాధులు ఆనాటి మానవజాతి నమ్మకాలు, విలువల సాంకేతిక పరిజ్ఞానానికి ఆనవాళ్లుగా ఉన్నాయని తెలిసింది. గుట్టకు కుడి, ఎడమ వైపులా నిరంతరం ప్రవహించే వాగు, దట్టమైన అడవి ఉండడం వల్ల ఆది మానవులకు ఆవాసంగా మారిందని ఆయన చేసిన చరిత్ర పరిశోధనలో తేలింది. సమాధి రాళ్లను తొలచి, సమాధుల నిర్మాణ ప్రాంతాలకు తరలించడం, టన్నుల కొద్దీ బరు వు ఉండే పైకప్పు బండలను వాటిపై అమర్చ డం విశేషంగా కనబడుతుంది. ఇసుకరాయితో ఏర్పడ్డ సూరగుండయ్య గుట్టను పలకలు పలకలుగా తొలచి ‘గది’లా నిర్మాణం చేశారు. సమాధులపై ‘ఏకరాయి కప్పు బండ’లను అమర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతి సమాధికీ ప్రవేశమార్గం ఓ మనిషి చొరబడేలా ఉంది. ఎటు చూసినా 15 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఏకరాతి బండల సమాధులు తొలిసారి ఇక్కడే వెలుగుచూశాయి. ఈ కప్పు బండలు రెండు నుంచి మూడు ఫీట్లకుపైగా సమాన మందంతో ఉన్నాయి. చాలా సమాధుల్లో లోతు తక్కువ ఉన్న 5 నుంచి 6 అడుగుల నీటి తొట్లు ఉన్నాయి. ఒక సమాధిలో మూడు నీటి తొట్లు ఉండడం విశేషం. వీటిని డోల్మన్ సమాధులు అంటారని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. మూడు రకాల్లో... సూరగుండయ్య గుట్ట ప్రాంతంలో మూడు రకాల డోల్మన్ సమాధులు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటి రకం నేలపై, రెండవ రకం రాతిపై, మూడో రకం రాళ్లను కుప్పగా పోసి మధ్యలో సమాధి నిర్మించిన ఆనవాళ్లున్నాయి. రాతిపై నిర్మించినవి మినహా మిగతా రెండు రకాల సమాధులు దీర్ఘ చతురస్రాకారంలో నిలబెట్టి ఉన్నా యి. ప్రాచీన ఆదిమానవుల సమాధుల్లో ఉన్న శిలువాకృతులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గతంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిలువ ఆకృతి సమాధి బయటపడింది. అయితే దామరవాయిలో కేవలం శిలువాకృతులు సమాధిపై పెట్టడానికి మాత్రమే అన్నట్లుగా ఉపయోగించబడ్డాయి. రెండు రాళ్ల కుప్పలపై నిర్మించబడిన డోల్మన్ సమాధుల మధ్య విరిగి పోయి ఉన్న శిలువాకృతులు 4 అడుగుల పొడవున కనిపిస్తాయి. అనేక శిలువాకృతులు బండను తొలిచినట్లుగా ఉన్నాయి. అప్పటికే అక్కడ నివసించిన జాతి వలసపోవడం, బలహీనపడి అంతరించిపోవడం లాంటివి జరిగి ఉండవచ్చని ఈ పరిశోధకుడి అంచనా. శిలువాకృతులు ఏసుక్రీస్తు శిలువను పోలి ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం నాటివని పరిశోధకుడు తెలిపారు. సమాధులపై పురావస్తు శాఖ సమగ్ర అధ్యయనంచేసి పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకొస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి సమాధుల లెక్కను తేల్చి, ఆది మానవుల సంప్రదాయ పనిముట్లను బయటి ప్రపంచానికి తెలిసేలా కృషి చేయాలని పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి కోరారు.