అజీంగఢ్‌కు గడ్డు రోజులు | A fort from the Nizam era is falling into ruin | Sakshi
Sakshi News home page

అజీంగఢ్‌కు గడ్డు రోజులు

Published Thu, Jan 30 2025 4:44 AM | Last Updated on Thu, Jan 30 2025 6:56 PM

A fort from the Nizam era is falling into ruin

నిజాం కాలంనాటి చారిత్రక కట్టడం

గతంలో పలు సినిమాల చిత్రీకరణ

నేడు శిథిలావస్థకు చేరుతున్న పురాతన కట్టడం

ఒకప్పుడు ఎంతోమంది ఇంజనీర్లు సహా ఇంకెందరో సేదదీరారు ఆ కోట నీడలో.. ఇంకెన్నో చిత్రాల్లోని సన్నివేశాలు చిత్రీకరించారు అక్కడే.. పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.. ప్రభుత్వ నిరాదరణతో శిథిలావస్థకు చేరింది. అదే నిజాం కాలం నాటి అజీంగఢ్‌ కోట. – దేవరకొండ

నిజాం నాటి కట్టడం
1980వ దశకంలో అజీంగఢ్‌ కోటలో రెండు తెలుగు సినిమాల్లోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. 1940–43 సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి నిజాం కాలంనాటి ఇంజనీర్‌ ఖాజా అజ్మొద్దీన్‌.. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో దుందుభి వాగుపై ప్రాజెక్టును నిర్మించారు. 

ఈ క్రమంలో ప్రాజెక్టుకు మంజూరు చేసిన నిధులు.. నిర్మాణం పూర్తయ్యాక కూడా కొన్ని మిగిలాయి. దీంతో డిండి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని బాపన్‌కుంట వద్ద అజీంఘడ్‌ అనే పేరుతో రాతి కోటను నిర్మించారు.

ఆ కోటను ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక కూడా ఇంజనీర్లకు విశ్రాంతి భవనంగా ఉపయోగపడింది. నిజాం పరిపాలన అనంతరం స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖ అతిథి గృహంతో పాటు అజీంగఢ్‌ కోట ఇరిగేషన్‌ శాఖ అధీనంలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఆ శాఖ పర్యవేక్షణలోనే కోట నిర్వహణ కొనసాగుతోంది.  

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల్లో భాగంగా అజీంగఢ్‌ మరమ్మతులకు దాదాపు రూ.20 లక్షలు కేటాయించింది. దీంతో అధికారులు అజీంగఢ్‌ కోటలో మెట్ల నిర్మాణం, నూతనంగా తలుపులు, కిటికీలు, భవనానికి రంగులు తదితర మరమ్మతులు చేపట్టి.. ఫర్నిచర్‌ ఏర్పాటు చేశారు. 

రాతితో పటిష్టంగా నిర్మించిన ఈ కోటను డిండి–దేవరకొండ వెళ్లే మార్గమధ్యలో రాకపోకలు సాగించేవారు చూసి అబ్బుర పడుతుంటారు. కానీ కోట నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు.

రెండు తెలుగు సినిమాల చిత్రీకరణ  
ఈ కోటలో 1980వ దశకంలో రెండు తెలుగు సినిమాలకు సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు. నాగేశ్వరరావు, అన్నపూర్ణ నటించిన ‘ఆత్మగౌరవం’చిత్రంలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించిన ‘అమాయక చక్రవర్తి’ సినిమాను దాదాపు 30 శాతం ఇక్కడే చిత్రీకరించారు.

వైభవం కోల్పోతున్న అజీంగఢ్‌
ఎంతో చరిత్ర కలిగిన అజీంగఢ్‌ కోట ప్రస్తుతం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. అప్పటి ఇంజనీర్ల ప్రతిభతో ఎంతో సుందరంగా నిర్మించిన ఈ కోట నిర్వహణ లోపంతో పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. మొత్తం రాతితో చెక్కు చెదరకుండా నిర్మించిన కోట ప్రస్తుతం చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. 

ప్రభుత్వాలు, అధికారులు కోట అభివృద్ధికి చర్యలు చేపట్టి.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. కాంగ్రెస్‌ ప్రభుత్వం అజీంగఢ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే.. డిండి మండల అభివృద్ధి మరింత సాధ్యపడుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement