విజయ విహారి | Ancient Monuments In Vizianagaram Tourism day Special Story | Sakshi
Sakshi News home page

విజయ విహారి

Published Fri, Sep 27 2019 8:43 AM | Last Updated on Wed, Dec 4 2019 11:31 AM

Ancient Monuments In Vizianagaram Tourism day Special Story - Sakshi

విజయనగరం కోట

చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
– విజయనగరం గంటస్తంభం 

వీర బొబ్బిలి.. పర్యాటక లోగిలి
వీర బొబ్బిలి పౌరుషానికి.. పరాక్రమానికి ప్రతీక.. త్యాగానికి పర్యాయ పదం. అలాంటి బొబ్బిలి పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి బొబ్బిలి కోట, విశ్రాంత మందిరం (గెస్ట్‌ హౌస్‌)లు చూడ ముచ్చటగా ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లోని నాట్యమందిరంలో చెక్క గచ్చులు ఆకట్టుకుంటాయి. రాజుల కోటలో యుద్ధానికి వాడిన కత్తులు, బాకులు, శూలాలు, డాళ్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాండ్ర పాపారాయుడు నాటి యుద్ధంలో గుడారంలో ఉన్న విజయరామరాజును చంపిన కత్తి ఆకట్టుకుంటుంది. వాటిని సందర్శకులు చూసేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బొబ్బిలి యుద్ధానికి గుర్తుగా 18వ శతాబ్ధంలో పాత బొబ్బిలి సమీపాన నిర్మించిన యుద్ధ స్తంభం నేటికీ చెక్కు చెదరలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 72,500 ఎకరాల్లో బొబ్బిలి సంస్థానం విస్తరించి ఉండేది.

తాండ్ర పాపారాయ కూడలి
బొబ్బిలి యుద్ధంలో రాజుల తరపున యుద్ధం చేసిన తాండ్ర పాపారాయుడి విగ్రహాన్ని బొబ్బిలి నడిబొడ్డులో ఏర్పాటు చేశారు. నేటికీ ఆ విగ్రహం పదిలంగా ఉంది. దీని పక్కన ఇటీవల నిర్మాణాలకు ప్రయత్నిస్తే విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని తొలగించారు. ఇప్పుడు తాండ్రపాపారాయుడి విగ్రహం అల్లంత దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.

తాజ్‌మహల్‌ వంటి నిర్మాణం
తాజ్‌మహల్‌ ఆకృతిని పోలి ఉండే పెద్ద గెస్ట్‌హౌస్‌ కాలనీ ఇక్కడే ఉంది. దీని పక్కనే వెలసిన గృహనిర్మాణాల సముదాయానికి గెస్ట్‌ హౌస్‌ కాలనీ అని పేరు. ఇక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్‌ను జరుపుకొన్నాయి. తమిళ, తెలుగు భాషా చిత్రాలతో పాటు ప్రముఖ నటులు సైతం గెస్ట్‌హౌస్, కోట, సంస్థానం ఉన్నత పాఠశాలల్లో షూటింగ్‌ను జరుపుకొన్నాయి. ఇక్కడ తీసిన చిత్రాలు విజయవంతమవుతాయనే నమ్మకం నిర్మాత, దర్శకులతో పాటు నటులకు కూడా ఉండటం గమనార్హం. రాణీ కోట, గుర్రపుకోనేరు వంటి నిర్మాణాలు చూపరులను ఆకట్టుకుంటాయి. అరుదైన రైల్‌ బస్‌ కూడా బొబ్బిలిలో ఉంది. ఇది నిత్యం నాలుగు మార్లు బొబ్బిలి–సాలూరు మధ్య తిరుగుతుంది. ఇందులో బస్సులో మాదిరి కండక్టర్‌ ఉండటం విశేషం. 


గోవిందపురంలోని ముక్తిధాం క్షేత్రం 

జిల్లాలో పైడితల్లి అమ్మవారి దేవస్థానం దేశీయంగా మంచి గుర్తింపు పొందింది. జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాలు వాసులు, ఇతర రాష్ట్ర, దేశాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించి పులకరిస్తుంటారు. శ్రీరామచంద్రులవారు కొలువైన రామతీర్థం కూడా ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలో ప్రముఖ రామాలయంగా వర్ధిల్లుతోంది. విజయనగరం పట్టణంలో త్రిపురాంతకస్వామి, జగన్నాథ స్వామి, కన్యకాపరమేశ్వరి, గుమ్చి, సారిపల్లి లింగేశ్వరస్వామి, కుమిలి, బొబ్బిలి వేణుగోపాలస్వామి, తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయనగరానికి సమీపంలోని రామనారాయణం దేవాలయం కూడా ప్రసిద్ధి పొందింది. 

ముఖ్యమైన కట్టడాలు
జిల్లా చరిత్రను ఇనుమడింప చేసే కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని నలుమూలలకు చాటాయి. ఇందులో విజయనగరంలోని రాజుల కోట, గంటస్తంభం, మోతీమహాల్, ఊద్‌ఖానా ప్యాలెస్, కోరుకొండ ప్యాలెస్, పెర్లా హోం, బొబ్బిలి కోట, రాజ్‌మహల్, బొబ్బిలి గెస్ట్‌హౌస్‌ ఇందులో ముఖ్యమైనవి. 

చారిత్రక ప్రదేశాలు
జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కొదవ లేదు. జిల్లా కేంద్రం విజయనగరం అనేక విధాలుగా గుర్తింపు పొందింది. సంగీత కళాశాల, సాంస్కృతిక కళాశాల, కోరుకొండ సైనిక పాఠశాల, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలతో గుర్తింపు పొందింది. వ్యాపార కేంద్రంగా భాసిల్లుతోంది. వస్త్ర వ్యాపారానికి చిరునామాగా మారింది. బొబ్బిలి కూడా రాజుల కాలం నుంచి గొప్ప చారిత్రక కేంద్రంగా పేరొందింది. సాలూరు లారీ పరిశ్రమ ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు వ్యాపారపరంగా గుర్తింపు పొందింది. పుణ్యగిరి, ధర్మవరం, శంబర, గోవిందపురం, తోటపల్లి ప్రాంతాలు ఆధ్యాత్మికపరమైన.. తాటిపూడి, తోటపల్లి పర్యాటకపరమైన గుర్తింపు పొందాయి. సాలూరు మండలం దండిగాం, కురుకూటి, గమ్మలక్ష్మిపురం తాటిగూడ తదితర ప్రాంతాలు జలపాతాలకు ప్రసిద్ధి చెందాయి. సముద్రతీర ప్రాంతం, చింతపల్లి లైట్‌హౌస్, జంఝావతి రబ్బర్‌డ్యాం ఇలా అనేక గుర్తింపు పొందిన ప్రదేశాలు పర్యాటకానికి అనుకూలంగా ఉన్నాయి. 

పర్యాటక రంగం అభివృద్ధికి కసరత్తు 
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో కలెక్టర్‌ హరి జవహర్‌లాల్, ఇతర అధికారులు పర్యాటక పెట్టుబడులు ఆహ్వానించడం, పర్యాటకంగా అభివృద్ధి సాధించడంపై దృష్టి సారించారు. పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఇందులో కొన్నింటిని ప్రభుత్వం, మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. 

ఇదీ ఆలోచన
►ఈ తాటిపూడి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో రూ.1.5 కోట్లు పర్యాటకానికి, రూ.50 లక్షలు అడ్వంచర్‌ పార్కుకు కేటాయించారు. తోటపల్లిలో రూ.4.5 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ రెండు చోట్ల ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేయాలని నిర్ణయించారు.
►ఈ సీతానగరం మండలం చెల్లంనాయుడువలసలో రూ.50 లక్షలతో సైబీరియా పక్షుల కేంద్రం ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.
►చారిత్రక కట్టడాలు. అపురూప జ్ఞాపకాలు. ప్రకృతి సోయగాలు.. మనసును ఉల్లాసపరుస్తున్నాయి. చరిత్రను కళ్లముందుంచుతున్నాయి. ఆధ్యాత్మిక.. సాంస్కృతిక కళా రంగాల్లోనే కాదు.. అందమైన ప్రకృతికి చిరునామా విజయనగరం జిల్లా. అందుకే దేశ విదేశాల పర్యాటకులు జిల్లా సందర్శనకు ఉవ్విళ్లూరుతారు. మనసు దోచే మనోహర ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లయిన విజయనగరం జిల్లా పర్యాటకాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పర్యాటక రంగాన్ని కొంత పుంతలు తొక్కించే క్రమంలో పర్యాటక పాలసీపై దృష్టి పెట్టింది. దీంతో రానున్న అయిదేళ్లలో జిల్లా పర్యాటకంగా మరింత కొత్త శోభ సంతరించుకుంటుందని.. పర్యాటకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
► విజయనగరం గంటస్తంభం ఈ సాంస్కృతిక రాజధాని విజయనగరం గుర్తింపును ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు విస్తరించేలా విశాఖపట్నం నుంచి విజయనగరం పట్టణంలోకి వచ్చే మార్గంలో రూ.50 లక్షలతో ముఖద్వారం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. 
►ఈ దేవాలయ పర్యాటకంలో భాగంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, సీతంపేట అడ్వంచర్‌ పార్కుతోపాటు రామతీర్థం సందర్శనకు ఒక పర్యాటక ప్యాకేజీని పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభిస్తున్నారు. 
►ఈ బౌద్ధ స్థూపాల పర్యాటకంలో భాగంగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా శాలిహుండం, విశాఖపట్నం జిల్లా తోట్లకొండ, అనకాపల్లి బొజ్జలకొండ, అమరావతిని కలుపుకొని ఒక సర్కిల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో రామతీర్థం, గంట్యాడ మండలం నీలావతిలో ఉన్న బౌద్ధ స్థూపాలను కూడా కలిపి సర్కిల్‌ తయారు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు అనుమతి రావలసి ఉంది. 
►ఈ స్వదేశీ దర్శనం పథకం కింద కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రారంభమై ఆ జిల్లా నర్సీపట్నం, లంబసింగి, అరకుతో ముగిసే విధంగా ఒక రోజు పర్యాటక యాత్ర ఏర్పాటు చేశారు. దీన్ని మరోరోజు విస్తరించి విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పారమ్మకొండ, పెద్దగెడ్డ జలాశయం, దండిగాం, కురుకూటి జలపాతాలు, శంబర పోలమాంబ, బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయాలు, కోట, యుద్ధ స్మారక ప్రదేశం, వీణల తయారీ, సీతానగరం చెల్లంనాయుడువలస, పార్వతీపురం మండలం అడ్డాపుశీల మహానంది, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి, కొమరాడ మండల రాజులకోట, గుమ్మలక్ష్మీపురం మండలం తాటిగూడ జలపాతాలతో ముగిసేలా పర్యాటక యాత్ర నిర్వహించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.


తాటిపూడి జలాశయం 

రా.. రమ్మని..
గంట్యాడ (గజపతినగరం): పచ్చని కొండల నడుమ అందమైన జలాశయం.. ప్రకృతి సోయగాలకు తాటిపూడి పెట్టింది పేరు. తాటిపూడి అందాలను తిలకించేందుకు విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు సేదదీరేందుకు తాటిపూడి అవతల గిరివినాయక కాటేజీలను నిర్మించారు. గిరి వినాయక కొండపైకి ఎక్కితే చేతికందేలా కనువిందు చేసే మేఘాల్ని చూసి కేరింతలు కొడతారు. గిరిజనుల సంప్రదాయ వంటలు, ధింసా నృత్యం ఆకట్టుకుంటాయి. నోరూరించే బొంగు చికెన్, మట్టి చికెన్‌.. నూనె లేకుండా చేసే వంటకాలను పర్యాటకులు లొట్టలేసుకొని తింటారు.

సినిమాల చిత్రీకరణ
తాటిపూడి పరిసరాల్లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా చిత్రీకరించారు. తాటిపూడిలో చిన్న దృశ్యం చిత్రీకరించినా ఆ సినిమా హిట్‌ అవుతుందని నటుడు నందమూరి బాలకృష్ణకు నమ్మకం ఉంది. ఆనాటి మరోచరిత్ర మొదలుకొని, బొబ్బిలి సింహం, లెజెండ్, సోలో, గంగోత్రిలో ఒకపాట, అల్లరి నరేష్‌ సినిమా మడతకాజాలో ఒక పాట.. ఇలా చాలా సినిమాలను తాటిపూడి జలాశయం ఆవరణలో చిత్రీకరించారు. తాటిపూడి జళాశయం మధ్యలోని ఐలాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఎలా చేరుకోవాలి
తాటిపూడి చేరుకోవడానికి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్‌ నుంచి  కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు, ఆటోలు, టూరిస్ట్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌.కోట ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. విశాఖ, అరకు నుంచి వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా తాటిపూడి జళాశయం అందాలు తిలకించకుండా వెళ్లరు.

అందాల మన్యం
గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో పర్యాటక రంగం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్‌.కె.పాడు గ్రామ సమీపంలో ఉద్యానవన నర్సరీ, శిక్షణ కేంద్రం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నర్సరీలో సుమారు రూ.38 లక్షలతో ఇటీవల చుట్టూ కంచె, సిమెంటు రోడ్లు, ప్రవేశంలో ఆర్చీ, పగోడా, యోగా ప్రతిమలు, పద్మవ్యూహం తదితర పర్యాటకాభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా మరికొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం చేపట్టిన పనులు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. మండలంలోని తాడికొండ గ్రామంలోని మొగనాళి గెడ్డ జలపాతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ జలపాతాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుండటంతో పర్యాటకాభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– గుమ్మలక్ష్మీపురం (కురుపాం)

పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. అందుకు ఉన్న అన్ని అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి నిధులు వచ్చాక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం వల్ల తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యం పెంచి బాధ్యత పెంచాలన్న ఆలోచనలో పెద్దలున్నారు. రానున్న రోజుల్లో జిల్లా పర్యాటకానికి మంచి రోజులు వస్తాయి.
– పి.ఎన్‌.వి.లక్ష్మీనారాయణ, జిల్లా పర్యాటక శాఖాధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement