పర్యాటక ఉత్సవాలకు హాజరైన ప్రజలు
పేరుకే ప్రపంచ పర్యాటక దినోత్సవం. చేసింది నామమాత్రం. పర్యాటక దినోత్సవాన్ని బహిరంగ ప్రదేశాల్లో కాకుండా నాలుగు గోడల మధ్య జరగడం ఏంటన్న సందేహం ప్రజలది. కానీ అలాగే ఓ హోటల్‌లో అధికారికంగా జరిపించేశారు. మమ అనిపించేశారు. ఇలా వేడుకలను నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల ద్వారా ప్రభుత్వం, నిర్వహణాధికారులు నవ్వులపాలయ్యారు.
విజయనగరం ,గంటస్తంభం: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు జిల్లాలో పేలవంగా జరిగాయి. ఒక హోటల్‌లో సాదాసీదాగా నిర్వహించి అధికారులు మమ అనిపించారు. దీంతో పర్యాటక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎంతన్నది ఇట్టే అర్ధమవుతోందని జనం గుసగుసలాడుకుంటున్నారు. పర్యాటక అభివృద్ధికి ఎలాగూ ప్రాధాన్యత లేదని, కనీసం ఉత్సవాలైనా వేడుకగా నిర్వహిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురష్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ అధికారులు జిల్లాలో ఉత్సవాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పట్టణంలో ఒక హోటల్‌లో గురువారం ఉదయం వేడుకలు నిర్వహించారు. ముందుగా చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జెడ్పీ చైర్మన్ శోభా స్వాతిరాణి, కలెక్టర్ హరి జవహర్‌లాల్, జేసీ వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు కొంతదూరం ర్యాలీ నిర్వహించారు.
సాధారణంగా వేడుకలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు నామమాత్రంగా నిర్వహించి అధికారులు విమర్శలకు గురయ్యారు. ర్యాలీకి పెద్దగా జనం హాజరు కాలేదు. కార్యక్రమానికి జనం కూడా అంతంతమాత్రంగా వచ్చారు. ఫంక్షన్ హాల్ కేవలం 200మందికి సరిపోయే విధంగానే కుర్చీలు ఉన్నాయి. అయితే అంత మంది జనం కూడా రాలేదు. అందులో సగం కుర్చీల్లో జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు కొందరు, విద్యార్థులు కొందరు మాత్రమే హాజరయ్యారు. సభ నిర్వహణ కూడా గంటలో ముగిసింది. అందులో జిల్లా పర్యాటక రంగ వైభవం గురించిగానీ, అభివృద్ధి గురించిగానీ చెప్పుకున్న సంగతలు అంతంతమాత్రమే. దీంతో ఎందుకు వేడుకలు పెట్టారా? అన్న అనుమానం అక్కడకు హాజరైన వారిలో కలిగింది. కొందరు ఉద్యోగులైతే పక్కన నిల్చొని మొక్కుబడిగా ఎందుకు చేయాలో? అని విమర్శించడం గమనార్హం. ఇక జిల్లా పర్యాటక రంగాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఏమీ లేకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది.
నాలుగు గోడల మధ్యే...
పర్యాటక ఉత్సవాలు వేడుకలు నిర్వహణకు ఎంచుకున్న స్థలంపై కొందరు బహిరంగంగానే పెదవి విరిచారు. పర్యాటక ఉత్సవాలంటే ఏదైనా ఒక పర్యాటక ప్రాంతంలో పెడితే ప్రజలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతేందుకు దూరంగా వద్దనుకుంటే విజయనగరంలో పర్యాటకంగా అభివృద్ధి చేసామంటున్న కోట ఉంది. కనీసం ఆ ప్రాంతంలో కూడా వేడుకలు పెట్టకుండా ఒక ßోటల్‌లో పెట్టడమేమిటని ప్రశ్న వినిపిస్తోంది. నాలుగు గోడల మధ్య, సాదారణ జనాలకు తెలియని ప్రాంతంలో వేడుకలు పెట్టి ఏమి చెప్పదల్చుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వేడుకలు నిర్వహణకు కలెక్టర్ కార్యాలయంలో రెండు సమావేశ మందిరాలు ఉండగా... జెడ్పీ సమావేశ మందిరం కూడా ఉంది. వీటిని కాదని అద్దె కట్టుకుని ఒక హోటల్‌లో ఎందుకు పెట్టారన్న అంశంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాధాన్యం ఇవ్వకే...
ఉత్సవాలు నిర్వహణ హోటల్‌లో సాదాసీదాగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు. ఖర్చు చేసిన తర్వాత బిల్లులు పెట్టమనడంతో తర్వాత ఎంత ఇస్తుందో తెలియని పరిస్థితి.దీంతో అట్టహాసంగా చేయకుండా మమ అనిపించారన్న వాదన ఉంది. మొత్తానికి కారణమేదైనా వేడుకలు నామమాత్రంగా జరగాయన్నది నిష్టుర సత్యం. ఈ విషయం జిల్లా పర్యాటకాధికారి లక్ష్మీనారాయణ వద్ద ప్రస్తావించగా హోటల్ కూడా టూరిజం స్పాట్ కావడం వల్ల అక్కడ పెట్టామన్నారు. ప్రభుత్వం ప్రత్యేకించి ముందుగా నిధులివ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment