బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపం
సూసైడ్ నోట్ రాసి.. పురుగు మందు తాగిన వైనం
కుమారుడి మృతితో విలపిస్తున్న తల్లిదండ్రులు
నెల్లిమర్ల: తమ కుమారుడు వైద్య వృత్తిలో స్థిరపడతాడని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, రోగులతో పాటు తమకు కూడా వైద్యసేవలు అందిస్తాడని ఆశ పడ్డారు. అయితే వారి ఆశలు ఆడియాసలయ్యాయి. చేతికి అందివచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం నుంచి బ్యాక్‌లాగ్స్ ఉండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసులు, సహ విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ వైద్య కళాశాలలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అతుకూరి సాయి మణిదీప్(24) ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో పురుగుల మందు తెప్పించుకుని, కూల్ డ్రింకులో కలుపుకుని తాగా డు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు విషయాన్ని మిమ్స్ యాజమాన్యానికి తెలియజేశారు.
యాజమాన్య ప్రతినిధులు నెల్లిమర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ గణేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయి మణిదీప్ బెడ్ కింద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. చదువు విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సదరు నోట్‌లో మృతుడు ప్రస్తావించాడు. బ్యాక్ లాగ్స్ ఎక్కువగా ఉండటం, చదువుపై ఏకాగ్రత లేకపోవడంతో చనిపో తున్నట్లు రాసాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గణేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment