తల్లిదండ్రులకు ఫోన్ చేసి, రైలు నుంచి దూకేసిన యువతి
మృతురాలు కలబుర్గి జిల్లావాసి
రాయదుర్గం వద్ద ఘోరం
రాయదుర్గం టౌన్: రాయదుర్గం టౌన్: వైద్య కళాశాలలో సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెంది ఓ యువతి వేగంగా వెళుతున్న రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా) జిల్లా సేడం పట్టణానికి చెందిన కిషోర్‌కుమార్ కుమార్తె తనూజ (20) మంగళవారం ఉదయం చిత్రదుర్గం చేరుకుని అక్కడి వైద్య కళాశాలలో సీటు కోసం ప్రయత్నించింది. అయితే ఆమెకు సీటు దక్కకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి రాయదుర్గం మీదుగా హోస్పేట్‌కు వెళ్లే రైలులో తిరుగు ప్రయాణమైంది.
ప్రయాణిస్తూనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడికల్ సీటు దక్కలేదని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపింది. అప్పటికే మధ్యాహ్నం 1 గంట. రాయదుర్గం శివారులోని పైతోట సమీపంలో వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కుమార్తె ఫోన్ కాల్‌తో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పలుమార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో విషయాన్ని వెంటనే కర్ణాటక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తనూజ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీ కోసం కర్ణాటక పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం పైతోట వద్ద గ్యాంగ్‌మెన్ నగేష్... పట్టాలు పక్కనే పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గుంతకల్లు జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించి తనూజగా నిర్ధారించారు. అక్కడే పడి ఉన్న ఫోన్‌లోని నంబర్‌కు కాల్ చేసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు రాయదుర్గానికి ప్రయాణమైనట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment