నెల్లూరు జిల్లాలో ఘటన
విద్యార్థిది విశాఖపట్నం
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్‌కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు.
ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది.
మత్స్యకారుడు గల్లంతు
కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.
బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment