వీరగల్లుల గుడి
యాదాద్రి: ఊరిని కాపాడుకోవడానికి ప్రతి గ్రామానికి కొంతమంది వీరులు ఉండేవారని చరిత్ర చెబుతోంది. వారు ఊర్లలోని పిల్లల్ని, స్త్రీలను, సంపదలను కాపాడటానికి దొంగలతో, పరాయి సైనికులతో, క్రూర జంతువులతోనూ పోరాడేవారు. పోరులో అమరులైన ఆ వీరుల పేరిట నిలిపిన స్మారక శిలలే వీరగల్లులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల్లో ఈ శిలలు దర్శనమిస్తాయి. అయితే వీరగల్లులకు గుడులు కట్టిన విషయం మాత్రం పరిశోధకులకు ఆసక్తి కలిగిస్తోంది.
గుర్తించిన చరిత్రకారులు..
శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, పెసరు లింగారెడ్డి, సహాయకుడు నాగరాజుతో కూడిన చరిత్ర బృందం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో పర్యటించినపుడు అక్కడున్న మన్నెవార్ కోట, శైవ, వైష్ణవ దేవాలయాలు, నిజాం కాలం నాటి మెట్లబావితో పాటు విశేషమైన వీరగల్లులను గుర్తించారు. ఎక్కడాలేనట్లు తుర్కపల్లిలో వీరగల్లులకు గుడికట్టిన అవశేషాలు కనిపించాయి. ఊరికి తూర్పున 2 కూలిన కప్పులతో చిన్నగుడుల అవశేషాలు ఉన్నాయి. వీరగల్లులకు గుడులు కట్టిన 4 రాతి స్తంభాలున్నాయి. భూమిలో మునిగినవి కొన్ని, సగం బయటపడినవి కొన్ని కనిపించాయి. మూడింటిలో 2 ప్రత్యేక వీరగల్లులు ఉన్నాయి.
వీరగల్లుల శిల
మొదటి వీరగల్లులో రెండవ అంతస్తులో పైన సూర్యచంద్రులు వాటికింద ఒక ఎద్దు, దానికెదురుగా పడ గెత్తిన నాగుపాము ఉన్నాయి. కింది అంతస్తులో దనుర్ధారి సైనికుడున్నాడు. పాము నుండి ఎద్దును కాపాడే క్రమంలో పోరాడి మరణించిన వీరుని స్మారకశిలగా భావిస్తు న్నారు. ఇంతవరకు తెలంగాణలో లభించిన వీరగల్లులలో ఇటువంటి వీరగల్లు ఇదే మొదటిది. రెండవ వీరగల్లులో పెద్దపులులతో పోరాడుతున్న వీరుడు అగుపిస్తున్నా డు. ఓ పులి మరణించి ఉంది. రెండో పులిని వీరుడు శూలంతో పొడుస్తున్నాడు. మూడో పులి పారిపోతున్నది. పులులతో పోరాడి అమరుడైన వీరయోధుని వీరశిల ఇది. తెలంగాణలో వీరులు పెద్దపులులతో పోరాడే దృశ్యాలున్న వీరగల్లులు కూడా ఐదులోపునే లభించాయి. మూడవ వీరగల్లులో వీరుని తలమీద సూర్యచంద్రులున్నా రు. ఇలా వీరగల్లులపై లోతుగా పరిశీలన చేస్తే విలువైన సమాచారం లభించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment