భద్రాచలం: భూలోక వైకుంఠంగా భక్తులు భావించే భద్రగిరి.. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. భద్రుడి తపస్సుతో వైకుంఠం నుంచి సరాసరి సాక్షాత్కరించి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు అవతార రూపమే భద్రాచలం రామయ్యగా ప్రతీతి. నాలుగు చేతుల్లో ఆయుధాలు, సీతమ్మతోపాటు సోదరుడైన లక్ష్మణుడితో శ్రీరాముడు దర్శనమివ్వడం ఇక్కడి విశిష్టత.
10న ఉత్తర ద్వార దర్శనం..
వేడుకల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి జలవిహారం చేస్తారు. 10వ తేదీ తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. స్వామి వారు జలవిహారం చేసే హంస వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేయగా, విద్యుత్ దీపాల పనులు పూర్తి కావాల్సి ఉంది. హంస వాహనానికి గోదావరిలో ట్రయల్ రన్ సైతం పూర్తయ్యింది.
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, దీనికి అనుబంధంగా ఉన్న పర్ణశాల ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముక్కోటి వేడుకలు జరిగే ఉత్తర ద్వారానికి మరమ్మతులు నిర్వహించి పంచరంగులు వేశారు. గోదావరి తీరంతోపాటు పలుచోట్ల భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులను సిద్ధం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచగా, భక్తులు కొనుగోలు చేస్తున్నారు.
భద్రగిరికే ప్రత్యేకం..
భద్రాచలంలో ముక్కోటి పర్వదినం రోజున రామయ్యను దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇదేరోజున వైకుంఠంలో స్వామివారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠం నుంచి సరాసరి భద్రిగిరిపై ప్రత్యక్షమైన స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి.. వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
ఉత్తర ద్వార దర్శనానికి ముందురోజు సాయంత్రం గోదావరిలో జరిగే స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించాలన్నా భద్రాచలం రావాల్సిందే. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌దీపాల వెలుగులు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య హంస వాహనంలో ‘లాహిరి లాహిరి..లాహిరిలో’అంటూ జలవిహారం చేసే అద్భుత దృశ్యాలు భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకం.
Comments
Please login to add a commentAdd a comment