టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా? | Ancient Art Tatoos Understand Risks And Precautions | Sakshi
Sakshi News home page

టాటులు వేయించుకోవడం మంచిది కాదా? ప్రభుత్వ ఉద్యోగాలు రావా?

Published Sun, Oct 29 2023 12:38 PM | Last Updated on Sun, Oct 29 2023 1:15 PM

Ancient Art Tatoos Understand Risks And Precautions - Sakshi

పచ్చబొట్టు వేసుకోవడం పురాతన కళ. ప్రపంచవ్యాప్తంగా ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. పలుదేశాల్లో బయటపడిన కొత్తరాతియుగం నాటి ఆధారాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా 3300 నుంచి 3200 నాటి ‘ఓట్జీ ది ఐస్‌ మ్యాన్‌’ మమ్మీ.. ఆస్ట్రియా–ఇటలీ సరిహద్దుల్లో దొరికింది. అతడి పచ్చబొట్లను ఎక్స్‌ రే తీసిన శాస్త్రవేత్తలు.. అతడి శరీరంపైనున్న ప్రతి పచ్చబొట్టుకు కొన్ని నొప్పులు, వ్యాధులే కారణమని నిర్ధారించారు. దీనిని బట్టి పురాతన చికిత్సా విధానాల్లో భాగంగా పచ్చబొట్లను వేసుకునేవారని తేలింది.

ఫ్రాన్స్‌, పోర్చుగల్, స్కాండినేవియన్‌ దేశాల్లోని పురావస్తు శాఖ పరిశోధకులకు పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే పురాతన పరికరాలు దొరికాయి. అవి సుమారు పన్నెండువేల ఏళ్ల నాటి మంచు యుగానికి చెందినవని నిర్ధారించారు. ఆనాటి కొన్ని స్త్రీల బొమ్మలపై పచ్చబొట్ల లాంటి చిత్రాలు ఉన్నాయి. తొడలపైన, వీపు మీద పచ్చబొట్లు వేయించుకోవడం అప్పటి నుంచే ఉండేదనేందుకు ఆ చిత్రాలే నిదర్శనాలు. పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే శాశ్వత చిహ్నాలు. ఒకప్పుడు ఇవి నలుపు, ముదురాకుపచ్చ రంగుల్లో ఉండేవి.

ఇప్పుడు పచ్చబొట్లు రకరకాల రంగులతో మరింత కళాత్మకంగా రూపు దిద్దుకున్నాయి. పూర్వం చాలామంది సంతల్లో, జాతర్లలో తమ పిల్లలు తప్పిపోకూడదని చేతులపై వారి పేర్లను పచ్చబొట్టుగా వేయించేవారు. పలు తెగలకు చెందిన గిరిజన స్త్రీలు తమ ముంజేతులు, భుజాలు, పాదాలపై నక్షత్రాలు, చందమామ చిత్రాలను తమ తమ సంప్రదాయాల ప్రకారం పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అప్పట్లో కొందరు స్త్రీలు సౌందర్యం కోసం బుగ్గలు, పై పెదవి, చుబుకం మీద పుట్టుమచ్చల్లా పచ్చబొట్లు వేయించుకునేవారు. కాలక్రమేణా మనసులోని ప్రేమను వ్యక్తపరచేందుకు ప్రియమైనవారి పేరును పచ్చబొట్టు వేయించుకునేవారు పెరిగారు. 

ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్‌ రాజ్యాల్లో బానిసలు, నేరగాళ్లు పారిపోయినా, వారిని సులువుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుగా వారి శరీరాలపై ప్రస్ఫుటంగా కనిపించేలా పచ్చబొట్లు వేసేవారు. రోమన్‌ చక్రవర్తుల కాలంలో పచ్చబొట్ల కళకు రాజాదరణ అమితంగా ఉండేది. రాజులను మెప్పించడానికి రాజ దర్బారులోని వారంతా పచ్చబొట్లు వేయించుకునేవారు. దర్బారులోని రాజోద్యోగులను చూసి సామాన్య పౌరులూ పచ్చబొట్లు వేయించుకోవడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతోంది. ఈ ధోరణి విపరీతమైన కొన్నాళ్లకు.. కొందరు మతపెద్దలు పచ్చబొట్లను నిషేధించడంతో 19వ శతాబ్దం వరకూ పశ్చిమ యూరోపియన్లకు పచ్చబొట్ల కళ దూరమైంది. ఇక తూర్పు యూరోపియన్లు కూడా పచ్చబొట్లపై పెద్దగా ఆసక్తికనబరచలేదు. అయితే వారు తమ శత్రువులను అవమానించడానికి అసహ్యకరమైన పచ్చబొట్లను నుదుటిపై వేసేవారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 

టాటూ అర్థాలు
వాటర్‌ కలర్‌ టాటూలు, బ్లాక్‌వర్క్‌ టాటూలు, ఇలస్ట్రేటివ్‌ టాటూలు, హెన్నా టాటూలు, డాల్ఫిన్‌ టాటూలు, పువ్వులు, సీతాకోక చిలుకలు, పక్షుల టాటూలు.. ఇలా ఒకటి రెండూ కాదు కొన్ని వందల టాటూలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా రంగులు పెరిగే కొద్దీ సహజమైన అందాలను అచ్చంగా అద్దే ఆర్టిస్ట్‌లు చాలామందే పుట్టుకొస్తున్నారు. అయితే టాటూ బాగుంది కదా అని వేయించుకునే వారికంటే.. వాటి అర్థాలు తెలుసుకుని వేయించుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో టాటూ అర్థాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువమంది వాడే కొన్ని టాటూల అర్థాలు చూద్దాం.

  • డ్రాగన్‌ – ధైర్యం, బలం, రక్షణ, శక్తి, జ్ఞానం
  • సీతాకోక చిలుక – అందం, స్వేచ్ఛ, విశ్వాసం
  • పక్షులు – స్వేచ్ఛ, ఆకాశమే హద్దు
  • నక్షత్రం – ఆశ, విశ్వాసం, పరివర్తన, ఆశయం, విజయం
  • పువ్వులు – సున్నితత్వం, ప్రశాంతత (ఎంచుకున్న రంగును బట్టి, పువ్వును బట్టి మరిన్ని అర్థాలు మారతాయి)
  • సూర్యుడు – ఆరంభం, శక్తి
  • మ్యూజిక్‌ టాటూ – ప్రేమ, పరివర్తన, అహ్లాదం (డప్పు, పియానో, ప్లేబ్యాక్‌ బటన్స్‌  వంటి రూపాలను బట్టి అర్థాలు మారతాయి)
  • పులి – నాయకత్వం, ప్రాణాంతకం, భయానకం, ప్రకృతిపై ప్రేమ
  • సింహం – రాజసం
  • త్రాసు – సానుకూలత, ఆదర్శవాదం 

శాశ్వత అలంకరణగా టాటూ మేకప్‌
ఎర్రని పెదవులు, గులాబి బుగ్గలు, నిండుగా ఉన్న కనుబొమలు, దట్టంగా కనిపించే కనురెప్పలు.. వీటితో స్త్రీలకు ప్రత్యేకమైన అందం వస్తుంది. అందుకే తాత్కాలిక కాస్మెటిక్స్‌ పక్కన పెట్టి మరీ.. ఈ పర్మినెంట్‌ టాటూ రంగుల్ని వాడటం మొదలుపెట్టారు నేటి మహిళలు. ఈ ట్రెండ్‌ ఇప్పటిది కాదని.. 1902లో లండన్‌లో మొదలైందనే ఆధారాలున్నాయి. అయితే భారతీయుల్లో పర్మినెంట్‌ మేకర్‌ అనే ఈ కళ 19వ శతాబ్దం చివర్లో ప్రారంభమైంది.

ఇప్పుడు దేశవాప్తంగా పలు సెలూన్స్‌, స్కిన్‌  క్లినిక్స్‌ ఇలాంటి శాశ్వతమైన మేకప్‌ ట్రెండ్‌ని అందిస్తున్నాయి. అయితే కొంతమంది అమ్మాయిలు.. పార్టీలు, ఫంక్షన్ల కోసం మాత్రమే సెమీ పర్మినెంట్‌ మేకప్స్‌ వేయించుకుంటున్నారు. అవి కొన్ని రోజుల పాటు చెక్కు చెదరని అందాన్ని ఇస్తుంటాయి. కానీ పర్మినెంట్‌ మేకప్స్‌ పట్ల మోజు చూపే యువత సంఖ్యే ఎక్కువగా ఉంది. సున్నితమైన పెదవులు, కళ్లు వంటి చోట్ల పర్మినెంట్‌ మేకప్‌లో భాగంగా రసాయనాలు వాడుతుండటం అంత మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వీటి జోలికి వెళ్లేందుకు కాస్త వెనుకాడుతున్నారు. 

ఈ మధ్య కాలంలో కపుల్‌ టాటూస్‌తో పాటు ఫ్రెండ్స్‌ టాటూలూ బాగానే ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే వీటితో పాటు పాపులర్‌గా నిలుస్తున్న కొన్ని టాటూస్‌ విశేషాలు చూద్దాం.

కలర్‌ఫుల్‌ టాటూస్‌: వీటిలో చాలా కలర్స్‌ వాడుతారు. మనిషి ముఖం, పువ్వులు వంటి ప్రకృతి అందాలను సహజసిద్ధంగా చెక్కుతారు.
టెంపరరీ టాటూ: నచ్చిన స్టికర్‌ సెలెక్ట్‌  చేసుకుంటే.. దాని మీద ఒకరకమైన స్ప్రే జల్లి.. ఆ స్టికర్‌ లాగేస్తారు. ఇది మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది.
యానిమే టాటూ: వీడియో గేమ్స్‌ నుంచి ప్రేరణ రూపొందిన టాటూలు ఇవి. యానిమేషన్‌ లవర్స్‌ వీటిని విపరీతంగా వేయించుకుంటున్నారు.
లివింగ్‌ టాటూ: దీన్నే త్రీడీ టాటూ అనీ అంటారు. వీటిలో కొన్ని చూడటానికి కదలుతున్నట్లుగా ఉంటాయి. మనదేశంలో ఇవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు.
మ్యూజిక్‌ ప్లేయింగ్‌ టాటూ: ఇష్టమైన వారి వాయిస్‌ని రికార్డ్‌ చేసి.. దాన్ని మ్యూజిక్‌ సింబల్‌ రూపంలో మార్పించి, దాన్ని టాటూగా వేయించుకోవచ్చు. అలా వేయించుకున్న టాటూని.. ఫోన్‌లో తిరిగి స్కాన్‌ చేస్తే ఆ వాయిస్‌ మనకు వినిపిస్తుంది. 

టాటూ క్యాన్సర్‌ కారకమా?
కలప బూడిదతో, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి.. పూర్వం పచ్చబొట్టు సిరాలను తయారు చేసేవారు. అయితే నేడు రకరకాల పిగ్మెంట్స్‌తో తయారైన కెమికల్‌ ఇంకును వాడుతున్నారు. పైగా ఏది ఎంత మోతాదులో వాడుతారనేదానికి సరైన తూకం లేదు. తయారీదారులు వాటి సాంద్రతను, గాఢతను బహిర్గతం చేయాల్సిన పనిలేదు. అలాగే టాటూ డిజైనర్స్‌.. వేసే డిజైన్‌ని బట్టి సొంతంగానే సిరాను కలిపి పచ్చబొట్లను చిత్రిస్తారు. దాంతో దేని మోతాదు ఎంత? దాని వల్ల కలిగే ఫలితాలేంటి అనేవి స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే గత ఏడాది అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు టాటూ ఇంక్స్‌ మీద పలు పరిశోధనలు చేశారు.

అప్పుడే ఓ షాకింగ్‌ విషయం బయటపడింది. టాటూల కోసం ఉపయోగించే ఇంకుల్లో క్యాన్సర్‌ కారకం ఉందని వారు వెల్లడించారు. స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌కు చెందిన సైంటిస్ట్‌ స్వియర్క్‌ నేతృత్వంలో దాదాపు వంద రకాల టాటూ ఇంకులను పరీక్షించారు. టాటూలు ఎప్పటికీ తొలగిపోకుండా శరీరంపై ఉండటానికి ఇంకుల్లో ఉండే పిగ్మెంట్, క్యారియర్‌ సొల్యూషన్‌ని వాడుతుంటారు. శాస్త్రవేత్తలు పరీక్షించిన 100 ఇంకుల్లో 23 ఇంకుల్లో అజో అనే సింథెటిక్‌ రంగుల ఉనికిని గుర్తించారు. సాధారణంగా అజో సింథెటిక్‌ రంగులను ఆహార పదార్థాలు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇవి బ్యాక్టీరియా చేరినా, అధిక సూర్యరశ్మి తగిలినా క్యాన్సర్‌ కారకంగా మారుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

టాటూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రావా?
ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధపడే వారు.. శరీరంపై పచ్చబొట్లు వేయించుకునే ఆలోచన మానుకుంటే మంచిది. ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌  నేవీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్, ఇండియన్‌  కోస్ట్‌ గార్డ్, పోలీసు ఉద్యోగాలతో పాటు.. ఇండియన్‌  అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌), ఇండియన్‌  పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) ఇండియన్‌  ఫారిన్‌  సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) వంటి ఉద్యోగాలు ఒంటిపైన పచ్చబొట్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రావు.

వాస్తవానికి, శరీరంపై పచ్చబొట్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోవడానికి.. పచ్చబొట్లు పలు వ్యాధులను కలిగించే ప్రమాదం ఉందనేది ఒక కారణం కాగా.. సైన్యం వంటి రక్షణ రంగంలో శరీరంపై టాటూలు భద్రతకు ముప్పు అనేది మరో కారణం. అంతేకాదు టాటూ వేసుకున్నవారు క్రమశిక్షణా రాహిత్యంతో ఉంటారనే అభిప్రాయమూ ఉంది. అయితే గత ఏడాది.. అన్ని అర్హతలూ ఉన్నా కేవలం తన ఒంటి మీదున్న టాటూ కారణంగా తనకు సర్కారు కొలువును నిరాకరించారంటూ అసోమ్‌కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ హైకోర్టు్టను ఆశ్రయించాడు. అయితే ఈ కేసులో కోర్టు.. పచ్చబొట్టు తీయించుకునేందుకు రెండు వారాలు గడువు ఇచ్చింది. పచ్చబొట్టు తొలగించుకున్నాక మెడికల్‌ బోర్డు ముందు హాజరు కావాలని, ఆ తర్వాతే నియామకం జరుగుతుందని తీర్పు చెప్పింది.

రక్తదానం చేయకూడదా?
గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రక్తదానాలు చేసే వారి సంఖ్య పెరిగింది. రాజకీయ అభిమానులు, సినీ నటుల అభిమానులతో పాటు చాలామంది యువత సేవాభావంతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడం  సర్వసాధారణమైంది. అయితే రక్తదానం చేయడానికి ముందుకొచ్చేవారిలో వందకు సుమారు తొంభై మంది టాటూస్‌తోనే ఉంటున్నారని కొన్ని సర్వేలు తేల్చాయి. అత్యవసర పరిస్థితుల్లో అయినా సరే.. రక్తం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు వైద్యులు. ఆ జాగ్రత్తల్లో రక్తం ఇచ్చేవారు టాటూ వేయించుకున్న సమయం కూడా ముఖ్యమే. ఎందుకంటే టాటూ కారణంగా.. కొన్ని రకాల చర్మవ్యాధులు, హెపటైటిస్‌– ఏ, హెపటైటిస్‌–బీ, హెచ్‌ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులూ సోకే ప్రమాదం ఉంది.

ఎవరైనా టాటూ వేయించుకుంటే సంవత్సరం పాటు రక్తదానం చేయకూడదనేది రెడ్‌ క్రాస్‌ నిబంధన. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన టాటూ సెంటర్స్‌లో టాటూ వేయించుకుంటే సమస్య లేదు. కానీ జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ టాటూ వేయించుకున్న తర్వాత కనీసం ఆరు నెలలు రక్తదానం చేయొద్దని అంటోంది. ఆరోగ్య నిపుణుల సలహాలతో, ప్రొఫెషనల్‌ టాటూ సెంటర్స్‌లో టాటూలు వేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. 

ఇవి వద్దు గురూ..
చిరునవ్వు సానుకూలత.. విచారం ప్రతికూలత అనేది తెలిసిన సంగతే. ఇదే టాటూల విషయంలోనూ కనిపిస్తుంది. సానుకూల సంకేతాలతో మేలు, ప్రతికూల సంకేతాలతో కీడు ఎలా వచ్చిపోతాయో మన పురాణాల్లో ఋషులు వర్ణించారు. అందుకే కొందరు శాస్త్రం తెలిసిన పెద్దలు.. కొన్ని రకాల టాటూలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. పగిలిన అద్దం (అశుభానికి సంకేతం), తిరగబడిన గుర్రపు డెక్క (దురదృష్టానికి ప్రతీక), విరిగిన గడియారం (పురోగతికి అవరోధం) విచారంగా ఉండే ముఖం (దుఃఖానికి సూచన) వంటివి ఒంటిపై టాటూలుగా వేయించుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే గబ్బిలం, పాము, బల్లి, పిల్లి, తేలు వంటి రూపాలను టాటూలుగా వేయించుకుంటే అవి జీవితాన్ని సన్మార్గంలో తీసుకెళ్లవని కొందరి నమ్మకం.

మొన్నటికి మొన్న హైదరాబాదీ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ.. ఏషియన్‌ గేమ్స్‌ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయానికి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. స్టేడియంలోనే.. తన జెర్సీని పైకి లేపి టాటూని చూపించాడు. ఒంటిపై వేయించుకున్న తల్లిదండ్రుల రూపాన్ని చూపించి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఆ దృశ్యం.. టాటూలపై మరోసారి చర్చకు దారితీసింది. యువత ఆకర్షణకూ కారణమైంది. ఈ రోజుల్లో యూత్‌.. టాటూ, టాటూస్య, టాటూభ్యోహ అనే రీతిలో టాటూ ఒరవడిని ఫాలో అవుతోంది. ఆ మాటకొస్తే అక్కినేని నాగార్జున, త్రిష, జూనియర్‌ ఎన్టీఆర్, నాని, తాప్సీ, విక్రమ్, షాలినీ పాండే, చార్మీ ఇలా ఎందరో సెలబ్రీటీలు ఏనాడో ఈ ట్రెండ్‌ ప్రారంభించారు.

పచ్చబొట్టు చెరిగిపోద్దిలే..
పూర్వకాలం శరీరంపై వేసిన ఈ పచ్చబొట్లను తీసివేయడం కోసం నాటు పద్ధతులను ఉపయోగించేవారు. వెనిగర్, పావురాల రెట్టలతో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని పిండికట్టులా పచ్చబొట్టుపై వేసేవారు. కానీ ఇప్పుడు లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో పచ్చబొట్లను తేలికగా తొలగిస్తున్నారు. ఈ ట్రీట్‌మెంట్‌తో నలుపు రంగులో ఉన్న పచ్చబొట్లను చాలా సులువుగా తొలగించవచ్చు. కానీ పసుపు, ఎరుపు వంటి ఇతర రంగులను తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పాత పచ్చబొట్టు కొత్త రంగులతో వన్నె తరగని ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం.. ఆహ్లాదం.. ఆనందం! దానికి పచ్చబొట్టూ మినహాయింపు కాదు! 

(చదవండి: ఇజ్రాయెల్‌ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్‌ అవుతోందంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement