తిమ్మాజిపేట మశమ్మ దేవాలయంలో బుద్ధుడి శిల్పం, గుర్తించకముందు ఇలా నిలువెల్లా బొట్లతో విగ్రహం
సాక్షి, హైదరాబాద్: బుద్ధుడు బతికుండగానే ఆయన స్ఫూర్తి తెలంగాణలో అడుగిడింది. ఆయన బోధనల ప్రచారం మొదలై ఇక్కడి నుంచి కొన్ని ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బౌద్ధం విలసిల్లింది. ఎన్నో అద్భుత నిర్మాణాలు, మందిరాలు రూపుదిద్దుకున్నాయి. కాకతీయుల కాలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో బుద్ధుడి విగ్రహాలు కొలువుదీరాయి. అందుకే తెలంగాణవ్యాప్తంగా చాలా ప్రాం తాల్లో బుద్ధుడి ప్రతిమలు, శిల్పాలు వెలుగుచూస్తూ ఉంటాయి. అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం బుద్ధుడి విగ్రహాలు ఇంతవరకు బయటపడలేదు. చరిత్రకారుల అన్వేషణలోనూ బుద్ధుడి జాడలేదు. కానీ, ఇంతకాలం తర్వాత తొలి సారి ఉమ్మడి పాలమూరులో 4 అడుగుల మూడం గుళాల ఎత్తున్న బుద్ధుడి శిల్పం వెలుగుచూసింది. ఇది తవ్వకాల్లో బయటపడింది కాదు.. ఓ పల్లెటూర్లోని చిన్న ఆలయంలో దేవతామూర్తిగా పూజలందుకుంటోంది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో తొలిసారి బుద్ధుడి శిల్పం రికార్డుల్లో నమోదైనట్టయింది.
మశమ్మ ఆలయంలో నిలువెల్లా బొట్లతో..
చాలా ఊళ్లలో గ్రామ దేవతగా భావిస్తూ ఎన్నో విగ్రహాలను పూజిస్తుంటారు. అందులో వీరగల్లులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీరుల శిల్పాలు ఆంజనేయ స్వామి విగ్రహంగా పూజలందుకుంటుంటాయి. అదే కోవలో.. నాగర్‌కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట గ్రామంలో స్థానికులు మశమ్మ విగ్రహానికి ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇందులో రెండు ప్రధాన విగ్రహాలున్నాయి. వీటికి నిలువెల్లా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తుంటారు. ఇటీవల స్థానికుడు శ్రీనివాస బహదూర్‌తో కలసి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి తోకల సంజీవరెడ్డి వేరే పనిమీద వెళ్తూ ఆ దేవాలయాన్ని పరిశీలించారు. ఆయనకు అందులో మశమ్మ విగ్రహం పక్కనున్న మరో విగ్రహంపై అనుమానాలు కలిగాయి. ఈ విషయాన్ని పురావస్తు విశ్రాంత అధికారి, చరిత్ర పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ ఈమని శివనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మరో చరిత్ర పరిశోధకుడు ఎం.ఏ.శ్రీనివాసన్‌తో వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించి అది బుద్ధుడి విగ్రహంగా తేల్చారు.
13వ శతాబ్దం నాటికి.. ఆ తర్వాత మార్పులు..
ఈ విగ్రహం ఎక్కడిదో, ఎవరు రూపొందించారో స్థానికులకు సమాచారం లేదు. ఎక్కడి నుంచో దాన్ని తెచ్చి ఆలయంలో ఉంచి దేవతామూర్తిగా పూజిస్తున్నారని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. దీని ఆకృతిని బట్టి 13వ శతాబ్దిలో రూపొందించినట్లు గుర్తించారు. కానీ, మళ్లీ 18వ శతాబ్దంలో దాని రూపాన్ని కొంత మార్చినట్లు తేల్చారు. అంతగా అనుభవం లేని శిల్పి ఎవరో విగ్రహం మొహం, చేతులు, కాళ్ల భాగాల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోందని వారు పేర్కొన్నారు. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి శరీరంపై పలుచటి వస్త్రం ఉన్నట్టుగా చెక్కారని, కుడివైపున ఉపాసిక ప్రతిమను కూడా తీర్చిదిద్దారని తెలిపారు. మధ్యయుగంలో తిమ్మాజిపేట ప్రాంతం బౌద్ధస్థావరమని సమీపంలోనే అలనాటి వర్ధమానపురం ఉంటుందని చెప్పారు. గోన వంశానికి చెందిన గోన బుద్ధారెడ్డి పాలనకు ఇది రాజధాని. బుద్ధసముద్రం, గోనె బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక నిర్మించిన ప్రస్తుతం భూత్‌పూర్‌గా పేర్కొంటున్న బుద్ధపురంలు కాకతీయుల కాలంలో బౌద్ధానికి ఈ ప్రాంతంలో ఆదరణను తెచ్చాయని వారు వివరించారు.
చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స
Comments
Please login to add a commentAdd a comment