
మహబూబ్‌నగర్: తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిపై నలుగురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నవాబుపేట మండలం మరికల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన బైండ్ల నర్సింహులు (32) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో పలుమార్లు గొడవ చోటు చేసుకుంది.
ఏడాది క్రితం నర్సింహులుపై వివాహిత సోదరులు దాడికి పాల్పడ్డారు. ఆరునెలల క్రితం అతడి ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. మంగళవారం వ్యవసాయ పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు మూకుమ్మడిగా దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడిని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి మరోసారి దాడిచేశారు.
ఈ క్రమంలో నర్సింహులు భార్యతో పాటు చుట్టుపక్కల వారు వారించి, అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు నర్సింహులు మృతికి కారణమైన జోగు యాదయ్య, అతడి సోదరులు శ్రీను, నర్సింహులు, బాల్‌రాజ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు ప్రధాన కారకురాలైన వివాహితపై సైతం పలువురు దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment