
రాజస్థాన్‌లో ఘటన
పిట్టలవానిపాలెం (కర్లపాలెం): పంజాబ్‌లోని సూరత్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం పంచాయతీ గౌడపాలెం గ్రామానికి చెందిన జవాన్ పరిశా మోహన్ వెంకటేష్ (27) గన్‌లోని బుల్లెట్ బ్యాక్‌ఫైర్ అయ్యి రాజస్థాన్‌లో మృత్యువాత పడ్డారు. ఈ మేరకు సైనిక అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆయన భార్య, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పరిశా శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులకు కుమారులు మోహన్ వెంకటేష్, గోపీకృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు చదివిన మోహన్ వెంకటేష్ 2019 డిసెంబర్‌లో ఆర్మీలో చేరారు. రాజస్థాన్‌లో సోమవారం జరిగిన ఆర్మ్‌డ్ గన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో మోహన్ వెంకటేష్ ఫోన్‌లో మాట్లాడారు.
మధ్యాహ్నం 2 గంటలకు భార్యకు వీడియోకాల్ చేసి ముచ్చటించాక, పాపను కూడా చూశారు. మళ్లీ రాత్రికి ఫోన్ చేస్తానని చెప్పారు. కానీ మధ్యాహ్నం 3.30 గంటలకు గన్ క్లియర్ చేస్తుండగా బ్యాక్ ఫైర్ అయ్యి బుల్లెట్ తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి రానుందని సైనికాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment