చీమలతోనే చిక్కు.. | Threat to the Ramappa temple | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 3:19 AM | Last Updated on Mon, Oct 2 2017 10:18 AM

Threat to the Ramappa temple

కూలిపోయిన ప్రహరీ గోడలు

సాక్షి, వరంగల్‌: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. చీమల కారణంగా ఈ ఆలయం గోడలు రోజురోజుకూ కుంగిపోతున్నాయి. క్రమంగా రెండు మూడేళ్లకు ఒకటి వంతున ఆలయానికి సంబంధించిన గోడలు, గోపురాలు, ద్వారాలు కూలిపోతున్నాయి. ఈ ఆలయం పునాదుల్లో ఉపయోగించిన ఇసుకను చీమలు తోడేస్తుండటంతో నిర్మాణంలోని పటిష్టత తగ్గిపోతుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలువబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం నిదర్శనం. ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ప్రధానంగా మదనికలు, నాగిని శిల్పాలను చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారు.

కాకతీయులు భారీ ఆలయాల నిర్మాణంలో సాధారణ పద్ధతికి భిన్నంగా శాండ్‌బాక్స్‌ టెక్నాలజీని ఉపయోగించారు. పునాదిలో బలమైన రాళ్లను కాకుండా ఇసుకను ఉపయోగించారు. ఇసుక పునాదిపై రాతి శిల్పాలను పేర్చుకుంటూ ఆలయాన్ని నిర్మించారు. దీంతో కొన్నేళ్లుగా ఈ ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చీమలు నిత్యం పునాదుల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో పునాది డొల్లగా మారుతోంది. ఫలితంగా ఈ పునాదిపై ఉన్న బరువైన శిలలు, శిల్పాల బరువుకు పునాది కుంగిపోతోంది. అధికారులేమో చీమలు పునాది నుంచి బయటకు తోడేస్తున్న ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే.. చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. 

నష్టం జరిగినా అదేతీరు.. 
పునాదుల్లో ఇసుక బయటకు రావడంతో బలహీనమైన పునాదిపై బరువైన రాళ్లు (శిల్పాలు) ఉండడంతో క్రమంగా కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై ఆలయ గోడలు కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో ఉన్న కామేశ్వరాలయం ఒకవైపునకు ఒరిగి పోయింది. దీంతో ఆలయానికి సంబంధించి శిల్పాలను తొలగిచారు. తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పినా... పదేళ్లలో ఎటువంటి పురోగతి లేదు. తొలగించిన శిల్పాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. అనంతరం 2013లో రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం కూలిపోయింది. తాజాగా ప్రహరీ గోడలు కూలిపోయాయి. 

అడుగడుగునా నిర్లక్ష్యం..
రామప్ప ఆలయ నిర్వహణపై పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చరిత్రకారులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ నాగరాజు రామప్ప ఆలయంపై భద్రత, నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచారం హక్కు చట్టం ద్వారా 2016 ఏప్రిల్‌లో వివరాలు కోరారు. 2016 మేలో పురావస్తుశాఖ అధికారులిచ్చిన సమాధానంలో ఆలయ భద్రత, మనుగడ కోసం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం లేదని స్పష్టమైంది. పదేళ్లు దాటినా కామేశ్వరాలయం పునరుద్ధరణకు ఒక్క పైసా నిధులు కేటాయించలేదు.  అంతేకాదు, రామప్ప ప్రధాన ఆలయంతోపాటు ఆరు ఆలయాలను గుర్తించామని చెప్పినా వాటి పరిరక్షణ కోసం ఇప్పటివరకు పురావస్తుశాఖ నుంచి ఎలాంటి పనీ జరగలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement