
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి చారిత్రక రామప్ప ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చారిత్రక చిహ్నాల్లో రామప్ప ఆలయం ఒకటని, దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకు కేంద్ర పురావస్తు శాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయ ప్రహరీ ఇటీవల వర్షాలకు కూలిపోవడం, ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.
త్రికల్లో వచ్చిన కథనాన్ని చదివిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు లేఖ ద్వారా ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పిల్ కమిటీ దాన్ని పరిశీలించి సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని నిర్ణయించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. వర్షాలకు దెబ్బతిన్న తూర్పు వైపు ప్రాకారానికి మరమ్మతులు చేస్తామని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ హామీ ఇచ్చారు. రామప్ప ఆలయ పరిరక్షణపై విట్ (వరంగల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రొఫెసర్లు, సివిల్ ఇంజనీర్ల బృందం చేసిన సిఫార్సుల నివేదిక పురావస్తు శాఖకు అందిందని, దీనిపై తీసుకోబోయే చర్యల్ని వివరించే కౌంటర్ పిటిషన్ దాఖలుకు వ్యవధి కావాలని ఆయన కోరారు. దీంతో విచారణ డిసెంబర్ 12కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment