ramappa temple
-
నేడు రామప్ప ఆలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాక.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంక
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(ఎం): మూడు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్న ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంక పాలంపేటకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాన్వాయ్‌లో 4:15 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మేనిఫెస్టోను వారు రామలింగేశ్వరుడి ముందు పెట్టి పూజలు చేస్తారని తెలిపారు. శివుడిపై రాహుల్, ప్రియాంకతోపాటు తనకూ విశ్వాసం ఉందన్నారు. అనంతరం 4:45 గంటలకు ఆలయం నుంచి బస్సుయాత్ర ద్వారా రామాంజాపూర్‌లో ఏర్పాటుచేసిన మహిళా విజయభేరి సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. అక్కడ రాహుల్, ప్రియాంక మహిళలను ఉద్దేశించి ప్రసంగించి, మహిళా డిక్లరేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. సభ అనంతరం ప్రియాంక ఢిల్లీకి పయనం కానుండగా, రాహుల్ బుధవారం రాత్రి భూపాలపల్లిలో బస చేస్తారు. రాహుల్ గురువారం ఉమ్మడి కరీంనగర్, శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో బస్సుయాత్ర సాగించనున్నారు. దసరా సెలవుల తరువాత రాహుల్ మలి దశ బస్సుయాత్ర ఉంటుంది. కాగా, రాహుల్, ప్రియాంక పర్యటన సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మంగళవారం రామాంజాపూర్ సభాస్థలిని పరిశీలించారు. మహిళా విజయభేరికి పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
రామప్ప దేవాలయం లో ఇటుకలు ఎంత తేలికో తెలుసా ?
-
రామప్ప దేవాలయం ప్రత్యేకతలు ఏమిటి?
-
రామప్ప ఆలయంలో గాలిలో తేలుతున్న స్తంభం..!
-
రామప్ప చెరువు మధ్యలో ఎత్తయిన శివుడి విగ్రహం
-
రామప్ప దేవాలయం మరియు వాటి రహస్య శక్తులు..!
-
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పొంచిఉన్న ముప్పు
-
రామప్పపై ఏఎస్ఐ మంట!
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ‘పీవీ నరసింహారావు భూఉపరితల గనుల (ఓపెన్ కాస్ట్ మైన్)’ అంశం వివాదానికి కారణమైంది. ఇప్పటికే ప్రతిపాదిత గనులతో అక్కడికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ముప్పు వస్తుందన్న అభ్యంతరాలు ఉన్నాయి. అలాంటిది బొగ్గు గనుల ఏర్పాటు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీపై కేంద్ర పురావస్తుశాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపద హోదా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా రామప్ప ఆలయం రికార్డు సృష్టించింది. దీనికి సమీపంలోనే సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించి బెంగళూరులోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ప్రాంతీయ కార్యాలయం ఎన్ఓసీ జారీకి సానుకూలత వ్యక్తం చేసింది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్‌లను సంప్రదించి.. సింగరేణి హామీల ఆధారంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు పేర్కొంది. కానీ దీనిపై రామప్ప ఆలయ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న ‘ది పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ విస్మయం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన యునెస్కో గుర్తింపు సాధించిన తరుణంలో, దానికి విఘాతం కలిగించే ఏ చిన్న చర్యను కూడా ఉపేక్షించకుండా అభ్యంతరం చెప్పాల్సిన ఏఎస్ఐ.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడింది. ఈ అథారిటీలో కీలక సభ్యత్వమున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు బొగ్గు గనులు ప్రారంభమైతే రామప్ప ఆలయానికి జరిగే నష్టం ఏమిటో తేల్చాలని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్‌జీఆర్‌ఐ), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)లను పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ కోరింది. దీనితోపాటు బొగ్గు గనులతో జీవావరణం, సామాజిక, ఆర్థిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌ను కోరాలని నిర్ణయించింది. ఈ సంస్థలు తేల్చే అంశాల ఆధారంగా బొగ్గు గనుల తవ్వకం ఆధారపడి ఉంది. మూడు కీలక అంశాలతో.. పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ భేటీలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పక్షాన ప్రొఫెసర్ పాండురంగారావు ప్రధానంగా మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బొగ్గు గనుల తవ్వకం వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. శాండ్ బాక్స్ పునాదుల్లోంచి ఇసుక జారిపోయే ప్రమాదం రామప్ప దేవాలయాన్ని నాటి కాకతీయ నిపుణులు శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలు వంటి కుదుపులు ఏర్పడ్డా.. నిర్మాణానికి ఇబ్బంది రాకుండా పునాదుల్లో ఇసుకను నింపారు. ఆలయ ప్రదక్షిణ పథం నుంచి దిగువకు దాదాపు 18 అడుగుల మందంతో ఇసుక ఉంది. ఈ ఇసుక పదిలంగా ఉంటేనే నిర్మాణం స్థిరంగా ఉంటుంది. రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవి్వతే.. భూమి పొరల్లో నీటి ప్రవాహ దిశను మార్చే కదలికలు (హైడ్రాలిక్ గ్రేడియంట్స్) ఏర్పడుతాయి. రామప్ప ఆలయం ఎగువన దాదాపు 3 టీఎంసీల సామర్ధ్యమున్న రామప్ప చెరువు ఉంది. హైడ్రాలిక్ గ్రేడియంట్స్ వల్ల చెరువు నీళ్లతో ఆలయ పునాదుల్లోని ఇసుకను కోత గురై.. క్రమంగా ఆలయ పునాదులు అస్థిరమయ్యే ప్రమాదం ఉంది. గని ఉన్నంత కాలం కంపనాల ప్రభావం బొగ్గు గనుల్లో నిరంతరం పేలుళ్లు జరుపుతూ ఉంటారు. 300 మీటర్ల లోతు వరకు తవ్వే క్రమంలో జరిపే పేలుళ్లు భూమి పొరల్లో కంపనాలు సృష్టిస్తాయి. రామప్ప ఆలయ నిర్మాణం నాజూకుగా ఉంటుంది. పేలుళ్ల కంపనాల వల్ల రాళ్లలో కదలికలు ఏర్పడి కట్టడం ధ్వంసమయ్యే ప్రమాదం ఉంటుంది. బొగ్గు తరలింపు ధూళితో ఆలయ నిర్మాణానికి ప్రమాదం ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్.. సమీపంలోని నూనె శుద్ధి కర్మాగారాల కాలుష్యం వల్ల దెబ్బతింటున్నట్టు ఇప్పటికే తేలింది. ఇప్పుడు రామప్పకు గనుల తవ్వకం, లారీల్లో బొగ్గు తరలింపుతో.. ధూళి కణాలు రామప్ప ఆలయం మీద పడుతూ.. రసాయనిక చర్యకు కారణమవుతాయి. ఇది నిర్మాణానికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. -
రామప్ప ఆలయంపై రాజకీయం
-
పోరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు
వెంకటాపురం(ఎం): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాటం.. స్థానిక ప్రజల పోరాటంతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలసి ఆమె సందర్శించారు. రామప్ప ఆలయ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. తర్వాత వారు ఆలయంలో రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్లో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రామప్ప ఆలయం ఉన్నందున గుడికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని, ఆలయ పరిసరాల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’.. ములుగు జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ కోసం 334 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించారు. ములుగు జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైందని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా, రూ.1,800 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క బ్యారేజీని నిర్మించినట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక కోత ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వం రూ.130 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. -
దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేదు
హనుమకొండ: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయ సన్నిధిలో రామప్ప ఉత్సవాల నిర్వహణకు కేంద్రం అనుమతివ్వకపోవడం బాధాకరమని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయి అన్నారు. శనివారం హనుమకొండలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ పాపారావుతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తి స్థలమైన రామప్పలో చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావ వైరుధ్యాలను కళలకు ఆపాదించడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్ఏలోనే ఉన్నదని పేర్కొన్నారు. వేదాల్లోంచే ఇది వచ్చిందన్నారు. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నానన్నారు. రామప్ప ఆలయం ఆవరణలో ప్రదర్శన రద్దయినా, వెంటనే హనుమకొండలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని, బాధ్యత కలిగిన పౌరురాలిగా గుజరాత్ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత అని చెప్పడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటి పాలకులతో విభేదిస్తూనే ఉన్నానని, అదే కొనసాగుతుందని అన్నారు. -
Warangal: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు
తెలంగాణకే తలమానికమైన అపురూపమైన వరంగల్ రామప్ప దేవాలయం మళ్లీ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినందుకు ప్రతి తెలుగువాడూ, భారతీయుడూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషాన్ని సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులు ఆవిరి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిరక్షణ, నిర్వహణలో ఈ కట్టడం ఉంది. అది యాత్రికుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందటంలో చూపిస్తున్న శ్రద్ధ కట్టడ పరిరక్షణలో చూపడం లేదు. 2010లో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టిన తరుణంలో అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి విలవిల లాడి గోడలు బీటలు వారిన విషయం సర్వదా విశదమే. ఈ విధ్వంసాన్ని అతి విషాదకరంగా పలు పత్రికలు ప్రపంచానికి వెల్లడి చేసినా ఏఎస్ఐ అంతగా ప్రతిస్పందించ లేదనే విమర్శ ఉంది. దీంతో కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాసంఘాల వారు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి చుట్టూ ఇరవై కి.మీ.ల దూరంలోని వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర గ్రామాల పరిధిలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరుపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలను సర్వేచేసి స్వాధీనం చేసుకునే దిశలో సింగరేణి ఉండగా ‘రామప్ప పరిరక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి సింగరేణి కంపెనీ అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఇదే సమయంలో ఏఎస్ఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదన పత్రాలు యునెస్కోకు వెళ్లడం, రెండు సార్లు తిరస్కరణకు గురికావడం... చివరికి ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు పొందడం తెలిసిందే. కాగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్త వచ్చింది. రామప్ప పరిరక్షణ కమిటీ , ఇతర ప్రజా సంఘాలూ తిరిగి ఆందోళన వ్యక్తం చేయడంతో సింగరేణి కంపెనీ యాజమాన్యం రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని మీడియా ద్వారా హామీ ఇచ్చింది. అయితే మళ్ళీ రామప్పగుడికి ఓపెన్ ముప్పు రానున్నదనీ, పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబం ధించిన సర్వేలు చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది. అందుకే ఈ ప్రయత్నాలను పత్రికా ముఖంగా కమిటీ ఖండిస్తున్నది. (క్లిక్ చేయండి: వేయి రేఖల వినూత్న సౌందర్యం) – నల్లెల్ల రాజయ్య తదితర ‘రామప్ప పరిరక్షణ కమిటీ’ సభ్యులు -
రామప్పలో రాష్ట్రపతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ములుగు జిల్లా రామప్ప దేవాలయా న్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామి కొలువైన, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కుటుంబసభ్యు లతో కలిసి సందర్శించడం ప్రాధాన్య తను సంతరించుకుంది. రాష్ట్రపతికి హెలిపాడ్ వద్ద గవ ర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రామప్ప ప్రధానగేటు వద్దకు చేరుకో గానే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ములుగు ఎమ్మెల్యే సీతక్కలు స్వాగతం పలికారు. ప్రధానగేటు నుంచి కాలినడ కన ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి పూజా రులు హరీష్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా ఆలయంలో రాష్ట్ర పతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి జలాభిషేకం చేశారు. అనంతరం మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గా రావు రాష్ట్రపతికి సమ్మక్క, సారలమ్మ దేవతలకు చెందిన పసుపు, కుంకుమతోపాటు పట్టుచీర అందించారు. రామప్ప ఆలయ పూజారులు శాలు వాతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. అక్కడి నుంచి రామప్ప గార్డెన్‌లోని గ్రీన్హౌస్లో రాష్ట్ర పతి కొద్దిసేపు సేదదీరారు. అనంతరం గార్డెన్లో ఏర్పాటు చేసిన సభావేదిక పైనుంచి రూ.62 కోట్లతో చేపడుతున్న ప్రసాద్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరంపర కళా కారుల బృందం శివుని పాటతో పాటు ‘బ్రహ్మ మొకటే పరబ్రహ్మమొకటే’ పాటకు చేసిన నృత్యాన్ని, ఏటూరునాగారానికి చెందిన కోయ కళా కారుల కొమ్మకోయ నృత్యాన్ని రాష్ట్రపతి తిలకించారు. అనంతరం సాయంత్రం 4:20 సమయంలో హైదరాబాద్‌కు వెళ్లారు. ఎల్ఈడీ స్క్రీన్కు మంటలు రాష్ట్రపతి రామప్ప పర్యటనలో స్వల్ప అపశ్రుతి దొర్లింది. రామప్ప వేదికపై ముర్ము తదితరులు ఆశీనులై గిరిజనుల కొమ్మకోయ, పరంపర సాంస్కతిక కార్యక్రమాలు తిలకిస్తుండగా మీడియా గ్యాలరీ సమీపంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికా రులు, ఫైర్ సిబ్బంది మంటలు చెలరేగకుండా అదుపులోకి తెచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ముర్ము
-
రామప్పకు రాష్ట్రపతి
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం సందర్శించనున్నారు. ఆమెతోపాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మీనాక్షి లేఖి, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ మాలోత్ కవిత హాజరుకానున్నారు. రాష్ట్రపతి కుటుంబసభ్యులు ఎనిమిది మంది ప్రత్యేక హెలికాప్టర్లో వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పహారా కోసం కేంద్ర బలగాలు రెండు రోజుల ముందే రంగంలోకి దిగగా.. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలయం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. భక్తులు, పర్యాటకుల సందర్శనలను నిలిపివేశారు. ఉదయం భద్రాద్రి.. మధ్యాహ్నం రామప్పలో పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన రామప్పలో గంటన్నరపాటు కొనసాగనుంది. ఉదయం 9:50 గంటలకు ఆమె భద్రాచలం వెళ్లి.. రామయ్య దర్శనం అనంతరం ప్రసాద్ పథకం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, కురవి, ఆసిఫాబాద్ లోని ఏకలవ్య గురుకులాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 145 మంది ఆదివాసీలతో రాష్టపతి భేటీ కానున్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి బ్యాటరీ కారులో 2:40 గంటలకు ఆలయానికి చేరుకొని గౌరవ వందనం స్వీకరిస్తారు. 3 గంటలకు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రూ.60కోట్లతో చేపడుతున్న ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అదేవిధంగా కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామప్ప గార్డెన్లో పరంపర బృందం చేసే గిరిజన నృత్యాలను తిలకిస్తారు. 3:40 గంటలకు ఆలయం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3:50 గంటలకు హెలికాప్టర్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయలుదేరుతుంది. రేపు సమతామూర్తి కేంద్రానికి... : శంషాబాద్ రూరల్: మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతామూర్తి కేంద్రా(శ్రీరామానుజ జీయర్‌స్వామి)న్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం దర్శించుకోనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆమె ఇక్కడకు సాయంత్రం చేరుకుంటారు. రాష్ట్రపతి రాక సందర్భంగా ఇక్కడకు వచ్చే భక్తులు భద్రతా సిబ్బందికి సహకరించాలని నిర్వాహకులు కోరారు. -
రాష్ట్రపతి రామప్ప పర్యటనకు సీఎం కేసీఆర్!
వెంకటాపురం (ఎం): ఈనెల 28న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రమే హాజరవుతారని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారయినట్లు సమాచారం. రామప్ప ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటివరకు రాలేదు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ రానుండటంతో పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రామప్పలో మూడు ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రామప్పలో గంటన్నరపాటు రాష్ట్రపతి... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గంటన్నరపాటు కొనసాగనుంది. భద్రాచలం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 2:20 గంటలకు ఆమె రామప్పకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 సమయంలో ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 3:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. రాష్ట్రపతి విలేకరులతో మాట్లాడతారా లేదా అనేది అధికారికంగా ఖరారు కాలేదు. -
2026 నాటికి పూర్తి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం చుట్టూ అభివృద్ధి పనులు, పురాతన అనుబంధ దేవాలయాల పునరుద్ధరణ 2026 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్.. సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)కు స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ఆ సంస్థ అనుబంధ విభాగం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)కు సమర్పించింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పను గతేడాది యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. యునెస్కో నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అందు కు 8 అంశాలను సూచిస్తూ, వాటి ప్రకారం పనులు ఎలా చేస్తా రో, ఎప్పటిలోగా చేస్తారో డిసెంబర్ వరకు నివేదిక అందజేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్ ట్రస్టుతో సంప్రదించి రూపొందించిన నివేదికను తాజా గా ఐకొమాస్‌కు ఏఎస్ఐ సమర్పించింది. ఏం చేస్తారు..?: రామప్ప ఆలయం పక్కనే అదే సమయంలో నిర్మించిన కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించడం కీలకం. 33 మీటర్ల వెడల్పు, 33 మీటర్ల పొడవుతో ఉండే ఈ మహా మండపాన్ని వేయి స్తంభాల మండపం తరహాలో పునరుద్ధరిస్తారు. 2023, జూన్ నాటికి ప్రదక్షిణ పథం వరకు, 2026, మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని యునెస్కోకు ఏఎస్ఐ తెలిపింది. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదులు నిర్మిస్తారు. 8 శతాబ్దాల కిందట ఈ ఆలయం కట్టినప్పుడు వాడిన ఇసుకనే మళ్లీ వాడనున్నారు. దానిమీద అర మీటరు మందంతో డంగు సున్నం, ఇటుకలతో వేదిక నిర్మించి దానిమీద రాళ్లతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనుండటం విశేషం. రామప్ప చెరువు వద్దకు వెళ్లే దారిలో శిథిలమైన చిన్న ఆలయాలను, రామప్పకు చేరువలో నర్సాపూర్‌లోని చెన్నకేశవస్వామి, కొత్తూరులోని దేవునిగుట్ట, బుస్సాపూర్‌లోని నరసింహస్వామి ఆలయాలతోపాటు జాకారంలోని శివాలయం, రామానుజాపూర్లోని పంచకూటాలయాలను పునరుద్ధరించారు. రామప్పకు 25 కి.మీ. పరిధిలో టూరిజానికి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. పర్యాటకులకు సమస్త వసతులుండాలని యునెస్కో సూచించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇందులో పొందుపర్చారు. దీని పరిధిలో ఉండే గ్రామాల అభివృద్ధి ఎలా ఉండాలో నిర్ధారిస్తూ ఓ పట్టణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయానికి రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించే చానళ్లు, చెరువు కట్ట అభివృద్ధి చేయనున్నట్లు నివేదికలో పేర్కొ న్నారు. పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. రామప్ప ఆలయ వైభవాన్ని పెంచడం, అక్కడి పవిత్రతను కాపాడటం, పురాతన కట్టడానికి ఏ రకంగానూ నష్టం వాటిల్లకుండా వ్యవహరించడం.. స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు, అర్చకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం లాంటివి నివేదికలో పొందురుపర్చారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.15 కోట్లను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజూరు చేశారు. ఆ నిర్మాణాలతో పోలికలు పంపండి: యునెస్కో ఇప్పటికే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కట్టడాలతో రామప్పను పోలుస్తూ నివేదిక సమర్పించాలని యునెస్కో కోరింది. నిర్మాణానికి వాడిన రాయి, పునాదిలో వినియోగించిన పరిజ్ఞానం, ఆలయ నగిషీలు, శిల్పకళారీతుల వర్ణన, నాట్యరీతులతో కూడిన శిల్పాలకు సంబంధించి ఖజురహో, హంపి, తంజావూరు బృహదీశ్వరాలయం, పట్టదకల్లు, బాదామీ ఆలయాలతో పోలుస్తూ నివేదికను సమర్పించారు. కంబోడియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లోని ఆలయాలతో పోలుస్తూ వచ్చే డిసెంబర్ నాటికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. -
రామప్పలో గుప్తనిధుల వేట
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా లభించి తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడుతుంటే, మరోపక్క దుండగులు రామప్ప ఉప ఆలయాల్లో గుప్తనిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో రామప్ప ప్రధాన ఆలయంతోపాటు పది ఉప ఆలయాలు ఉన్నాయి. వారం క్రితం రామప్ప ఆలయానికి పడమర దిశలో ఉన్న జామాయిల్ తోటలోని శివాలయం (ఉప ఆలయం) వద్ద గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపినట్లు సమాచారం. నెలరోజులుగా ఉప ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఒక ముఠా రాత్రివేళల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో సరస్సుకట్టపై ఉన్న ఉపఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి శివలింగాలను ధ్వంసం చేశారు. బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న శివాలయంలో నంది మెడను ధ్వంసం చేశారు. 20 రోజుల క్రితం పాలంపేట నాగబ్రహ్మక్షేత్రం వద్ద తవ్వకాలు జరపగా, ఏమీ లభించకపోవడంతో దానిని పూడ్చివేసినట్లు తెలిసింది. జామాయిల్ తోటలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్లు అక్కడ ఉన్న పూజా సామగ్రిని పట్టి తెలుస్తోంది. తవ్వకాల్లో విగ్రహంతోపాటు బంగారం లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ రక్షణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలంపేట ఉప ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, రాత్రివేళల్లో పోలీసులు భద్రతాచర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. -
Photo Feature: త్రివర్ణ కాంతుల్లో రామప్ప
రామప్ప ఆలయం సోమవారం రాత్రి త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఆలయానికి మూడు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో ఆ గొప్ప కట్టడం కాంతులీనింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడ జాతీయజెండాను ఆవిష్కరించడంతోపాటు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు పురావస్తుశాఖ అ«ధికారులు తెలిపారు. – వెంకటాపురం(ఎం), ములుగు జిల్లా -
పూజలు చేసి..ప్రతి శిల్పమూ చూసి..
వెంకటాపురం(ఎం): రామప్ప కళాసంపదకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫిదా అయ్యారు. ఆలయంలో శిల్పాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి జస్టిస్ రమణ దంపతులతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్‌కుమార్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావులు ఆలయ చరిత్ర, శిల్పాకళా విశిష్టతను వివరించారు. గర్భగుడి ముందు ఉన్న సప్తస్వరాలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని సుప్రీం చీఫ్ జస్టిస్ స్వయంగా మీటారు. ఒకే శిల్పంలో వివిధ చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయని గైడ్ వివరించారు. రామప్ప ఆలయాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారని, అదే తరహాలో ప్రస్తుతం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారని ప్రొఫెసర్ పాండురంగారావు వెల్లడించారు. ఆలయంలో గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన పర్యటనలో ప్రతి శిల్పం గురించి జస్టిస్ ఎన్వీ రమణ అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత ఆయన హనుమకొండకు బయలుదేరారు. ఆయన వెంట ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నరసింగరావు, అదనపు జడ్జి అనిల్‌కుమార్, ములుగు సివిల్ జడ్జి రాంచందర్‌రావు, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ మహేశ్‌నాథ్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు ఉన్నారు. రాత్రి వరంగల్‌లోని నిట్‌లో సీజేఐ రమణ బస చేశారు. ఆదివారం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. -
టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సమగ్ర పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడం రామప్ప దేవాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చార్మినార్, గోల్కొండ, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క–సారలమ్మ, ప్రకృతి పండుగ బతుకమ్మ మొదలైన అరుదైన ప్రత్యేకతలు తెలంగాణ సొంతమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు టెంపుల్ టూరిజంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా రూ. 14 వందల కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని కేంద్రాన్ని కోరారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, అభివృద్ధి చేయటానికి తగిన సహకారాన్ని అందించాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
Telangana: ‘యునెస్కో’కు మరో 25 ప్రతిపాదనలు
సాక్షిప్రతినిధి, వరంగల్: పురాతన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున రామప్పకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో మరో 25 పర్యాటక ప్రాంతాలను యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2016 నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని, అయితే అప్పుడు పలు దేశాలు తిరస్కరించాయన్నారు. ఆయా దేశాలతో విదేశాంగ శాఖ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడి, వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేసేలా చేశారని తెలిపారు. ఇందులోభాగంగా 17 దేశాలు రామప్పకు జై కొట్టాయన్నారు. తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం పరిరక్షించుకోవాలని, నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. తర్వాత కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు వేయిస్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి నుంచి కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటకు వెళ్లారు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ షోను వీక్షించారు. -
రామప్పపై త్వరలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయం అభివృద్ధికి సమగ్ర నివేదికను త్వరలోనే కేంద్ర పర్యాటక, సాంస్కృ తిక మంత్రి జి.కిషన్‌రెడ్డికి అందజేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వచ్చే జయంతి కల్లా ఆయన పుట్టిపెరిగిన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. పీవీ ఖ్యాతి అందరికీ తెలియజేసేలా మ్యూజియం స్థాపిస్తామని చెప్పారు. శుక్రవారం మండలిలో రామప్ప ఆలయం వద్ద పర్యాటక ప్రోత్సాహకంపై ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వేసిన ప్రశ్నకు సభ్యురాలు సురభి వాణీదేవి తొలిసారి కౌన్సిల్లో మాట్లాడారు. కాగా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై 8 ఇంటర్‌ఛేంజ్ పాయింట్ల వద్ద ట్రామాకేర్ సెంటర్లను నెలకొల్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పటాన్చెరువు, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట్, బొంగులూరు, నార్సింగి, టీఎస్‌పీఏల వద్ద పలు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. -
ఓ క్రేన్.. పనులాపింది..
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయం ప్రపంచవారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ, కాకతీయుల హయాంలోనే నిర్మితమై, ‘ఇంత మంచి నిర్మాణం ఉండగా రామప్పనే ఎందుకు ఎంచుకున్నారు’అని యునెస్కో ప్రతినిధితోనే అనిపించుకున్న వరంగల్ నగరంలోని వేయిస్తంభాల దేవాలయం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. శిథిలమై పడిపోయే స్థితికి చేరిందన్న ఉద్దేశంతో వేయిస్తంభాల రుద్రేశ్వరాలయానికి దక్షిణం వైపు ఉన్న నాట్యమండపాన్ని పునర్నిర్మించేందుకు విప్పదీసి దశాబ్దన్నర గడుస్తున్నా తిరిగి నిర్మించలేక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) విభాగం చతికిలబడింది. కేవలం 18 నెలల్లో నిర్మిస్తానని చెప్పి, 16 ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయలేక అభాసుపాలవుతోంది. ఇదీ సంగతి.. కాకతీయుల నిర్మాణాల్లో వేయిస్తంభాల గుడి అగ్రపథాన ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణశైలి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 800 ఏళ్ల క్రితమే ఆ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అబ్బురపరుస్తోంది. శివాలయం, దాని పక్కనే నాట్యమండపం ఉన్నాయి. రెండింటిలో కలిపి వేయిస్తంభాలు ఉండటం విశేషం. కానీ, కాలక్రమంలో నాట్యమండపం శిథిలమవుతూ వస్తుండటంతో దాన్ని తిరిగి పూర్వవైభవం తెస్తామంటూ ఏఎస్ఐ 2005లో విప్పదీసింది. వెంటనే పనులు మొదలుపెట్టి 18 నెలల్లో పూర్తిచేస్తామని పేర్కొని కసరత్తు ప్రారంభించింది. రెండుమూడేళ్ల విరామంతో ఎట్టకేలకు పనులు ప్రారంభించింది. నాలుగేళ్లపాటు నిపుణుల ఆధ్వర్యంలో శ్రమించి 80 శాతం పనులు పూర్తి చేశాక అర్ధంతరంగా ఆగిపోయాయి. క్రేన్ తెచ్చిన తంటా.. అలనాటి నిర్మాణంలో వాడిన రాళ్లనే యథావిధిగా తిరిగి వినియోగించేందుకు వాటిపై నంబర్లు వేసి పెట్టారు. ఆ రాళ్లనే తిరిగి పాత నిర్మాణశైలిలో క్రమపద్ధతిలో పేర్చి, డంగు సున్నం మిశ్రమాన్ని బైండింగ్‌కు వాడి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ 50 టన్నులు, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్లను అద్దెకు తెచ్చి పనులు చేపట్టగా, ఏఎస్ఐకి సొంత క్రేన్ ఉండగా అద్దె క్రేన్లు ఎందుకు వాడారంటూ అధికారులు అభ్యంతరం చెప్పి బిల్లులు నిలిపివేశారు. అయితే అప్పటికే దాదాపు రూ.ఏడు కోట్ల వ్యయంతో 80 శాతం పనులు పూర్తిచేయడం, క్రేన్లకు సంబంధించిన రూ.కోటిన్నర బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. దాన్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను ఉమ్మడి ఏపీ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు కృష్ణయ్యకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే ఆయ న మృతి చెందటంతో ఇక ఆ కసరత్తు కంచికి చేరింది. కాగా, తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి ఇప్పుడు కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉండటంతో వేయిస్తంభాల దేవాలయ మండప పునర్నిర్మాణం కొలిక్కి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. భారీగా పెరిగిన ఖర్చు.. క్రేన్ల వినియోగానికి అనుమతుల విషయంలో ఏర్పడ్డ గందరగోళం ఇప్పుడు ఖర్చును భారీగా పెంచేందుకు కారణమవుతోంది. కేవలం రూ.కోటి వ్యయంతో మిగతా పనులు పూర్తిచేయాల్సిన తరుణంలో, ఇప్పుడు దాని ఖర్చు ఏకంగా రూ.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రూఫ్ బీమ్‌లు ఏర్పాటు చేసి పైకప్పు నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.6 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 13 స్తంభాలు గల్లంతు నాట్యమండపంలోని పైకప్పునకు ఆధారంగా 132 స్తంభాలున్నాయి. విప్పదీసినప్పుడు వాటికి నంబర్లు వేసి పెట్టారు. కానీ, ఇప్పుడు 119 స్తంభాలే లెక్కతేలాయి. మిగతా 13 గల్లంతు కావటంతో కొత్తగా వాటిని తయారు చేశారు. -
రామప్ప పరిరక్షణలో తొలి అడుగు
చరిత్ర ఒక జాతి గుండెకాయ. సాంస్కృతిక, కళారంగాల గత వైభవపు ఆనవాళ్ళు దేశ చరిత్రకు మదింపు రాళ్ళు. వాటిని పరి రక్షించుకోని నాడు, కాలానుగుణంగా కాంతులీనిన మానవ మేధో జనిత çసృజన కాలగర్భంలో కలిసిపోతుంది. కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రుడు నాలుగు దశాబ్దాలు శ్రమించి నిర్మాణం చేయించిన అద్భుత శిల్పకళాఖండం రామప్ప దేవాలయం. క్రీ.శ. 1213లో పూర్తయిన ఈ ఆలయంలో కొలువు న్నది రామలింగేశ్వరుడైనా ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి కెక్కడం విశేషం. శాండ్బాక్స్ టెక్నాలజీతో, ఇసుక పునాదులపై ఓ భారీ ఆలయాన్ని నిర్మించడం, అది తీవ్రమైన భూకంపాలను సైతం తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం దేశంలో మరెక్కడా చూడలేని నిర్మాణ కౌశలం. శిల్పసౌందర్యానికి వేదికైన ఈ కట్టడం దశాబ్దాల పాటు నిరాదరణకు గురికావడం క్షంతవ్యం కాని విషయం. 1310లో మాలిక్ కాఫర్ దండయాత్రలో చాలా భాగం దెబ్బతినడం చారిత్రక గాయమైతే, గుప్తనిధుల కోసం జరిపిన తవ్వకాలు దీని శైథిల్యానికి మరో కారణం. ఆలయం కొలువున్న పాలం పేట ప్రజలతో పాటు, చరిత్రకారులు, సాహితీవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆందోళనతో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎలాంటి చలనం లేని నిర్లక్ష్య ధోరణి. ఒకవైపు పునాదుల్లో నింపిన ఇసుకను తోడుతున్న చీమలు, మరోవైపు దేవాదుల సొరంగాల తవ్వకాల కోసం జరిపే భారీ పేలుళ్ళు ఈ ఆలయ ఉనికిపై తీవ్ర ప్రభావాన్ని చూపసాగాయి. ఆ తరుణంలో తెలంగాణ రచయితల వేదిక కార్యక్షేత్రంలోకి దిగింది. ఔత్సాహికులను సమీకరించి, రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసింది. వివిధ కార్యక్రమాల రూపకల్పనతో మేధావులను భాగస్వామ్యం చేసి, ప్రజలకు ఆలయ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చింది. ‘విధ్వంసం కోరల్లో రామప్ప’ అన్న పుస్తకాన్ని వెలువరించింది. తెరవే నిర్వహించిన ఆ కార్య క్రమాల వివరాలు పత్రికల్లో చూసి హైకోర్టు వాటిని సుమోటోగా స్వీకరించి, ప్రభుత్వానికి, పర్యాటకశాఖకు, పురావస్తు శాఖకు నోటీ సులు జారీ చేసి చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆఖరి దశలో అనివార్యంగానైనా స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల కృషి కూడా తోడై ఒక సుదీర్ఘ కల నెరవేరింది. గతంలో బొమ్మలమ్మగుట్టను కూడా గ్రానైట్ క్వారీకి అనుమ తించడం వల్ల తవ్వకాలకు సిద్ధపడ్డప్పుడు గ్రామస్తులను సమీ కరించి తెరవే అడ్డుకున్నది. ఏ బొమ్మలమ్మగుట్టనైతే పగలజీరి గ్రానైట్ మాఫియా నోట్ల కట్టలుగా మార్చుకోవాలనుకున్నదో, ఆ బొమ్మలమ్మగుట్టే తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి ప్రధానంగా నిలిచింది. జినవల్లభుడు చెక్కిన తొలి కందపద్యం కాలం ఆధారంగా తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. నందగిరి కోట్ల నర్సిం హులపల్లిలో కూడా క్రీ.పూ. 320 సంవత్స రానికి సంబంధించిన నందుల కాలంగా చెప్పుకుంటున్న నర్సింహస్వామి ఆలయం ఉన్న గుట్టను కూడా గ్రానైట్‌కు అనుమతిస్తే తెరవే అక్కడి ప్రజలను సమీకరించి, దాని పరిరక్షణ కోసం ఉద్యమించిన ఫలితంగానే తవ్వకాలు ఆగిపోయాయి. మన ప్రాంతంలో వెల్లివిరిసిన ప్రాచీన జైన, బౌద్ధం ఆన వాళ్ళు, ఈ ప్రాంతాన్నేలిన శాతవాహన, కాకతీయ అంతకు పూర్వపు రాజుల చారిత్రక అవశేషాలకు ఆధార భూతంగా నిలిచే ప్రాచీన వాఙ్మయం, ప్రాచీన కట్టడాలు, ఇతరత్రా లభించే చారిత్రక ఆధారాలన్నిటినీ వెలికితీసి తెలంగాణ ఘనమైన వారసత్వ సంప దను ముందుతరాలకు అందించే పనిని ప్రభుత్వాలు చేయాలి. గాజోజు నాగభూషణం మొబైల్ : 98854 62052 -
Ramappa Temple: ఇక... అన్ని దారులూ ఇటువైపే!
ఎనిమిది వందల ఏళ్ల కిందటి మాట. రేచర్ల రుద్రుడు ముచ్చటపడి నిర్మించిన ఓ నిర్మాణం. ప్రాశస్త్యానికి కొదువలేదు... కొరవడింది ప్రచారమే. మన వాస్తుశిల్పుల నైపుణ్యానికి ఇది ఓ మచ్చుతునక. అయినా ఇటువైపు తిరిగి చూసిన వాళ్లు ఎందరు? వాస్తుశిల్పి రామప్ప పేరుతో రామప్ప గుడిగా వ్యవహారంలోకి వచ్చిన రుద్రేశ్వర ఆలయం నిర్మాణనైపుణ్యం గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. ఓ గ్రంథమే రాయాలి. కాకతీయులు స్వతంత్ర రాజులైన తర్వాత నిర్మాణశైలిలోనూ స్వతంత్రతను, సృజనాత్మకతను ప్రదర్శించారు. కాకతీయుల తర్వాత ఈ ఆలయం ఆదరణకు నోచుకోలేదనే అభిప్రాయమే బలంగా ఉంది. కానీ ఇది వాస్తవం కాదంటారు పురావస్తు పరిశోధకులు, స్థపతి డాక్టర ఈమని శివనాగిరెడ్డి. నిజాం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసిన తరవాత ప్రభుత్వం రామప్పగుడికి సమీపంలో ఒక గెస్ట్ హౌస్ కట్టించి పర్యాటక ప్రాధాన్యం కల్పించింది. అయితే పర్యాటక ప్రదేశంగా రావల్సినంత ప్రాముఖ్యత రాకపోవడానికి కారణం ప్రచారం పెద్దగా లేకపోవడమే. డాక్టర్ సి. నారాయణరెడ్డి, పీవీ నరసింహారావు రచనలతో ఈ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా చాలాకాలం శ్రీకాకుళం వాళ్లకు కానీ చిత్తూరులోని సామాన్యులకు కానీ దీని గురించి తెలియనే తెలియదు. పత్రికలు కథనాలు రాయడం, టీవీలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయడంతో ఇక్కడ ఇంత గొప్ప నిర్మాణం ఉందనే సంగతి సామాన్యులకు చేరింది. ఈ ప్రదేశం కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడం కూడా ఒక కారణమే. పురావస్తు శాఖ ఒక సైట్‌ను పరిరక్షిస్తుంది తప్ప ప్రచారం కల్పించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించలేదు. అది రాష్ట్రప్రభుత్వాల పని. ఈ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని చెప్పలేం. కానీ కొంతమేర ఆక్రమణలకు గురైన మాట నిజం. 2008 నుంచి మొదలైన ఒక ప్రయత్నం ఇప్పటికి నెరవేరింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. మనదేశంలో ఉన్న హెరిటేజ్ కమిటీ పాలంపేటలో పర్యటించి... ఆక్రమణలను తొలగించమని, నిర్మాణాన్ని రీస్టోర్ చేయమని ఇంకా అనేక సూచనలు చేసింది. కేంద్రప్రభుత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ శాఖ, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో ఈ పదకొండేళ్ల కాలంలో చాలా పనులు జరిగాయి. గుడి వాస్తుశైలి, నీటి మీద తేలే ఇటుకలతో నిర్మాణ ప్రతిభ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ యునెస్కో నియమావళికి తగినట్లు ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పట్టింది. ఇన్నాళ్లూ ఎందుకిలా! రామప్ప గుడి నిర్మాణశైలిపరంగా, శిల్పలాలిత్యపరంగా ఎంత విశిష్టమైనదైనప్పటికీ పర్యాటకుల మనసును పెద్దగా తాకలేదు. కాకతీయుల నిర్మాణాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు సాధారణంగా హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి నేరుగా హన్మకొండకు వెళ్లి వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం చూస్తారు. వరంగల్ కోటను చూస్తారు. వరంగల్ కోట చూడడానికి షెడ్యూల్లో అనుకున్న టైమ్కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రామప్ప గుడి ఉంటుంది ప్రణాళికలో. అయితే భోజనాలు పూర్తయ్యేటప్పటికి మూడున్నర అయిపోతుంది. ఇప్పుడు రామప్పగుడికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు చేరేటప్పటికి ఎంత టైమవుతుందోనని మెల్లగా పునరాలోచన మొదలవుతుంది. గైడ్లు, స్నేహితులు కూడా తమవంతుగా నిరుత్సాహపరిచేవాళ్లు. పర్యాటకుల డైలమాను పోగొట్టడానికి ‘రామప్ప గుడి కూడా వేయిస్తంభాల గుడి ఉన్నట్లే ఉంటుంది. పైగా రెండూ శివాలయాలే. మళ్లీ అంతదూరం వెళ్లడం ఎందుకు? దూరం వంద కిలోమీటర్ల లోపే. అటవీ ప్రాంతం. తిరిగి వచ్చే సమయానికి చీకట్లు అలుముకుంటాయి. అక్కడ ఉన్నవి కూడా ఇలాంటి శిల్పాలే’ అని చెప్పి పర్యాటకులను తిరుగుముఖం పట్టించేవాళ్లు. అలా... వేయిస్తంభాల గుడి పర్యాటకుల్లో రామప్ప గుడి వరకు కొనసాగే వాళ్ల నంబరు సగానికి లోపే ఉండేది. రెండు రోజుల టూర్ ప్లాన్ ఉన్నవాళ్లు మాత్రం... లక్నవరంలో రాత్రి బస చేసి రెండవ రోజు రామప్ప గుడిని కవర్ చేసేవాళ్లు. ఇలాగ... ఈ నిర్మాణం పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోకపోవడంలో అందరి పాత్ర ఉంది. ఇకపై రూట్ మారుతుంది! ఇప్పుడు రామప్ప గుడికి ప్రపంచస్థాయి వచ్చింది. ఇక పర్యాటకుల టూర్ రూట్ కూడా మారిపోతుంది. రామప్ప గుడి దగ్గర మెరుగైన బస సౌకర్యాలు పెరుగుతాయి. రామప్ప గుడిని చూడడానికి ములుగు జిల్లా, పాలంపేటకు వచ్చిన పర్యాటకులు... ఆ తర్వాత రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పచెరువు, హన్మకొండలోని వెయ్యి స్థంబాల గుడి, వరంగల్ ఖిలాలు కవర్ చేస్తారు. ఇకపై పాలంపేటలో బస చేసి ఇవన్నీ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యే అవకాశాలే ఎక్కువ. అలాగే ట్రెకింగ్, బోటింగ్ వంటివీ పెరుగుతాయి. ఈ పాలంపేట గ్రామం హస్తకళాకారులకు కూడా మంచి మార్కెట్ పాయింట్ అవుతుంది. వరంగల్ డరీస్, పెంబర్తి ఇత్తడి బొమ్మల వంటి స్థానిక హస్తకళలు మన ఖ్యాతిని చాటుతూ గర్వంగా ప్రపంచదేశాలకు చేరతాయి. భవిష్యత్తు బంగారమే! రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని ఇప్పటి వరకు మనం మాత్రమే రాసుకున్నాం, చదువుకున్నాం. ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన తర్వాత ఈ నిర్మాణం గురించి దేశవిదేశాల్లో రచనలు వెలువడతాయి. మన దగ్గర కూడా ఈ నిర్మాణం గురించి ఇంకా ఎక్కువ పుస్తకాలు రావాలి. పర్యాటకులు ప్రతి ఒక్కరూ వెళ్తూ వెళ్తూ ఒక పుస్తకం కొనుక్కుని వెళ్తారు. వాళ్ల స్నేహితులకు, బంధువులకు చూపిస్తారు. ఇప్పటి వరకు మల్లారెడ్డి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందుకు అవసరమైనట్లు సంక్షిప్త సమాచారంతో చిన్న పుస్తకాల అవసరం ఉంది. యునెస్కో ప్రకటనతో ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పర్యాటకుల సంఖ్య పెరిగితే గైడ్లు, బస కోసం లాడ్జిలు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్, భోజనానికి హోటళ్లు పెరుగుతాయి. హౌస్‌కీపింగ్, ఎస్కార్ట్, లాండ్రీ వంటి సర్వీస్ రంగాలకు డిమాండ్ ఎక్కువవుతుంది. డాన్స్ షో ఏర్పాటు చేస్తే కళాకారులు, వాద్యకారులు ఉపాధి పొందుతారు. అలాగే వసతుల కల్పనలో ప్రకృతి సుందరీకరణ చెక్కు చెదరకుండా జాగ్రత్త పడాలి. -
‘రామప్ప’కు రూ. 250 కోట్ల ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: రామప్ప ఆలయానికి రూ.250 కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. భద్రాచలం ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని, మేడారం జాతరకు జాతీయహోదా కల్పించి అభివృద్ధి చేయాలని విన్నవించారు. బుధవారం కేంద్రమంత్రిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. మహబూబాబాద్ పర్యాటకంగా అభివృద్ధి చెంది, ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ది చెందాలంటే కేంద్రమంత్రిగా చొరవ తీసుకోవాలని, తెలంగాణబిడ్డగా పూర్తి సహకారం అందించాలని కిషన్‌రెడ్డిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణమన్నారు. -
Ramappa Temple: అలా జరిగితే యునెస్కో గుర్తింపునకు దెబ్బ!
ఎక్కడపడితే అక్కడ పసుపు–కుంకుమలు చల్లినా.. దీపం వెలిగించిన నూనె మరకలు కనిపించినా.. అగరుబత్తి పొగతో మసిబారినా.. రామప్ప ప్రపంచ వారసత్వ హోదా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. యునెస్కో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇకపై జాగ్రత్తలు అత్యవసరం. ‘రామప్ప’కు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ప్రపంచ హోదా వచ్చిన సంతోషాన్ని కాదనలేం. కానీ వచ్చిన గుర్తింపును చేతులారా పోగొట్టుకునే పనులే సరికాదు. ఇలాంటివి యునెస్కో ప్రతినిధుల కంటపడితే గుర్తింపు రద్దు చేసే ప్రమాదం ఉంటుంది మరి. సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వరాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా తెలుగువారిని మురిపి స్తోంది. దశాబ్దాలపాటు సాగిన ఎదురు చూపులు ఇప్పుడే ఫలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ‘గుర్తింపు’ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతకాలం ఓ పద్ధతంటూ లేకుండా సాగిన వ్యవహా రంలో ఇప్పుడు మార్పులు రాకుంటే చేతులారా హోదా కోల్పోయినట్టు అవుతుంది. ఎంతో కసరత్తుతో..: రామప్ప ఆలయానికి గుర్తింపు ఇచ్చే ముందు యునెస్కో చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. యునెస్కో అనుబంధ సంస్థ ఐకొమాస్ ప్రతినిధి 3 రోజుల పాటు రామప్పలోనే మకాం వేసి మొత్తం గుడి, పరిసరాలను జల్లెడ పట్టారు. ప్రతి అంశాన్ని నోట్ చేసు కుని నివేదిక రూపొందించారు. ఆ తర్వాత రామప్ప ఆలయం ఇతర కట్టడాల కంటే ఎందుకు, ఎంత ప్రత్యేకమైనదో గుచ్చిగుచ్చి వివరాలు సేకరించారు. ఆ తర్వాతే గుర్తింపుపై ముందడుగు పడింది. యునెస్కో నిబంధనల ప్రకారం.. పురాతన కట్టడం ప్రత్యేకతలకు భంగం కలిగే ఏ చిన్న మార్పు చేసినా, కట్టడం దెబ్బతిన్నా ‘వారసత్వ గుర్తింపు’ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అందు కోసం యునెస్కో ప్రతినిధులు ఆకస్మికంగా సంబంధిత ప్రదేశాలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామప్ప ఆలయంలోనూ అలా తనిఖీలు చేయనున్నారు. అందువల్ల యునెస్కో గుర్తింపును కాపాడుకోవడానికి అత్యంత శ్రద్ధ పెట్టాల్సి ఉండనుంది. ఏటా కొనసాగుతున్న నిర్లక్ష్యం.. రామప్ప శివాలయం కావటంతో కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆలయం ప్రాంగణాన్ని దీపాలతో నింపేస్తారు. కొంతకాలంగా స్థానిక ఏఎస్ఐ అధికారుల చర్యలతో ఇది కాస్త తగ్గినా.. దీపాల జాతర, ఆలయంలో ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహాలపై పసుపు, కుంకుమలు, విభూతి చల్లడం వంటివి జరుగుతున్నాయి. ఇక ముందు ఇవన్నీ యునెస్కో గుర్తింపునకు సమస్యతగా మారే అవకాశం ఉంది. అయితే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా యునెస్కో కొన్ని విధివిధానాలు రూపొందించింది. వాటిని ఆచరించేలా చూసుకుంటే చాలు. పూజలు అందుకునే విగ్రహాల వద్ద, అర్చకులు పసుపుకుంకుమలు, పూలతో పూజ చేయవచ్చు. అక్కడే దీపాలు వెలిగించాలి. ఇతరచోట్ల అలా చేయకూడదు. ►పండుగల సమయంలో ఆలయంపై ఇష్టం వచ్చినట్టుగా విద్యుద్దీపాలు అమర్చకూడదు. ►కట్టడానికి వంద మీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా యునెస్కో నిబంధన ఉంది. ఆ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా జరగటానికి వీల్లేదు. కానీ రామప్ప గుడి పక్కనే తరచూ సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాస కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు చేపడుతుంటారు. అవి కుదరదు ►నిషేధిత ప్రాంతానికి అవతల మరో వంద మీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత పరిధిగా భావిస్తారు. ఆ పరిధిలో నిబంధనల ప్రకారం అనుమతి పొంది కొన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అవి ఆలయానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. సమన్వయం అత్యవసరం.. రామప్ప ఆలయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ పరిధిలో ఉంది. ఆలయం విస్తరించి ఉన్న 20 ఎకరాల ప్రాంతంలో అన్నింటినీ ఏఎస్ఐ పర్యవేక్షిస్తుంది. దాని వెలుపల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య పూర్తి సమన్వయం అవసరం. ►ఆలయంలో పూజాదికాలు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయి. ఇవి కూడా ఏఎస్ఐ విధివిధానాలకు లోబడే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రామప్ప వద్ద మ్యూజియం, ధ్యానకేంద్రం, శిల్పారామం సహా పలు కట్టడాలు నిర్మించే యోచనలో ఉంది. అవి ఏఎస్ఐ నిబంధనల ప్రకారమే జరగాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం లోపిస్తే.. యునెస్కో గుర్తింపు రద్దుకు దారితీసే అవకాశం ఉంటుంది. ►రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యునెస్కో సూచన మేరకు పాలంపేట డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్రస్థాయిలో ముఖ్య విభాగాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా సమన్వయంలో పనిచేయాలి. ►ఆలయం పరిధిలో గతంలో విప్పదీసి పెట్టిన కాటేశ్వరాలయాన్ని 2024 నాటికి పునర్నిర్మిస్తామని ఏఎస్ఐ లిఖితపూర్వకంగా యునెస్కో దృష్టికి తెచ్చింది. దాన్ని పూర్తి చేయాలి. ►భక్తులకు వసతులు, రోడ్ల నిర్మాణం, జీవ వైవిధ్యానికి ఇబ్బంది లేని పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. వీటిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలి. యునెస్కో సూచించిన ఈ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా గుర్తింపుపై దెబ్బపడుతుంది. చిన్న వంతెన కడితే.. ‘గుర్తింపు’ పోయింది డ్రెస్డన్ ఎల్బ్ వ్యాలీ.. జర్మనీలోని ఓ చారిత్రక నగరం. యునెస్కో 2004లో దానికి కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌గా ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చింది. 16–20 శతాబ్దాల మధ్య జరిగిన అద్భుత చారిత్రక నిర్మాణాలు ఆ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. కానీ అక్కడి ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ట్రాఫిక్ సమస్యకు విరుగుడు అంటూ అక్కడ కొత్తగా ఓ వంతెన కట్టారు. దీంతో ఆ ప్రాంత విశిష్టతకు భంగం కలిగిందంటూ యునెస్కో గుర్తింపును ఉపసంహరించుకుంది. -
మన రామప్ప... మనందరి గౌరవం
-
1922లో రామప్ప ఆలయం.. వైరలవుతున్న ఫోటో
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సంబంధించిన పురాతన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 1922లో తీసిన రామప్ప ఆలయం ఫొటోను మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేశాడు. ఆలయానికి సంబంధించిన వివరాలను కనుక్కునేందుకు ప్రయత్నించగా తాను పురావస్తుశాఖలో పనిచేస్తున్నానని, 1922లో రామప్ప ఆలయాన్ని తీసిన ఫోటో అని మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. ఇటీవల ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో చారిత్రక కట్టడాలకు పేరున్న తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ స్థాయిలో ఈ రకమైన గుర్తింపు సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప చరిత్ర సృష్టించింది. -
Ramappa Temple: మైనింగ్‌తో ముప్పు లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపికైన రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని కొన్ని ప్రచార మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రారంభించాలని భావిస్తున్న ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు.. కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని, తాజాగా యునెస్కో రామప్పను వారసత్వ సంపదగా ప్రకటించిన నేపథ్యంలో వెంకటాపురం ప్రాజెక్టుపై మరింత సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా ఉంటుందని యాజమాన్యం వివరించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి.. తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి చిన్న నష్టం కూడా చేకూర్చే ఎటువంటి ప్రతిపాదన చేయబోదని, గుడి పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటుందని తెలిపింది. దీనిపై అవాస్తవాలు నమ్మవద్దని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. రామప్ప అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయ సమీపంలో ఉన్న చరిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని హెరిటేజ్ శాఖ అధికారులను పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శుక్రవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో రామప్ప ఆలయంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యునెస్కో సూచించిన గైడ్‌లైన్స్‌పై, డిసెంబర్ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలులిచ్చారు. రామప్ప ఆలయంలో కేంద్ర ఆర్కియాలజీ శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలని, అలాగే ఆలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రామప్ప ఆలయం, చెరువు, కాలు వలకు చట్టబద్ధత కల్పించే విషయంపై యునెస్కో వారికి డిసెంబర్, 2022 లోపల ప్రణాళికలను సమర్పించాలన్నారు. సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్ కుమార్, వైఏటీసీ జాయింట్ సెక్రటరీ రమేశ్, హెరిటేజ్ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు పాల్గొన్నారు. -
Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి..
ఆడిటోరియం, కాటేజీలు, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు.. ఇలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి రాష్ట్ర సర్కార్ పంపిన రామప్ప ఆలయ అభివృద్ధి నమూనా చిత్రం ఇది. చరిత్రాత్మక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ప్రకటనకు ముందు ఆలయంతోపాటు సరస్సు కట్ట, రామప్ప సరస్సు ఐలాండ్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నమూనా చిత్రాలను కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని రామప్ప ఆలయం దగ్గర ఆడిటోరియం, కాటేజీలు, సరస్సు కట్టపై శివాలయం టెంపుల్, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు చేయడం, ఐలాండ్‌లో భారీ శివుడి విగ్రహం, పిల్లల పార్క్, కాటేజీలను ఏర్పాటు చేయనున్నట్లు నమూనా చిత్రాలను తయారు చేసి పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. –వెంకటాపురం (ఎం) -
రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం సంతోషకరం
-
‘రామప్ప సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు’
సాక్షి, హైదరాబాద్: రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు సాధనలో సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో రామప్ప ఆలయం ప్రపంచ పర్యాటక ప్రాంతం అవు తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. రామప్ప ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎర్రబెల్లి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. కేటీఆర్‌ను కలసిన వారిలో పార్టీ రాష్ట్ర సోషల్‌మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి, లింగాలఘణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి ఉన్నారు. -
పాత శిల్పాలకు కొత్త ఊపిరి
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇటీవల పరిగి సమీపంలోని ఓ గ్రామానికెళ్లా.. ఆ ఊరి నిండా శిల్పాలే. వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దుస్థితి కొంత దూరమవుతుందన్న ఆశాభావం కలుగుతోంది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావటమే ఇందుకు కారణం. ఆలయ శిల్పాలే యునెస్కోను ఆకర్షించాయి. ఫలితంగా శిల్పాలకు కొంతగుర్తింపు పెరుగుతుంది. నిరాదరణకు గురవుతున్న పురాతన శిల్పాలకు కొంత గౌరవం దక్కుతుంది’అని ప్రముఖ స్తపతి, రామప్ప దేవాలయ నిర్మాణానికి వినియోగించిన ఎర్ర ఇసుక రాతిని తొలిచిన క్వారీలను ఇటీవల వెలుగులోకి తెచ్చిన పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇది గొప్ప మలుపు కర్ణాటకలోని హంపికి యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. 10 వేల కుటుంబాలకు ఉపాధి రావటమే కాకుండా, నిత్యం విదేశీ పర్యాటకులతో ఆ ప్రాంతం కొత్త అందాలతో పాటు వేగంగా పురోగమించేందుకు అవకాశం కలిగింది. పట్టడకల్ దేవాలయాలకు ఆ గుర్తింపు వచినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంతో మనవద్ద కూడా అలాంటి అభివృద్ధికి అవకాశం ఉంది. కాలక్రమంలో వాటిల్లో చాలావరకు దాడులకు గురై ధ్వంసం కావటంతో వాటి శిల్పాలు ఊరూవాడ చిందరవందరగా పడిపోయాయి. అవగాహనలేని స్థానికులు వాటిని గాలికొదిలేశారు. ఇప్పుడు రామప్పకు గుర్తింపుతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చి ఆ శిల్పాలకు కొంత గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. శిల్పులకూ గౌరవం వస్తుంది రామప్ప దేవాలయంలోని నల్లరాతితో చెక్కిన శిల్పాలు, స్తంభాల ముందు నిలబడితే అద్దంలో చూసుకుంటున్నామన్న భావన వస్తుంది. రాతిని గాజులాగా మార్చేసిన 8 శతాబ్దాల క్రితం నాటి శిల్పుల ఘనతకు ఇప్పుడు మరింత గుర్తింపు వస్తుంది. వారిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి యంత్రాలు అందుబాటులో లేని సమయంలో.. ఉలితోనే రాతిని అద్దంలా మార్చిన ప్రతిభ నేటి తరానికి తెలుస్తుంది. శిథిల ఆలయాల పునరుద్ధరణ అవసరం.. కాకతీయుల కాలంలో అద్భుత దేవాలయాలను నిర్మించారు. అంతకుముందు చాళక్యులు కట్టిన అలంపూర్ లాంటి ఆలయాలున్నాయి. కానీ చాలావరకు శిథిలమవుతున్నాయి. రామప్పకు ప్రపంచ గుర్తింపు నేపథ్యంలో.. శిథిలమవుతున్న పాత దేవాలయాలను పునరుద్ధరించాలన్న ఆలోచన కూడా గ్రామాలకు కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
యునెస్కోను మెప్పించాలి
27 చారిత్రక కట్టడాలనూ.. చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్‌లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. ఆగస్టు 4న ఏఎస్ఐ, కలెక్టర్ సమావేశమవ్వాలి ‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్ విభాగం, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. -
అందరి చూపు... రామప్ప వైపు..!
దాదాపు 200 సంవత్సరాల పాటు సుస్థిర పాలనను అందించి, వర్తక, వాణిజ్య, వ్యవసాయాభివృద్ధితో పాటు, సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనాలను పోషించిన కాకతీయులు తెలుగునాట, ప్రత్యే కించి తెలంగాణలో వేయికి పైగా దేవాలయాలను నిర్మించారు. హన్మ కొండలోని వేయి స్తంభాలగుడి, వరంగల్ కోటలోని శంభుని గుడి, ఘనపూర్‌లోని కోటగుళ్లు, పాలంపేటలోని రామప్ప దేవాలయం కాకతీయ శిల్పకళా కౌశలానికి అద్దంపడుతున్నాయి. కాకతీయ చక్రవర్తి గణ పతిదేవుని సైనాధ్యక్షుడైన రేచర్ల రుద్రారెడ్డి పాలంపేటలో తన పేరిట రుద్రేశ్వర ఆలయాన్ని, సముద్రాన్ని తలపించే చెరువును క్రీ.శ.1213లో నిర్మించాడు. పరచుకొన్న పచ్చటి తివాచీలాంటి ప్రకృతి ఒడిలో, అందాన్ని మరింత ఇనుమడింపజేసే కొండపానుపుల దిగువనున్న పాలంపేటలో తాను కూడా తన ప్రభువు మాదిరే శివునికి ఒక వినూత్నమైన ఆలయాన్ని నిర్మించా లనుకొని, అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకొన్నాడు. తానొక అద్భుత ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నానని, కాకతీయ సామ్రాజ్యానికే మణిమకుటంగా ఆ ఆలయం భాసిల్లాలనీ తన తలంపును ప్రకటించాడు. ఇక అంతే! అద్భుత ఆలయాల నిర్మాణంలో సిద్ధహస్తులైన కాకతీయ శిల్పులు, అప్ప టివరకూ అందుబాటులో ఉన్న ఆలయాలకు భిన్నంగా, ఒక అపురూప దేవాలయాన్ని బట్టపై చిత్రించి, కొయ్యలో నమూనా దేవాలయాన్ని చెక్కి చూపించారు. మునుపటి కళ్యాణీ చాళుక్య దేవాలయాల వాస్తునే ఎంచుకొన్నా, నిర్మాణం వరకే ఆ శైలికి పరిమితమై, ఎల్తైన ఉపపీఠంలో మరిన్ని వరుసలు చేర్చి, తమ ప్రయోగ పరం పరలో సాటిలేని మేటి భూమిజ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏమంత లోతు లేని పునాదుల్ని రచించి, ఆధారశిలతో ప్రారంభించి, నక్షత్రాకారపు ఉపపీఠాన్ని ప్రద క్షిణాపథంగా తీర్చిదిద్దారు. కట్టడభాగాలకు పాలంపేట, రామానుజపురం మధ్యలో గల ఎర్ర ఇసుకరాతిని, ద్వారాలు, రంగమంటప స్థంభాలు, దూలాలు, మధ్య కప్పులు, రుద్రేశ్వర శివలింగపానపట్టాలు, నంది వాహనం, రంగ మండపం ముందుభాగంలో చుట్టూ మదనికలు, అలసకన్యలు, నాగినులు, సురసుందరీమణులను బోలిన అందాలొలికే అప్సరసలాంటి యువతుల శిల్పాలను నల్ల శానపు రాతితోనూ, కప్పుపైన శిఖరా (విమానా)న్ని నీళ్లపై తేలియాడే ఇటుకలతో నిర్మించబోతున్నామని వివరించగా, రుద్రుడు, చిరునవ్వుతో ఆమోదాన్ని తెలిపాడు. అపురూప ఆలయ రూపురేఖల గురించి విన్న గణపతి దేవచక్రవర్తి, మహారాణి సోమలదేవి, ప్రధానులు, మహా ప్రధానులు ఎప్పుడు పూర్తవుతుందా అని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఎర్ర ఇసుక రాయి స్థానికంగానే దొరికినా, ద్వారాలకు స్తంభాలకు కావలసిన నల్ల శానపు రాతిని ఖమ్మం చుట్టు పక్కల నుంచి తరలించాల్సి రావటంతో మండప నిర్మాణం కొంత ఆలస్యమైంది. విమానానికి కావలసిన సున్నాన్ని ఏటూరు నాగారం నుంచి, తేలికపాటి ఇటుకల కోసం చెరువు అడుగుభాగం మట్టిని తెచ్చి, రంపపు పొట్టు, ఊక, తుమ్మ చెక్క, కరక్కాయలు, బెల్లం కలిపి, బాగా కలియదొక్కి, ఇటుక పెళ్లలను పోతపోసి, ఆవంలలో కాల్చి సిద్ధం చేసుకొన్నారు. చిన్నదైనా మన్నికగల అధి ష్ఠానాన్ని రచించి, ఎల్తైన గోడలు, వాటిపై పొలాల్లో రైతులు వేసుకునే మంచె లాంటి కోష్టాలను, వాటిపైన శిఖరం, కలశాలతో అలంకరించారు. గోడలపైన కప్పు భాగంలో బాగా విస్తరించిన ప్రస్తరకపోతాన్ని తీర్చిదిద్ది, వర్షపు నీరు ఆలయ గోడలపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని, నిర్మాణ పరంగా ఆధునిక ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోమని కాక తీయ శిల్పులు ఆనాడే నిరూపించారు. తెలంగాణ దేవాలయాల్లో మేటి, కాకతీయ కళా కౌశలానికి మచ్చుతునక రామప్ప దేవాలయం. సార్వత్రిక కళా నైపుణ్యంతో, అబ్బురపరచే సాంకేతిక పరిజ్ఞానానికి, మేధో మథనమందించిన సృజనాత్మకతకు నిదర్శనంగా ప్రపంచ దృష్టినాకర్షించి, తెలంగాణ తల్లి కీర్తి కిరీటంలో మణి మకుటంగా వెలుగొందుతూ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబి తాలో చోటును దక్కించుకొంది. ప్రతి తెలుగువాడికీ గర్వ కారణమైంది. రామప్ప ఎవరో తెలియదుగానీ, అన్నీ తానై అపురూప ఆలయాన్ని సృష్టించిన రేచర్ల రుద్రసేనాని, 31–3–1213న ఆలయంలో తన పేరిట రుద్రేశ్వరుని ప్రతిష్టించి, చరిత్రలో మిగిలిపోయాడు. విశ్వకర్మ దిగొచ్చి రామప్ప అవతారమెత్తి, రేచర్ల రుద్రునితో భూలోక పుష్పకాన్ని మనకందించి, తర తరాల తెలుగువారి కీర్తికి స్ఫూర్తిగా నిలిచాడు. - ఈమని శివనాగిరెడ్డి వ్యాసకర్త స్థపతి, సీఈవో, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్. -
రామప్పకు వారసత్వ హోదా: చిరు వ్యాపారుల్లో టెన్షన్ టెన్షన్
సాక్షి, వెంకటాపురం(వరంగల్): చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా వచ్చిందని సంతోషించాలో.. బాధపడాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక చిరు వ్యాపారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ముందు చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి యునెస్కో ప్రతిపాదన జీవనోపాధి దూరం చేసింది. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి దుకాణాలు, కట్టడాలు ఉండకూడదనేది యునెస్కో ప్రధాన నిర్ణయం. ఈ ఆంశం ఆధారంగానే వేయిస్తంభాలగుడి, వరంగల్ కోట కట్టడాలు తిరస్కరణకు గురయ్యాయి. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం డోషియార్ (రామప్ప సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం)ను తయారు చేసి ప్రతిపాదించింది. ఈ క్రమంలో డోషియార్‌లో పొందుపరిచిన విషయాలను క్షేత్రస్థాయిలో పరీశీలించేందుకు 2019 సెప్టెంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన పర్యటన ఖరారైంది. దీంతో రామప్ప ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల కట్టడాలను కూల్చివేసి దుకాణాలను తొలగించారు. యునెస్కో ప్రతినిధి పర్యటన పూర్తయ్యాక ఆలయానికి దగ్గరలో ఉన్న పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు. ఆలయానికి వచ్చిన పర్యాటకులు పార్కింగ్ స్థలంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి కోనుగోలు చేయకపోవడంతో వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో ఆలయం ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదా తూర్పు ముఖద్వార రోడ్డు వద్ద పర్మనెంటుగా స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌తోపాటు మంత్రులకు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతానికి కొంతమంది ఆలయం ముందు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తుండగా, మరికొంతమంది కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. స్థలం కేటాయించాలి రామప్పకు యునెస్కో ప్రతిపాదన పంపడంతో అధికారులు దుకాణాలను తీసివేయించారు. రెండేళ్లుగా వ్యాపారం చేయకుండా తీవ్రంగా నష్టపోయాం. దుకాణాలను తొలగించే సమయంలో పర్మినెంట్‌గా దుకాణాదారులకు స్థలాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికార యత్రాంగం స్పందించి రామప్పలోని చిరువ్యాపారులకు రామప్ప తూర్పు ముఖద్వారం వైపు స్థలాలు కేటాయించాలి. – పిల్లలమర్రి శివ, రామప్ప చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు కూలీ పనులకు వెళుతున్నా.. రామప్పకు వచ్చే పర్యాటకులకు బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడిని. ఆలయం ముందు ఉన్న దుకాణాన్ని తొలగించడంతో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పర్యాటకులను నమ్ముకొని 28 మంది చిరు కుటుంబాలకు జీవనోపాధి దొరికేది. ప్రస్తుతం వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలి. – పోశాల రాజమౌళి, బొమ్మల దుకాణదారుడు, రామప్ప -
మోదీ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సం పద హోదా రావడానికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నా రు. ఇందుకు రాష్ట్ర ప్రజల తరపున మోదీకి అభినందనలు తెలిపారు. భారత వారసత్వ సంపదకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్న ప్రధాని తపన వల్లే ఈ హోదా లభించిందన్నారు. దీనికోసం కృషిచేసిన కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలకు కూడా సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్)’తొమ్మిది లోపాల ను ఎత్తిచూపిందని గుర్తుచేశారు. -
తెలుగు చరితకు విశ్వ ఘనత
తెలుగు జాతికిది సంతోష సందర్భం. తెలుగు ఖ్యాతికిది విశ్వవిఖ్యాత సంబరం. కొన్నేళ్ళ ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఎనిమిదొందల ఏళ్ళ నాటి కాకతీయుల శిల్పకళావైభవ ప్రతీక రామప్ప దేవాలయం ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా గుర్తింపు తెచ్చుకుంది. గర్వంతో తెలుగు వారి ఛాతీ ఉప్పొంగేలా చేసింది. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రపంచ పట్టం సాధించిన తొలి నిర్మాణంగా రామప్ప కొత్త చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప గుడికి ఈ విశ్వవిఖ్యాత పట్టం రావడానికి వారసత్వ ప్రియుల మొదలు ప్రభుత్వాల దాకా ఎందరో కృషి చేశారు. పురాస్మరణకూ, పర్యాటకం పుంజు కోవడానికీ తోడ్పడే ఈ విశ్వఘనత అనేక రకాల ప్రత్యేకమైనది. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాలలో అంతర్జాతీయ సహకారంతో శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి పెట్టిన ప్రత్యేక సంస్థ ‘యునెస్కో’. ఆ సంస్థ నుంచి 1972లో ఓ అంతర్జాతీయ ఒప్పందంగా వార సత్వ కట్టడాల గుర్తింపు ప్రారంభమైంది. 1977లో మన దేశం ఆ ఒప్పందంలో భాగమైంది. 1983లో మన దేశం నుంచి తొలిసారిగా అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌మహల్ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. అప్పటి నుంచి దేశంలోని ఖజురహో శిల్పాలు, కోణార్క్ ఆలయం, మహాబలిపురం, హంపీ నిర్మాణాలు, ఎర్రకోట, ఖజిరంగా జాతీయ పార్క్ తదితర 38 సాంస్కృతిక నిర్మాణాలు, సహజ అభయారణ్యాలు ‘యునెస్కో’ గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ వరుసలో 39వదిగా మన రామప్ప ఆ జాబితాకు ఎక్కింది. ఇప్పటికి ఇలా మొత్తం 167 దేశాల్లోని 1130 నిర్మాణాలు ఈ ప్రత్యేక గుర్తింపు సాధించాయి. రామప్ప గుడి కట్టి 800 ఏళ్ళు పూర్తయినప్పటి నుంచి ఈ గుర్తింపు కోసం మన ప్రభుత్వాలు కృషి చేస్తూ వచ్చాయి. 2014 ఏప్రిల్‌లో ప్రయత్నించి, విఫలమయ్యాం. అప్పటి నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో మటుకు కొనసాగుతూ, గుర్తింపు కోసం రామప్ప గుడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 సెప్టెంబర్‌లో అక్కడి అధికారులొచ్చి, మన శిల్పకళా సౌందర్యాన్ని చూసి వెళ్ళారు. దరఖాస్తు లోని లోటుపాట్ల సవరణ, నృత్య శిఖామణుల వివరణతో మన వాదనకు బలం చేకూరింది. ఇంతలో కరోనా కారణంగా గత ఏడాది సమావేశం వాయిదా పడింది. చివరకు చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో 44వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం వర్చ్యువల్‌గా జరిగినప్పుడు ఈ ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలు దాటాక తీపి కబురందింది. మొత్తం 21 సభ్యదేశాలలో నార్వే అభ్యంతరం చెప్పింది. కానీ, మన ప్రభుత్వ దౌత్యం ఫలించి, రష్యా చొరవతో 17పైగా సభ్య దేశాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అలా రామప్పకు విశ్వవిఖ్యాతి దక్కింది. పది వేర్వేరు అంశాలను బట్టి ఈ గుర్తింపు ఈసారి రామప్పతో పాటు చైనా, ఇరాన్, స్పెయిన్‌లలోని కట్టడాలకూ లభించింది. ‘విలక్షణ శైలి... సూక్ష్మరంధ్రాలుండి నీటిలో తేలే తేలికైన ఇటుకలతో కట్టిన ఆలయ విమానం... కాకతీయ సంస్కృతినీ, నృత్య సంప్రదాయాలనూ ప్రతిఫలించే అద్భుత ఆలయ శిల్పాలు...’ అంటూ యునెస్కో ఈ ప్రాచీన ఆలయ నిర్మాణ విశేషాలను వేనోళ్ళ పొగడడం విశేషం. రామప్పగా పేరుపడ్డ శివాలయమైన రుద్రేశ్వరాలయం కాకతీయ శిల్పకళా విశిష్టతకు మకుటాయ మానం. విశాల కాకతీయ సామ్రాజ్యంలో గణపతిదేవుని పాలనలో, సేనాని రేచర్ల రుద్రుడు నిర్మిం చిన ఈ ఆలయ సముదాయానిది పెద్ద కథ. క్రీ.శ. 1213లో నిర్మాణమైన ఈ గుడిలో ఎన్నెన్నో విశే షాలు. ఇది భక్తులకు గుడి. నల్లని రాళ్ళపై చెక్కిన అపురూపమైన స్త్రీమూర్తులతో కళాప్రియులకు అద్భుత శిల్పసౌందర్యశాల. ‘శాండ్ బాక్స్ టెక్నాలజీ’లో ఇసుక మీద పేర్చిన రాళ్ళతో నిర్మాణ నిపుణులకు అపూర్వ ఇంజనీరింగ్ అద్భుతం. వెరసి, రాశిగా పోసిన విశేషాల కుప్ప– రామప్ప. దాదాపు 40 ఏళ్ళు ఈ నిర్మాణం కోసం శ్రమించిన శిల్పి రామప్ప పేరు మీదే ఎనిమిదొందల ఏళ్ళ నాటి ఈ గుడికి ఆ పేరొచ్చిందని కథ. ఆ తరువాత కట్టిన వాటెన్నిటికో గుర్తింపు దక్కినా, ఇప్పటి దాకా ఆ భాగ్యం రామప్పకు దక్కకపోవడం విచారకరమే. చరిత్రపై శ్రద్ధ, ఘనవారసత్వాన్ని కాపాడుకోవాలనే ధ్యాస లేని సమాజంలో ఈ ప్రాచీన శిల్పవిన్నాణానికి ఇప్పటికైనా గుర్తింపు రావడమే ఉన్నంతలో ఊరట. మన తెలుగు నేలపై ఇంకా వేయిస్తంభాల గుడి, లేపాక్షి లాంటి అద్భుతాలు, పునరుద్ధరిం చాల్సిన శిథిల నిర్మాణాలు, మరుగునపడిన చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. ఆలనాపాలనా లేని వాటిపై ఇకనైనా దృష్టి పెట్టాలి. కళలు, సంస్కృతి, చరిత్రపై తమిళ, కన్నడిగ, మలయాళీలకున్న అక్కర తెలుగువారికి లేదనే అపఖ్యాతి తరతరాలుగా మూటగట్టుకున్నాం. ఆ మచ్చను తుడిచేయా లంటే, ఇది సరైన సమయం! ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో’ అన్న సినారె సాక్షిగా చరిత్రకెక్కని చరితార్థుల కథలు వెలికి తీయడానికి ఇదే సందర్భం! రామప్పకు దక్కిన గుర్తింపు మన జాతి చరిత్ర, సంస్కృతి, కళలపై స్వాభిమానం పెంచుకోవడానికి అందివచ్చిన అవకాశం! కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ లాంటి సంస్థలు, కొందరు కళాప్రియులు రెండు రాష్ట్రాల్లో ఇతోధికంగా శ్రమిస్తున్నా, అదొక్కటే సరిపోదు. భారతీయ పురావస్తు శాఖ తోడ్పాటు, తగిన నిధుల కేటాయింపుతో ప్రభుత్వాలు ముందుకు రావాలి. చరిత తెలుకోనిదే భవితను నిర్మించలేమనే చైతన్యంతో ప్రజలు భాగస్వాములు కావాలి. సమష్టిగా బాధ్యతను భుజానికెత్తుకొని, మన ఘనతను విశ్వానికి చాటాలి. ఆ దీక్షలో రామప్ప నుంచే తొలి అడుగు వేయాలి! -
రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
-
రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం
-
రామప్పకు యునెస్కో గుర్తింపుపై సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపుపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ రాజులు రామప్ప ఆలయాన్ని అత్యంత సృజనాత్మకంగా కట్టారన్నారు. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది: కేటీఆర్ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన వారిందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. @UNESCO pic.twitter.com/ljfJvQ7691 — Telangana CMO (@TelanganaCMO) July 25, 2021 -
రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ హర్షం
సాక్షి, ఢిల్లీ: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. రామప్ప దేవాలయం కాకతీయుల అద్భుతమైన నైపుణ్యం అని కొనియాడారు. అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. స్వయంగా శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానికి కృతజ్ఞతలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించటం పట్ల చాలా సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘దేశ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరపున ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్న ప్రధానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. Excellent! Congratulations to everyone, specially the people of Telangana. The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex and get a first-hand experience of it’s grandness. https://t.co/muNhX49l9J pic.twitter.com/XMrAWJJao2 — Narendra Modi (@narendramodi) July 25, 2021 -
వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయం
-
రామప్పకు విశ్వఖ్యాతి
‘వారసత్వ హోదా’ ప్రయోజనాలు ఎన్నో.. ►ఆలయం యునెస్కో అధీనంలోకి వెళ్తుంది. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ►రామప్పకు యునెస్కోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గణనీయంగా నిధులు అందుతాయి. వసతులు, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. ►యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు/కట్టడాలను చూసేం దుకు విదేశీ పర్యాటకులు లక్షల్లో వస్తారు. ఇక ముందు రామప్పకూ పోటెత్తిన అవకాశం ఉంటుంది. ►యునెస్కో ప్రచారం, వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపడితే దేశీయ పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. ►రామప్పకు వచ్చేవారు ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించే అవకాశం ఉంటుంది. ఇది టూరిజానికి ఊపునిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, వరంగల్/ న్యూఢిల్లీ: వందల ఏళ్లనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. చైనాలోని వూహాన్ కేంద్రంగా ఆదివారం జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలకుగాను మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం యునెస్కో అధికారిక ప్రకటన చేసింది. ఏళ్లుగా చేస్తున్న కృషితో.. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్ (దరఖాస్తు) రూపొందకపోవటంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సరిదిద్దుతూ మరో డోజియర్‌ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)’ ప్రతినిధి వాసు పోష్యానందన 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి.. యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఉన్న ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి.. మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆక్రమణలను చూసి బిత్తరపోవడంతో.. నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులతో ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి బిత్తరపోయి, ప్రతిపాదన సమయంలో తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్లీ సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తిరస్కరించింది. చివరగా ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్ఐ)తోపాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది. సౌకర్యాలు కల్పించాలి.. ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్ఐ పరిధిలో ఉంది. కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తోంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణకు ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఇస్తోంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి. పీవీ అప్పుడే ఆకాంక్షించారు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 55 ఏళ్ల కిందటే రామప్పకు ప్రపంచ గుర్తింపు గురించి ఆకాంక్షించారు. ఆలయంలోని అద్భుతాలను చూసి అబ్బురపడిన ఆయన తన భావాలకు ‘రామప్ప– ఏ సింఫనీ ఇన్ స్టోన్స్’ పేరుతో అక్షర రూపం ఇచ్చారు. ఆ నిర్మాణం ప్రపంచ ఖ్యాతి పొందగలిగినదని అందులో పేర్కొన్నారు. ఆ శిల్పాలు అద్భుతాలే.. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ (నల్లశానపు) రాయిని వాడారు. ►సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ►వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. ►నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశ ద్వారం, రంగమండపం అరుగు తదితర చోట్ల జైన తీర్థంకరులు, బౌద్ధమూర్తుల చిత్రాలు ఉండటం గమనార్హం. ►ఇక్కడ నంది కోసం ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. ►గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. ►భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. అద్దంలాంటి నునుపుతో.. ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది. ►ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. ►దూలాలపై శివ కల్యాణసుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త రుషులు, గజాసురసంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి చిత్రాలు ఉన్నాయి. ►ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి. రామప్పకు ఎలా వెళ్లాలి? వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం హైదరాబాద్‌లోనిదే. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. రైలు మార్గంలో అయితే వరంగల్ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. బస్సుల ద్వారా అయితే.. వరంగల్ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్లొచ్చు. అభివృద్ధి పనులు షురూ.. రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక, శిల్పకళా వేదికగా మార్చేందుకు ఇప్పటికే పనులు చేపట్టారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం, రెండు స్వాగత తోరణాలు కట్టారు. ఆలయం పక్కన చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటు కోసం నమూనాలను సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్పకళా అధ్యయనం కోసం కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. తరలిరానున్న పర్యాటకులు రాష్ట్రంలో గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, కట్టడాలున్నా తగిన ప్రచారం, వసతులు లేక దేశ, విదేశీ పర్యాటకులు పెద్దగా రావడం లేదు. అదే పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, కేరళలకు పోటెత్తుతున్నారు. తాజాగా రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏళ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయ రాజవంశ విశిష్ట శిల్పకళా వైభవం రామప్ప ఆలయంలో కళ్లకు కడుతోంది. ఆ దేవాలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్మ్యం తెలుసుకొని స్వయంగా అనుభూతి పొందాలని కోరుతున్నా. – ప్రధాని మోదీ కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడానికి మద్దతిచ్చిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. – సీఎం కేసీఆర్ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు 13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది తెలంగాణ గొప్ప వారసత్వానికి గొప్ప గుర్తింపు. దీనిపై తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నా. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీమ్ ఇండియాకు అభినందనలు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలకు, శిల్ప కళా చాతుర్యానికి రామప్ప ఆలయం ఓ చక్కని ఉదాహరణ. టీమ్ ఇండియాకు అభినందనలు. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంతోషకరమైన వార్త రామప్ప ఆలయానికి వారసత్వ హోదా దక్కడం గొప్ప వార్త. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. –కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆనందంగా ఉంది రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందం కలిగించింది. దీనికి మార్గదర్శనం, మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీకి దేశం తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో విదేశాంగ శాఖ, భారత పురావస్తు శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నా. – ట్విట్టర్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రామప్ప తర్వాతి లక్ష్యం హైదరాబాద్ నగరమే ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని చేర్చడం సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు లభించడంలో పాలుపంచుకున్న అందరికీ అభినందనలు. తెలంగాణ నుంచి రామప్ప తొలి వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించింది. తర్వాత హైదరాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. –ట్విట్టర్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చరిత్రలో చిరస్థాయిగా.. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజిది. ఈ గుర్తింపుతో ‘రామప్ప’ కట్టడం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ ఘనత సాధించడం సంతోషకరం. – శ్రీనివాస్‌గౌడ్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి చాలా సంతోషం.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ గుర్తింపు రావడానికి కృషిచేసిన సీఎం కేసీఆర్ సహా అందరికీ ధన్యవాదాలు. – పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మా కృషి ఫలించింది రామప్పకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావటంతో ఆనందంగా ఉంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిలో మా ట్రస్టు కీలకపాత్ర పోషించింది. పర్యాటకపరంగా రామప్ప ప్రాంత రూపురేఖలు మారతాయి. – పాపారావు, కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
వారసత్వ రేసులో రామప్ప.. యునెస్కో కీలక సూచనలు
సాక్షి, పాలంపేట(వరంగల్): రుద్రేశ్వరాలయం అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ రామప్ప అంటే చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు అంశం చివరి అంకానికి చేరుకుంది. అయితే రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలా, వద్దా? అనేది జులై 25న తేలనుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్లను గుర్తించేందుకు చైనాలో యునెస్కో జులై 16 నుంచి 31 వరకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. యూనెస్కో సూచనలు ఇప్పటికే రామప్ప ఆలయానికి సంబంధించిన నివేదికను పరిశీలించిన యునెస్కో బృందం పలు సందేహాలు లేవనెత్తి వాటికి సంబంధించి కీలక సూచనలు చేసింది. వీటికి అనుగుణంగా రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామం పేరు మీదుగా పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాథికార సంస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పాటు యూనెస్కో చేసిన పలు సూచనలకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యునెస్కో సూచనలో మరికొన్ని కీలక అంశాలు, అడిగిన అదనపు సమాచారం ► రామప్ప ఆలయానికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలు, కట్టడాలు, రామప్ప సరస్సు, మంచి నీటి పంపిణీ వ్యవస్థలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చట్టపరమైన హక్కులు కల్పించాలి. ► రామప్ప ఆలయం, సరస్సు పరిధిలో జరిగే ఇతర అభివృద్ధి పనులకు హెరిటేజ్ పరిధిలోకి తీసుకురావాలి. ► గతంలో విప్పదీసిన కామేశ్వరాలయం పునర్ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలి ► రామప్ప ఆలయానికి వచ్చే పర్యాటకులు, భక్తుల వల్ల ఆలయ నిర్మాణానికి నష్టం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► శిథిలమవుతున్న ఆలయ ప్రహారి గోడల పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి ► ఆలయ పరిరక్షణలో స్థానికులు, ఆయల పూజారులలకు భాగస్వామ్యం కల్పించాలి ► ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కాపాడటానికి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ► జాతరలు, పండుగల సమయంలో ఆలయ ప్రాంగణంలో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చేపట్టే చర్యలు, పర్యాటకుల పర్యటనలకు సంబంధించి సమీకృత ప్లాను , ఎటునుండి రావాలి, ఎక్కడ ఎం చూడాలి, సూచిక బోర్డు లాంటి వివరాలు, విదేశీ భాషలలో ఆలయ వివరాలు ► కట్టడానికి సమీపంలో భవిష్యత్ లో చేప్పట్టనున్న ప్రాజెక్టుల వివరాలు అద్భుతాల నెలవు రామప్ప ఆలయం అద్భుతాలకు నెలవు. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శిల్ప కళా సౌందర్యానికి చెక్కు చెదరని సాక్ష్యం. -
‘వారసత్వ రేసులో రామప్ప’
-
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
Ramappa Temple: తుది అంకానికి వారసత్వ హోదా
సాక్షి, హైదరాబాద్: రమణీయమైన శిల్పకళతో అలరారే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. కోవిడ్ విలయం కారణంగా నిలిచిపోయిన తుది కసరత్తును యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తిరిగి ప్రారంభించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూలై 15 నుంచి 30 మధ్య యునెస్కో హెరిటేజ్ కమిటీ భేటీ కాబోతోంది. ఇందులో సభ్యత్వం ఉన్న 18 దేశాల ప్రతినిధులు నివేదికను కూలంకషంగా పరిశీలించి ఓటు వేయనున్నారు. ఎక్కువ ఓట్లు వస్తే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేరుతుంది. లేదంటే మళ్లీ నిరాశ తప్పదు. అయితే ఇప్పటివరకు జరిగిన కసరత్తులో పూర్తి సానుకూల వాతావరణమే ఏర్పడినందున, ఈ కమిటీ కూడా సాను కూల నిర్ణయమే తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం యునెస్కో నుంచి స్థానిక అధికారులకు సమాచారం అందింది. కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే, తెలుగు రాష్ట్రాల్లో తొలి యునెస్కో గుర్తింపు పొందిన కట్టడంగా ఈ కాకతీయుల కళాసృష్టి రికార్డు సృష్టించనుంది. చదవండి: Telangana: జూన్ 15నుంచి రైతుబంధు -
రామప్ప ఆలయానికి వెల్దుర్తపల్లి రాయి..!
సాక్షి, హైదరాబాద్ : నీటిలో తేలియాడే ఇటుకలా..? అదీ ఎనిమిది శతాబ్దాల క్రితమా..? యునెస్కో ప్రతినిధులు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతూ అడిగిన ప్రశ్నలు. ప్రపంచ వారసత్వ హోదాకు ఈ నిర్మాణం అర్హమైందా కాదా అని తేల్చే కసరత్తులో భాగంగా యునెస్కో ప్రతినిధులు రామప్ప నిర్మాణం గురించి తెలుసుకునే క్రమంలో ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ఇటుకలను తామెక్కడా చూడలేదని పారిస్‌లో జరిగిన సమావేశంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో పుణికిపుచ్చుకున్న రామప్ప మందిరం.. మెరిసే నల్లరాతితో కొంత, అబ్బురపరిచే ఎర్ర ఇసుకరాతితో సింహభాగం నిర్మితమైంది. సూదిమొన దూరేంతటి సందులు, విస్తుగొలిపే నగిషీలతో ఆ రాళ్లు అద్భుత కళాకృతులుగా ఆ మందిరంలో ఒదిగిపోయాయి. యునెస్కో గుర్తింపు వస్తే ప్రపంచ పర్యాటకులనూ మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్న రామప్ప ఆలయానికి మనోహర రూపును తెచ్చి ఆశ్చర్యపరిచే ఆకృతి అద్దుకున్న ఆ రాళ్లు ఎక్కడివి? ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఆ వివరాలు నమోదు కాలేదు. తొలిసారి ఆ రాతి జాడ తెలిసింది. మూడు కిలోమీటర్ల దూరం.. 10 వేల టన్నుల రాళ్లు.. రామప్పతోపాటు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపురం కోటగుళ్లు, రామానుజాపురం పంచకూటాలయాలు కూడా ఎరుపు ఇసుకరాతితో రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం ద్వారాలు, స్తంభాలు, దూలాలకు డోలరైట్ నల్లరాతిని వినియోగించారు. మిగతా నిర్మాణమంతా ఎరుపు ఇసుకరాతితో సాగింది. నల్లరాతిని ఓరుగల్లు సమీప ప్రాంతాల నుంచి తేగా.. ఎర్ర రాతిని మాత్రం అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామానుజపురం–వెల్దుర్తపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెంచు కాలనీ(గుంటూరుపల్లి ) సమీపంలో ఉన్న గుట్టల నుంచి తొలిచినట్టు తాజాగా గుర్తించారు. అప్పుడు రాళ్లను తొలిచేందుకు వినియోగించిన పనిముట్ల గుర్తులు, వాటిని తయారు చేసిన కొలిమిలు, తయారైన పనిముట్లు నిల్వ చేసే ఏర్పాటు ఇప్పటికీ ఆ గుట్టలపై కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ విశ్రాంత అధికారి, విజయవాడ, అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, ఔత్సాహిక చరిత్ర అన్వేషకుడు అరవింద్ శనివారం ఆయా గుట్టల వద్ద జరిపిన పరిశీలనలో వీటిని గుర్తించారు. ఇక్కడ రెండు గుట్టల నుంచి ఈ రాళ్లను సేకరించారు. ఈ రెండు గుట్టల నుంచి దాదాపు పది వేల టన్నుల రాతిని తొలిచినట్టు భావిస్తున్నామని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. తొలుత అవసరమైన ముడిరాతిని గుట్టపై భాగాన తొలిచి దిగువన దానికి కావాల్సిన ఆకృతి ఇచ్చి దేవాలయం వద్దకు తరలించి అక్కడ పూర్తి రూపు ఇచ్చేలా ప్రణాళికను అనుసరించారన్నారు. గుట్టపై భాగంలో కావాల్సిన రాతిని విడదీయటానికి వాడిన గూటం (సమ్మెటతో కొట్టే పరికరం)తో చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దిగువన ఆ రాతి చిన్నచిన్న ముక్కలున్నాయి. పది ఎకరాల్లో రామప్ప ఆలయం, కల్యాణమండపం, త్రికూటాలయాలు రెండు, రామప్ప చెరువు కట్ట వద్ద ఎనిమిది అనుబంధ దేవాలయాలు, రామానుజాపురం పంచకూటాలయం, రెండంతస్తుల కల్యాణ మండపం, గణపురంలో 26 దేవాలయాల సమూహం, కల్యాణమండపాలకు ఈ రాతినే వాడారు. ఒక్క రామప్ప దేవాలయానికే దాదాపు 3,500 టన్నుల ఎర్ర ఇసుకరాయి, 1,500 టన్నుల నల్లరాయి వాడినట్టు అంచనా. ఇక గణపురం దేవాలయాలకు మరో 3,000 టన్నులు వాడారు. ఇలా అన్నీ కలిపి దాదాపు 10 వేల టన్నులు వాడి ఉంటారని అంచనా. వందల మంది శిల్పులు.. ఈ అద్భుత నిర్మాణాలకు వందల మంది శిల్పులు పనిచేసేవారని, వారికి సహాయంగా మరికొంతమంది సిబ్బంది ఉండేవారని నాగిరెడ్డి తెలిపారు. ఆ రోజు పని పూర్తికాగానే ఉలులు, గూటాలను అక్కడే పడేస్తే ఇతర సిబ్బంది వాటిని సేకరించి మళ్లీ కొలిమి వద్దకు తీసుకెళ్లి, సరిచేసి అక్కడ పేర్చేవారని వివరించారు. మళ్లీ వాటిని మరుసటి రోజు శిల్పులు వినియోగించేవారని, ఈ ఆనవాళ్లన్నీ గుట్టలపై ఉన్నాయని వెల్లడించారు. వీటిని కాపాడి భావితరాలకు చూపించాల్సిన అవసరం ఉం దని నాగిరెడ్డి, అరవింద్ అభిప్రాయపడ్డారు. -
రామప్పపై యునెస్కో సందేహాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉన్న కల్యాణ మండపం పునర్నిర్మాణంలో నెలకొన్న దుస్థితి రామప్పకు ఎదురవుతుందా? రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్న యునెస్కోకు ఈ తరహా సందేహం వచ్చినట్లుంది. రామప్ప పరిరక్షణ, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, కట్టడంపై దుష్ప్రభావం చూపే పరిస్థితులను సకాలంలో నిరోధించటం, ఆక్రమణల్లేకుండా చూడటం, పర్యాటకుల సంఖ్య పెంచేందుకు చేపట్టే చర్యలు, పర్యాటకుల వల్ల కట్టడంపై ప్రభావం.. తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి అత్యున్నత స్థాయి హోదా అధికారి ఆధ్వర్యంలో అథారిటీ ఏర్పాటు చేస్తారా అంటూ తాజాగా యునెస్కో ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చే జూన్/జూలైలో చైనాలో జరిగే సమావేశంలో రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే విషయాన్ని యునెస్కో తేల్చనుంది. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేముందు ఇలాంటి సందేహాను యునెస్కో లేవనెత్తడం సహజమేనని అధికారులు పేర్కొంటున్నా.. రామప్పపై వేయి స్తంభాల దేవాలయ కల్యాణమండపం పునర్నిర్మాణంలో కనిపించిన నిర్లక్ష్యం ప్రభావం ఉంటుందన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడే ప్రశ్నించిన యునెస్కో ప్రతినిధి గత నవంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోష్యానంద రామప్పను సందర్శించారు. డోజియర్‌లో పేర్కొన్న ప్రత్యేకతలు రామప్ప కట్టడానికి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తన రెండ్రోజుల పర్యటనలో వేయి స్తంభాల దేవాలయాన్ని కూడా చూశారు. ఆలయం పక్కనే అసంపూర్తిగా ఉన్న కల్యాణమండపాన్ని చూసి విస్తుపోయారు. దానికి కారణాలపై వాకబు చేశారు. శిథిలావస్థకు రావటంతో కట్టడాన్ని పునర్నిర్మిస్తున్నామని అధికారులు వివరించారు. కానీ తిరిగి నిర్మించేందుకు ఇన్నేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్న లేవనెత్తారు. దీంతో కొన్ని అంతర్గత సమస్యలు అని అధికారులు చెప్పారు. అద్భుత నిర్మాణం దుస్థితిని కళ్లారా చూశాక ఆయనకు రామప్ప విషయంలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందా అన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకే తాజాగా మన అధికార యంత్రాంగం నుంచి స్పష్టత కోరుతూ యునెస్కో పలు ప్రశ్నలు అడిగింది. రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే వేయి స్తంభాల దేవాలయం పక్కనే ఉండే కల్యాణమండపాన్ని పునర్నిర్మించేందుకు దశాబ్దన్నర కిందటే విడదీసి ఆ రాళ్లపై సీరియల్ నంబర్లు వేసి పక్కన పెట్టారు. చివరకు మూడేళ్ల కింద పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లో రూ.7.5 కోట్ల అంచనాతో మొదలుపెట్టినా.. పైకప్పు వరకు రాకుండానే ఆ నిధులు ఖర్చయిపోయాయి. ఇప్పుడు దాదాపు రూ.కోటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉన్నాయి. తదుపరి నిధులు వస్తే కానీ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు. దాదాపు రెండేళ్లుగా అవి నిలిచిపోయే ఉన్నాయి. ఈ పనుల్లో పాలుపంచుకునే స్థపతులతో పాటు ఇతర సిబ్బందికి చెల్లించే మొత్తం తాలూకు రేట్లను సవరించాలన్న విజ్ఞప్తి ఉంది. ఆ రేట్లు ఎంతుంటాయో నిర్ధారించేందుకే ఏడాదికిపైగా సమయం పట్టింది. ఇటీవలే ఆ ధరలను పేర్కొంటూ ఏఎస్ఐకి ప్రతిపాదన పంపారు. ముందు చూపు లేకపోవడంతోనే.. గతంలో పనులు చేపట్టినప్పుడు క్రేన్లను వినియోగించారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే వాటిని వాడారు. ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్ చేయటం కష్టంగా మారింది. పునాదులకు అయ్యే వ్యయం రెట్టింపు అయింది. దీనికి కారణాలను ఢిల్లీ అధికారులకు వివరించాల్సి ఉంది. ఇలాంటి చిక్కుముడులతో పనులు పెండింగులో పడి పైకప్పు లేకుండానే మొండి శిలలు వెక్కిరిస్తున్నాయి. అలాంటి సమస్య రాదు.. ‘వేయిస్తంభాల దేవాలయ మండపం పునర్నిర్మాణంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో మళ్లీ పనులు మొదలై ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కే విషయంలో దీని ప్రభావం ఉంటుందనుకోను. కొన్ని అనుమానాలను నివృత్తి చేయాలంటే యునెస్కో కోరిన మాట నిజమే. వాటికి సమాధానాలు పంపాం. ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చే సమయంలో ఇలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవటం యునెస్కోకు సహజమే’ – మల్లేశం, ఏఎస్ఐ అధికారి -
రామప్ప’ ఇక రమణీయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంçస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్ఆర్ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి వద్ద, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. కాగా యునెస్కోకి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాగా, సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, ఈ నెల 22న పారిస్ లో యునెస్కో బృందంతో సమావేశం జరగనుంది. కాగా, రామప్ప ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులతో సోమవారం సమీక్ష జరిపారు. -
‘రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు అన్ని అర్హతలున్నందున రామప్ప దేవాలయాన్ని ఆ జాబితాలోకి చేర్చేలా చొరవ చూపాలని యునెస్కో ప్రతినిధి వాసు పొష్యానందనను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆ జాబితాలో చేర్చేందుకు రామప్ప దేవాలయానికి ఏమేర అర్హతలున్నాయో పరిశీలించేందుకు వచ్చిన ఆయనను శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టతను, చరిత్రను, శిల్ప కళా వైభవాన్ని తెలియచేసే ఆలయ దృశ్యమాలికను ఆయనకు అందజేశారు. -
రామప్పా.. సూపరప్పా
కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం రామప్ప ఆలయం. ఈ ఆలయానికి యునెస్కో జాబితాలో చోటు లభిస్తే ప్రపంచ వారసత్వ సంపదగా ఖ్యాతి దక్కనుంది. యునెస్కో అంటే ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన(శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ. అంతర్జాతీయంగా విద్య, విజ్ఞానంతో పాటు సాంస్కృతిక పరిరక్షణ కోసం ఈ సంస్థ పాటుపడుతోంది. ఇప్పటివరకు చారిత్రక ప్రాంతాలకే గుర్తింపు నిస్తుండగా.. కాకతీయులు నిర్మించిన కట్టడం ఈ జాబితాలో స్థానం కోసం పోటీ పడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సాక్షి, వెంకటాపురం: దేశంలో 3,867 చారిత్రక కట్టడాలు ఉండగా ఇప్పటివరకు 38 చారిత్రక ప్రాంతాలకు మాత్రమే యునెస్కో జాబితాలో చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 137 చారిత్రాక కట్టడాలు ఉన్నా ఇప్పటి వరకు ఒక కట్టడానికి కూడా వారసత్వ సంపదగా గుర్తింపు లభించలేదు. ఏటా యునెస్కో గుర్తింపు కోసం దేశం నుండి రెండు, మూడు దరఖాస్తులను కేంద్రం పంపిస్తుండగా 2017లో రామప్ప ఆలయం పేరు కూడా పంపించారు. కానీ ఆలయ ప్రత్యేకతల వివరాలు సరిగా లేవంటూ దరఖాస్తును తిరస్కరించారు. ఈ మేరకు యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ అయిన చూడామణి నందగోపాల్‌తో ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు అందజేశారు. దీంతో 2019 సంవత్సరానికి గాను భారతదేశం నుండి రామప్ప ఆలయం ఒక్కటే యునెస్కో పరిశీలనకు నామినేట్ అయింది. ఈ మేరకు దరఖాస్తుతో జత చేసిన ప్రత్యేకతలు రామప్పలో ఉన్నాయో, లేదో పరిశీలించేందుకు ఈనెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు యునెస్కో(ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ సైట్స్) బృందం రామప్పలో పర్యటించనుంది. ఫ్లోటింగ్ బ్రిక్స్ (నీటిలో తేలియాడే ఇటుకలు) కాకతీయుల కాలంలోనే ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని చెప్పొచ్చు. ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించి ఆలయంపై ఎలాంటి బరువు ఉండొద్దనే ఉద్దేశంతో గర్భగుడిపై గోపురానికి కేవలం నీటిలో వేస్తే తేలాడే ఇటుకలను వాడారు. సాధారణంగా ఇటుకల సాంద్రత(డెన్సిటీ) 2.2 ఉంటుంది. ఈ ఇటుకలు నీటిలో మునిగిపోతాయి. దీంతో శిల్పి ఆలయ గోపుర నిర్మాణం కోసం 0.8 – 0.9 సాంద్రత(డెన్సిటీ) ఉన్న ఇటుకలను వాడారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే సుమారు మూడురెట్లు తక్కువ బరువు ఉండగా.. ఇలాంటి ఇటుకలతో కట్టిన ఆలయం దేశంలోనే రామప్ప ఒకటే. కలర్ వేరియేషన్స్(ఆలయానికి మూడు రకాల రాయి) రామప్ప ఆలయాన్ని సుమారు 300మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్‌కు చెందిన మూడు రకాల రాళ్లను వాడినట్లు యునెస్కోకు నివేదించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఫిల్లర్లు, పైకప్పుకు శాండ్‌స్టోన్, ఆలయ భీములకు డోలరైట్, ఆలయంలోని శిల్పాలకు, నల్లరాతి స్తంభాలు గల మండపానికి, గర్భగుడి ముఖద్వారం ఇరుప్రక్కల ఉన్న పేరిణి నృత్య భంగిమలకు బ్లాక్ గ్రానైట్‌ను వాడారు. శాండ్‌స్టోన్ రాయిపై చెక్కిన నృత్య భంగిమల శిల్పాలు అద్దం అంత నునువుగా ఉంటూ నేటికి చెక్కు చెదరలేదు. అంతేకాకుండా శాండ్‌స్టోన్‌తో చేసిన ఒక శిల్పంలో రెండు రంగులు కలిగి ఉండడం మరో ప్రత్యేకత. శాండ్ బాక్స్ టెక్నాలజీ (ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం) 1213 సంవత్సరంలో కేవలం ఇసుకను పునాదిగా చేసి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడం కోసం 3 మీటర్ల మట్టిని తీసి అందులో ఇసుక నింపారు. ఇసుకను పునాదిగా మార్చి ఒక్కో శిల్పాన్ని పేరుస్తూ వెళ్లారు. పునాది బలంగా ఉండేందుకు, కృంగినా కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా 10–12 అంగుళాల బీమ్‌లు వాడారు. ఆలయ నిర్మాణం కోసం శాండ్‌స్టోన్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లు ఉపయోగించారు. 17వ శతాబ్దంలో భూకంపం వచ్చి రామప్ప ఆలయంలోని కళ్యాణ మండపానికి సంబంధించిన 4 భీములు మధ్యలోకి విరిగిపోయినా శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడడం వల్లే ఆలయం చెక్కు చెదరలేదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిపాదించిన ప్రత్యేకతలివే.. యునెస్కో కన్సల్టెంట్ చూడామణి నందగోపాల్ ఆలయంపై అధ్యయనం చేసి ఆలయంలోని మూడు ప్రత్యేకతలను తెలియజేస్తూ నివేదించించారు. ఇందులో శాండ్ బాక్స్ టెక్నాలజీ(ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం), ఫ్లోటింగ్ బ్రిక్స్ (నీటిలో తేలాడే ఇటుకలతో గోపురం నిర్మించడం), కలర్ వేరియేషన్స్(ఆలయ నిర్మాణానికి మూడు రకాల రాతిని వాడడం)ను వివరిస్తూ డోషియర్(దరఖాస్తు ప్రతిపాదన)ను తయారు చేసి యునెస్కోకు సమర్పించారు. ఈ అంశాలను పరీశీలించేందుకు యునెస్కో బృం దం వస్తోంది. ఈ బృందం సభ్యులు ఈనెల 24న హైదరాబాద్‌కు చేరుకుని.. 25వ తేదీ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుం టుంది. ఆ రోజే కూడా 26వ తేదీన కూడా రామప్ప ఆలయంలోని ప్రతీ ఆంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి రికార్డు చేస్తారు. ఎన్నో ప్రత్యేకతలు 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వరాలయం, నందిమండపం, శిలశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన శిల్పం, సరిగమలు పలికే పొన్నచెట్టు, ముగ్గురికి నాలుగు కాళ్లే ఉండే శిల్పాలు రామప్పలో చూపరులను కట్టిపడేస్తాయి. అంతేకాకుండా నాట్యమండపంపై పురాణ ఇతిహాసాలు ప్రతిబం బించే శిల్పాలు, గజాసుర సంహరణ, క్షీరసాగరమథనం దృశ్యాలను వివరించే శిల్పాలు కనువిందు చేస్తాయి. మరో విశేషమేమిటంటే సాధారణంగా ఏ ఆలయాన్నైనా అందులో ఉండే మూలవిరాట్ పేరుతో లేదా నిర్మించిన వారి పేరుతో పిలుస్తాం. కానీ రామప్ప అనే శిల్పి కళానైపుణ్యానికి నిదర్శనంగా ఆలయానికి ఆయన పేరే పెట్టడం మరో విశేషం. యునెస్కో గుర్తింపు వస్తే.. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే ఆలయ అభివృద్ధి్దకి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని విధాలుగా తీర్చిదిద్దుతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. రామప్పకు మెరుగైన రవాణా మార్గం ఏర్పాటు చేయడమే కాకుండా పరిసరప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చి పరిరక్షణ చర్యలు చేపడుతారు. తద్వారా దేశ, విదేశీ పర్యాటకులు పెరగనుండడంతో అంతర్జాతీయ పర్యాటకుల కోసం కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు రూ.8 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు రామప్ప ఆలయాన్ని ఈనెల 25, 26వ తేదీల్లో యునెస్కో బృందం సందర్శించనున్న నేపథ్యంలో సుమారు రూ.8కోట్లతో పురావస్తుశాఖ అధికారులు అభివృద్ది పనులను చేపట్టారు. గత నెలరోజులుగా చేపడుతున్న ఈ పనులు పూర్తికావొచ్చాయి. ప్ర«ధాన ఆలయానికి తూర్పు ప్రాకారగోడ పునరుద్ధరణ, కాటేశ్వరాలయం, నందిమండపం చుట్టూ ఆఫ్రాన్ ప్లా్లట్ఫాం ఏర్పాటు, గొల్లాల గుడి వినియోగంలోకి తేవడం, తూర్పుముఖద్వారం వైపు సీసీ రోడ్డు వేసి తూర్పు ముఖద్వారాన్ని వినియోగంలోకి తీసుకువచ్చారు. పడమటి ముఖద్వారాన్ని రెండు మీటర్ల నుండి నాలుగు మీటర్ల రోడ్డుగా విస్తరించి సీసీ వేశారు. అలాగే, రెండు ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి వాహనాలు దిగపడకుండా గ్రావెల్ పోశారు. గార్డెన్లో పూలమొక్కలు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం కెఫటేరియా, క్లాక్ రూం, టాయిలెట్ బ్లాక్, ఆర్ఓ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు కల్పించారు. రామప్ప సరస్సు కట్టపై బోర్డు కనిపించేలా పెయింటింగ్ వేశారు. -
రామప్ప.. మెరిసిందప్పా
ఆహా... ఎంతలో ఎంతమార్పు! ఏడొందల ఏళ్ల క్రితం నిర్మాణరంగంలో ప్రపంచానికి సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన రామప్ప దేవాలయం పరిసరాలు ఎలా ఉండేవి ఎలా మారాయి..! గుడిని గుర్తుపట్టకుండా ఉన్న పిచ్చిమొక్కలను, 300 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమకట్టడాలను అధికారులు తొలగించారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతం కేవలం 20 రోజుల్లో ఆహ్లాదకరంగా మారిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తించేందుకు ఈ నెల 25న యునెస్కో ప్రతినిధులు అక్కడికి వస్తుండటమే దీనికి కారణం. మార్పు ఎంతుందో ఈ చిత్రాలే సాక్ష్యం. –సాక్షి, హైదరాబాద్. ఎంత గొప్ప ఆలయమైనా సరే, అడ్డదిడ్డంగా వెలిసే అక్రమ నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని గజిబిజిలా మార్చేస్తాయి. రామప్ప దేవాలయం ప్రవేశద్వార ప్రాంతం 20 రోజుల క్రితం ఇలా ఉంది. ఇప్పుడక్కడ దేవాలయం, దాని చుట్టూ చెట్లు తప్ప మరేం లేదు. యునెస్కో నిబంధనల ప్రకారం.. కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలుండకూడదు. అందుకే అధికారులు ఇలా మార్చేశారు. రామప్ప ఆలయం తరహాలోనే మంచి నిర్మాణకౌశలం ఉన్న చిన్నగుడి ఇది. ఆలయం శిల్ప సౌందర్యం ఇప్పటివరకు కనిపించేది కాదు. ఇప్పుడు ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. మూలవిరాట్టు దర్శనం కాకున్నా, శిల్పుల పనితనాన్ని దర్శించుకునే అవకాశం చిక్కింది. గుబురుగా పెరిగిన చెట్లు, లతలతో ఇదో పొదరిల్లులా మారింది కదూ. కానీ అక్కడ ఓ రాతి నిర్మాణం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలమైతే ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. అది త్రికూటాలయం. రామప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో దీనిన్ని కట్టారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత దానికి విముక్తి కలిగింది. -
‘రామప్ప’కు టైమొచ్చింది!
సాక్షి, హైదరాబాద్: నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’కు యునెస్కో పట్టాభిషేకం చేసే తరుణం ఆసన్నమైంది. చార్మినార్, కుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ హోదా తిరస్కరించిన ఐక్యరాజ్యసమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. వచ్చే నెల 25న యునెస్కో బృందం రాష్ట్రానికి రానుంది. ఆ అద్భుత దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కలి్పంచాల్సిందిగా 2017లో భారత ప్రభుత్వం యునెస్కోకు దరఖాస్తు చేసింది. దాని ప్రత్యేకతలు, అది అద్భుత నిర్మాణంగా మారటానికి అందులో నిగూఢమైన అంశాలను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన) దాఖలు చేసిన ఇంతకాలానికి దాన్ని పరిశీలించేందుకు ఆ సంస్థ రానుంది. ఈ సారి వస్తుందనే ధీమా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న కట్టడాలు/ప్రాంతాలు ఏవీ లేవు. దీంతో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో చారి్మనార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులను యూనిట్‌గా చేసి యునెస్కోకు దరఖాస్తు చేశారు. కానీ నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడి కబ్జాలు చూసి అవాక్కయ్యారు. కట్టాడాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ప్రైవేటు నిర్మాణాలుండటం, కట్టడాలకు అతి చేరువగా వాహనాలు వెళ్తుండటం, ఓ పద్ధతి లేకుండా దుకాణాలు వెలియటంతో గుర్తింపు ఇవ్వలేమని యునెస్కో తిరస్కరించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి కేంద్రాన్ని కోరింది. దీంతో 2017లో కేంద్రం యునెస్కోకు దరఖాస్తు చేసింది. అయితే, ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ యునెస్కో తిప్పి పంపింది. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు పంపారు. దాన్ని స్వీకరించిన యునెస్కో.. ఆ వివరాలు కచి్చతంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు బృందాన్ని పంపుతోంది. రామప్ప విశేషాలు.. ఇది రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆ ఆల యానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం మన దేశంలో మరెక్కడా లేదు. క్రీ.శ.1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది. పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామశివారులో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరువలో రామప్ప పేరుతో పెద్ద చెరువు కూడా ఉంది. దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలున్నా.. అవన్నీ పర్యవేక్షణ లేక శిథిలమయ్యాయి. కాగా, మన దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 38 ఉన్నాయి. అద్భుత నిర్మాణం.. నర్తకి కళ్లముందే నృత్యం చేస్తున్నట్లు అనిపించేంత సహజంగా ఆలయంలో శిల్పాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, పైకప్పు, ఫ్లోర్‌పై చూడ చక్కని, అబ్బురపరిచే చెక్కడాలున్నాయి. దక్షిణ భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన హంపి, హాలెబీడు, తంజావూరు ఆలయాలతో పోలుస్తూ చూడామణి నందగోపాల్ రామప్ప ప్రత్యేకతలను గుర్తించి నివేదించారు. హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్ రాతిపై చెక్కారు. కానీ రామప్పలో కఠినంగా ఉండే డోలరైట్ రాతిపై చెక్కారు. శిల్పాలు అద్దం మాదిరిగా నునుపు తేలుతూ మెరుస్తూ ఉండటం నాటి శిల్పుల నిర్మాణ పనితనానికి నిదర్శనం. వెంట్రుక దూరేంతటి సన్నటి సందులతో కూడిన డిజైన్లు శిల్పాలపై ఉండటం దీని విశిష్టత. గర్భాలయ ప్రవేశ మార్గం పక్కన ఉండే వేణుగోపాలస్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరా లు పలకటం నాటి పరిజ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది. ఈ ఆలయానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయి. నిర్మాణ బరువును తగ్గించేందుకు ఈ ఇటుకలు రూపొందించారు. పూర్తి నల్లరాతితో ఆలయాన్ని నిర్మించారు. కానీ సమీపంలో ఎక్కడా అలాంటి రాళ్ల జాడ కనిపించదు. వేరే ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఆ రాళ్లను తెప్పించారన్నమాట. పేరిణి నృత్యం స్పష్టించేందుకు ఈ ఆలయంలోని శిల్పాల నృత్య భంగిమలే ప్రేరణ. గణపతి దేవుడి బావమరిది జాయపసేనానీ 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ. -
గుర్తింపు దక్కేనా..!
సాక్షి, ములుగు: కాకతీయుల అద్భుత శిల్పకళా సంపదకు నిలువుటద్దం రామప్ప దేవాలయం. ప్రపం చ వ్యాప్తంగా కీర్తిని పొందాయి ఇక్కడి శిల్పాలు. విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన కళాఖండాలను తనివితీరా చూడాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. 806 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయానికి విభిన్నమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి ఇటుకలు నీటిలో వేస్తే తేలియాడుతూ ఉంటాయి. ఇది ఇప్పటికీ అం తుపట్టని అద్భుతమని చెప్పుకోవచ్చు. ఆలయం ఎదుట ఉండే నందీశ్వరుడు ఏకశిలతో ఏర్పాటు చేయడంతో పాటు శివలింగానికి ఎదురుగా ఉండడం మరో ప్రత్యేకత. సూర్యకాంతి నేరుగా గర్భగుడిలో పడి ప్రకాశవంతమైన వెలుతురును ప్రసరింపజేయడం శిల్పి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయం ముచ్చటగా మూడోసారి 2019 సంవత్సరానికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున యునెస్కోకు నామినేట్ అయింది. ఇప్పటికే రెండుసార్లు (2017, 2018) రాష్ట్రం నుంచి అందించిన ప్రతిపాదనలో వివరాలు సరిగా లేవని తిరస్కరించబడింది. దేశం నుంచి ఒక చారిత్రక ప్రదేశానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఈ రెండు సార్లు రాజస్థాన్ రాష్ట్రం యునెస్కో గుర్తింపు పొందింది. పకడ్బందీగా ప్రతిపాదనలు.. రామప్ప ఆలయాన్ని ఇప్పటికే రెండు సార్లు యు నెస్కో తిరస్కరించడంతో పర్యాటక శాఖ అన్ని రకాల జాగ్రత్తలతో పకడ్బందీగా ప్రతిపాదనలు చేసింది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ ప్రతిపాదన యునెస్కో బెంచ్ ముందుకు వెళ్లనుంది. కాగా, ఈ దఫా రామప్ప ఆలయం మాత్రమే నా మినేట్ కావడంతో కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని, వారసత్వ సంపదకు తగిన గౌరవం దక్కుతుందని భక్తులు, స్థానికులు ఆశిస్తున్నారు. ప్రతిపాదనలు.. జిలాల్లోని వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతిదేవుడి కాలంలో సామంత రాజు రేచర్లరుద్రడు నిర్మించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్‌గా అరుదైన సాండ్ బాక్స్ టెక్నాలజీని వినియోగించారు. దీంతో పాటు ఆలయ పైభాగం నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. అలాగే సరిగమపలు పలికే మ్యూజికల్ పిల్లర్, చిపురుపుల్ల దూరే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాలు, ఆ కాలంలో మహిళ హై హిల్స్ చెప్పులు, పేరిణీ నత్య భంగిమలు, రకరకాల రాళ్లను వినియోగించి, నృత్య భంగిమలతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనలో పొందుపర్చారు. సమీప రాజ్యాలతో వ్యాపార సంబంధాలు భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఆలయ గోడలపై శిల్పాలను చెక్కించడం, బెల్లం, కరక్కాయలతో కూడిన మిశ్రమంతో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు చేశారు. పరిశీలన.. రామప్పకు యునెస్కో జాబితాలో చోటుదక్కడంలో భాగంగా ప్రతిపాదనల కోసం ఇటీవల ఆర్కాలజీ డైరెక్టర్ విశాలాక్షి, ఇంటాక్ట్ కన్వీనర్ పాండురంగారావుతో కూడిన బృందం ఆలయాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ప్రతిపాదన యునెస్కో పరిశీలనలోకి వెళ్లిన అనంతరం మరోసారి ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కేంద్ర బృంద సభ్యులు ఆలయాన్ని సందర్శించనున్నారు. మెరుగపడనున్న సౌకర్యాలు.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఆలయానికి చోటు దక్కితే టూరిజం పరంగా ప్రపంచ దేశాల చూపు రామప్పవైపు మరలుతుంది. నిధుల కేటాయింపు నేరుగా జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే అన్ని రకాల వసతులు, సౌకర్యాలు మెరుగుపడుతాయి. షాపులను తొలగిస్తేనే.. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందాలంటే ఆలయ చుట్టు పక్కల 100మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. దీంతో పాటు మరో 200 మీటర్ల పరిధిలో అనుమతులు లేకుండా భవనాలు, ఇతర గృహాల నిర్మాణం చేపట్టకూడదు. అయితే ఆలయానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. గత రెండు సంవత్సరాలుగా షాపులను తొలగించే విషయంలో రెవెన్యూ, సంభందిత అధికారులు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. యునెస్కో బృందం పరిశీలనకు వచ్చే సమయంలో దుకాణాలు ఇలాగే కొనసాగినట్లయితే ప్రతిపాదనలు తిరస్కరించబడే అవకాశం ఉంది. -
‘రామప్ప’ అభివృద్ధికి సహకరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ను ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో వారు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’పథకంలో రామప్ప ఆలయం, రామప్ప చెరువును కూడా చేర్చాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. స్వదేశీదర్శన్ పథకంలో ట్రైబల్ సర్క్యూట్లో రామప్పను చేర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సందర్శకులతో కళకళలాడుతున్న రామప్ప చెరువులో విహారానికి రెండు హౌజ్ బోట్లను మంజూరు చేయాలని విన్నవించారు. రామప్ప ఆలయాన్ని హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించాలని, ట్రైబల్ సర్క్యూట్లో ములుగు, లక్నవరం, తాడ్వాయి మేడారం, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం మాత్రమే ఉన్నాయని, ఈ పథకంలో రామప్పను చేర్చితే రామప్ప ఆలయం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రికి విన్నవించార -
‘దత్తపుత్రుడు’ రామప్ప
సాక్షి, హైదరాబాద్: చారిత్రకంగా ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నిధుల్లేక అభివృద్ధికి నోచు కోవట్లేదు. ఈ నేపథ్యంలో చారిత్రక నిర్మాణాలను దత్తతకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. దశల వారీగా ముఖ్యమైన కట్టడాలను కార్పొరేట్ సంస్థలకు దత్తత ఇవ్వాలని భావి స్తోంది. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు చారిత్రక కట్టడాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇందు లో భాగంగా తొలుత రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్‌ల దత్తతకు సంబం ధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృ తిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలు దీన్ని జారీ చేశాయి. దీనికి జీఎమ్మార్, కాక తీయ హెరిటేజ్ ట్రస్టులతో పాటు మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఆయా సంస్థలకు లేఖలు అందజేసింది. రామప్ప దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించి మూడు వారాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రపర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ సమక్షంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి పాండురంగారావుకు అధికారులు లేఖ అందజేశారు. జీఎమ్మార్ సంస్థ కూడా గతంలో ప్రతిపాదన సమర్పించింది. మూడువారాల్లో వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి దత్తత సంస్థను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది. దత్తత తీసుకుని ఏం చేస్తారు..? రామప్ప దేవాలయం ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. నిర్మాణ బరువును తగ్గించేందుకు నీటిలో తేలే ఇటుకలను రూపొందించి ఈ గుడిని నిర్మించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతోంది. కానీ ఆ అద్భుత నిర్మాణం వద్ద పర్యాటకులకు కనీస వసతుల్లేవు. సరైన రోడ్డు వసతి లేదు. ప్రస్తుతం ఆ కట్టడం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అధీనంలో ఉండగా, నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ సంరక్షిస్తోంది. కానీ పర్యాటకులకు వసతులు కల్పించటం సాధ్యం కావ టం లేదు. మంచి రోడ్డు, పచ్చిక బయళ్లు, లైటింగ్ వ్యవస్థ, సౌండ్, లైట్ షో లాంటి ఏర్పాట్లు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆ పనులు చేపట్టబోతోంది. దత్తతకు తీసుకునే సంస్థ ఆ నిధుల జమ బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పనులు మాత్రం పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. -
రామప్పను సందర్శించిన జర్మనీయులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాక రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మనీకి చెందిన ఇద్దరు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారి ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ శిల్పకళాసంపద గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించగా శిల్పాకళా అందాలను వారు తమ కెమెరాల్లో బంధించుకొని ముగ్ధులయ్యారు. -
ప్చ్.. రామప్ప!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ హోదా అందినట్లే అంది చేజారింది. నిర్మాణ చాతుర్యం, వైశిష్ట్యం పరంగా ప్రత్యేకత చాటుకుంటున్న రామప్ప దేవాలయం యునెస్కో జాబితాలోకి చేరినట్టే చేరి దారితప్పినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం లేదన్న లోటును రామప్ప తీరుస్తుందని ఆశించినా.. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మాత్రం భిన్నంగా ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించిన రామప్ప దరఖాస్తును కేంద్రం బుట్టదాఖలు చేసిందని, దాని స్థానంలో జైపూర్ ప్రతిపాదనను పంపిందని సమాచారం. గతంలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధు లతో కలిపిన ప్రతిపాదన, ఆ తర్వాత వేయిస్తంభాల గుడి ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడంతో ఈసారి పక్కాగా దరఖాస్తు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రామప్ప దేవాలయాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించింది. కానీ అది యునెస్కో తలుపు తట్టకుండానే తిరుగుటపాలో వచ్చినట్లు తెలుస్తోంది. దాన్ని ఢిల్లీ స్థాయిలో స్క్రూటినీ కమిటీనే తిరస్కరించినట్లు్ల సమాచారం. రెండు సార్లు తయారు చేసినా.. గత చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి కొంత పక్కాగానే ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు పాపారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రామప్ప ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చారు. కానీ ఆలయ ప్రతిపాదన (డోషియర్) రూపకల్పనలో పక్కాగా వ్యవహరించకపోవడమే తిరస్కరణకు కారణమని తెలుస్తోంది. కేవలం రామప్ప ఆలయ నిర్మాణ కౌశలంపైనే దృష్టి సారించి వివరాలు సేకరించిన నిపుణులు.. ఆ కోణంలోనే దాన్ని ప్రతిపాదించారని, యునెస్కోకు పంపాల్సిన పద్ధతిలో ప్రతిపాదన లేదని ఢిల్లీ స్క్రూటినీ కమిటీ అభిప్రాయ పడినట్లు తెలిసింది. కట్టడానికి సంబంధించిన కొన్ని వివరాలూ తప్పుగా పేర్కొన్నట్లు కమిటీ గుర్తించిందని తెలుస్తోంది. కొన్ని శిల్పాలకు సంబంధించి కుడి వైపు వివరాలను ఎడమవైపు, ఎడమ వైపు వివరాలు కుడివైపు ఉన్నట్లు తప్పుగా నమోదు చేసిన విషయాన్నీ కమిటీ గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రానికి సమాచారం లేదు.. జైపూర్ ప్రతిపాదనను కేంద్రం వారం క్రితం యునెస్కోకు పంపి రామప్పను పెండింగులో పెట్టిందని ఢిల్లీ సమాచారం. కానీ దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందలేదు. యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపం చ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రాజస్తాన్ ఈ విషయంలో గట్టి లాబీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో బాగా వెనుకబడిన తెలంగాణ, యునెస్కో గుర్తింపు పొందే విషయంలోనూ మంచి అవకాశం చేజార్చుకున్నట్లయింది. యునెస్కో ప్రతిపాదనలు రూపొందించటంలో అనుభవం ఉన్నవారి మార్గదర్శనంలో కొత్త ప్రతిపాదన రూపొందిస్తే భవిష్యత్‌లోనైనా రామప్పకు గుర్తింపు తథ్యమన్న విషయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాట్లు కూడా లేకుండా డోషియర్ రూపొందించాలని సూచిస్తున్నారు. కనీస వసతులూ లేవు..! ప్రపంచ వారసత్వ హోదా పొందే కట్టడం వద్ద పర్యాటకులకు కనీస వసతులు అవసరం. కానీ రామప్ప ఆలయానికి ఇప్పటికీ సరైన రహదారి లేదు. అక్కడ పర్యాటకులకు మంచి భోజనం లభించే వసతి లేదు. మంచి నీరు, టాయిలెట్లకూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కనీస వసతులు కల్పించి దరఖాస్తు చేసి ఉండాల్సిందని, దాన్ని కూడా పట్టించుకోకపోవడాన్ని కమిటీ తప్పుబట్టిందని తెలుస్తోంది. వరంగల్‌లోని వేయిస్తంభాల దేవాలయాన్ని రుద్రేశ్వరాలయంగా పిలుస్తారు. రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వరాలయంగా పేర్కొంటారు. కానీ యునెస్కో ప్రతిపాదనలో దాన్ని రుద్రేశ్వరాలయంగా పేర్కొన్నట్లు తెలిసింది. దీన్ని కూడా కమిటీ గుర్తించిందని చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టిందని సమాచారం. ఇదే కేటగిరీలో పోటీ పడిన రాజస్తాన్ రాజధాని నగరం జైపూర్ ప్రతిపాదనకు కమిటీ జై కొట్టిందని తెలుస్తోంది. -
రారండోయ్.. రామప్పకు..
వెంకటాపురం(ఎం): మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని రామప్ప ఆలయాన్ని సందర్శించే మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తులు రామలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు గతంలో నిర్మించిన మినీవాటర్ ట్యాంకులకు మరమ్మతు చేసి వినియోగంలోకి తెచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం తహసీల్దార్ ఇరుకుల శివకుమార్, ఎస్సై పోగుల శ్రీకాంత్, రామప్ప ఈఓ చిందం శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రామప్ప ఆలయం ఎదుట ఉన్న కట్ట సమీపంలో 20 మరుగుదొడ్లను నిర్మించినప్పటికీ వాటికి తడకలు అమర్చకపోవడంతో వినియోగంలోకి రాలేదు. సాయంత్రం 6 గంటలకే ఆలయ ప్రధాన గేట్లు మూసి వేస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరస్సు కట్టకు కాలినడకన... భక్తుల వాహనాలను పోలీసులు రామప్ప ఆలయ శివారులోనే నిలిపివేస్తుండడంతో ఆలయాన్ని సందర్శించిన భక్తులు కాలినడకన పిల్లపాపలతో కలిసి సరస్సుకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 300 మంది పోలీసులచే బందోబస్తు మేడారం జాతర సందర్భంగా రామప్పకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 300 మంది పోలీసు సిబ్బందిచే సేవలు అందిస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ తెలిపారు. జంగాలపల్లి నుంచి గణపురం క్రాస్‌రోడ్ వరకు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. రామప్పలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న భక్తజనం మేడారం జాతర దగ్గర పడుతున్నకొద్దీ రామప్పలో భక్తుల రాక పెరుగుతోంది. గత నాలుగైదు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు రామప్పను సందర్శిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో రామప్ప ఆలయ పరిధిలో మిఠాయి దుకాణాలు, బొమ్మల దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, హోటళ్లు తదితర దుకాణాలు వెలిశాయి. రామప్ప పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. -
అయ్యో.. రామప్ప!
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రాక రామప్ప ఆలయ అభివృద్ధిని అధికారులు మరిచారు. నిత్యం వందలాది మంది భక్తులు సందర్శించే ఈ ఆలయానికి మేడారం జాతర నేపథ్యంలో వేలాదిగా తరలివస్తున్నారు. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివస్తారు. దూర ప్రాంతాల నుంచి మేడారంను సందర్శించే భక్తులు తిరుగు ప్రయాణంలో వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. మేడారంలో దుమ్ము,దూళితో అలిసిపోయిన భక్తులు రామప్ప ఆలయ ప్రాంగణంలో ఒకరోజు విడిది చేస్తారు. ఈ సందర్భంగా రామప్ప సరస్సులో పుణ్యస్నానాలాచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో భోజనాలు వండుకొని తిని విశ్రాంతి తీసుకుంటారు. మేడారం భక్తులకు సమస్యల స్వాగతం.. మేడారం జాతర మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్నప్పటికీ ఇప్పటికే ప్రతిరోజు రామప్పను 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు సందర్శిస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా ఐదు లక్షలకుపైగా భక్తులు రామప్పను సందర్శించే అవకాశం ఉంది. భక్తుల సౌకర్యార్థం ఇప్పటి వరకు రామప్పలో కనీస వసతులు అ«ధికారులు కల్పించకపోవడంతో వారికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు, పార్కింగ్ స్థలం, లైటింగ్ వసతి ఇలా ప్రతీ సమస్య భక్తులకు ఎదురు కానుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి రామప్పలో సౌకర్యాలు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. కానరాని మరుగుదొడ్లు.. గత జాతర సందర్భంగా సరస్సు కట్ట సమీపంలో పది శాశ్వత స్నానఘట్టాలు, పది శాశ్వత మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటి వద్ద నీటివసతి కల్పించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఆ సమయంలో రామప్ప పరిసర ప్రాంతాల్లో 30 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ ఈ సారి తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రామప్పగుడి వద్ద తాత్కాలిక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బస్ సౌకర్యం కల్పించరూ.. నిత్యం రామప్పకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నా ఇక్కడికి బస్‌సౌకర్యం లేదంటే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడారం జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్నా రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పరకాల, హన్మకొండ, భూపాలపల్లి నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపించడం తోపాటు ముఖ్యమైన కూడళ్లతో పాటు ఆలయం వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. రాత్రి 8 గంటల వరకు ఆలయంలోకి అనుమతించాలి రామప్ప ఆలయంలోకి వెళ్లేందుకు రాత్రి 8 గంటల వరకు భక్తులకు అవకాశం కల్పించాలని మేడారం భక్తులు, పర్యాటకులు పురావస్తుశాఖ అధికారులను కోరుతున్నారు. సాయంత్రం ఆరు దాటితే ఆలయ ప్రధాన గేట్లను మూసి వేస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మహబూబ్‌నగర్, జగిత్యాలకు చెందిన భక్తులు ఇదే విషయమై పురావస్తుశాఖ సిబ్బందితో గొడవపడి గేటుకు వేసిన చైన్‌ను ధ్వంసం చేసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కంపు కొడుతున్న పరిసర ప్రాంతాలు రోజురోజుకు రామప్ప ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతున్నా గ్రామపంచాయతీ అధికారులుగానీ, ఆలయ సిబ్బందిగానీ ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రామప్ప పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. రామప్ప ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు వారి వెంట తెచ్చుకున్న భోజన పదార్థాలను ఆరగించి ప్లేట్లను, భోజన పదార్థాలను రోడ్డుపైనే వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులు విఫలం రామప్పను సందర్శించే భక్తులకు వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ శివారులోని ఒగరు కాల్వ వద్ద సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి. రామప్పలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో రోడ్లకు ఇరువైపులా ప్లేట్లు, మిగిలిపోయిన భోజన పదార్థాలను భక్తులు పడేస్తున్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతాల్లో తాగునీటి వసతి, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. వంగ మల్లేష్, పాలంపేట గ్రామస్తుడు కానరాని నీటి వసతి రామప్పకు చేరుకోనే మేడారం భక్తులకు ఆలయ సమీపంలో స్నానాలు చేయడానికి ఎలాంటి నీటివసతి లేకపోవడంతో ప్రతిసారి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ ఆవరణలో ఒక చేతిపంపుతోపాటు ఆలయం ముందు చిన్నవాటర్ ట్యాంకు ఉంది. భక్తులు తాగునీటికి వీటిపైనే ఆధారపడుతుండడంతో స్నానాలు చేసేందుకు సరస్సును ఆశ్రయించక తప్పడం లేదు. అంతేగాక ఆలయం ముందు ఇరుకైన కల్వర్టు ఉండడంతో గత ఆరేళ్ల క్రితం మేడారం భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు లక్షలతో తాత్కాలిక వంతెనతో మరో రహదారి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ వంతెన కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆలయం ఎదుట ఉన్న ఇరుకైన వంతెన(బ్రిడ్జి) కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదకరంగా మారిన వంతెనలకు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
విభిన్నం, ప్రత్యేకం.. రామప్ప దేవాలయం!
సాక్షి, హైదరాబాద్ : రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం పూర్వకాలంలో అమలైన పద్ధతి. అందుకే తెలంగాణలో కచీర్లు వెలిశాయి. రెండు వర్గాల వాదన విని కచీర్ ‘పెద్ద’ఇచ్చే తీర్పుతో ఆ వివాదం పరిష్కారమయ్యేది. మరి రెండు వర్గాలు దేవుడి సన్నిధిలో కూర్చుని పంచాయితీ జరిపితే..!!! కాస్త ఆశ్చర్యమే. గౌందలి, యోగిని, నాగిని, పేరిణి.. ఇవన్నీ నృత్య రీతులు. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. చేతులతో డప్పు వాయిస్తూ, పాడుతూ, నర్తించాలి.. ఈ మూడింట మంచి ప్రవేశంతో ఏకకాలంలో జరపటం గౌందలి ప్రత్యేకత. ఇలా ఒక్కో ప్రత్యేకతతో ఉండి, వాటి రూపాలన్నీ దేవాలయంలోని శిల్పాల్లో అచ్చుగుద్దినట్టు ప్రస్ఫుటమైతే..!!!! సంభ్రమాశ్చర్యమే. దేవాలయంలోని శిల్పాల భంగిమల నుంచి స్థానిక జానపద, ఇతర శాస్త్రీయ నృత్యరీతులు రూపుదిద్దుకుంటే..!!!! అబ్బురమే. ...ఇలాంటి ప్రత్యేకతలు ఒకే గుడిలో కనిపిస్తే.. అది రామప్ప దేవాలయం అవుతుందని ప్రముఖ నర్తకి, చారిత్రక పరిశోధకురాలు, యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్ అంటున్నారు. రామప్ప దేవాలయంపై పరిశోధన జరిపి తేల్చిన వివరాలతో చూడామణి త్వరలోనే ఓ పుస్తకాన్నీ రూపొందించబోతున్నారు. దీన్ని ప్రచురించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ముందుకొచ్చింది. శనివారం రామప్ప ప్రత్యేకతలను వివరిస్తూ ఆమె, తన శిష్యురాలైన నర్తకి డాక్టర్ విద్యతో కలసి గంటన్నర పాటు అంతర్జాతీయ హెరిటేజ్ సదస్సులో ప్రదర్శన ఇచ్చారు. రామప్ప నిర్మాణ వైషిష్ట్యాన్ని దృశ్యరూపకంగా వివరించారు. ఆలయంలో అత్యద్భుతంగా చెక్కిన శిల్పాల్లోని నృత్య భంగిమలను వివరిస్తూ డాక్టర్ విద్య నర్తించి చూపారు. ఈ ప్రదర్శన సదస్సుకు హాజరైన దేశవిదేశాలకు చెందిన ఆçహూతులను విశేషంగా ఆకట్టుకుంది. శాసనం కోసమే ప్రత్యేక మండపం కల్యాణి చాళుక్యుల హయాంలో నిర్మితమైన అన్ని ప్రధాన శివాలయాలను తాను చూశానని, వాటికంటే విభిన్నమైన ప్రత్యేకతలో కాకతీయుల కాలంలో రామప్ప నిర్మితమైందని చూడామణి వివరించారు. ఎత్తయిన కక్ష్యాసనం, మూలవిరాట్టు దిగువన ఉండే జగతి (ప్లాట్‌ఫామ్) చాలా ఉన్నతంగా ఉంటుందని, సభా మండపాన్ని తలపించే రంగమండపం నాడు దేవుడి సన్నిధిలో వివాదాలు పరిష్కరించుకునేందుకు, సభలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వాడి ఉంటా రని అభిప్రాయపడ్డారు. వేడి ప్రాంతమైనందున ఆలయం వెలుపల నిలబడి జనం వీక్షించటం ఇబ్బందిగా ఉంటుందని, వెలుపలి వైపు ఎలాంటి ప్రత్యేక డిజైన్లు రూపొందించలేదని, కానీ లోపలి వైపు సంభ్రమాశ్చర్యాలు కలిగేలా అలంకరణలు చెక్కారని తెలిపారు. డోలమైట్, గ్రానైట్, ఇసుకరాయి, నీటిలో తేలే ఇటుకలతో మందిరాన్ని నిర్మించారన్నారు. శాసనం కోసమే ప్రత్యేక మండపం నిర్మించి ఉండటం మరెక్కడా కనిపించదని వివరించారు. ఆలయంలో మొత్తం 280 వరకు నృత్య భంగిమల శిల్పాలున్నాయని తెలిపారు. జాయపసేనాని రాసిన నృత్యరత్నావళిలోని నృత్య భంగిమలు ఈ శిల్పాలను పోలి ఉంటాయని పేర్కొన్నారు. చిందు యక్షగానాలు కూడా వీటిని చూసే రూపొందించి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి రామప్ప దేవాలయం ఓ గ్యాలరీ.. అని చూస్తే ఎన్నో నేర్చుకుంటామని పేర్కొన్నారు. అనంతరం చూడామణి, విద్యలను హెరిటేజ్ తెలంగాణ సంచాలకుడు విశాలాచ్చి సన్మానించారు. -
ఫైలు అటకెక్కింది.. రామప్ప గోడ కూలింది
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత రామప్ప దేవాలయం విషయంలో కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారుల నిర్లక్ష్యంతో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రహరీ గోడ దాదాపు 40 మీటర్ల మేర కుప్పకూలింది. మరో 30 మీటర్ల మేర ఏ క్షణంలోనైనా కూలేలా తయారైంది. పత్రికల్లోని వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రశ్నించటంతో రూ.2 కోట్లతో పునర్ నిర్మించేందుకు ఏఎస్ఐ అధికారులు సిద్ధమయ్యారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు ప్రతిపాదించిన నేపథ్యంలో మరింత స్పష్టంగా దరఖాస్తు సమర్పించేందుకు యునెస్కో కన్సల్టెంట్, ప్రఖ్యాత నర్తకి, ఆర్కిటెక్ట్ చూడామణి నందగోపాల్ బృందం అధ్యయనం జరిపిన మూడు రోజులకే గోడ కూలడం గమనార్హం. జూన్‌లోనే ఏఎస్ఐ రాష్ట్ర సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలన్ చౌలే స్థానిక అధికారులతో కలసి ఆలయాన్ని పరిశీలించారు. అప్పుడే ప్రహరీ కూలే స్థితిలో ఉందని, అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సకాలంలో దాన్ని పరిశీలించక పెండింగులో పెట్టినట్లు సమాచారం. మళ్లీ పాత పద్ధతిలో మరమ్మతులు.. ఈ ఆలయం శాండ్బాక్స్ టెక్నాలజీతో కాకతీయుల కాలంలో నిర్మితమైంది. ప్రహరీ నిర్మాణంలోనూ అప్పట్లో ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. దాదాపు మీటరున్నర మేర పునాదిపై గోడను నిర్మించారు. గోడను వెలుపల, లోపల భాగంలో రెండు పొరల చొప్పున నిర్మించి మధ్యలో ఓ మీటర్ మేర ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇసుక నింపి పైభాగంలో అడ్డురాళ్లతో అనుసంధానించారు. ఇప్పుడు అదే పద్ధతిలో దాన్ని పునర్ నిర్మించారు. ఇప్పుడు ఆ రెండు గోడ పొరల మధ్య ఇసుక బదులు ఇటుకలు వాడాలని వరంగల్ నిట్ సూచించటంతో ఆ ఇటుకల తయారీకి ఏఎస్ఐ ఆర్డరిచ్చింది. ఇసుక రాతిని వినియోగిస్తారు. మధ్యలో సిమెంటు బదులు డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి, గుడ్డుసొనల మిశ్రమాన్ని వినియోగించనున్నారు. ఈశాన్యం వైపు మరో 30 మీటర్ల గోడ ప్రమాదకరంగా మారటంతో దాన్ని కూల్చేసి తిరిగి నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని తాజాగా అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర కార్యాలయానికి పంపారు. -
రామప్ప ఆలయాన్ని పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి చారిత్రక రామప్ప ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చారిత్రక చిహ్నాల్లో రామప్ప ఆలయం ఒకటని, దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకు కేంద్ర పురావస్తు శాఖ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయ ప్రహరీ ఇటీవల వర్షాలకు కూలిపోవడం, ఆలయ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. త్రికల్లో వచ్చిన కథనాన్ని చదివిన న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు లేఖ ద్వారా ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. పిల్ కమిటీ దాన్ని పరిశీలించి సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని నిర్ణయించింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. వర్షాలకు దెబ్బతిన్న తూర్పు వైపు ప్రాకారానికి మరమ్మతులు చేస్తామని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ హామీ ఇచ్చారు. రామప్ప ఆలయ పరిరక్షణపై విట్ (వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రొఫెసర్లు, సివిల్ ఇంజనీర్ల బృందం చేసిన సిఫార్సుల నివేదిక పురావస్తు శాఖకు అందిందని, దీనిపై తీసుకోబోయే చర్యల్ని వివరించే కౌంటర్ పిటిషన్ దాఖలుకు వ్యవధి కావాలని ఆయన కోరారు. దీంతో విచారణ డిసెంబర్ 12కి వాయిదా పడింది. -
రామప్ప.. ‘ప్రపంచ’ గొప్పే!
సాక్షి, హైదరాబాద్: అద్భుత నిర్మాణ కౌశలంతో అలరారుతున్న రామప్ప దేవాలయం ప్రపంచ స్థాయి ప్రత్యేక నిర్మాణమని నిపుణుల కమిటీ తేల్చింది. ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఆధ్వర్యంలోని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకునేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని రూఢీ చేసింది. నిర్మాణంలో ఉపయోగించిన ఇంజనీరింగ్ నైపుణ్యం, తీర్చిదిద్దిన శిల్పాల పనితనం, ప్రత్యేక నృత్యరీతులు రూపొందేందుకు ఆ శిల్పాలు ప్రేరణ కావటం తదితరాల ఆధారంగా ప్రత్యేకను సంతరించుకున్న నిర్మాణమని తేల్చింది. ప్రఖ్యాత నర్తకి, ఆర్కిటెక్ట్, యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్ ఆధ్వర్యంలోని బృందం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. యునెస్కో గుర్తింపు పొందిన సమకాలీన నిర్మాణాలతో పోలిస్తే రామప్ప మెరుగ్గా ఉందని, దీని నిర్మాణానికి వినియోగించిన ఇంజనీరింగ్ మెళకువలు, నిర్మాణ శైలి, వాడిన పరిజ్ఞానం, కఠినమైన రాతిపై శిల్పాలు చెక్కడం తదితరాలన్నీ ప్రపంచ స్థాయి ప్రత్యేకతలుగా ఆమె అభివర్ణించారు. దీన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో పది రోజుల్లో ప్యారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయానికి నివేదికను అందజేయనుంది. ఇప్పటికే పెండింగులో ఉన్న రామప్ప డోషియర్ (దరఖాస్తు)కు దీన్ని జతచేసి ప్రపంచ వారసత్వ హోదా కేటాయించే విషయాన్ని యునెస్కో పరిశీలించనుంది. ఈసారి యునెస్కో గుర్తింపు వస్తుందని ప్రభుత్వం భరోసాతో ఉండటం విశేషం. ఏడు నెలల క్రితమే దరఖాస్తు గోల్కొండ, చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ల ప్రతిపాదనలను యునెస్కో తిరస్కరించటంతో రాష్ట్ర ప్రభుత్వం రామప్ప దేవాలయంపై దృష్టి సారించి ఏడు నెలల క్రితం దరఖాస్తు చేసింది. దీన్ని పరిశీలించిన యునెస్కో.. రామప్ప మందిర నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఎలా ప్రత్యేకతను సంతరించుకుందో తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ప్రభుత్వం నిపుణులను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు నిష్ణాతులతో చర్చించి చివరకు ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్‌ను ఎంపిక చేశారు. ఆమె గతంలో కర్ణాటకలోని హంపి, హాలెబీడు హొయసాలేశ్వర మందిరం, తంజావూరు బృహదీశ్వరాలయం వంటి వాటిపై సమగ్ర అధ్యయనం చేసిన అనుభవశాలి. డాన్స్ రీసెర్చ్ స్కాలర్ విద్య, ఆర్ట్ రీసెర్చ్ స్కాలర్ సౌమ్య మంజునాథ్, విశ్రాంత పురావస్తు ఉన్నతాధికారి రంగాచార్యులతో కలసి గత ఆగస్టులో రామప్ప మందిరంపై ఆమె అధ్యయనం చేశారు. అధ్యయనం వివరాలివీ.. - యునెస్కో కోరిన అంశాల ఆధారంగా చూడామణి పరిశీలన సాగింది. - హంపి, హాలెబీడు, తంజా వూరు నిర్మాణాలతో పోల్చి వాటితో రామప్ప దేవాలయం ఏరకంగా ప్రత్యేకమైందో గుర్తించారు. - హంపి, హాలెబీడు, తంజావూరులలో శిల్పాలను సిస్ట్ రాతిపై చెక్కారు. అది మెత్తరకం రాయి కావటంతో శిల్పాలు చెక్కడం ఇబ్బందిగా ఉండదు. కానీ రామప్ప దేవాలయంలోని శిల్పాలను చాలా కఠినంగా ఉండే డోలరైట్ రాతిపై చెక్కారు. - శిల్పాలు అద్దం తరహాలో నునుపు, మెరుపు తేలాలా ఉండటం పనితనంలో ప్రత్యేకతను తెలుపుతోంది. శిల్పాల కార్వింగ్‌లో చిన్నచిన్న వివరాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని డిజైన్లలో వెంట్రుక దూరేంత సన్నటి సందులు ఏర్పరచారు. - వేణుగోపాల స్వామి శిల్పంపై మీటినప్పుడు సప్తస్వరాలు పలకటం నాటి పరిజ్ఞానానికి నిదర్శనం. - నృత్య భంగిమల్లోని శిల్పాలు ప్రత్యేక నృత్య రీతులు ఏర్పడేందుకు ప్రేరణగా నిలిచిన దాఖలాలున్నాయి. - గణపతి దేవుడి బావమరిది జాయప సేనాని 1250లో రచించిన నృత్య రత్నావళి గ్రంథంలోని వర్ణనకు ఈ ఆలయ శిల్పాలే ప్రేరణ అని గుర్తించారు. - పేరిణి శివతాండవాన్ని నటరాజ రామకృష్ణ రూపకల్పన చేయటానికి ఈ శిల్పాలే ప్రేరణగా నిలిచిన తీరును గుర్తించారు. - ఈ మందిర నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి. ఎంత తేలికైనవో, అంత కఠినమైనవి. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా ఇటుకలు ఉపయోగించిన దాఖలాలు లేవని గుర్తించారు. -
చీమలతోనే చిక్కు..
సాక్షి, వరంగల్: అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. చీమల కారణంగా ఈ ఆలయం గోడలు రోజురోజుకూ కుంగిపోతున్నాయి. క్రమంగా రెండు మూడేళ్లకు ఒకటి వంతున ఆలయానికి సంబంధించిన గోడలు, గోపురాలు, ద్వారాలు కూలిపోతున్నాయి. ఈ ఆలయం పునాదుల్లో ఉపయోగించిన ఇసుకను చీమలు తోడేస్తుండటంతో నిర్మాణంలోని పటిష్టత తగ్గిపోతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలువబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఆలయం నిదర్శనం. ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ప్రధానంగా మదనికలు, నాగిని శిల్పాలను చూసేందుకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారు. కాకతీయులు భారీ ఆలయాల నిర్మాణంలో సాధారణ పద్ధతికి భిన్నంగా శాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. పునాదిలో బలమైన రాళ్లను కాకుండా ఇసుకను ఉపయోగించారు. ఇసుక పునాదిపై రాతి శిల్పాలను పేర్చుకుంటూ ఆలయాన్ని నిర్మించారు. దీంతో కొన్నేళ్లుగా ఈ ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. చీమలు నిత్యం పునాదుల్లో ఉన్న ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో పునాది డొల్లగా మారుతోంది. ఫలితంగా ఈ పునాదిపై ఉన్న బరువైన శిలలు, శిల్పాల బరువుకు పునాది కుంగిపోతోంది. అధికారులేమో చీమలు పునాది నుంచి బయటకు తోడేస్తున్న ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే.. చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. నష్టం జరిగినా అదేతీరు.. పునాదుల్లో ఇసుక బయటకు రావడంతో బలహీనమైన పునాదిపై బరువైన రాళ్లు (శిల్పాలు) ఉండడంతో క్రమంగా కుంగిపోతున్నాయి. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై ఆలయ గోడలు కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో ఉన్న కామేశ్వరాలయం ఒకవైపునకు ఒరిగి పోయింది. దీంతో ఆలయానికి సంబంధించి శిల్పాలను తొలగిచారు. తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పినా... పదేళ్లలో ఎటువంటి పురోగతి లేదు. తొలగించిన శిల్పాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. అనంతరం 2013లో రామప్ప ఆలయం తూర్పు ముఖ ద్వారం కూలిపోయింది. తాజాగా ప్రహరీ గోడలు కూలిపోయాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. రామప్ప ఆలయ నిర్వహణపై పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై చరిత్రకారులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ నాగరాజు రామప్ప ఆలయంపై భద్రత, నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలపై సమాచారం హక్కు చట్టం ద్వారా 2016 ఏప్రిల్‌లో వివరాలు కోరారు. 2016 మేలో పురావస్తుశాఖ అధికారులిచ్చిన సమాధానంలో ఆలయ భద్రత, మనుగడ కోసం ఎటువంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం లేదని స్పష్టమైంది. పదేళ్లు దాటినా కామేశ్వరాలయం పునరుద్ధరణకు ఒక్క పైసా నిధులు కేటాయించలేదు. అంతేకాదు, రామప్ప ప్రధాన ఆలయంతోపాటు ఆరు ఆలయాలను గుర్తించామని చెప్పినా వాటి పరిరక్షణ కోసం ఇప్పటివరకు పురావస్తుశాఖ నుంచి ఎలాంటి పనీ జరగలేదు. -
రామప్పకు యునెస్కో గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తొలి ప్రపంచ వారసత్వ కట్టడం హోదా తెచ్చిపెట్టే బాధ్యత ను భుజాలకెత్తుకున్న రామప్ప దేవాలయం ఈ ఏడాది యునెస్కో తలుపు తట్టబోతోంది. గతేడాదే ఈ ప్రయత్నం జరిగినా చివరి నిమి షంలో కేంద్ర ప్రభుత్వం రామప్ప ప్రతిపాద నను పెండింగ్‌లో పెట్టి.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న మరో నిర్మాణ ప్రతిపాదనను యునెస్కోకు పంపింది. అయి తే ఈ ఏడాది రామప్ప ప్రతిపాదనను పంపేం దుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రామప్ప దేవాలయ ప్రత్యేకతలతో కూడిన డోజియర్‌ను కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ విభాగం మూడు రోజుల కింద కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ ఒక్క నిబంధనతో.. ప్రపంచ వారసత్వ హోదా పొందాలంటే.. నిర్ధారిత కట్టడం/ప్రాంతానికి నిర్దిష్ట పరిధిలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు ఉండొద్దనేది యునెస్కో ప్రధాన నిబంధన. ఈ నిబంధన కారణంగానే మన దేశంలోని చాలా కట్టడాలు యునెస్కో గుర్తింపు దక్కించుకోలేకపోతున్నా యి. గతంలో చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ టూంబ్స్, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలు ఇలాగే తిరస్కరణకు గురయ్యాయి. కానీ రామప్ప దేవాలయానికి చేరు వలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు లేనందున ఆ నిబంధన అడ్డుకాబోదు. ఆలయ నిర్మాణ విశిష్టతలు కూడా గొప్పగా ఉండటంతో దానికి యునెస్కో గుర్తింపు తథ్యమన్న భావన వ్యక్త మవుతోంది. హైదరాబాద్‌లో జరు గుతున్న అంతర్జాతీయ పురావస్తు సదస్సు లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘ఈసా రి రామప్ప దేవాలయం డోజియర్‌ను యునెస్కోకు పంపుతున్నారు. దానికి కేంద్రం ఆమోదం లభించింది. యునెస్కో పరిశీలనలో రామప్ప దేవాలయానికి మంచి మార్కులే వస్తాయని ఆశిస్తున్నాం. అదే జరిగితే తెలం గాణలోని ఓ కట్టడానికి తొలి ప్రపంచ వార సత్వ హోదా వచ్చినట్టవుతుంది..’’అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు పేర్కొన్నారు. -
రామప్పకు పొంచి ఉన్న ముప్పు
- పునాదులను తొలుస్తున్న చీమలు - శాండ్బాక్స్ టెక్నాలజీపై కాకతీయ కట్టడాలు - నిర్లక్ష్యపు నీడలో చారిత్రక ఆలయం సాక్షి, హన్మకొండ: విశిష్టమైన కాకతీయ కట్టడాలకు, అద్భుత శిల్పకళా సంపదకు నెలవైన రామప్ప ఆలయాన్ని నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చాపకింద నీరులా చీమలు ఈ ఆల యానికి చేటు చేస్తున్నాయి. ఆదిలోనే చీమల దండుకు అడ్డుకట్ట వేయకపోతే ఆలయ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. వరంగల్ కేం ద్రంగా తెలుగు ప్రాంతాలను ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు పాలించారు. వీరి కాలంలో గొలుసుకట్టు చెరువులతోపాటు వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం , కీర్తితోరణాలు వంటి అనేక రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించారు. స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కువ కాలం కట్టడాలు నిలిచి ఉండేలా నాటి నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు. 8 వందల ఏళ్ల క్రితమే శాండ్బాక్స్ పద్ధతి ద్వారా నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో విస్తారంగా ఉన్న నల్లరేగడి నేలలో భారీ రాతికట్టడాలు కుంగి పోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని అవలంభించారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పునాదుల నుంచి బలమైన శిలలను కాకుండా ఇసుకతో నింపారు. ఈ ఇసుక పునాదిపై రాళ్లను పేర్చుకుంటూ పోయి వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయాలను నిర్మించారు. ఎనిమిది వందల ఏళ్ల తర్వాత నేటికీ ఈ ఆలయాలు నిలిచి ఉండటానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రధాన కారణం. చీమల కారణంగా ఈ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. రామప్పకు ముప్పు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలవబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి రామప్ప ఆలయం నిదర్శనం. ఈ ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా మదనికలు, నాగిని శిల్పాలు చూసేందుకు విదేశీ యూత్రికులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చీమల కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం నిర్మించిన ఆలయ పునాదుల్లో ఉపయోగించిన ఇసుక బయటకు వచ్చి పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. చీమల కారణంగా పునాదుల్లో ఇసుక బయటకు రావడం వల్ల ఆలయ పటిష్టతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే.. రామప్ప ఆలయానికి ఇరువైపులా కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం ఉన్నాయి. చీమల కారణంగా కామేశ్వరాలయం పునాదులు కుంగిపోవడంతో ఆలయం ఒకే వైపు నకు ఒరిగిపోయింది. ప్రమాదభరితంగా మారడంతో ఆలయాన్ని తొలగించారు. రామప్ప ఆలయంలో చీమల సంచారంపై నిర్లక్ష్యం వహిస్తే పునాదుల్లో ఉన్న ఇసుక నిల్వలు తగ్గిపోయేందుకు అవకాశముంది. దీని కారణంగా ఆలయం ప్రమాదంలో పడుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం పైకప్పు కురుస్తోంది. అయినా పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
రామప్ప ఆలయానికి చీమలతో ముప్పు!
హన్మకొండ: విశిష్టమైన కాకతీయ కట్టడాలకు, అద్భుత శిలా సంపదకు నెలవైన రామప్ప ఆలయాన్ని నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చాపకింద నీరులా చీమలు ఈ ఆలయానికి చేటు చేస్తున్నాయి. వరంగల్ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు పాలించారు. వీరి కాలంలో గొలుసుకట్టు చెరువులతో పాటు వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయం , కీర్తితోరణాలు వంటి అనేక రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించారు. స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితులో ఎక్కువ కాలం కట్టడాలు నిలిచి ఉండేలా నాటి నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు. ఎనిమిది వందల ఏళ్ల క్రితమే శాండ్బాక్స్ పద్ధతి ద్వారా నిర్మాణాలు చేపట్టారు. నల్లరేగడి నేలలో భారీ రాతికట్టడాలు కుంగి పోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని అవలంబించారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పునాదుల నుంచి బలమైన శిలలను కాకుండా ఇసుకతో నింపారు. ఈ ఇసుక పునాదిపై రాళ్లను పేర్చుకుంటూ పోయి వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు నిలిచి ఉండటానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రధాన కారణం. చీమల కారణంగా ఈ కట్టడాలకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం ఎలా? ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటి కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం నిర్మించిన ఆలయ పునాదుల్లో ఉపయోగించిన ఇసుక బయటకు వస్తోంది. ఆలయంలో పలుచోట్ల చీమల కారణంగా ఇసుకు బయటకు వచ్చి పేరుకుపోతోంది. ఇలా పేరుకుపోయిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. చీమల కారణంగా పునాదుల్లో ఇసుక బయటకు రావడం వల్ల ఆలయ పటిష్టతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే.. రామప్ప ప్రధాన ఆలయానికి ఇరువైపులా కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం ఉన్నాయి. చీమల కారణంగా కామేశ్వరాలయం పునాదులు కుంగిపోవడంతో ఆలయం ఒకే వైపుకు ఒరిగిపోయింది. ప్రమాదభరితంగా మారడంతో ఈ ఆలయాన్ని తొలగించారు. ప్రస్తుతం రామప్ప ప్రధాన ఆలయంలో చీమలు సంచారం ఎక్కువైంది. ఇదే తీరుగా నిర్లక్ష్యం వహిస్తే పునాదుల్లో ఉన్న ఇసుక నిల్వలు తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. దీని కారణంగా ఆలయ పటిష్టత ప్రమాదంలో పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఆ కట్టడం నిర్మించడానికి 40 ఏళ్లు!
సాక్షి,వీకెండ్: చరిత్ర తలుపులు తట్టి... అలనాటి జ్ఞాపకాలను ఆస్వాదించాలంటే... వందల ఏళ్ల నాటి శిల్ప సంపద, కళా వైభవాన్ని కళ్లకు కట్టాలంటే... వరంగల్ జిల్లాలోని రామప్ప గుడికి వెళ్లాల్సిందే. మానవ నిర్మితమై అందాన్ని, కౌశల్యాన్ని, సృజనని చాటే ఆలయ నిర్మాణాల్లో ఈ గుడికి విశేష స్థానం ఉంది. – ఓ మధు రామలింగేశ్వరుడు కొలువున్నప్పటికీ ఈ ఆలయం రామప్ప ఆలయంగా ప్రసిద్ధి. దేశంలోనే శిల్పకారుడి పేరుతో పిలిచే ఆలయం ఇదొక్కటే. ఆలయ నిర్మాణ శిల్పుల్లో ప్రముఖుడైన రామప్ప పేరు మీదే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందంటారు. దాదాపు 40 ఏళ్ల పాటు సాగిందని చెప్పే ఈ ఆలయ నిర్మాణంలో శిల్పకారుల శిల్పకళా నైపుణ్యం ఇప్పటికీ ఎప్పటికీ అబ్బురమే. పురాణ, ఇతిహాసాలతో కూడిన శిల్పాలు... వివిధ భంగిమలతో ఉన్న శిల్పాలు.. నంది మండపం, కామేశ్వర ఆలయాలు, చక్కటి శిల్పాలు చెక్కిన స్తంభాలు.. ఆలయంలో కొలువైన శిల్పకళా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే నృత్య రీతులకు స్ఫూర్తినిచ్చే శిల్పాలు ఇక్కడ అనేకం. ఆద్యంతం... అద్భుత నిర్మాణం కాకతీయుల పరిపాలనలో ఎంతో వైభవాన్ని చూసిన ఓరుగల్లు ప్రముఖ ప్రదేశాలలో రామప్ప గుడి ఒకటి. గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రయ్య ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఇక్కడి శిలా శాసనాలు తెలియజేస్తున్నాయి. దక్కన్ పీఠభూమిలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్కన్ ఆలయాల సముదాయంలో ఒక నక్షత్రంగా, మణిమకుటంగా ఈ ఆలయాన్ని వర్ణిస్తారు చరిత్రకారులు. ఆరడగుల ఎల్తైన నక్షత్రాకార తలంపై కాకతీయుల కళాభిరుచికి అద్దం పట్టేలా నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ ఒక ఆర్కిటెక్చరల్ వండర్. ఎంత దూరం.. హైదరాబాద్‌కు సుమారు 160 కి.మీ దూరంలో ఉందీ ఆలయం. వరంగల్ నుంచి 70 కి.మీ. వెంకటాపురం మండలం పాలంపేట్ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి నగరం నుంచి బస్‌లో వెళ్లొచ్చు. ఈ గుడికి దగ్గర్లోనే రామప్ప చెరువు ఉంది. శివరాత్రి సమయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. -
అయ్యో.. నందీశ్వరా..
జీవకళ కోల్పోతున్న నంది విగ్రహం మండపంపై కప్పు నిర్మించని అధికారులు నందీశ్వరుడిని కాపాడాలని భక్తుల వేడుకోలు వెంకటాపురం : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. నందీశ్వరుడి విగ్రహం రోజురోజుకు జీవకళ కోల్పోతుంది. మండలంలోని పాలంపే ట శివారులో 1213లో కాకతీయులు రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆల య గర్భగుడికి ఎదురుగా నంది మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శివుడి వాహనమైన నందీశ్వరుడి విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే కాలక్రమేణా నంది మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో 1910లో నిజాం ప్రభుత్వం వి గ్రహాన్ని ప్రధాన ఆలయంలోకి మార్చి రామలింగేశ్వరస్వామికి ఎదురుగా ఏర్పాటు చేసిం ది. దీంతో ఆలయంలోనే భక్తులు 1988 వరకు నందీశ్వరుడిని దర్శించుకున్నారు. పాతస్థలంలో పునఃప్రతిష్ఠతకు కసరత్తు 1989లో నందీశ్వరుడి విగ్రహాన్ని తిరిగి పాత స్థలంలోనే పునఃప్రతిష్ఠించాలని పురావస్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కాకతీయులు ఏర్పాటు చేసిన నంది మండపాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా పైకప్పునకు చెందిన శిల్పాలు పూర్తిగా ధ్వంసం కావడంతో అధికారులు వాటిని తొలగించారు. పైకప్పు లేకుండానే నంది మండపాన్ని 1989 డిసెంబర్ లో పునరుద్ధరించి నందీశ్వరుడిని అందులో పునప్రతిష్ఠించారు. నూతనంగా పైకప్పు నిర్మిం చేందుకు పురావస్తు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నుంచి స్పందన కరువైందో.. ప్రతిపాదనలు పంపి పురావస్తుశాఖ అధికారులు చేతు లు దులుపుకున్నారో.. తెలియదు కానీ ఇప్పటివరకు పైకప్పు నిర్మాణం జరగలేదు. కళా సంపద కనుమరుగు 27 ఏళ్లుగా పై కప్పు నిర్మాణాన్ని పట్టించుకునే వారే కరువవడంతో నందీశ్వరుడు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా డు. జిల్లాలోని అన్ని ఆలయాల్లోని నంది విగ్రహాల కంటే రామప్పలోని నందీశ్వరుడికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మండపం ముందుకు వెళ్లి నందీశ్వరుడిని ఎటు పక్క కు జరిగి చూసిన మనల్ని చూసినట్లుగానే కనిపిస్తుంది. శివుడి వాహనమైన నందీశ్వరుడు ఆయన ఆజ్ఞ వినగానే పరుగెత్తేందు కు సిద్ధంగా ఉన్నట్లు రెండు చెవులు వం చి, ఒక కాలును ముందుకు పెట్టి పిలుపుకోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతటి కళా వైభవం కలిగిన విగ్రహాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో శిల్ప సంపద కనుమరుగవుతున్నాయి. కేంద్ర పురావస్తుశాఖ అధికారు లు తక్షణమే నంది మండపంపై పైకప్పు నిర్మించాలని భకులు కోరుతున్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
వెంకటాపురం : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. హరితహా రంలో భాగంగా శని వారం మండలంలోని రామప్ప ఆలయ గార్డెన్లో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజి పరిధిలో కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో 50లక్షల మొ క్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. అనంతరం రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామికి డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్ ఉన్నారు. -
రామప్ప.. రక్షణ లేదప్పా!
- ఆలయం పైకప్పు నుంచి కారుతున్న వర్షపునీరు - చారిత్రక సంపదపై అధికారుల నిర్లక్ష్యం - ఇలాగే వదిలేస్తే ఆలయాలు కూలిపోయే ప్రమాదం వెంకటాపురం, గణపురం : ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 803 ఏళ్లు దాటుతున్నా శిల్పాలు చెక్కుచెదరలేదు. కానీ కొంతకాలంగాఆలయ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారలుగా కారుతోంది. దీంతో ఆలయం బీటలు వారుతోంది. గతంలో ఇలా జరగడంతో 1992లో ఆరు అంగుళాల మందం సిమెంట్‌తో స్లాబ్ వేయించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తిరిగి 2010 నుంచి ఆలయంలో వర్షపు నీరు కారుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీనిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలతో స్పందించిన పురావస్తుశాఖ అధికారులు రామప్ప ఆలయ పైకప్పు పునర్నిర్మాణానికి 2014 డిసెంబర్లో ప్రతిపాదనలు పంపారు. దాంతో కేంద్ర ం రూ.23లక్షలు మంజూరు చేసింది. ఆ నిధులతో 2015 ఫిబ్రవరి 5న పైకప్పు పునర్నిర్మాణ పనులు ప్రారంభించి.. అంతకు ముందు వేసిన సిమెంట్ పొరను తొలగించారు. తర్వాత తాత్కాలికంగా టార్పాలిన్ కప్పి చేతులు దులుపుకొన్నారు. తర్వాత ఏడాది కూడా పనులు మొదలుపెట్టినా తూతూ మంత్రంగా పూర్తి చేశారు. తాజాగా ఆలయంలో మళ్లీ వర్షపు నీరు కారుతోంది. దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా ఆలయూన్ని పరిశీలించేందుకు ఎవరూ రాకపోవడం గమనార్హం. ఈ వర్షాకాలం గడిచేవరకు రామప్ప ఆలయంపై మళ్లీ టార్పాలిన్ కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా ఆలయ పైకప్పు నుంచి నీరు కారుతూ చిత్తడిగా మారి.. భక్తులకు ఇబ్బంది ఎదురవుతోంది. పురాతన కట్టడమైన రామప్ప ఆలయ పైకప్పు లీకేజీలు అరికట్టకపోతే ఆలయ శిల్పాలు దెబ్బతింటాయని, ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక గర్భగుడిలోని సోమసూత్రం మూసుకుపోవడంతో అభిషేకాల నీరు, శివలింగాన్ని శుద్ధి చేసే నీరు గర్భగుడిలోనే నిలిచి ఇంకిపోతోంది. దీంతో ఆలయంలోని రామలింగేశ్వరుడు ఒకవైపు ఒరిగిపోతున్నాడు. పూజారులు సైతం మహాశివరాత్రి మినహా మిగతా రోజుల్లో చిలకరింపు అభిషేకాలే చేస్తుండడం గమనార్హం. సోమసూత్రం మూసుకుపోవడంతో ఇలా చిలకరింపు అభిషేకాలు చేస్తున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు. గణపేశ్వరాలయానిదీ అదే దుస్థితి వరంగల్ జిల్లా గణపురంలో కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలిచిన గణపేశ్వరాలయంలోనూ వర్షపు నీరు కారుతోంది. నాలుగేళ్ల కింద కేంద్ర పురావస్తు శాఖ నుంచి రూ.2.75 కోట్లు మంజూరైనా దేవాలయం పైకప్పునకు మరమ్మతులు చేయలేదు. ఆ నిధుల్లో నుంచి రూ.75 లక్షలతో హరిత హోటల్ నిర్మించారు. మిగతా నిధులతో ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులకు 2014 ఆగస్టు 8న శంకుస్థాన చేశారు. కానీ ఆ పనులు ముందుకు కదలలేదు. దాంతో ప్రతి వర్షాకాలంలో ఆలయంలోకి నీరు చేరుతున్నాయి. శిఖర భాగంలో పగులు ఉండటంతో చిన్న వర్షానికి కూడా దేవాలయం నీటితో నిండిపోతోంది. దీంతో దేవాలయ పరిరక్షణ కమిటీ ఏటా టార్పాలిన్లను కొనుగోలు చేసి దేవాలయ గోపురంపై కప్పుతోంది. ఈసారి కూడా ఇటీవలే రూ.16 వేల ఖర్చుతో టార్పాలిన్లను కొనుగోలు చేసి కప్పారు. శివలింగానికి పైన రెండు గొడుగులు పెట్టారు. -
హెరిటేజ్ సైట్‌గా రామప్ప
చివరి క్షణంలో స్థానం కోల్పోరుున ఖిలా వరంగల్ యునెస్కో పరిశీలనలో ప్రతిపాదనలు త్వరలో ఫ్రాన్స్ నుంచి {పతినిధుల రాక నేడు వరల్డ్ హెరిటేజ్ డే హన్మకొండ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రామప్ప ఆలయ శిల్ప సంపద కీర్తి పతాకం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు హోదాకు బరిలో ఉన్న రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో ప్రతినిధులు త్వరలోనే వరంగల్ రానున్నా రు. యునెస్కో- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటిటేవ్ లిస్ట్ లో ఇప్పటికే రామప్ప ఆలయానికి చోటు లభించిం ది. సోమవారం వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని ప్ర పంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయూనికి గుర్తిం పు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ప్రత్యేక కథనం. మూడింటిలో ఒకటి.. కాకతీయుల కళావైభవానికి ప్రతీకలుగా నిలిచిన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలకు ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్) గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ టెంటిటేటివ్ లిస్టులో 2014లో ఈ మూడు కట్టడాలకు చోటు దక్కింది. తర్వాత ప్రక్రియలో భాగంగా ఈ కట్టడాల నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతలను వివరిస్తూ రూ. 20 లక్షల వ్యయంతో 2015 డిసెంబర్లో నివేదిక (డోసియర్) రూపొందించారు. దీనిపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. అరుుతే చారిత్రక కట్టడాల పరిరక్షణ విషయంలో యునెస్కో నిబంధనలు కఠినంగా ఉండటంతో జనావాసాల మధ్య ఉన్న వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్‌ను చివరి నిమిషంలో తప్పించారు. దీంతో రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి చారిత్రక విశేషాలు, శిల్పాల విశిష్టతతో కూడిన తుది నివేదికను ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో సమర్పించారు. త్వరలో ప్రతినిధుల రాక.. రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు విజ్ఞప్తి చేసింది. నివేదిక అందిన తర్వాత ఆరు నెలల లోపు యునెస్కో ప్రతినిధులు వచ్చి రామప్ప ఆలయ విశిష్టత, దాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాల్సి ఉంది. జనవరిలో నివేదిక సమర్పించిన నేపథ్యంలో యునెస్కో ప్రతినిధులు త్వరలోనే జిల్లాకు వచ్చి చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు. అనంతరం యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా రామప్ప ఆలయ ప్రత్యేకతలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వీటిపై యునెస్కో సంతృప్తి చెందితే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తుంది. గుర్తింపు లభిస్తే అద్భుత ప్రచారం.. యునెస్కో నుంచి గుర్తింపు లభిస్తే కాకతీయులు నిర్మిం చిన అద్భుత కట్టడాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభిస్తుంది. ఈ కట్టడాల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికి యునెస్కోతో పాటు కేంద్రం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది. ఇందుకు కర్నాటకలో ఉన్న హంపిని ఉదాహరణగా తీసుకోవచ్చు. యునెస్కో గుర్తింపు తర్వాత హంపి శరవేగంగా అభివృద్ధి చెందింది. టూరిస్టుల సం ఖ్య నాలుగురెట్లు పెరిగింది. హోటళ్లు, టాక్సీలు, ఫుడ్‌కోర్టులు, గైడ్ల సంఖ్య పెరగడంతో యువతకు ఉపాధి అ వకాశాలు మెరుగయ్యాయి. అలాగే రామప్పకు గుర్తింపు లభిస్తే దాంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఐలోని, కొమురవెల్లి, మల్లూరు, మేడారం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవులగుట్ట, గణపురం సున్నపురాయి గుహలు, పెంబర్తి, చేర్యాల హస్తకళలన్నీంటిని కలిపి టూర్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయొచ్చు. శిల్పాల్లోకి నేడు ఉచిత ప్రవేశం ఖిలావరంగల్ : హెరిటేజ్ డేను పురస్కరించుకుని చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణంలోకి సోమవారం పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు కేంద్ర పు రావస్తుశాఖ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. జంగయ్య గడిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగిస్తామని తెలిపారు. పర్యాటకులు, నగర ప్రజలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు!
వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బరిలో రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్ యునెస్కోకు సమర్పించేందుకు సిద్ధమైన తుది నివేదిక హన్మకొండ: కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలైన రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్ కీర్తితోరణాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ చారిత్రక కట్టడాల విశిష్టతను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. 2016 జనవరి 31లోగా యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈ నివేదికను అందచే యనున్నారు. కాకతీయులు నిర్మించిన వేయి స్తంభాలగుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలకు 2014లో యునెస్కో హెరిటేజ్ సైట్స్ టెంటిటేటివ్ లిస్టులో చోటు దక్కింది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ కట్టడాల నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతలను వివరిస్తూ రూ. 20 లక్షల వ్యయంతో నివేదికను రూపొందించారు. ఈ నివేదికపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) డెరైక్టర్ జనరల్ రాకేశ్ తివారీ సంతృప్తి వ్యక్తం చేశారు. 2016 జనవరి 31లోపు పారిస్‌లో ఉన్న యూనిసెఫ్ ప్రధాన కార్యాలయానికి నివేదిక ఏఎస్ఐ సమర్పిస్తుందని తెలిపారు. నివేదికను పరిశీలించిన యునెస్కో ప్రతినిధులు వరంగల్‌లో పర్యటించనున్నారు. వీటిపై యునెస్కో సంతృప్తి చెందితే ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తింపు లభిస్తుంది.