ఎక్కడపడితే అక్కడ పసుపు–కుంకుమలు చల్లినా.. దీపం వెలిగించిన నూనె మరకలు కనిపించినా.. అగరుబత్తి పొగతో మసిబారినా.. రామప్ప ప్రపంచ వారసత్వ హోదా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. యునెస్కో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇకపై జాగ్రత్తలు అత్యవసరం.
‘రామప్ప’కు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ప్రపంచ హోదా వచ్చిన సంతోషాన్ని కాదనలేం. కానీ వచ్చిన గుర్తింపును చేతులారా పోగొట్టుకునే పనులే సరికాదు. ఇలాంటివి యునెస్కో ప్రతినిధుల కంటపడితే గుర్తింపు రద్దు చేసే ప్రమాదం ఉంటుంది మరి.
సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వరాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా తెలుగువారిని మురిపి స్తోంది. దశాబ్దాలపాటు సాగిన ఎదురు చూపులు ఇప్పుడే ఫలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ‘గుర్తింపు’ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతకాలం ఓ పద్ధతంటూ లేకుండా సాగిన వ్యవహా రంలో ఇప్పుడు మార్పులు రాకుంటే చేతులారా హోదా కోల్పోయినట్టు అవుతుంది.
ఎంతో కసరత్తుతో..: రామప్ప ఆలయానికి గుర్తింపు ఇచ్చే ముందు యునెస్కో చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. యునెస్కో అనుబంధ సంస్థ ఐకొమాస్ ప్రతినిధి 3 రోజుల పాటు రామప్పలోనే మకాం వేసి మొత్తం గుడి, పరిసరాలను జల్లెడ పట్టారు. ప్రతి అంశాన్ని నోట్ చేసు కుని నివేదిక రూపొందించారు. ఆ తర్వాత రామప్ప ఆలయం ఇతర కట్టడాల కంటే ఎందుకు, ఎంత ప్రత్యేకమైనదో గుచ్చిగుచ్చి వివరాలు సేకరించారు. ఆ తర్వాతే గుర్తింపుపై ముందడుగు పడింది. యునెస్కో నిబంధనల ప్రకారం.. పురాతన కట్టడం ప్రత్యేకతలకు భంగం కలిగే ఏ చిన్న మార్పు చేసినా, కట్టడం దెబ్బతిన్నా ‘వారసత్వ గుర్తింపు’ను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. అందు కోసం యునెస్కో ప్రతినిధులు ఆకస్మికంగా సంబంధిత ప్రదేశాలను తనిఖీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామప్ప ఆలయంలోనూ అలా తనిఖీలు చేయనున్నారు. అందువల్ల యునెస్కో గుర్తింపును కాపాడుకోవడానికి అత్యంత శ్రద్ధ పెట్టాల్సి ఉండనుంది.
ఏటా కొనసాగుతున్న నిర్లక్ష్యం..
రామప్ప శివాలయం కావటంతో కార్తీక మాసంలో భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆలయం ప్రాంగణాన్ని దీపాలతో నింపేస్తారు. కొంతకాలంగా స్థానిక ఏఎస్‌ఐ అధికారుల చర్యలతో ఇది కాస్త తగ్గినా.. దీపాల జాతర, ఆలయంలో ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహాలపై పసుపు, కుంకుమలు, విభూతి చల్లడం వంటివి జరుగుతున్నాయి. ఇక ముందు ఇవన్నీ యునెస్కో గుర్తింపునకు సమస్యతగా మారే అవకాశం ఉంది. అయితే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా యునెస్కో కొన్ని విధివిధానాలు రూపొందించింది. వాటిని ఆచరించేలా చూసుకుంటే చాలు. పూజలు అందుకునే విగ్రహాల వద్ద, అర్చకులు పసుపుకుంకుమలు, పూలతో పూజ చేయవచ్చు. అక్కడే దీపాలు వెలిగించాలి. ఇతరచోట్ల అలా చేయకూడదు.
►పండుగల సమయంలో ఆలయంపై ఇష్టం వచ్చినట్టుగా విద్యుద్దీపాలు అమర్చకూడదు.
►కట్టడానికి వంద మీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా యునెస్కో నిబంధన ఉంది. ఆ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా జరగటానికి వీల్లేదు. కానీ రామప్ప గుడి పక్కనే తరచూ సభలు, సమావేశాలు, రాజకీయ ఉపన్యాస కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు చేపడుతుంటారు. అవి కుదరదు
►నిషేధిత ప్రాంతానికి అవతల మరో వంద మీటర్ల ప్రాంతాన్ని నియంత్రిత పరిధిగా భావిస్తారు. ఆ పరిధిలో నిబంధనల ప్రకారం అనుమతి పొంది కొన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అవి ఆలయానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు.
సమన్వయం అత్యవసరం..
రామప్ప ఆలయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)’ పరిధిలో ఉంది. ఆలయం విస్తరించి ఉన్న 20 ఎకరాల ప్రాంతంలో అన్నింటినీ ఏఎస్‌ఐ పర్యవేక్షిస్తుంది. దాని వెలుపల అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య పూర్తి సమన్వయం అవసరం.
►ఆలయంలో పూజాదికాలు రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయి. ఇవి కూడా ఏఎస్‌ఐ విధివిధానాలకు లోబడే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రామప్ప వద్ద మ్యూజియం, ధ్యానకేంద్రం, శిల్పారామం సహా పలు కట్టడాలు నిర్మించే యోచనలో ఉంది. అవి ఏఎస్‌ఐ నిబంధనల ప్రకారమే జరగాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయం లోపిస్తే.. యునెస్కో గుర్తింపు రద్దుకు దారితీసే అవకాశం ఉంటుంది.
►రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యునెస్కో సూచన మేరకు పాలంపేట డెవలప్‌మెంట్ అథారిటీ, రాష్ట్రస్థాయిలో ముఖ్య విభాగాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా సమన్వయంలో పనిచేయాలి.
►ఆలయం పరిధిలో గతంలో విప్పదీసి పెట్టిన కాటేశ్వరాలయాన్ని 2024 నాటికి పునర్నిర్మిస్తామని ఏఎస్‌ఐ లిఖితపూర్వకంగా యునెస్కో దృష్టికి తెచ్చింది. దాన్ని పూర్తి చేయాలి.
►భక్తులకు వసతులు, రోడ్ల నిర్మాణం, జీవ వైవిధ్యానికి ఇబ్బంది లేని పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. వీటిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలి. యునెస్కో సూచించిన ఈ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా గుర్తింపుపై దెబ్బపడుతుంది.
చిన్న వంతెన కడితే.. ‘గుర్తింపు’ పోయింది
డ్రెస్డన్ ఎల్బ్ వ్యాలీ.. జర్మనీలోని ఓ చారిత్రక నగరం. యునెస్కో 2004లో దానికి కల్చరల్ ల్యాండ్‌స్కేప్‌గా ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చింది. 16–20 శతాబ్దాల మధ్య జరిగిన అద్భుత చారిత్రక నిర్మాణాలు ఆ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. కానీ అక్కడి ప్రభుత్వం, అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ట్రాఫిక్ సమస్యకు విరుగుడు అంటూ అక్కడ కొత్తగా ఓ వంతెన కట్టారు. దీంతో ఆ ప్రాంత విశిష్టతకు భంగం కలిగిందంటూ యునెస్కో గుర్తింపును ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment