రామప్పకు వారసత్వ హోదా: చిరు వ్యాపారుల్లో టెన్షన్‌ టెన్షన్‌ | Telanganas Ramappa Temple Gets UNESCO Heritage Tag | Sakshi
Sakshi News home page

రామప్పకు వారసత్వ హోదా: చిరు వ్యాపారుల్లో టెన్షన్‌ టెన్షన్‌

Published Tue, Jul 27 2021 11:14 AM | Last Updated on Tue, Jul 27 2021 11:34 AM

Telanganas Ramappa Temple Gets UNESCO Heritage Tag - Sakshi

సాక్షి, వెంకటాపురం(వరంగల్‌): చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా వచ్చిందని సంతోషించాలో.. బాధపడాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక చిరు వ్యాపారులు ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ముందు చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి యునెస్కో ప్రతిపాదన జీవనోపాధి దూరం చేసింది. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి దుకాణాలు, కట్టడాలు ఉండకూడదనేది యునెస్కో ప్రధాన నిర్ణయం.

ఈ ఆంశం ఆధారంగానే వేయిస్తంభాలగుడి, వరంగల్‌ కోట కట్టడాలు తిరస్కరణకు గురయ్యాయి. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం డోషియార్‌ (రామప్ప సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం)ను తయారు చేసి ప్రతిపాదించింది. ఈ క్రమంలో డోషియార్‌లో పొందుపరిచిన విషయాలను క్షేత్రస్థాయిలో పరీశీలించేందుకు 2019 సెప్టెంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన పర్యటన ఖరారైంది. దీంతో రామప్ప ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల కట్టడాలను కూల్చివేసి దుకాణాలను తొలగించారు. యునెస్కో ప్రతినిధి పర్యటన పూర్తయ్యాక ఆలయానికి దగ్గరలో ఉన్న పార్కింగ్‌ స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు.

ఆలయానికి వచ్చిన పర్యాటకులు పార్కింగ్‌ స్థలంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి కోనుగోలు చేయకపోవడంతో వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో ఆలయం ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదా తూర్పు ముఖద్వార రోడ్డు వద్ద పర్మనెంటుగా స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌తోపాటు మంత్రులకు మొరపెట్టుకున్నప్పటికి ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతానికి కొంతమంది ఆలయం ముందు తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తుండగా, మరికొంతమంది కూలీ పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. 

స్థలం కేటాయించాలి
రామప్పకు యునెస్కో ప్రతిపాదన పంపడంతో అధికారులు దుకాణాలను తీసివేయించారు. రెండేళ్లుగా వ్యాపారం చేయకుండా తీవ్రంగా నష్టపోయాం. దుకాణాలను తొలగించే సమయంలో పర్మినెంట్‌గా దుకాణాదారులకు స్థలాలు కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికైనా అధికార యత్రాంగం స్పందించి రామప్పలోని చిరువ్యాపారులకు రామప్ప తూర్పు ముఖద్వారం వైపు స్థలాలు కేటాయించాలి.

– పిల్లలమర్రి శివ, రామప్ప చిరువ్యాపారుల సంఘం అధ్యక్షుడు

కూలీ పనులకు వెళుతున్నా..
రామప్పకు వచ్చే పర్యాటకులకు బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడిని. ఆలయం ముందు ఉన్న దుకాణాన్ని తొలగించడంతో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పర్యాటకులను నమ్ముకొని 28 మంది చిరు కుటుంబాలకు జీవనోపాధి దొరికేది. ప్రస్తుతం వీరంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు మాకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలి. 

– పోశాల రాజమౌళి, బొమ్మల దుకాణదారుడు, రామప్ప 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement