
‘60 ఏళ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేత చూశాం. గోదావరి, కష్ణా నీళ్లు దక్కకకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోదించారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్‌ఎస్ పార్టీ. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్రం కల కూడా నెరవేరింది. తర్వాత ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని మన చేతుల్లో పెడితే పదేళ్లలో ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకుని పోయాం.
ఎన్ని రంగాల్లో ఎన్ని అవార్డులు వచ్చాయి. ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపించాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎగతాళి చేయబడ్డ ప్రాంతం. పనికిమాలిన ప్రాంతం అని పేరుపెట్టబడిన ప్రాంతం. అలాంటిది రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.50 లక్షలకు పెంచుకున్నాం. జీఎస్‌డీపీని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం. బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం..’ అని కేసీఆర్ సభా వేదికగా గుర్తుచేశారు.
పథకాలు కావాలని ఎవరూ అడగలేదు
‘రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదు. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను ఆగమేఘాలపై పని చేసి పూర్తి చేయించాం. పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకున్నాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకుని పోయాం.
వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీస మద్దతు ధర వచ్చేలా .. తడిసినా, రంగు పోయినా, మొలక వచ్చినా.. రైతులు మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్‌కు రూ.5 వేల కోట్ల నష్టం వచ్చినా ధాన్యం కొన్నాం..బాధ పడలేదు. వరంగల్ గడ్డ కోసం పెండింగ్‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ గడ్డకు నీరు తెచ్చుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం..’ అని మాజీ సీఎం చెప్పారు.
రైతాంగాన్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నా..
పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించాం. రైతు కష్టం ఏంటో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును కాబటే రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నా. ఈ దేశంలో షేర్సా సూరీ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చారు. చరిత్ర పొడుగూతా చూస్తే.. షేర్సా సూరీ నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా.. రైతుల వద్ద రకరకాల శిస్తులు వసూలు చేశాయి. రైతుల వద్ద డబ్బులు, తహసీల్, నీటి తీరువాలు వసూలు చేశారు కానీ.. రైతును చూడాలని ఎవరూ అనుకోలేదు.
జై కిసాన్.. జై జవాన్ అన్నరు తప్ప పట్టించుకోలేదు. కానీ నన్ను ఎవరూ అడగలేదు. ఎన్నికల్లోనూ చెప్పలేదు. నాకు నేనుగా ఆలోచించి.. రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాను. బ్రహ్మాండంగా అమలు చేశాం. బ్యాంకుల్లో డబ్బులు పడి రైతుల సెల్‌ఫోన్లు మోగుతుండే. రైతాంగానికి ఎటువంటి కరెంటు ఇచ్చాం? ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడారు? తెలంగాణ వస్తే కారు చీకట్లు అయితయ్ అని చెబితే.. వాళ్ల నోర్లు మూయించేలా నాణ్యమైన కరెంటును 24 గంటలు సరఫరా చేశాం.
పొలాల కాడ బోర్లు దుంకినయ్..
రైతులు ఇంట్ల కూసుంటే.. పొలాల కాడ బోర్లు దుంకినయ్. మూడెకరాలున్న రైతులకు ఏముంటది ఆదాయం? బీఆర్‌ఎస్ రాక ముందు వారు చనిపోతే పట్టించుకున్న నాథుడు లేడు. బీఆర్‌ఎస్ వచ్చాక రైతుబీమా ఇచ్చి 8 రోజుల్లోనే కుటుంబాలకు బీమా అందేలా చర్యలు తీసుకున్నాం. 7500 కేంద్రాల్లో వడ్లు కొని మూడునాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశాం. మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఇంటింటా నల్లా పెట్టి ప్రజలకు మంచినీరు అందించాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు అడిగారు ? మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువుల్లో చేపలు పెంచాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ధర్నా చేయలేదు. ఎవరూ అడగలేదు. ప్రభుత్వమే వారికి బ్రహ్మాండంగా చేసింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చింది..’ అని కేసీఆర్ వివరించారు.
నేను చెప్పినవన్నీ మీ కళ్లెదుట జరిగినవే..
‘పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20–25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాం. రూ.40 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. వెయ్యికి పైగా గురుకులాలు తీసుకువచ్చాం. తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. 33 కాలేజీలకు పెంచాం. బీఆర్‌ఎస్ హయాంలో మత కల్లోలం లేదు. కర్ఫ్యూ లేదు.. కల్లోలం లేదు. శాంతిభద్రతలన్నీ బ్రహ్మాండంగా కాపాడి.. ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ నా డైలాగులు కాదు, స్టోరీలు కాదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయాలు. ఆర్‌బీఐ, కాగ్ వెల్లడించిన అధికారిక లెక్కలే. మీ కండ్ల ముందర జరిగినవే..’ అని మాజీ సీఎం పేర్కొన్నారు.
పోలీసులెందుకు దుంకులాడుతున్నరు?
లక్షన్నర మందిని రోడ్లపైనే లారీలు అడ్డుపెట్టి ఆపిన్రు. ఇన్ని అడ్డంకులా? ఈ ప్రభంజనాన్ని ఎట్ల ఆపుతారు? పోలీసులను అడుగుతున్న. మీరెందుకు దుంకులాడుతున్నరు? సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ సైనికులు ప్రశి్నస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు. డైరీల్లో రాసిపెట్టుకోండి... మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. దాన్ని ఆపడం ఎవడి తరం కాదు. ఎవడి వశం కాదు. సోషల్ మీడియా వారియర్స్‌ను కాపాడేందుకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది. నేను కూడా ఊర్కోను. బయలుదేరుత. కమీషన్లు తీసుకుంటున్నారని కేటీఆర్ అసెంబ్లీలో చెపితే భుజాలు తడుముకున్నరు. తప్పు చేయనప్పుడు ఆర్థిక మంత్రి ఎందుకు ఉలిక్కి పడుతున్నరు? కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా అంటున్నరు. మా సభ్యులు అడిగితేనే సమాధానం చెపుతలేరు.
బీజేపీతో మనకు వచ్చేది లేదు
బీజేపీ 11 ఏళ్లుగా రాజ్యం చేస్తోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి లేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. బీజేపీతో మనకు వచ్చేది లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను ఊచకోత కోస్తున్నారు. బలం ఉంది కదా అని చంపుడేనా? నక్సలైట్లు చర్చలు జరుపుతం అంటున్నరు. చర్చలు జరపండి. దీనిపై ఢిల్లీకి ఉత్తరం పంపిద్దాం..’ అని కేసీఆర్ అన్నారు.
‘కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పెడితే, నేను అధికారంలోకి’ వచ్చిన తరువాత అధికారులను పిలిచి అడిగిన. ఆ పథకం మంచిదని చెప్పడంతో పేరు కూడా మార్చకుండా కొనసాగించిన. అసెంబ్లీలో చెప్పిన.. రాజశేఖరరెడ్డి తెచ్చిన మంచి పథకం అదని. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పథకాలను నిర్విర్యం చేస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదు. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు అడిగారు ? మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువుల్లో చేపలు పెంచాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ధర్నా చేయలేదు. ఎవరూ అడగలేదు. ప్రభుత్వమే వారికి బ్రహ్మాండంగా చేసింది.
పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20–25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాం. రూ.40 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.2.50 లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ
రంగంలో 7 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. వెయ్యికి పైగా గురుకులాలు తీసుకువచ్చాం. తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. 33 కాలేజీలకు పెంచాం.
సైడ్‌లైట్స్
⇒ మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర ముఖ్య నేతలంతా సాయంత్రం 4:30 గంటలకు సభావేదికపైకి చేరుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గాయకుల పాటలకు మాస్ స్టెప్పులతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
⇒ ‘ఉక్కు గుండెను ఒక్కసారన్నా తాకాలని ఉన్నది.. ఆ బక్క పలచని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నది’ అనే పాటకు కవిత సహా సభా వేదికపై ఉన్న నేతలు సెల్‌ఫోన్లలో టార్చ్‌లైట్ ఆన్ చేసి ఊపడంతో సభికులు కూడా తమ సెల్‌ఫోన్లలో టార్చ్ ఆన్ చేసి చేతులతో పైకెత్తి ఊపారు.
⇒ సాయంత్రం 5:48 గంటలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వచ్చిన హెలికాప్టర్ సభా ప్రాంగణంలో ల్యాండ్ అయ్యింది.
⇒ దాదాపు గంట తర్వాత 6:51 గంటలకు కేసీఆర్ సభావేదికపైకి చేరుకొని ప్రజలకు అభివాదం చేశారు.
⇒ ముందుగా పహల్గాం ఉగ్ర దాడి మృతుల కు నిమిషంపాటు సంతాపం తెలిపారు.
⇒ కేసీఆర్ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా సీఎం, సీఎం అంటూ సభికుల నుంచి పలుమార్లు నినాదాలు చేశారు. దీంతో కేసీఆర్ జర ఆగండి అంటూ సుతిమెత్తగా మందలించారు.
⇒ కాంగ్రెస్ ఏయే అంశాల్లో విఫలమైందో చెబుతూనే ప్రజల నుంచి చెప్పించే ప్రయత్నం చేశారు.
⇒ రాత్రి 7 గంటలకు మొదలైన కేసీఆర్ ప్రసంగం 7:59 గంటలకు ముగిసింది.
⇒ చివరగా ‘ఇక మీ లొల్లి షురూ చేయండి’ అని కేసీఆర్ అనడంతో సభికులు సీఎం, సీఎం అంటూ నినదించారు. ఇంకోవైపు బాణాసంచా మోత మోగించారు. – సాక్షి, వరంగల్