
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభ
హాజరుకానున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు
హాజరుకానున్న పార్టీ అధినేత కేసీఆర్
ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సబిత తదితరులు
కేసీఆర్ తదుపరి సభలు, యాత్రలపై త్వరలోనే స్పష్టత
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో శనివారం తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు శుక్రవారం పరిశీలించారు.
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ ఈ సభను నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్లగొండ, కరీంనగర్‌లలో బీఆర్‌ఎస్ బహిరంగ సభలు నిర్వహించింది. అయితే ఈ రెండు సభలూ రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో బీఆర్‌ఎస్ తొలి సభ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు బహిరంగ సభలు నిర్వహించాలా.. లేక కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలా అనే అంశంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.
ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సుమారు 20 రోజుల పాటు కేసీఆర్ పాల్గొనే సభలు, బస్సు యాత్ర షెడ్యూలుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సోషల్ మీడియా సమన్వయకర్తలను ప్రకటించారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానానికి అభిలాశ్‌రావు రంగినేని, మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఆశప్రియ ముదిరాజ్ సమన్వయకర్తలుగా పనిచేస్తారు.