
అట్టర్‌ఫ్లాప్ పాలనపై అబద్ధాలు మాట్లాడించారు
అసెంబ్లీ మీడియాపాయింట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగం.. గాందీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటి వెంట అబద్ధాలు, అసత్యాలు చెప్పించి ఆయన స్థాయిని దిగజార్చిందని ఆరోపించారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కొత్త విషయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలపై స్పష్టత ఇస్తారని, గత 15 నెలల పాలనపై ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశించాం.
కానీ అలాంటిదేమీ జరగలేదుగానీ పెళ్లిలో చావుడప్పు కొట్టినట్టుగా ప్రసంగం ఉంది’అని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమేనని, ఆయన ప్రతిష్టను సైతం తగ్గించిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యంతో రైతులు అరిగోసలు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, గవర్నర్ ప్రసంగంలో ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్కమాట కూడా లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 నుంచి 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, గవర్నర్ నోటి ద్వారా మాత్రం రుణమాఫీ పూర్తయిందని అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం అందక ఆగమాగమవుతుంటే, రైతుబంధు అందిందని, అసత్యాలు వల్లించారని విమర్శించారు. సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, గోదావరి పరీవాహకంలో పంటలు ఎండిపోతున్నాయని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 83 మంది విద్యార్థుల మరణాలపై గవర్నర్ ప్రసంగంలో ఒక్క సానుభూతి మాట కూడా లేదని విచారం వ్యక్తం చేశారు.
బీసీలకు సామాజిక న్యాయమా?
కులగణన పేరుతో బీసీల సంఖ్య తగ్గించి, వారిని మోసం చేసి.. ఏదో ఉద్ధరించినట్టు సోషల్‌జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒకరు గళం విప్పితే, ఆయన్ను సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘమైనా కులగణన లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు.
నో విజన్.. ఓన్లీ కమీషన్
భారతదేశంలో ఏ రాష్ట్ర సచివాలయంలోనూ జరగని ఘోర సంఘటన తెలంగాణ సచివాలయంలో జరిగిందని కేటీఆర్ దుయ్యబట్టారు. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ధర్నా చేసిన సంఘటనే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం 20 శాతం కమీషన్ కక్కుర్తి మాత్రమే ఉందని మండిపడ్డారు. కమీషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో రూ. 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.62 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. దావోస్‌లో రూ.1.79 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గవర్నర్ ద్వారా అబద్ధాలు చెప్పించారని, గత ఏడాది చెప్పిన రూ.40,000 కోట్లలో ఒక్క పైసా కూడా రాలేదని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమని, తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడం ఖాయమన్నారు.
పిచ్చికుక్క హద్దులన్నీ దాటేసింది
‘మర్యాదకు ఉండే హద్దులన్నింటినీ పిచ్చి కుక్కదాటేసింది. అతడిని వెంటనే ఏదైనా పిచ్చాస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులను కోరుతున్నారు. అసహనంతో ఉన్న అతను.. తన చుట్టూ ఉన్నవారిని కరవడం మొదలుపెడతాడేమో. త్వరగా కోలుకో ‘చీఫ్ మినిస్టర్’అని సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment