
సాక్షి, హైదరాబాద్: ‘సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ–కేటుగాళ్లు కనీసం బాధితుల కంటికి కూడా కనిపించకుండా రూ.కోట్లలో కొల్లగొడుతున్నారు. సైబర్ భద్రత, ఈ నేరాల దర్యాప్తు సాంకేతికతతో ముడిపడిన అంశాలు. పోలీసు విభాగాలు, ప్రత్యేక ఏజెన్సీలు మాత్రమే వీటిని కట్టడి చేయలేవు’అని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) డైరెక్టర్ డాక్టర్ ఇ.కాళిరాజ్ నాయుడు అన్నారు. జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న ఎన్సీఎస్సార్సీ.. ఉస్మానియా యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో బుధవారం హ్యాకథాన్–ఎక్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాళిరాజ్ నాయుడు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సైబర్ నేరాలు, భద్రతపై ఆయన చెప్పిన అంశాలివి... దేశవ్యాప్తంగా హ్యాకథాన్‌లు ఎన్సీఎస్సార్సీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ హ్యాకథాన్–ఎక్స్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాం. తెలంగాణలో ఓయూ వేదికగా ఏర్పాటు చేశాం. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లోని అన్ని విభాగాలకు చెందినవాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. యువకులతో పాటు యువతులూ పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
ఆంధప్రదేశ్‌లో నిర్వహించిన హ్యాకథాన్‌కు 300 మంది హాజరుకాగా.. తెలంగాణలో 400 మంది పోటీపడ్డారు. వీటి నుంచి ఎంపికైన 50 బృందాలకు (దాదాపు 200 మంది) వచ్చే నెల (ఏప్రిల్) రెండో వారంలో ఆంధ్రప్రదేశ్‌లో సెమీఫైనల్స్ నిర్వహిస్తాం. ఇందులో విజయం సాధించిన వారికి మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందిస్తాం.
ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, విభాగాల్లో సెమీ ఫైనల్స్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నాం. వీటి తర్వాత ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రీజియన్లలో ఫైనల్స్ ఉంటాయి. గెలుపొందే వారికి మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష ఇవ్వనున్నాం. ఆపై ఢిల్లీలో సూపర్ ఫైనల్స్ జరుగుతాయి.
ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్న కంపెనీలు
యువతలోని నైపుణ్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీనికోసం సర్కారు కూడా హ్యాకథాన్లు నిర్వహిస్తోంది. అయితే అవి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. రెండు, మూడో శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఎన్సీఎస్సార్సీ పని చేస్తోంది. దీనికోసమే ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో హ్యాకథాన్–ఎక్స్‌లు నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా నిపుణులను వెలికితీసి జాతికి అంకితం చేయాలన్నదే మా ధ్యేయం.
వీళ్లు పోలీసులు, ఏజెన్సీలకు సహకరిస్తారు. ఎన్సీఎస్సార్సీ నిర్వహించే హ్యాకథాన్లలో సత్తా చాటుతున్న యువతీయువకులకు ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు ఎన్సీఎస్సార్సీకి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. హ్యాకథాన్లలో పాల్గొన్న వారిలో ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలి.
నేరాలపై అవగాహనకు పెద్దపీట
సైబర్ నేరాల బారినపడిన వారికి సహాయం చేయడం కన్నా.. అసలు ఎవరూ ఆ నేరాలకు బలి కాకుండా చూసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా దర్యాప్తు, సైబర్ సెక్యూరిటీ పైనే కాకుండా అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. దీనికోసం ఎన్సీఎస్సార్సీ హ్యాకథాన్ల ద్వారా ప్రత్యేక సమూహాన్ని ఏర్పాటు చేయనున్నాం.
ఇందులోని సభ్యులు అన్ని రంగాలకు చెందిన వారికి సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన కల్పిస్తుంటారు. వీరికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ ఏజెన్సీల్లోనూ పని చేసే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఎస్సార్సీ ప్లానింగ్, టెక్నికల్, అవేర్‌నెస్ కోణాలను స్పృశిస్తూ హ్యాకథాన్లను నిర్వహిస్తోంది. మా హ్యాకథాన్లలో పాల్గొంటున్న అభ్యర్థులు తమ రాష్ట్రాలకే సేవలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ కోణంలో ముందుకు రావాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్సీఎస్సార్సీతో కలిసి పని చేయడానికి అంగీకరించింది. మిగిలిన రాష్ట్రాలు సైతం ఇలా ముందుకు రావాలి అని కాళిరాజ్ నాయుడు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment