
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని దంపతుల బలవన్మరణం
ఇద్దరు పిల్లలకు విషమిచ్చినట్లుగా అనుమానం
హైదరాబాద్ హబ్సిగూడలో విషాద ఘటన
మృతుల స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా మోకురాల
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్‌నగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్‌రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్‌రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్‌లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment