
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేసి నగ్నంగా వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ సందర్భంగా కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే వీడియో పంపించారు. అనంతరం, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు.
వివరాల ప్రకారం.. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. దీంతో, ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కాల్ మాట్లాడారు. ఈ క్రమంలో కేటుగాళ్లు ఫోన్ స్క్రీన్ రికార్డు చేశారు. అనంతరం, ఆ వీడియోను ఆయనకే పంపించారు. వీడియో విషయమై బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. కానీ, ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు.
ఈ క్రమంలో సదరు నేతలు, కార్యకర్తలు ఆయనను ఫోన్లు చేయడంతో వీరేశం ఖంగుతిన్నారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాత్రి అనుచరులతో ఫోన్ మాట్లాడుతుండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment